కొత్త పుస్తకం కబుర్లు

కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కవిత్వం, ఎప్పటికీ కొత్తగానే…

ఫిబ్రవరి 2015


కొత్తేమీకాదు పాఠకలోకానికి కొండ్రెడ్డి గారి కవిత్వం. తొమ్మిది కవితా సంపుటాలు, ఒక సాహిత్య వ్యాస సంకలనం, మూడు వందల పైచిలుకు విమర్షనా వ్యాసాలూ, రెండువందల ‘కదిలే కలాలకు’ కొత్త సత్తువను సమకూర్చే సాహితీ సమీక్షలు- రెడ్డి గారి కవిత్వ సంపద ఎంత దొడ్డదో వారి సాహిత్య బంధుకోటి కూడా అంత పెద్దది. కరీంనగర్ లో శరత్ సాహిత్య పురస్కారం, ఒంగోలు లో రాజరాజేశ్వరి అవార్డ్, విజయవాడలో రమ్యసాహితీ అవార్డ్, మచిలీపట్నంలోఆవంత్ససోమసుందర్ పురస్కారం, ఆటా వారి అవార్డ్- ఇలా పలు పురస్కారాలు పొంది ‘ఆకాశమంత చూపుతో’ సాహిత్య ఆకాశాన్ని ఆవరించిన కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి సరికొత్త కవితా చిగిరింత “ఎప్పటికీ కొత్తగానే”.

రెడ్డి గారు ఆరంభ కవితలోని ఆది పంక్తుల లోనే తనతనాన్ని కొత్తదనాన్ని ముద్రించుకున్నారు -”మనిషన్నాక/పరుగెత్తే కాలం మీద/పచ్చబొట్టై కనిపించాలి!”. ఆఖరి కవిత “వాడేం మనిషో!” లోని అంతిమ చరణాలు కవి మనుసు లోని నిర్ణయాత్మక ముగింపు-”వాడేమ్మనిషై నా మనం పట్టించుకోక తప్పదు/ వాడి దార్ని మార్చకా తప్పదు!”. అక్షర ప్రయాణం సుఖంగా జరిగిందన్న మాటేగాని, దారిపొడుగునా సమాజంలోని దైన్యం హైన్యం నిండిన వ్యక్తులు అడుగడుగునా దర్శనమిస్తారు . ముక్కిడి సిద్ధాంతాలు, భిన్న మనస్తత్వాలు, వ్యవస్థాగత అవస్థ లు, జెండర్ విద్వేషాలు,కార్పోరేట్ కంచెలు, ఆత్మాశ్రయ అసహనాలు, అవకాశవాదుల సంతలు, కళాత్మకత లోపించిన కళ్ళు, పూల మొక్కలకు కాసిన రాళ్లు కనిపిస్తుంటాయి. భర్తను బాధించే సీతలు, బంగారు లేడి వెంట పరుగెత్తే రాముళ్లు, స్త్రీల హృదయ నాసికలు కోసే లక్ష్మణులు, నిద్రలేవని ఊర్మిళలు, ఆధ్యాత్మిక మాయలో పడి మరణించే వృద్ధులు- ఇలా ఎందరెందరో మార్గం మధ్యలో తారసపడుతారు. సమాజం అతని కేంద్ర బిందువు.సమకాలీన మానవ జీవనం ఆతని కవితా వస్తువు. కవిత కళకు చెందినా దైనా, అనుభూతికి చెందినదైనా ఎక్కడో ఒకచోట మానవీయ సామాజిక స్పృహ తళుక్కున మెరవక తప్పదు.పాఠకుడు ‘నిప్పుల వానలో నానక, విషాదపు ఉబ్బిలిలో చిక్కక’ తప్పదు.

‘ఉద్యమకారులకు ఆశ్రయమిచ్చే చల్లని చెట్టు నీడ మా తాత!’ అంటూ పాతజ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే ఉద్యమాల మూల ఉద్దేశాలకు మద్దతు పలికారు. ‘సమస్త ప్రపంచాన్ని కలం పాళీ మీద పరికిస్తూ’నే ‘తాను అల్లుకున్న పద్యంలోకి’ తనను తాను జారవిడుచు కుంటాడు. ‘తెరచాప చిరిగింది /తెడ్డు విరిగింది / ఈ తెప్ప దరిజేర్చు తుందంటారా’ అంటూ నిటూర్స్తూనే ‘రైతరికాన్ని బతికించేందుకు / నీవు బతకాలి’ అని జీవన ధ్యేయాన్ని సూచిస్తారు. ‘వర్షం వెలిసినా యిల్లు కురుస్తూనే వుంది / ఇక ఇంటినీ నమ్మలేము’- సాభిప్రాయంగా కనిపించే సాధారణమైన రెండే రెండు వాక్యాల్లో ఈనాటి జీవన వాస్తవాన్ని అసాధారణ రీతిలో వ్యక్తీకరించారు. మడమ తడిపే నీటి ధారలో మొలబంటి లోతులు! ‘నేటి సమస్యలకు పుట్టుకలే గాని /చావులు లేవు’, ఐనా ‘అప్పుడే పిగిలిన పిల్లంత కొత్తగా/ కన్నీరంతా మెత్తగా’ కదలి రమ్మంటున్నాడు. ‘కంటి గుండం చుట్టు కదలాడే నెత్తురు జీరల సాక్షిగా/నిద్రాణం మోస్తున్న హేతువుకు/ చిటికెన వేలందిస్తూ /నిస్వార్థపు పాయల్లోకి ఉరకండి / సాంప్రదాయ వ్యర్ఠాలనుండి విడివడండి ‘ అంటూ వెన్నుతట్టుతున్నాడు. రాజకీయ నాయకులకు ఎప్పటికైనా “రంగు పడుద్దని” హెచ్చరిస్తున్నాడు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారిలోని కవి. “విభజన దిగులుముడికాదు! వికాసపు ఒడిగా / రెండు రాష్ట్రాల అభివృద్ధికి / అంకిత మౌదాం !!” అంటున్నాడు కవిలోని పరిణత మానవుడు .

ఈ సంకలనంలో అందమైన అనుభూతి ప్రధానమైన కవితలూ ఉన్నాయి.”ఓ రాగ స్పర్శకై ఎదిరిచూస్తూ…” లో -

“కొన్ని జ్ఞాపకాలు
కాల చప్పరించి మింగేస్తున్న
నా బాల్యాన్ని బతికిస్తూ
నా అక్షరం మీద నెలవంకను రాల్చి
నా పెదాల మీద నక్షత్రాలు మొలిపించి
నా కవిత్వాన్ని అవిశ్రాంతంగా
సాగిపొయ్యే
అత్యబ్ధుత చైతన్య దీప్తిని
చేస్తుంటాయ్ !”.

“నిర్జన సమూహాలు” లో -

ఎక్కడో కుదురుకట్టిన వో రహస్య స్థావరం
మనిషిని ఆడిస్తూ
ఆలోచనలను ఆర్పేస్తూ…
ప్రపంచాన్ని శాసిస్తూ
నిర్జన సమూహాలను సృష్టించ బోతోంది .”

“నా అక్షరంతో…” లో -

నా అక్షరం
రాత్రిని
ఊయల్లో ఊపుతూ
ఏ జాముకు నిద్ర పుచ్చుతుందో ఏమో తెలియదు.
………
ఉషోదయాన్ని
వెలుగు కిరణ స్పర్శతో తాకి
దినచర్యైన వో దుఃఖిత సహచరిని
కవిత్వంతో కళ్ళు తుడిచేందుకు
ఉపక్రమింప జేస్తుంతుంది !

ముక్కిడి సిద్ధాంతాలు, ఉబ్బిలి లాంటి అరుదైన పదాలతోపాటు ‘పవన విస్తృతంగా’ వంటి పదబంధాలనూ వాడాడు. మొక్కలకు రాళ్ళు పూయించాడు. ఇంద్రధనసుకు ఎనిమిదవ రంగును పులిమాడు. సామాజిక ప్రయోజనమే ప్రధాన ధ్యేయమైన తన కవిత్వంలో సహజ సామాన్యమైన పలుకుబడులతో సరికొత్త స్పృహను రగిలించాడు కవి కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు.

వచనకవితా వ్యవసాయానికి స్వయం ప్రబోధకమైన సరళ భాషా సామగ్రిని వినియోగించిన రెడ్డి గారు తన కళావ్యాసంగంలో నర్మగర్భితమైన అమూర్త చిత్రకళను ఎన్నుకున్నారు ! స్వయంగా చిత్రించుకున్నఅందమైన ఆబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్ ను కవరు పేజీ మీద అలంకరించారు.సమాజాన్ని నిదుర లేపేందుకు సరళమైన భాష మాత్రమే చిత్ర కళను మించిన సరైన సాధనం అని భావించి ఉంటారు. పాఠకుని సులభ అవగాహనకు లొంగని అధునాతన శైలీ విన్యాసాన్ని గాని, అనవసర భాషా బేషజాన్ని గాన్ని పాటించలేదు.An Artistic balancing act of emotional expression !
కవి గారి వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈ కవిత్వ సంపుటి చదివి తీరాల్సిన పుస్తకం.

వివరాలు:
పుస్తకం: ఎప్పటికీ కొత్తగానే…(కవిత్వం)
రచన: కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
ప్రతులకు: kavi.kondreddy@gmail.com


“ఎప్పటికీ కొత్తగానే” కవితా సంకలనం నుండి మచ్చుకు ఒక కవిత:

ఓ రాగస్పర్శకై ఎదురుచూస్తూ…

అప్పుడప్పుడు కొన్ని జ్ఞాపకాలు
అంతరంగావరణంలో
గువ్వల్లా వాలుతూ
ఆవర్తమౌతున్న కొన్ని
వ్యక్తిత్వాలను
చిత్తరువులుగా గీసిపొతుంటాయి!
చిరునవ్వు లొలుకుతూ
పలుకరించేవి కొన్నైతే
మాటాడని మౌనావేశంతో
మనసును తొల్చేవికొన్ని!
అపార్థాల ప్రతిబింబాలై
హృదయ తలం మీద
జీరాడేవి మరికొన్ని!
ఎన్నెన్నో జీవితోత్సవాల
మధురిమలు
అందీ అందని ఇంద్రధనస్సులు
బతుకు బంధాలై
గతం రక్తపు మరకల మీద
రంగుల తివాసీలు పరుస్తూ…
నాకు నాకే ఆశ్చర్యం!
కొన్ని చెడు జ్ఞాపకాలు
రగిల్చిన అంతర్ జ్వాల
నాలో అవ్యక్తంగా వేలాడే
కవితా తెట్టెను కదుపుతూ
రక్తసిక్త పథాలమీద
రసగంగను పారిస్తుంటాయి!
కొన్ని చిక్కని చిరునవ్వై
సోగకనుల సోయగాల్లోంచి
తీయని గళమెత్తి పాడుతూ
వేకువ వెన్నెల మాటున
చకోరం సేదదీరినట్లు
వడిసే దుఃఖానికి ఒదార్పునిచ్చే
వో కొత్త పద్యానికి
ఊపిరోస్తుంటాయి!
కొన్ని జ్ఞాపకాలు
కాలం చప్పరించి మింగేస్తున్న
నా బాల్యాన్ని బతికిస్తూ
నా అక్షరం మీద నెలవంకను రాల్చి
నా పదాల పెదాలమీద
నక్షత్రాలు మొలిపించి
నా కవిత్వాన్ని అవిశ్రాంతంగా
సాగిపొయ్యే
అద్భుత చైతన్య దీప్తిని
చేస్తుంటాయ్!
సందర్భమేదైనా అప్పుడప్పుడు
అంతరంగం నిశ్శబ్దం ఆవహించి
నిర్వేదమైనపుడు
కవితా సృజన కొరవడి
దిగులు జ్వాలలో రగిలిపోతూ…
తిరిగి కవిగా మొలకెత్తే
తలపుల్లో తడుస్తూ
రాగాస్పర్శకై ఎదురు చూస్తుంటాను!

**** (*) ****