కవిత్వం

అనువాద కవితలు

మే 2014

1. నేను ఒంటరిని కాను

ఈ రాత్రి నిర్జన రాత్రి
సానువులనుండి సముద్రం దాకా.
కాని, నిన్ను ఊయలలూపుతున్న నేను
ఒంటరిని కాను!

ఈ నింగి ఒంటరి ఎడారి
శశి సంద్రంలో పడిపోయింది
కాని, నిన్ను పొదివి పట్టుకున్న నేను
ఒంటరిని కాను!

ఈ భువి ఒంటరి ఊషర క్షేత్రం
ఉసూరు మంటున్నది దేహం
కాని, నిన్ను హత్తుకున్న నేను
ఒంటరిని కాను!

——————————

2. అపరిచిత

ఆమె ఒక విచిత్ర వృద్ధవర్షీయసి !
సముద్ర ఘోష ఆమె భాష
ఆమె మాట్లాడుతుంది తనదైన వింత పంథాలో
ఆల్గే లాంటి అజ్ఞాత అల్ప జీవాలతో,
అపరిచయ సైకతాలతో .
అవసాన దశ ఆసన్నమైనట్టుండే ఆమె
ఆరాధిస్తుంది బరువు లేని ఆకారం లేని దేవున్ని!
ఆమె వచ్చాక మా తోట ఒక విచిత్ర వనం!
కాక్టస్, అలీన వన తృణాల మయం,
ఆమెలో నిండి వుంది ఎడారి గాలి శ్వాస.
ఆమెది అచ్చమైన స్వచ్ఛమైన గాఢ మమత ,
ఆమె మౌనాన్నే ఆశ్రయిస్తుంటుంది;
చెప్పాల్సి వస్తే అజ్ఞాత నక్షత్రాల
వర్చస్సులను వర్ణించాలి గా మరి!
చిరు వన ప్రాణులకు మాత్రమే అర్థమయ్యే
తరుగుల్మాల వాక్కు ఆమెది.
నిన్ననే కొత్తగా వచ్చినట్టుంటుంది;
బతికితే బతకొచ్చు ఓ ఎనభై దాకా.
ఏదో ఒక బాధామయ భయద రాత్రి
ఆమె మామధ్యే మరణిస్తుంది;
విధి తలగడ గా, నిశ్శబ్దంగా,హఠాత్తుగా.

 

మూలం: చిలీ దేశ కవయిత్రి, నోబెల్ బహుమతి గ్రహీత గాబ్రియేలే మిస్త్రాల్
తెలుగుసేత : నాగరాజు రామస్వామి.