కవిత్వం

హస్తినా, నీ వారసత్వం నిలబెట్టుకున్నావ్!

జనవరి 2013

ఆమె మృత్యువు అనైతికతకి ప్రతీక కాదు
ప్రజల మితిలేనిసహనానికి ప్రతీక
సమాజపు నిశ్చైతన్యానికి ప్రతీక
ప్రభుత్వాల అలసత్వానికి ప్రతీక
అదిచేసే అత్యాచారాలకి ప్రతీక.

చనిపోయింది కాబట్టి బ్రతికిపోయింది.
లేకపోతే
మార్చ్యురీలో ఉన్నట్టో,
క్వారంటైన్లో ఉన్నట్టో
జీవితాంతం బ్రతకాల్సిందే.
వెంటాడే నీలికళ్ళ ఎక్స్ రేలు ఎదుర్కోవలసిందే
రాబందుసమాజానికి
జీవితాన్ని కణకణం సమర్పించవలసిందే.

నేరంచేసినవాడే దోషికాదు
వాణ్ణి శిక్షించని చట్టమూ, న్యాయమూ
ఆమెను రక్షించని రాజ్యమూ దోషులే.

మేధావులకేముంది
ప్రతి జంతువుకీ ఒక రేటు ఉంటుంది

ఈ నాగరికత
కుక్కమూతిపిందెలు కాస్తోంది.
కౌరవసభలో వికర్ణుడిలా
గుడ్డి ప్రభుత్వాలకి
నోరెత్తిచెప్పగలవాళ్ళు లేరు
జటాయువులా ఎదిరించేవాళ్ళూ లేరు.
కొందరు జాత్యంధులూ
మరికొందరు గాంధారులూ

ఇక ఈ రోగానికి మందులేదు…
సమూలచ్ఛేదనే.