సమీక్ష

మహాభారతేతిహాస అనుసృజన “పర్వ” – ప్రశ్నార్థకమైన “ఆర్యధర్మం” !

డిసెంబర్ 2014

“పర్వ”- ప్రఖ్యాత కన్నడ సాహిత్యవేత్త Dr.S.L.బైరప్ప గారి విశిష్ట ఉద్గ్రంథం. మహా భారతేతిహాసం అధునిక నవలగా రూపొందిన రచన. బైరప్ప గారి Magnum Opus! అదే పేరుతో Dr.గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు తెనుగించిన “పర్వ” 730 పేజీల బృహదనువాదం. గంగిశెట్టి గారి మాటల్లో ‘మిత్ ‘నుండి చరిత్ర విడదీయబడి సమగ్రంగా పునర్నింప బడిన అపూర్వ పునఃసృష్టి “పూర్వ”. వైదిక యుగ చరమభాగం (12 th B.C.) లో జరిగిందని భావించ బడుతున్న కురుక్షేత్ర మహా సంగ్రామ నేపథ్యం కథావస్తువు. ఇతివృత్తాన్ని దైవీయ భావన నుండి విముక్తం చేసి, ఆనాటి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ధర్మానువర్తులైన వ్యక్తుల పాత్రలను సాధారణీకరించి, 20 వ శతాబ్ది బుద్ధిజీవుల ఆలోచనలకు ఒప్పిదంగా రూపొందించ బడినందుకు, బహుశా, “పర్వ” modern classic గా పేరుతెచ్చుకొని ఉంటుంది. దేవలోక ఇంద్రుణ్ణి సాధారణ మానవునిగా నేరుగా హిమాలయ పర్వత పీఠభూములలోకి దింపాడు బైరప్ప. కృష్నున్ని కేవలం చతుర రాజకీయ యుద్ధతంత్ర కోవిదునిగా భావించాడే కాని అవతార పురుషునిగా చిత్రించలేదు. భారత ఇతిహాసంలోని ఉత్కృష్ట వ్యక్తులైన ధర్మజ, అర్జున, భీమ, ద్రౌపది వంటి కాల్పనిక పౌరాణిక పాత్రలను సాధారణ మానవ పాత్రలుగా సామాన్య స్థాయికి చేర్చాడు. అనుపమ త్యాగధనుదనిపించుకున్న వృద్ధ భీష్మునికి ఎలాంటి పౌరాణిక ఔన్నత్యాన్ని అంటగట్టలేదు. ఐతిహాసిక అభిజాత్యమంతా సగటు మానవుని స్వార్థపురిత స్వగత చింతన ( monologue) గా ‘పర్వ’ నిండా పరచుకున్నది. ‘ A great human drama set on sociopolitical ,cultural landscape of anicient India’ !

పంచమవేదంగా పరిగణించబడుతున్న మహాభారత మారుమూలలోని చీకటి కోణం ‘పర్వ’లో వాస్తవ ఆధునిక సాహిత్య రీతిలో నిస్సందిగ్ధంగా ఆవిష్కరింప బడింది. ఆనాటి క్షత్రియ ధర్మం కేవలం తమ వంశాన్నికాపాడుకునే అసహాయ ఆఖరు ప్రయత్నపు కొనసాగింపుగా, ఆర్యధర్మం యావత్తు ఆ దిశలో నిబద్దీకరించబడిన ఒక constitutionalised స్వార్థ పద్ధతిగా రూపొందింది. ‘ఆర్యధర్మమంటే వేట, తాగడం, జూదం, ఆడవాళ్ల సహవాసం, స్వయంవరం పేరుతో రాచకన్యలను అపహరించి పెళ్ళాడడం, కనీసం పదిమంది దాసీల నైనా పెళ్లి కానుకలుగా తెచ్చుకుని సుఖించడం, వాళ్లకు పుట్టిన పిల్లలను సూతులుగా వదిలేయడం’ అని నిరసిస్తుంటుంది కోపోద్రిక్త ద్రౌపది.”‘పర్వ’ పూర్వ భారత పాత్రల కథ కాదు. మానవ అనుభవానికి చెందిన ఆముఖాల,రూపాల, మానవ సంబంధాల స్వరూప వివేచన” అంటున్నారు బైరప్ప గారు.

పర్వ లో అలనాటి దేశాచారాల, మూఢ విశ్వాసాల గుట్టు రట్టయింది. మూర్ధ ఘ్రాణ సాంప్రదాయం (తమ సంతానం తమదేనా కాదా అన్న సందేహ నివృత్తి కోసం పిల్లల తలలను ఆఘ్రాణించి నిర్దారించుకోవడం), నియోగం (వంశాభివృధ్ధి కోసం స్త్రీలను పరపురుషుల సాంగత్యానికి పంపడం) ద్వారా ‘కానీనులను’ కనడం, అతిథుల ఆనందం కోసం రాత్రిళ్లు దాసీలను అర్పించడం, స్త్రీల రుతుస్రావనష్టాన్ని పాపంగా పరిగణించడం వంటి క్షత్రియ కుహనాచార శాస్త్ర సమ్మత ‘ఆర్య ధర్మం’ చెలామణిలో ఉండడం బట్టబయలయింది. అంబ అంబాలికలు మొదలు కుంతీ మాద్రుల దాకా ఈ నియోగధధర్మం కొనసాగింది. నియోగానికి వేదజ్ఞులైన ఋషులు సైతం అర్హులే. కుంతికి పెళ్ళికి ముందు తల్లితండ్రుల ప్రోత్సాహంతో దుర్వాస ఋషి వల్ల ఒక కానీనపుత్రున్నికన్నది.పంచపాండవు లందరూ కానీనులే ( పెళ్ళికి ముందు కన్యలుగా ఉన్నప్పుడు కలిగిన సంతానం ) – epithets specially applied to Vyaasa and Karna. వంద మంది కౌరవ పుత్రులలో కేవలం పదునాలుగురు మాత్రమే గాంధారి సంతానం. మిగతా ఎనుబదిఆరుగురు దాసీల వలన సంక్రమించిన సంతతే !

యుద్ధంలో పోరాడుతున్న సైనికులను ప్రోత్సహించేందుకు తిండీ మందు తోపాటు పడతులను కూడా పంపిస్తాడు దుర్యోధనుడు. మహాయుద్ధం లో విధవలైన వేలాది యువతులకు నియోగమే శరణ్యమైనట్టు సూచింప బడింది. యుద్ధానంతరం సైనికుల వల్ల పుట్టిన వందలాది బిడ్డల భవిష్యత్తు ఒక జటిల సామాజిక సమస్య ఔతుంది. A wreched aftermath of war! A great human crisis! పరుశురాముని క్షత్రియ రాజుల సంహారానంతరం ఈ వంశోద్ధారణ మొదలై ఈ ఆర్యధర్మం గతానుగతికంగా అనూచాన ఆర్య పరమధర్మంగా కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కుహన నీతిని జీర్ణించుకున్న శాల్యరాజుకు పెళ్ళికి ముందు పిల్లలను కనడం, నియోగం అపచారంఅనిపించలేదు. శల్యుని కుమారుడు రుక్మరథునికి కూతురు బతుకు ఋతుచక్ర కాలంలో బీజావాపం లేకుండా గడవడం భూమిని బంజరుగా ఉంచినంత పాపంగా తోచింది. స్రావం ఆగి స్నానంచేసిన దినం మగడు ఊరిలో లేనందున మగని శిష్యుణ్నే పిలిపించుకున్న గురుపత్నుల కథలు అతనికి గుర్తుకొచ్చాయి. అతని పత్నికి కానీన సంతానం పొందటంలో తప్పులేదనిపించింది. కృష్ణద్వైపాయనుడు (వేదవ్యాసుడు) కానీనుడేనట. వ్యాసుని పినతల్లికి కానీన పుత్రుడున్నాడట. తన పెళ్లికి ముందు పుట్టిన అబ్బాయి తన పుట్టింటిలోనే పెరుగుతున్నసంగతిని భర్తకు గుర్తు చేస్తుంది. భర్త రుక్మరథుడు వినీవిననట్టు మిన్నకుండిపోతాడు. స్వయంవరం నిర్వహించే స్థోమత తమకు లేనందున, రాజకుమారులు తన కూతురును ఎత్తుకెళ్ళి వివాహం మాడే అవకాశం మృజ్ఞమైనందున ,ఆఖరు అస్త్రం ‘నియోగాన్ని’ ఆచరించడం ధర్మ విరుద్ధం కాదని ఆమె అంటుంది. తుదకు ధర్మజ్ఞుడూ,నియోగ ధర్మాన్ని ప్రారంభించిన భీష్ముడు మహాభారత యుద్ధ సందర్భంలో ధర్మ సందేహంలో చిక్కుకుంటాడు. కానీనులైన పంచపాండవులు రాజ్యార్హులేనా? కురుక్షేత్ర యుద్ధం ధర్మయుద్ధ మేనా? ఈ సందేహ నివృత్తి కై భీష్ముడు ఆగవేగాలతో కృష్ణద్వైపాయనున్ని ఆశ్రయిస్తాడు. వేదాల పరిష్కర్త, నియోగాన్ని స్వయంగా ఆచరించిన వ్యాసుడు సందిగ్ధం లో అవాక్కవుతాడు. తుదకు యుద్ధానంతరం పాండు పుత్రులందరిని కోల్పోయి, ఉత్తర మృత పిండాన్ని ప్రసవించిన కారణంగా, కుంతి ద్రౌపదిని మళ్ళీ పిల్లలను కని వంశాన్ని నిలబెట్టుమని అర్థిస్తుంది. ససేమిరా అంటూ ద్రౌపది ఉత్తరకు నియోగం చేయాలంటుంది .Last nail on the coffin ! ఇలా ‘పర్వ’ లో ఆద్యంతం కొనసాగిన ఈ కానీన హీన సంస్కృతి పాఠకునికి మింగుడు పడదు. లోలోన ఏదో ముల్లు గుచ్చుకుంటూనే వుంటుంది. చదువరికి ఇదొక persistant pain in the neck.

‘పర్వ’ కు మరో పార్శ్వం ఈనాటికీ కొనసాగుతున్న కుటిలరాజనీతి.శత్రువులను తమవైపు తిప్పుకునే ఎత్తుగడల చతురత, యుద్ధ తంత్రం, యుద్ధం. ఎవరికి వారు ఆ యుద్ధాన్ని ధర్మయుద్ధంగా, యుద్ధంలో పాల్గొనడం ధర్మబద్ధంగా అన్వయించుకుంటారు. విశ్లథ మౌతున్న రాజ్య వ్యవస్థలో ధర్మం వివిధ రూపాలుగా రంగులు మార్చుకుంది. ‘ పర్వ’ లో వెర్రి తల లేసిన రణనీతి ఆసక్తిదాయకంగా చిత్త్రించ బడింది. యుద్ధానంతరం విజయం పాండవులదైనా విస్తృతమైన నిరాశ, విశ్లథమైన మానవ జీవన విశ్వాసం ఎల్లెడలా నెలకొని ఉంటుంది. A great human tragedy ever!
అభ్యంతరకరమైన ఆనాటి నియోగరీతి, రణనీతి ‘పర్వ’ లో ఆద్యంతం సమాంతరంగా ప్రవహించాయి .యుద్ధ అనివార్యతకు హేతువులైన వ్యక్తిగత ఈర్షా ద్వేషాలను, అహంకారాలను, ప్రతిజ్ఞలను, ప్రతీకారాలను, మానవ సంబంధాలను,ఆత్మశోధనలను, ధర్మాధర్మ సంశయాలను, ఐకమత్యం కరువైన ఆనాటి రాజకీయాలను అత్యంత నైపుణ్యంతో సంఘటనల సమాహారంగా, స్మృతుల పరంపరగా, విశిష్ట స్వగతరూప సంవిధాన శిల్పంగా యావత్ భారత గాధను కొత్తకోణం లో ఆవిష్కరించారు బైరప్ప గారు.

రచనలోమానవీయస్పర్శఉంది. హేతువాద గణనీయత ఉంది. సమగ్ర మానవ అవగాహన ఉంది.మానవీయ స్పర్శ మహాసంగ్రామాన్నిఎలా ఆపలేకపోయిందో రచయిత తన కథాకథన కౌశలంతో సమర్థవంతంగా సమర్థించు కున్నారు. ” బైరప్పగారు వ్యాస ఆంధ్రమహాభారత ఇతిహాసాలలోని లోని ఖాళీలను (voids) ఏంతో నైపుణ్యంతో పూరించి రాసిన నవల “పర్వ”. A faithful documentation of anicient practices. ఈనాడు మనకు అనైతికంగా తోచే ‘నియోగం’, ‘రుతునష్ట పాపం’ వంటి విషయాలు సంస్కృత ఆంధ్ర భారతాలలో ఉన్నవే. నాటి ‘భారతానికి’ నేటి ‘పర్వ’ సమగ్రపూరణ” అంటున్నారు అనువాదకులు.

” ‘ చైతన్య స్రవంతి ‘ శిల్పంతో బైరప్పగారు వాక్యాలను అసంపూర్ణంగా ఒకదాన్లో నుండి ఒకటి వచ్చినట్లుగా అదో విలక్షణమైన పధ్ద్ధతి తో నడిపిస్తారు. యథాతథం గా కథనంతా భూతకాల క్రియారూపాలతో చెప్పి,చివరి అధ్యాయాన్ని మాత్రం భవిష్య, తద్ధర్మ రూపాలలో చెబుతారు “-ఇది బైరప్ప గారి రచనా శిల్పం పై అనువాదకులు గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారి అభిప్రాయం.

విశ్రాంత ఉపకులపతి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు కన్నడ ‘పర్వ’ను అదే పేరుతో అత్యంత సమర్థవంతంగా తెనుగించారు. “ప్రామాణిక పర్యాయాలతో పాటు ఒకటీ అరా రాయలసీమ పలుకుబడులను ప్రయోగించాను.మూలం లో కావాలని వాడబడిన వ్యవహార పదాలను వీలైనంత వరకు ఎబ్బెట్టు కాని రీతిలో తెలుగులోకి పట్టుకు రావడానికి ప్రయత్నించాను” అంటున్నారు. సరల వ్యవహార భాషలో తెనుగించిన తీరు అభినందనీయం. Lovely write.

ఐతే, “వేదవ్యాస విరచితమైన కథను వక్రీకరించి రాసిన ‘పర్వ’ ఎంత ప్రామాణికం? ఇలాంటి రచనలు మేలు కన్నా కీడునే చేస్తాయి” – ఇది కొందరి అభిప్రాయం. రాఘవేందర్ రావు గారి ఆంగ్లానువాదం ” ‘Parva’:A tale of War,Peace,Love,Death,God and Man ” చదివితే మరింత అవగాహన లభించవచ్చు. With all the goods and the bads, the book is lovable.

వివాదాస్పదమైన ఈ అరుదైన అసాధారణ ఉద్గ్రంధాన్ని చదవి నిట్తూర్చి తేరుకున్నాక నాలో మెదలిన ఈ నా కవితా పంక్తులతో ముగిస్తాను.

ఏదో క్రోన్నీటి ఉద్ధ్రత కెరటం
నా సనాతన కోవెల పునాదులలో
ఎవరో కప్పుతున్న కాలమేఘం
నా అనాది ఆకాశ హరివిల్లు మీద
సత్యాసత్యాల సందిగ్ధ కూడలిలో నిలిచి
దిక్కులు చూస్తున్నది నా వ్యగ్ర హృదయం.
తమసు తెరలను చీల్చే పురా ఉగ్ర కిరణం
పునర్భవిస్తే ఎంత బాగుండును.