కవిత్వం

తూనీగ ఆధారం

జనవరి 2013

ఇక కన్నీళ్ల పిడి గుద్దుల్ని భరించలేను
అపజయాల దిగుడు బావిలో ఆత్మహత్యించలేను
నాకో నిర్భయ ప్రదేశం కావాలి
ఎండ తళుక్కున మెరిసే వెచ్చని నవ్వు కావాలి
నా మనసుకు తూనీగ కాలూన్చే చిన్ని ఆధారం కావాలి
అనుక్షణం తలలూపే పైర్లని ముద్దాడే ఏటవాలు తెమ్మెర కావాలి
నేనో అమాయకపు దీపప్పురుగుని
ప్రపంచం మెరుగుల్ని నురుగై పూసుకుని కూలబడతాను
కళ్ల ఆధారంతో కవిత్వాలల్లుకుని
కందిరీగల కాలాన్ని రెక్కలార్చుకుంటూ పోయే సీతాకోకచిలుకని
ఆగిన ప్రతిచోటా వెన్నెల పుష్పాలు జలజలా రాలాలి నాకు
చూపు సాగినంత మేరా కెరటాలు పాదాల ముందు ప్రత్యక్షమవ్వాలి
పగళ్లన్నీ రాత్రుళ్లై చల్లని వనాలై పోవాలి
అబ్బా- విరబోసుకున్నా తల నిండా బొప్పి కట్టిన అనుభవాలు
ఇంటా బయటా నా కోసమే ప్రత్యేకించిన రాక్షస సేనలు
నోరు కుట్టుకుని, కాల్చేతులు మడిచి వెనక్కి కట్టుకుని
మెదడు చక్రాల్నీడ్చుకెళ్తూన్న వర్తమాన వైకల్యురాల్ని
ఏ త్రోవన ఏ గుండె కొట్టుకుంటూందో!
ఏ ఒక్క క్షణం లో చిర్నవ్వు శాశ్వతమవుతుందో!!
ముళ్ల సోపానాలైనా
మొత్తం ముంచెత్తినా
ఇక ఈ స్వప్నాల్ని పుష్పించకుండా ఆపలేను
దుఃఖం దిగబడే ఊబిలో నరకమై మరణించలేను