కిటికీలో ఆకాశం

జీవితం… తిరిగి మొదలు పెట్టవలసిన పద్యం!

ఫిబ్రవరి 2015

ప్పిపోతాం మనం. లోకం లోకి వొచ్చి, అమ్మ చేతి గోరుముద్దల కాలం దాటి, ఇంటి నుండి విశాల వీధుల లోకి అడుగు పెట్టాక, మన చిన్నప్పటి అమాయక వెన్నెల నవ్వులని, ఎదురుపడిన మనిషిలోకి అట్లా అనాయాసంగా వెళ్లిపోగలిగిన స్వచ్చ అద్దం లాంటి మనసున్న అప్పటి రోజులని కాలగమనంలో మనకు తెలీకుండానే పోగొట్టుకుంటాం!

ఇక అక్కడి నుండీ మనం ఎట్లా మారిపోతాము? కరచాలనం దాకా వొచ్చిన మనిషి కూడా మనల్ని కదిలించడు. ఎదురయ్యే ఏ దృశ్యమూ మనల్ని అబ్బుర పరచదు. రోజులు గడిచే కొద్దీ మనం చాలా ముందుకు వెళ్ళి పోతున్నామన్న ఒక భ్రమ ఏదో మనల్ని ఆవరించి వుంటుంది గానీ, మనల్ని మనం సజీవంగానే ఒక గోనెసంచిలో కుక్కి, పెద్ద చెరువులోకి విసిరేసుకున్నామన్న ఎరుక ఏదీ వుండదు-

ఇక అపుడేం చెయ్యాలి మనం?
ఏమీ తెలియని, కనీసం తల బయటపెట్టి తొంగి చూడలేని దీన స్థితిలోకి జారిపోయాక ఎంత గింజుకుంటే మాత్రం ఏమి చేయగలం?
బహుశా, అట్లాంటి సంక్లిష్ట స్థితిలో, ఒక పెను కుదుపు ఏదో మన జీవితంలో సంభవించాలి.

ఒక పెను విస్ఫోటనం (Big Bang) తదనంతరం, ఒక చిన్ని మట్టి ముద్దలా వున్న విశ్వం, విస్తరించీ విస్తరించీ వేన వేల మెరిసే నక్షత్రాలనీ, పాల పుంతలనీ, సూర్యుల్లనీ, చంద్రుల్లనీ దర్శించినట్టు, అప్పటి దాకా మనకూ, సజీవ కాంతిమయ లోకానికీ అడ్డుగా వున్న ఒక చీకటి మాయ తెర తొలగిపోయి అప్పుడే కళ్ళు తెరిచిన పసివాడిలా లోకాన్ని కొత్త కొత్తగా చూడడం మొదలు పెడతాము.

ఒక వేళ, అట్లాంటి పెను విస్ఫోటనమేదీ సంభవించక పోతే? బెంగపడ వలసినదేమీ లేదు! ఇక్కడొక హెచ్చార్కె పద్యం వుంది. దాన్ని మీ జీవితంలోకి వొంపుకొనండి. తప్పిపోయిన జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి తగిన శక్తినీ, వెలుగునీ యిస్తుంది.

యరేజర్

కడచి వచ్చాననే అనుకుంటున్నాను
ఇరుకు గడప దాటి ఊళ్లోకి వొచ్చినట్టు
కీళ్ళకు చుట్టుకొని కదలనీయని నన్ను దాటి
బాగా దూరం వచ్చాననే అనుకుంటున్నాను

యిటీవల నేనొక మంచి మరణాన్ని
మనసారా వరించాను
దేహం విల్లుకి ప్రాణాన్ని సంధించి లాగినట్టు
మరుక్షణంలో మరణా వరణాన్ని దాటబోతుండగా
పక్కింటి వాడికివ్వాల్సిన చేబదులు గుర్తొచ్చి
వార్నీ అని నవ్వుకుంటూ వెండిరిగి నడిచినట్లు ఏదో మెలకువ
చిలుకుతున్న కవ్వం చుట్టిపెట్టి
వెన్నతీయని మజ్జిగ లోటాతో వచ్చిన
తడి తడి చేతుల అమ్మలా నా కన్రెప్పలను స్పృశించింది
నిజంగా నిజమైన చిరు మెలకువ
మహాద్భుత స్వప్నం కన్న మనోహరం

అప్పుడే పుట్టిన పాపాయి కళ్ళు విప్పార్చి
ఏం చూస్తుందో యిప్పుడు తెలుస్తోంది
అంతా చాలా కొత్తగా వుంది వింతగా వుంది
యింకా యింకా చూడాలనిపిస్తోంది వినాలనిపిస్తోంది
కనిపించిన ప్రతి మనిషినీ పలకరించాలనిపిస్తోంది
పలకరించిన ప్రతి మనిషికీ నమస్కరించాలనిపిస్తోంది
మీరు ఎటో వెళ్తున్నట్టున్నారు తోటకో ఏటి గట్టుకో
నన్ను మీతో తీసుకెల్లరూ అని అడగాలనిపిస్తోంది

అంతా లోపల ఉందనడం ఒక మహా అబద్ధం
ఏముంటుంది లోపల పాచి పట్టిన కోనేటి నిలవ నీరు

ఆ నీడలో యిద్దరాడ పిల్లలు ఊయల వూగుతున్న దృశ్యం
ఈ నీడలో చెప్పులు కుట్టే ఆయన పక్కన కూచొని
ముఖాన్ని పున్నమి చందమామ చేస్కొని వూరి వూసులు
చెబుతోన్న మున్సిపాలిటీ శ్రామికురాలు, ఆ పక్కనే
ఊరకే కూచుని వింటూ ఏదో నేర్చుకుంటూ వున్న పడుచు పిల్ల

కొలతలు మానేసి, పోలికలూ తేడాలూ వొదిలేసి
లోపలి కమురు కోర్కెలకు అత్తరు మాటలోదిలేసి
కాళ్ళూ కళ్ళూ నీళ్ళకు వొదిలి చెరువు గట్టున కూర్చున్నట్టు
యిలా మనుషుల్లో మనిషిగా కలిసిపోవడం
చల్లని మానవత్వంతో కడుపు నింపుకోవడం
యెంత బాగుందో ఎంత బాగుందో

ఉన్నదంతా బయటే వుంది
నేనొక ఎండ పొద్దు గోడని మాత్రమె
నీడలు నిజాలనుకుని కళ్ళు బైర్లు కమ్మేలా
లోలోపల గింగిర గోల్ తిరిగానంతే
నీడలను దాటేసి , గోడతనపు నన్ను దాటేసి
మనుషుల రూపమెత్తిన చల్లని సూర్యుడిని
తనివితీరా కావలించు కుంటున్నాను… మళ్ళీ!

కవిత ఎత్తుగడ లోనే కవి అంటున్నాడు ‘కడచి వచ్చాననే అనుకుంటున్నాను’ అని. ఇంతకీ దేనిని దాటి వచ్చానని కవి భావిస్తున్నాడు?
కాలగమనంలో బావిలో కప్పలా మారిన దీన స్థితిని ‘ఇరుకు గడప’ తో, ‘ఎటూ కదలనీయని కీళ్ళ జబ్బు’ తో పోల్చుతున్నాడు. ఆ స్థితి ఎంత దయనీయంగా మారిందో చెప్పడానికి ‘ఒక మంచి మరణాన్ని మనసారా వరించాను’ అంటున్నాడు.
ఆహ్వానించనైతే ఆహ్వానించాడు గానీ, ఆ మరణ పరిష్వంగం లోకి ఒదిగిపోయాడా?
లేదు … ఆ మరణావరణాన్ని దాటబోతూ వుండగా నిజంగా నిజమైన, మనోహరమైన ఒక చిరు మెలకువ అమ్మలా స్పృశించింది అంటున్నాడు. అంతేనా? ‘వెన్న తీయని మజ్జిగ లోటాతో వచ్చిన తడి చేతుల అమ్మలా’ అని అంటున్నాడు. మరి, మనం పూర్తిగా మన అమ్మల లోకంలో వున్న ఆ కాలంలోనే కదా ఏ మరకలూ అంటని అద్దంలా వున్నది.

‘అప్పుడే పుట్టిన పాపాయి కళ్ళు విప్పార్చి / ఏం చూస్తుందో యిప్పుడు తెలుస్తోంది’ అంటూ ఇక్కడే కవి ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. అంతేనా? కనిపించిన ప్రతి మనిషినీ పలకరించాలనీ, నమస్కరించాలనీ అనిపిస్తోంది అంటున్నాడు. ఆ పలకరింపులు కరవయ్యే కదా, మనమిట్లా మన యిరుకిరుకు గడపల్లోనే జీవితాలని వెళ్లదీస్తున్నది!

యిరుకిరుకు గడపని దాటి, వీదుల్లోకీ, విశాల లోకంలోకీ వొచ్చి, తాను కనుగొన్న ఒక సత్యాన్ని ప్రకటిస్తున్నాడు -
‘అంతా లోపల ఉందనడం ఒక మహా అబద్ధం / ఏముంటుంది లోపల పాచి పట్టిన కోనేటి నిలవ నీరు’
ఇంతకూ ఎదురైన మనుషుల్ని కౌగిలించుకోవడానికి మనకు అడ్డు పడుతున్నవేమిటి ? … కొన్ని పోలికలూ , తేడాలే కదూ ! … మరి, అపుడు మన ముందున్న మార్గం ఏమిటి ? …. అనుకోవాలే గానీ చాలా సులభం !
కవి చెప్పినట్టు – ‘కాళ్ళూ కళ్ళూ నీళ్ళకు వొదిలి చెరువు గట్టున కూర్చున్నట్టు’ మనుషులలో ‘మనిషి’ గా కలిసిపోవాలి !
తనపైన వాలే నీడల్నే నిజాలని భ్రమసి, లోలోపలే ‘గింగిర గోల్ ‘ తిరిగే ‘గోడ తనాన్ని’ వొదిలించుకుంటే గానీ, మనుషులు కౌగిలించుకోదగిన ‘చల్లని సూర్యుడిలా’ అగుపించరు!
గమనించారా ?
పద్యాన్ని ‘మళ్ళీ’ అన్న మాటతో ముగించాడు కవి.
మరి, ఇంతకు క్రితం ఇట్లాంటి స్థితి సజీవంగా వుండిన కాలం ఏది?
సరే గానీ, ‘అప్పుడే పుట్టిన పాపాయి కళ్ళు విప్పార్చి ఏం చూస్తుందో’ మన ఊహకు ఏమైనా అందుతూ వుందా?!

**** (*) ****