కథాకథనం

గుప్ఫున నవ్వించే హాస్య కథనం – సామగానం!

మార్చి 2014

కథలు అనేక రకాలు. అనేక వర్ణాలు.

ఒక కథకున్న తీరు మరో కథకుండదు.

కానీ, చిత్రం! ప్రతి కథకి ఒక తీరం మాత్రం వుంటుంది. ఉండి తీరుతుంది.

‘ఇదిగో, ఈ రచయిత చెప్పదలచుకున్న విషయం ఇదీ’అని తేలిపోతూనో, తెలిసిపోతూనో వుంటుంది – కథాంతం లో! అదొక తీరు. అదే దరిదాపు అందరూ అనుసరించే జోరు కూడా.

కానీ చిక్కల్లా ఎక్కడంటే, ఎంత చదివినా, కథ లో రచయిత ఏంచెప్పాడని కానీ, ఏం చెప్పాలని ప్రయత్నించాడని కానీ వెదుక్కోవడం వుంటుంది చూశారూ, అక్కడ..అక్కడ వుంటుంది పాఠకుని గుండె చిక్కుకోవడమైతేనేం, చిక్కబడిపోడమైతేనేం.
నాకు అలా అనిపించే కథలు చాలా చాలా అరుదుగా దొరుకుతుంటాయి.

అనేక వృక్షాల వనం లోనూ, కొన్ని చెట్ల నీడల్లోనే మరింత సేపు నిలబడిపోవాలనుకోడం… విశేషమే మరి.
నేనీ కథని మావూలు కథలా చదువుతూ పోయాను. నాకేమీ అనిపించలా. ఎక్కడి దాకా అంటే, చివర్లో ఓ నవ్వొచ్చి పెదాల మీద వాలే దాక!

పుస్తకం మూసేసాక, గభాల్న గుర్తొచ్చింది. ఈ కథలో రచయితకీ – నాకూ,… ఆలోచనా ధోరణుల్లో కాసింత దగ్గర పోలికలున్నట్టు! మాకు మేము మనసులో గుట్టుగా చేసుకునే అనాలసిస్ కి గుంభనమైన నవ్వొచ్చింది. (ఆ మాటకొస్తే రైటర్సందరూ ఒక గూటి పిట్టలే కదా. అందుకని. )

ఆ వెంటే, నిజంగా జరిగిన ఓ సంఘటన నా కళ్ళముందు మెదిలింది కూడా!

ఓ సారి మా ఫ్రెండ్ ఫోన్ చేసి, దుఃఖభారమైన గొంతుతో ఆ వార్త నా చెవిన వేసింది.

ఏమనంటే, వాళ్ళాయన వూరెళ్లాడని, ఫోన్ చేస్తుంటే స్విచాఫనొస్తోందని..భోరుమంది.

ఆయనొక బిజినెస్ మాన్. రెండునెల్లకోసారి దేశంలోని ఏదోక రాష్ట్రాన్ని చుట్టొస్తూంటాడు. మనిషి మహా నిఖార్సు. పిసినారి పుంజు. ఎవరైనా పలకరింపుగా నవ్వితే, తిరిగి నవ్వడానికి కూడా ఆగి, ఆలోచిస్తాడు. ఏం లాభం వస్తుంది నవ్వడం మూలాన – అని కాబోలు మహానుభావుడు ఆలోచిస్తున్నాడు..అని నాలో నేనే నవ్వుకునేదాన్ని. అంత జాగ్రత్త మనిషి! ఎక్కడికి పోతాడు. ఎక్కడికీ పోడు.

కానీ, అది భయపడుతున్న కారణాలు విన్నాక నాకూ జడుపైంది.

ఈయన పని లో చండ శాసనుడు కాబట్టి, పనివాళ్ళెవరైన పగ బట్టి కిడ్నాప్ చేసి కాని..సెల్ లాగేసుకుని కానీ..ఆ పైన మాటలని పూర్తిచేయ లేకపోయింది.

చెప్పొద్దూ, నా గుండే గుభేల్మంది. నిజమే. పేపర్లలో ఎన్ని చదవడం లేదూ, టీవీల్లో ఎన్ని చూడటం లేదని.
అయినా తేరుకుని, నే ధైర్యం తెచ్చుకుని దానికి ధైర్యం చెప్పాను. నాకు తెలిసిన వాళ్ళ చేత ఎంక్వైరీ చేయిస్తానన్నాను. అవసరమైతే ఆచూకి కోసం పోలీస్ కంప్లైంట్ చే ద్దాం, ఏం వర్రీ కామాకు అని భరోసా కూడా ఇచ్చాను.

ఆ ప్రయత్నం లో నేనుండంగానే.. తను మళ్ళా కాల్ చేసి చెప్పింది. “మా ఆయన ఫోన్ చేసారే. ఇప్పుడే చేసారు. క్షేమంగానే వున్నారట. పాపం! సెల్ పోయిందిటే. చాలా ఇబ్బంది పడుతున్నారట. రెండ్రోజుల్లో వచ్చేస్తానన్నారు. వచ్చే దాకా ఏదోక టైం లో తనే ఫోన్ చేస్తాననన్నారు. కంగారు పడొద్దని కూడా చెప్పారు.” అంటూ, గడగడా మాట్లాడేస్తున్న ఆ కంఠంలో సంతోషాన్ని గుర్తించాను.

‘శుభం. హమ్మయ్యా’ అనుకుంటూ హాయిగా నిట్టూర్చేలోపే – ఏదో శంక మనసుని జీడీ పాకం లా పట్టుకుపోయింది.
ఆయన సెల్ పారేసుకోడమేమిటా అని. అది కూడా కాదు. నేనే ఫోన్ చేస్తుంటాలే (నువ్వు చేయొద్దు అనే అర్ధమొచ్చేలా) అనడమేమిటా? అని కూడా!

రెండ్రోజుల్లో అనుకున్నట్టే ఆయన తిరిగొచ్చిన శుభవార్తని నా చెవినేసింది. అడగొద్దనుకుంటూనే అడిగాను. ఊరుకోలేక!

“సెల్ దొరికిందిటే?” – అని.

“నీకు చెప్పలేదు కదూ, సెల్ ఎక్కడాపోలా. ఇంట్లోనే వుంది. హాంగర్ కేసిన చొక్కాలో దొరికింది.” చెప్పింది.

“స్విచాఫ్ చేసా?” అడిగాను నవ్వుతూ.

“లేదు. దానంతటదే ఆగిపోయుంటుంది.” అంది మావూలుగా.

ఆయన తన సెల్ ని ఇంట్లోనే మర్చిపోయాడంటే ఎందుకో నమ్మబుధ్ధి కాలేదు. ఎక్కడో ఏదో లింక్ మిస్సౌతోందని ఒకటే గింజుకున్నా. పోన్లే! మనకెందుకొచ్చిన గొడవ. ఆయన నిజంగానే ఇంట్లోనే మరచిపోయుండొచ్చు. అని నాకు నేనే సమాధాన పరచుకు న్నా.

అయినా సరే, నల్ల చీమల బారుల్లా సందేహాలు.. వరసకట్టుకుని మరీ, మెదడులో మరి మరి మెరుపులు మెరిపించి పోతూన్నాయి.

కారణవేవిటంటే, నేనెప్పుడు చూసినా ఆయన తన సెల్ ఫోన్ ని గుప్పిట్లో పట్టుకునే కనిపించేవాడు. ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడయినా సరే, జేబులో తోసే వాడు కాదు. ఆఫీస్ లో కూడా అంతే, టేబుల్ మీద కూడా పెట్టడు. ఆయనకదో గొప్ప అలవాటు అని పసికట్టాను. అంతలా, తన శరీరం లో ఒక భాగం లా అంటిపెట్టుకునుండేదన్న మాట. అలాటి వాడు..? ఇలా ఎలా మర్చిపోగలడనేదే ఒక వీడని ప్రశ్న. అంతే. అంతకు మించి మరో ఉద్దేశమని కాదు, అలా అని లేదనీ కాదు. ఆ చిక్కు ముడి ఇప్పటికీ అలానే వుంది. వీడలేదు.

ఇదిగో ఇలా సాగుతుంది నా ఆలోచనా ప్రవాహం – ఒక విన్నచిన్న సంఘటన చుట్టూ ప్రవహిస్తూ.

ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే –

ఈ కథలో రచయిత ఆలోచనా సరళి కీ, ఊహా కల్పనా విధానానికి నవ్వొచ్చి.

ఇంతకీ అసలు కథకొస్తే :
రచయిత దగ్గరకి – లక్ష్మయ్య అనే ఒకతనొచ్చి తన సమస్య గురించి చెబుతాడు. ఏమనంటే, తనకు రోజూ ఓ కల వస్తోందని, ఆ కలలో కనిపించే స్త్రీ రూపం అస్పష్టంగా వున్నా, తను ఎక్కడొ ఎరుగున్న మొగం లా వుంటోందనీ, పోల్చుకోలేకపోతున్నందుకు వ్యధగా వుందని తన బాధను వెళ్లబోసుకుంటాడు.
వెధవ కలల దే ముంది, ఏవొ వస్తుంటాయి, పోతుంటాయి వొదిలేయ్ అని నచ్చచెప్పబోతాడు.
కానీ లక్ష్మయ్య మాత్రం ఆఫ్ట్రాల్ కలే కదాని తను వూరుకో దలచుకోలేదంటాడు.
వూరుకోక ఏం చేస్తాడుట? కేవలం తలకట్టు మాత్రమే వుండి, పునిస్త్రీ లక్షణాలేవీ లేని ఆమె ని ఎవరితో అయినా ఎలా పోల్చుకుంటాడు? అసలేమని అడుగుతాడు? తను ఆమెకి ఏమౌతానని చెబుతాడు? ఒక వేళ కల ఫలించి కలలోని నారీ కనుల పడిందనే అనుకుందాం? ఏం చేస్తాడు? తెచ్చుకుంటాడా? పెళ్ళైనవాడు, పరువున్న వాడు, వయసుడుగుతున్నవాడు తెచ్చుకుని మాత్రమేం చేసుకుంటాడు? పెద్ద హెడేక్ కాకుంటే?- ఊహు. ఇదంతా కుదరని పని. వొదిలేయ్. అని సలహా ఇస్తాడు ఈయన.

కానీ లక్ష్మయ్య వినడు. ఎలా అయినా సరే ఆమెని వెదకి పట్టుకుంటాననీ, కలుసుకుని తీరతానని లేకపోతే తనకు మనశ్శాంతి శూన్యమన్నట్టు చెబుతాడు. చెప్పి, దేశాల బడి పోతాడు.
అలా వెళ్ళిన వాడు ఎన్నాళ్లకి రాకపోయేసరికి, అతను పడుతున్న తిప్పల్ని రచయిత అనే క రీతుల ఊహించుకుంటూ.. కామెడీ సీన్సేసుకుని నవ్వుకుంటూ, మనల్ని నవ్విస్తూ వుంటాడు.
రచయిత గుప్పించిన హాస్య కథనానికి మనం నవ్వకుండా వుండలేం.

సరే,
కొన్నాళ్ళకి ఎలాగైతేనేం తిరిగొచ్చిన లక్ష్మయ్య ని చూసి ఉత్కంఠత ఆపుకోలేని వానిలా ఆత్రపడిపోతూ వెంఠనే అడిగేస్తాడు.
“ఏమైంది. కాయా, పండా” అని.

ల క్ష్మయ్యయ్య చెప్పల్నా వొద్దా అన్నట్టు సందిగ్దావస్థలో పడతాడు.

చెప్పమంటూ తొందర చేస్తాడీయన.

లక్ష్మయ్య నింపాదిగా – “కనిపించింది. కానీ చెప్పడానికి సిగ్గౌతుంది.” అని అంటాడు. రచయిత ఊరుకోడు. ప్రశ్నలతో తరుముతాడు.

చివరికెలాగైతేనేం, గొంతు సవరించుకుంటూ… అసలు సంగతి చెబుతాడు. తాను కనుగొన్న స్వప్న సుందరి ఎవరన్నదీ,
ఏమిటన్నదీ, చిరునామా తో సహా వున్నదున్నట్టు అంతా చెప్పేస్తాడు.
ఉఫ్!…రహస్యం తెల్సిపోతుంది.

పూర్తిగా విన్నాక, ఈయన – ఏ మాత్రం మొహమాటమనేది లేకుండా అడిగేస్తాడు.

ఇంతకీ మరి నువ్వు ఎవరితో కాపురం చేస్తావ్? కట్టుకున్న పెళ్లాం తోనా లేక కలలో నిన్ను ఊరించి చంపిన స్వప్న సుందరి తోనా? అని, శుభ్రం గా మొహం మీదే అడిగేస్తాడు.

జవాబు చెప్పలేని లక్ష్మయ్య తలొంచుకుని పరుగో పరుగు తీస్తాడు.

రచయిత ఎంతగా నవ్వుతాడో లేదో తెలీదు కానీ..మనం ఏ మాత్రం వెనకాడకుండా నవ్వుకుంటూ, పుస్తకం మూసేస్తాం.
అదీ ఈ కథా, కథనమూ!

అయితే, ఇంతకీ లక్ష్మయ్య అష్టకష్టాలు పడి కనుగొన్న ఆ డ్రీం గాళ్ ఎవరన్నది మాత్రం నేనిక్కడ చెప్పడం లేదు. అదొక సస్పెన్స్ గానే వుంచదలచుకున్నాను. మరి పాఠకునికి ఆసక్తి రగలాలి, మిగలాలి కదా, కథ చదివేందుకు.
కథ పై నా విమర్శ:

ఇక కథ విశ్లేషణలోకెళ్తే, ఆ కాలపు రచన కాబట్టి, స్త్రీ పాత్రల చిత్రీకరణ, వితంతువు వేష ధారణ, వాడిన కొన్ని పదాలు కాసింత హేళన చేస్తున్నట్టుగా అనిపించవచ్చు ఈ నాటి పాఠకులకి.

అలానే-
ఇదే కథని ఇదే రచయిత ఇప్పుడు రాసుంటే, ఈ కాలానికనుగుణం గా ఆధునికంగా మోడ్రన్ వే లో మలచి, ఇంకాస్త సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ, మరింత గా నవ్వించే వారే. అందులో డౌటే లేదనిపిస్తుంది.

అసలా కాలం లోనే ఇంత గొప్ప హాస్య, వ్యంగ్యా ల తో బాటు, సూటి మాటల చురకలు, చక్కటి చతురోక్తుల తో కథ నడిపించారంటేనే చెప్పలేనంత ఆనందవూ, ఆశ్చర్యవూ వేసిపడేసింది నాకైతే!

తప్పక చదవండి. ఆనందించండి.

రచయిత శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి అంజలి ఘటిస్తూ.. అభివందనాలతో..


కథ


సామ గానం -మల్లాది రామకృష్ణ శాస్త్రి


విని.. ఏమీ చెప్పకుండా ఊరుకున్నాను…వెళ్ళిపోయినాడు.
మరునాడు మళ్ళా వచ్చి..ఆ సంగ తే చెప్పాడు. నవ్వి వేళాకోళం చేశాను..
మూడోనాడు..సగం విని..మొగం వాచేటట్లు చివాట్లు పెట్టి పంపించాను.
అంతకన్నా ఏమిటి చేయడం?.. అసలు అందులో ఏముంది. ఒకరు ఆర్చేందుకూ, తీర్చేందుకూ?
కలలు ఎందుకు వస్తాయి?..తిన్న తిండి సరిగా అరగనప్పుడు, అమాం బాపతు గానూ..ఎదురు రొమ్ము మీద చేతులు వేసుకు పడుకుంటే..ప్రత్యేకం భయం వేసేట్టుగా..కలలు..వస్తాయని..ఆబాలగోపాలమూ తెలిసిన సంగతి.
కలలో – ఏమేమి వస్తాయి?…ఎవడి అదృష్టం వాడిది. అందలం ఎక్కినట్లు గానూ…మిక్కు మన్ను కాకుండా క్రింద బోర్లపడినట్లుగానూ ..అనుకున్నవన్నీ అయే యోగ్యత లేకపోతే..ఆ కోరికలన్నీ మనసులో వెనక పీటీని నెమరునపడి..అవి మనకు అంతు చిక్కని ధోరణి లో అల్లా, యిల్లా, కలల్లో చిగిరిస్తాయి. ఇది, నా మతం కాదు; మనకన్న కొమ్ములు తిరిగిన వాళ్ళు..ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న మీదట తేల్చిన సిధ్ధాంతం.
కలలకు అర్ధం ఏమిటి?.. ఒకటేమిటి, కోటి. చెప్పేవాడి తాహతును బట్టి ఎన్ని చిలవలు పలవలయినా అల్లవచ్చును. అవి నిజమవుతాయా? ఏమో, ఎవరు చూసి వచ్చారు?…అవవచ్చు, కాక పోనూ వచ్చును. తెల్లవారగట్ల వచ్చినవి చాలావరకు అయితీరుతవని..పెద్దవాళ్ళు చెపుతుంటారు. కాని, నికరంగా అయి తీరవలెనని శాసనం లేదు. నాకు మాత్రం, ఎంత మాత్రమూ నమ్మకం లేదు.
లక్ష్మయ్యకు..మొదటి రోజున కల వచ్చినప్పుడు..నిదుర లేచేటప్పుడు అంతా పూర్తిగా జ్ఞాపకం లేదటకాని…ఆ మనిషి అప్పటికీ కళ్ళకు కట్టినట్టుగా ఉన్నది..ఇక రోజూ..ఆ రోజు వచ్చిన కలే, వీసపాలన్నా మార్పు ఏమీ లేకుండా!-
ఆమె ఎక్కడో ఎరుగున్న మొగమే. కాని పోల్చుకోలేడు – ఎరుగుండటమంటే…రోజూ నిదురలో కలిసి మెలిసి ఉంటూండటం చేతనా అంటే, అదికాదట. మొదటిసారి కనబడినప్పటినుంచీ..అలాగే తోస్తూన్నదట..
ఎలా ఉంటుంది?..ఏమో? ఇలా, ఇలా అని ప్రత్యేకం చెప్పదగినదేదీ కనుపించదు. అందరు ఆడవాళ్ళలాగానే వుంటుంది. కాని, ఏదో మొత్తానికి ఉండి ఉండాలి. ఇదీ అని చెప్పలేకపోతున్నాడు కాని..
పోనీ..ఆఖరుకు..విధవా..సధవా? – ఆ మాత్రం అన్నా..చెప్పగలడా?… ఏమో, అదీ అనుమానమే. ఎందుచేతనంటే..తలకట్టు ఉన్నదన్న మాటే కాని..ఇక యితర పునిస్త్రీ లక్షణాలేమీ లేవు..అంటే..మామూలుగా..మెళ్ళో పుస్తెలు..పూసలూ..కాళ్ళకు మట్టెలూ..ముఖానా..చేతులకు ఉన్నవీ అంటే..అవి యీ కాలంలో అందరికీ ఉంటున్నవి. అందువల్ల చప్పున ఫలానా అని చెప్పడానికి వల్ల కాదు…కాని మొత్తానికి నిగ్గుతీస్తే పునిస్త్రీ అనడం కన్న..
సరే..అయితే…పోనీ ఒకటనుకుందాం. ఒక్కొక్కప్పుడు జాతకంలో అలాటివి అంటూ వుంటే..ప్రత్యక్షంగా జరగకపోయినా..యిలా..ఆ దోషం అంతటితో శాంతించడానికి..అవడమూ కద్దు. అలాంటిదేమన్నా వుందా?…లేదు. నిక్షేపం లాంటి జాతకం!
మరి..ఇప్పుడు ఏమిటి చేయడం?
చేయడానికి ఏం వుంది, వాడి ముఖం కాకపోతేను..కలలోకి..ఎవరో పనీపాటా లేకుండా వస్తూంటే..ఏం మునిగిపోయింది? వచ్చేదానికి బుధ్ధి లేకపోతే..లక్ష్మయ్య ఏండ్లు వచ్చిన సంసారి…వీడికన్నా వుండవద్దూ?
వింటే ఎవరన్నా ఏమనుకుంటారు? – నాతో తప్ప ఎవరితోనూ ఈ సంగతి చెప్పలేదు. అయితే మాత్రం ఒరిగిందేముందీ? ..ముక్కూ మూతీ మూసుకు కూర్చోకుండా? – నాతో కాదు..బ్రహ్మదేవుడితో చెప్పినా..ఆరుస్తాడా…తీరుస్తాడా? –
ఇప్పుడు ఏం చేయాలి? – ఇదిగో, ఆ వెర్రివేషాలే కూడవన్నది! ఏమిటి చేసేది! – ఏం చేయాలని అభిప్రాయం? –
ఎవరో – ఎలా తెలుస్తుంది? ముప్ఫైమూడుకోట్ల జనాభా..జీవించినదే ఉంటూంటే..ఎక్కడని, ఏ దేశంలో అని..విచారిచడం?..యిప్పటిదే అని మాత్రం ఎలా?…ఏ యుగం నాటిదో..ఎందుకు కాకూడదూ?..
ఎన్ని చెప్పినా లాభం లేదు.
‘ఎలాగైనా ఆమె ఎవరో..కంట పడే దాకా ఇంకో ఆలోచనే లేదు..ఏమీ మనస్సుకు ఎక్కడం లేదు..’
‘సరే..కర్మం జాలక అలాటి ఆడది అంటూ ఉండి..చప్పన్న దేశాలు గాలించగా ఎక్కడో కనబడిందే అనుకో..అప్పుడు ఏమిటిరా..?’
‘అప్పటి మాట అప్పుడు చూసుకోవచ్చును..ముందు కనబడటం అంటూ వుండనీ..’
మన ఊళ్ళో..తెలిసినంతవరకూ…ఊహు..ఎక్కడా అలాటి ఆమె తగుల లేదు. నీలాటి రేవులూ..సర్కారు బావులూ…అక్కడ కాపలా వేయడం..తెల్లవారగట్లనే లేచి రోజుకు ఒక్కొక్క పేట చొప్పున…తెల్లవారే లోపున గస్తీ తిరుగుతూ.. ఇంటి ముందుర ఊడ్చి నీళ్ళు జల్లుతూ ముగ్గువేసే..వితంతువులను పరకాయించి చూడటం..ఇంకా..ఏకాదశి నాడు గుళ్ళల్లోనూ..హరికథలూ, వీధినాటకాల దగ్గిర..కార్తీక స్నానాలూ, మాఘ స్నానాలూ…పర్వాలప్పుడు సముద్రానికి..వీలయినంతవరకు శక్తి వంచన లేకుండా.. చూసి..అక్కడకు..అక్కడ యిక లాభం లేదు అని తేల్చుకున్నాడు. చూడటం అంటే..బయట కనపడిన వాళ్ళనే కాని…యింటి యింటికీ వెళ్ళి…’ఏమండీ మీ ఇంట్లో..ఇలాంటి వితంతులెవరైనా ఉన్నారా? చూడాలి, పనుంది..ఉంటే దయచేసి ఒక మారు యిలా పిలుస్తారూ?’ ‘మీరు,రోజూకలలోకివెళుతున్నారే,అతడు మిమ్మల్నివెదుక్కుంటూ వచ్చాడు ..’అని అడగటానికి వీలున్నట్టయితే..క్షుణ్ణంగా చెప్పవచ్చును..ఆ ఊళ్ళో ఆమె లేదూ, అని..
తిరిగి..తిరిగి..కొన్నాళ్ళకు దానితో దిమ్మతిరిగి..బుధ్ధి వస్తుందేమో ననుకున్నాను. కాని లక్ష్మయ్యది రాక్షసత్వం. మూటాముల్లే కట్టుకుని బయలుదేరుతా నన్నాడు దేశం మీదికి..ఉషకు..అనిరుద్ద్దుడెవరో ముందు తెలుసునా?…పోనీ మనకెందుకు అని, ఎవడో వెధవాయ కలలో కనపడినాడు ఊరుకుందా? ..ఏం, మనం మటుకు తక్కువ తిన్నామా?..ఏం లోటూ, తిరిగేందుకు సత్తువ వున్నది..తిరగడానికి సత్తుగా వున్నది. ఎందుకు మానుకోవాలీ?..ఏదో అమీ తుమీ తేలకుండా?…పట్టుబడితే..దాని సంగతేదో తేలకుండా నిదుర పోవడమేనా?
లక్ష్మయ్య..అలా దున్నపోతులాగా కాకుండా కొంచెం చిన్నవాడైనట్లయితే.. ‘ఎప్పుడూ ఇలాటి వెధవ వేషాలు వేయవు గద- వెయ్యవు గంద..’ అని పట్టుకు దవడ వాయగొట్టి వుందును. కాని, యిప్పుడేం చేయడం…నానాగడ్డీ కరచి..బ్రతికున్న నాళ్ళు పొట్టకు కూడా సరిగా తినకుండా వీడేదో ఉధ్ధరించుతాడని..లప్పంతా వీడికే కట్టిపోయిన.. ఆ తండ్రి ముండావాడిని మనసులో చెడామడా తిట్టి.. నీ కర్మానికి ఎవరు కర్తలు? అనుకుని..’సరే..పోయిరా..ఏ ఊరు వెళ్ళినా, ఈ పంపిణీ మీదనే వెదుకుతూండు…కాకపోతే..పోనీ, నీకు చేతనైనట్టుగా భోగట్టా చేయి..వచ్చేటప్పుడు వట్టి చేతులతో మాత్రం రాక, పుల్లాయ వేమవరం వెళ్ళినట్టుగా..ఎందుకన్నా మంచిది..కొంత దైవ సాహాయ్యం కూడా వుండాలి కనుక, బయలుదేరేవాడు సత్యనారాయణ వ్రతమూ, వెంకటేశ్వరులకు దీపారాధనా చేసుకుని..కోరిక ఫలిస్తే ఏటేటా అలా చేసుకుంటూంటానని..ఇద్దరమూ కలిసి కొండకు వస్తామని మొక్కుకో…’
‘సరే..నేను చెప్పవలసినవన్నీ చెప్పాను..క్షేమంగా వెళ్ళి లాభంగా రా..ఎన్నడన్నా ఓ ఉత్తరం ముక్క ..నీకు తీరికవుంటే సుమా..రాసిపారేస్తూ ఉండు..’ ఇలా, పైకి సామంగానే అని..సాగనంపాను.
ఇంకో యావ ఏం లేదు గనుకనా, ఎప్పుడూ అదే జ్ఞాపకం ఉండటానికి?..ఎవడన్నా ఎరుగున్నవాడు అప్పుడప్పుడు..లక్ష్మయ్య ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదేం..ఎక్కడికి వెళ్ళాడు..ఎందుకు..యిలాటి బారవ ప్రశ్నలు వేసినప్పుడు మాత్రం.. లక్ష్మయ్య అవస్థ..నా ఊహలో కళ్ళకు కట్టేది..వాడిని, రైలులో పక్క కూర్చున్నవాళ్ళు యిలాటి ప్రశ్నలే వేస్తారు..ఎక్కడికి? – సరే ఏదో ఫలానా ఊరికి! ఏం పనిమీద…బంధువులెవరన్నా వున్నారా..ఏమని సమాధానం చెపుతాడు?..కలలో ఎవరో సకేశి కనబడ్డది, ఆవిడ కంటబడటం కోసం బయలుదేరానని..నిజం చెపుతాడా?..విన్నవాళ్ళు చెప్పొహటి పుచ్చుకుంటారు; పై స్టేషన్లు రాగానే…ఆ పెట్టెలోనుంచి దింపుతారు. దిగనంటే పోలీసును పిలిచి..పిచ్చివాడని..అతనికి అప్పగిస్తారు…ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకుంటాడా- వీడికెంత నిక్కు! అని ఒకడు, ఏం చూసుకుని అంత పొగరు? అని యింకొక డు..వీడేం ఆకాశం నుంచి దిగివచ్చాడా…మాట మాట్లాడటానికే అంత యిదా?..అని కార్పణ్యంతో..చేతనైనంత వరకూ నాలుగువైపుల నుండి కాల్చే చూపులు చూసి..ఆ తరువాత ఎలుకమీదా, పిల్లిమీదా పెట్టి, ఏదో లోకాభిరామాయణంగా..మాటలతో చంపేస్తారు. ఎటైనా కంఠానికే పట్టుకుంటుంది. సరి..ఆ అవస్థ ఎలాగో తప్పించుకుంటాడు..అన్నీ..లౌక్యంగా..అబద్ధాలే ఆడి…అంతటితో గడచి బయటపడతాడా? – అడుగడుగుకీ ఎవరి వంకన్నా – పరాకున ఒకసారికి రెండుమార్లు చూస్తే పక్కను తోడుగా వుంటే ఏ ముసలమ్మ అయినా అది చూడటం సంభవించెనా…ఏం..నీకేం పోయేకాలం వచ్చింది? ఎందుకూ దానివంక అలా ఉరిమి ఉరిమి చూస్తావు..నీ గుడ్లు పీకెంచేస్తాను చూసుకో…నలుగురినీ పిలిచి నోట గడ్డి పెట్టిస్తాను..ఏం..నీకు దానిలాంటివారు లేరూ? తల్లీతోడూ అంతా తగులబడిపోయిందా? కళ్ళు ఊరుకుండకపోతే..యింత కారం సన్నగా తాల్చికొట్టుకో…’ యిదే వరుసను యక్షులూ, పక్షులూ హడలిపోయేట్టుగా…తిట్టితిట్టి..ఏమిటో అని చోద్యం చూడటానికి పోగయినవారు నలుగురూ నాలుగు మాటలూ అని…మరీ కర్మం తప్పిజారితే..సున్నంలోకి ఎముక లేకుండా…పాపం..అంతా తలుచుకుంటే, నవ్వు వచ్చేది – కోపమూ వచ్చేది..జాలీ వేసేది..యిదంతా బయటకు పొక్కనీయకుండా…వాడి యోగక్షేమం అడిగిన వాడితో ‘ఏమో లక్ష్మయ్య నాకూ కనబడటం లేదు- కనబడి చాలా రోజులయింది-‘ అని టూకీగా జవాబు చెప్పి తప్పించుకుంటూ వుండేవాడిని…నిజానికి అంతే కూడాను. ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం అఘోరిస్తున్నాడో..వాడి అజాపజా తెలియలేదు.
ఎక్కడికి పోతాడు?..ఏమౌతాడు, రేపీపాటికి యిల్లూ యిల్లాలు ఎక్కడ వున్నారా అని మళ్ళా వెదుక్కుంటూ రాడూ?…
అలాగే..రానే వచ్చాడు.
కనబడటంతోనే…అంతదూరాన్నుంచే..’ఏం రా, ఏమైంది? – కాయా పండా?’ అని పొల్లుకేకగా పలుకరించాను. లక్ష్మయ్య దగ్గరకు వచ్చి…నా చేయి పట్టుకుని…నింపాదిగా ‘చెప్పాలి..యింటికి వెళుదాము రా’ అని మెల్లగా అన్నాడు. ‘కనబడ్డదా లేదా..ముందు ఆ సంగతి చెప్పు. తరువాత భారతమంతా కానిద్దువు గాని..’ అని, చెప్పేదాకా …అక్కడే నిలవేశాను.
లక్ష్మయ్య, నదురుడుగా..తల ఊగించాడు. ‘ఊహు, అలా కాదు, నోటివెంట చెప్ప ‘ మని సాగదీసి, ‘అవు’ ననిపించాను.’
‘కనబడిందన్న మాటేనా?’
‘ఆహా’
‘ఎక్కడ?’
‘కనబడిందిగా..ఎక్కడనైతేనేం’
‘అడిగినది ఒకటీ..చెప్పేదొకటీనా?’
‘చెపుతూంటినిగా’
‘ఏమిటి, నీ ముఖం! అంత అంతః పురాంగన అయి..ఆమె పేరే..యీ పాపాత్ముడు వినడానికి వీలులేకపోతే..పోనీలే..ఇక్కడనే వుట్టుకట్టుకు ఊరేగు..’
‘అది కాదు..చెప్పడానికి సిగ్గవుతూంది.’
‘ఏం..అచ్చంగా కోతిలాగా వుందా?…’
‘ఎబ్బే!..చెపితే..నేను వెర్రివాడననుకుంటావేమోనని భయం. అంతేకాని…’
‘…అది ఏనాడో నీకు వుండవలసింది. ఉంటే, యిందాకా వచ్చేదా వ్యవహారం?…యింకా నీకు అదుపూ ఆజ్ఞా ఏమిటి? – చెప్పు-‘
‘చెప్పనా..’
‘పోనీలే మానేయి…’
‘ఎవరూ కారు..నా భార్యే!’
లక్ష్మయ్య వంక..నిలువుగ్రుడ్లు వేసుకు చూశాను. ‘వాడికా, నాకా, మతిపోయింది!’
‘అందుకనే, నీవు నమ్మవనే..చెప్పడానికి సందేహించింది!..కాళ్ళు బలపాలు కట్టేట్టుగా..యిన్నాళ్ళనుంచీ తిరిగి..విసుగెత్తి..నాలుగురోజులపాటు యింటి పట్టునవుండి, మళ్ళా బయలుదేరుదామని…నిన్న సాయంకాలం మెయిలులో వచ్చాను. ఇంటికి చేరుకునేటప్పటికి కనుచీకటి పడుతూ వుంది…మా ఆవిడ తలుపు తీసింది..నా కళ్లను నేను నమ్మలేకపోయినాను. మొదట, ఎప్పుడూ అదే పలవరింత కావడం చేత…అలా భ్రమ పడుతున్నానేమో అనుకున్నాను; కాదు. మా యిల్లాలే. తలంటిపోసుకున్నది కాబోలు..అందుచేత నిరాభరణ సుందరి. ఒళ్ళు తుడుచుకుంటున్నదో ఏమో, నా పిలుపు వినబడేటప్పటికి చప్పున ఎదురుగుండా వంకెను నా మల్లుపంచే కనబడితే అది చుట్టుకువచ్చినట్లుంది….ఏమైతేనేం..మూడుమూర్తిలా…నా కలలో అంతకాలం కనిపించింది..ఆ మూర్తే..నాకు సందేహం ఏమీ లేదు, మనసు యిన్నాళ్ళనించీ పడిన యాతన గడిచి గట్టెక్కినందుకు..శాంతిగా, దానిలో అది ‘అమ్మయ్యా!’ అనుకుని ఊరడిల్లింది…ఆమెను చూచినకొద్దీ..నా గుండె కుదుటపడింది..మా ఆవిడకు, నా గొడవంతా ఏం తెలుసునూ పాపం..’ఏమిటండీ..అలా చూస్తారూ’ అని రెట్టించుతూ నన్నూ, నా వాలకం చూసి తెల్లబోవడం మొదలుపెట్టింది…’ఏమీ లేద’ని ఆమెకు నచ్చ్ చెప్పేటప్పటికి రాత్రి తాతలు దిగివచ్చారు…’ అని ముగించాండు లక్ష్మయ్య.
నాకు లోపల నవ్వు ఆగడం లేదు…కాని, పైకి తొణకకుండా…
‘అయితే..పెద్ద చిక్కే వచ్చిందే’ అన్నాను.
‘ఏం’అన్నాడు ఆదుర్దాగా…
‘అవును, నీవు ఇకనుండి ఎవరితో చేయడం కాపురం?..
‘అంటే..’
‘ఇంటావిడ అనుకుంటే..మనసు ఒప్పదు. కాదనుకుంటే..అలాటి కానిపని చేయడానికే..నీలాటి శ్రోత్రియుడికి…మనసు ఒప్పదు..చూస్తూ చూస్తూ రండాగమనం..’
‘అప్రాచ్యపు మాట యిలాటిదేదో అంటావనే అనుకున్నాను…అన్నంతపనీ చేశావు..’
‘అన్నంతపనీ చేస్తే- నీవు యిన్ని ఆటలు ఆడేవాడివా?..ఒళ్ళు పొగరు కాకపోతే..ఊ..’

లక్ష్మయ్య తలవంచుకుని ఒకటే పరుగు. ఈ అక్కసుతో రేపు భోజనానికి మాత్రం పిలవడు. వ్రతం ఎలాగూ చేస్తాడు మళ్ళా, కోరిక ఫలించినందుకు. చేయకపోతే ఎక్కడ పడవ మునుగుతుందో అని భయంకాదూ!-

*****