కథ

గళ్ళ లుంగీ – గళ్ళ మేక్సీ

మే 2015

దేమి కాకతాళీయమో గాని నేను గళ్ళ లుంగీ వేసుకుని మా డాబా మీద పచార్లు చేస్తున్నప్పుడల్లా మా ఎదురింటి ఆవిడ గళ్ళ మేక్సీ వేసుకుని తన డాబా మీద తిరుగుతుంటుంది. చూసేవాళ్ళు తను పిచ్చిగా తిరుగుతుందని అనుకోకూడదని కొన్నిసార్లు బట్టలు ఆరేయడం కోసం, కొన్ని సార్లు బట్టలను తీసుకోవడం కోసం, మరికొన్ని సార్లేమో చీపురును ఇవ్వడం కోసం అన్నట్టు పనిమనిషిని వెంట తీసుకుని పైకి రావడం, వచ్చినప్పుడు నన్ను కన్నార్పకుండా చూడడం చేస్తుందని మా ఆవిడ దగ్గర చెప్పుకోవడానికి దమ్ముల్లేక నేను లోలోన సంతోషించిన సందర్భాలెన్నో ఉన్నాయి! అయినా భార్య దగ్గర ఇలాంటి విషయాలు చెప్పడం మర్యాదగా ఉంటుందా అని మనసులోనే అనుకునే వాడిని. పైగా నేను మొగుడిని కదా. పరాయి ఆడవాళ్ళు నాకు సైట్ కొట్టడం గురించి మా ఆవిడకు చెప్పడం ఏమంత గొప్పగా ఉంటుంది? గొప్ప కోసం చెప్పుకుంటే ఎప్పుడో ఓసారి రివర్స్ కిక్ వచ్చినా రావచ్చు. అందుకేరా అబ్బాయీ, నువ్వు గప్ చిప్ గా ఎదురింటి ఆవిడకు సైట్ కొడుతూ ఉండు, అని నా మనసుకు ధైర్యం చెప్పాను. నా సాయంత్రాలు అలా గడుస్తున్నాయి.

ఎందుకో గాని కొందరి మొహాలను చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అలా చేయడంతో సాధించేదేమీ ఉండదు. కాని, మనసుకు అదో ఆనందం కదా అనిపిస్తుంది నాకు.

మా ఎదురింటావిడ చాలా అందంగా, నాజూకుగా ఉంటుంది. శరీరావయవాలు చెప్పుకోదగ్గట్టుగా, ఎత్తుపల్లాలతో ఆకర్షణీయంగా ఉంటాయి. నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఈ విషయంలో మా ఆవిడకంటె ఎదురింటావిడ బాగుంటుంది. అయినా ఏం లాభం? అందని ద్రాక్షపండ్లు పుల్లన కదా!
మా డాబా పైనుంచి ఆమెతో కనీసం కండ్లైనా కలుపుదామని ప్రయత్నించి చాలాసార్లు ఓడిపోయాను. కాని, ఆమె నన్ను చూడకుండా ఉండదని నా గాఢ విశ్వాసం. నేను ఆమెవైపు చూడనప్పుడల్లా ఆమె నన్ను చూస్తూ ఉంటుందని ఓ ఆశ.

మా ఎదురింటావిడ ఎంత వరకు చదువుకుందో కాని, గౌరవమర్యాదలు గల కుటుంబానికి చెంది ఉంటుందని నా అభిప్రాయం. ఆమె భర్త ఏదో ఆఫీసులో అధికారి అని మా ఆవిడ ద్వారా చూచాయగా తెలిసింది. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఉబలాటపడ్డాను కాని, మా ఆవిడ ఎక్కడ లేనిపోని అర్థాలు తీస్తుందోనని గాబరా పడి నోర్మూసుకుని, నా చెవులు మాత్రం ఏంటెన్నాలలా నిక్కబొడుచుకుని ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను! చచ్చిపోతున్న వాడు ఊపిరి ఆడుతున్నంత వరకు తను బ్రతికిపోతానని నమ్మినట్టు, ఏ ఘడియలోనైనా మా ఆవిడ నోటిలోంచి ఎదురింటావిడ గురించిన ప్రస్తావన రాకపోతుందా అని పేరాశలో ఉండేవాడిని. ముఖ్యంగా సాయంత్రం ఆఫీసునుంచి వచ్చాక నేను టిఫిన్ తింటున్నప్పుడు, టీ తాగుతున్నప్పుడు మా ఆవిడ నాకెదురుగా కూర్చుని తను కూడా నాతో పాటు టిఫిన్ తింటూ టీ తాగుతూ, ఇరుగుపొరుగు ఇండ్లలో జరిగిన సంఘటనల వివరాలను నాకు చెప్పుతుంది. నేను ఊఁ కొట్టుతూ నాకు కావలసిన విషయం గురించి వినాలనే ఆత్రుతతో ఉంటాను. టిఫిన్ ఎలా ఉందని అడిగితే ఒకవేళ ఎదురింటావిడ గురించి ఒక్క మాట కూడా వినకుంటే రుచిగా లేదనీ, కనీసం ఓ రెండు విషయాలను వింటే బాగుందనీ చెప్పుతుంటాను. మా ఆవిడ నా జవాబును ఎలా అర్థం చేసుకుంటుందో నాకు తెలియదు. ఒకరోజు ఆమె ఆ ప్రశ్నను వేయడం నేను జవాబివ్వడం అయింతర్వాత, “వంటింటి పని పూర్తి చేసుకుని డాబా మీదికి వచ్చెయ్” అని యథాలాపంగా ఓ పత్రికను పట్టుకెళ్ళి డాబా మీద కుర్చీలో కూలబడ్డాను, నా రోజువారీ కార్యక్రమాన్ని ఆనందించడానికి.

కొన్ని రోజుల్నుంచి మా ఆవిడలో ఎదురింట్లోకి కొత్తగా వచ్చినవాళ్ళ గురించి స్వయంగా తెలుసుకోవాలనే ఉబలాటం ప్రబలుతోందని గ్రహించాను.
ఒకనాడు ‘ఏమండీ, ఎదురింటివాళ్ళ దగ్గరికి వెళ్దామా?’ అనో ‘కొత్తగా వచ్చిన వాళ్ళింటికి వెళ్ళి పరిచయం చేసుకుందామండీ’ అనో మా ఆవిడ ఏ క్షణంలోనైనా అంటుందని క్షణాలను లెక్క పెట్టుకోసాగాను. సోఫాలో కూలబడి ఓ ఇంగ్లీషు మ్యాగజైన్ పేజీలను తిప్పుతూ, వంటింట్లో ఉన్న మా ఆవిడ వైపు చూసి, ఆమె టీ టిఫిన్లను ఎప్పుడు పట్టుకొస్తుందా అని ఎదురు చూశాను. ఆఫీసునుంచి వచ్చాక అలా కొద్దిసేపు బడలిక తీర్చుకోవడం నాకు అలవాటు. నా శ్రీమతి ఆరోజు ఇరుగుపొరుగు ఇండ్లలో జరిగిన సంభాషణలను ఉపోద్ఘాతం రూపంలో తెలుపుతూ తను కూడా నాతో కలిసి టిఫిన్ తిని టీ తాగింది. అంతకన్న ఎక్కువ ఏం జరగలేదు.

కాని, ఓ ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయ్యాక నా శ్రీమతి తీరిక చేసుకుని ముసిముసి నవ్వులతో వంటగది లోంచి డ్రాయింగ్ రూంలోంచి నా చేతిలోంచి మాసపత్రికను లాక్కుంటూ “సెలవు రోజు ఇదేమిటండీ! ఓ ముద్దూ లేదు, ముచ్చటా లేదు” అన్నది. తర్వాత నాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది.

“ముద్దులు రాత్రే అయిపోయాయిగా. ఇక ముచ్చట్ల సంగతంటావా? ఏ విషయం గురించి, లేక ఎవరి గురించి ముచ్చట పెట్టాలో చెప్పు” అన్నాను ఆమె మనసులోని మాటను బయటికి లాగాలని.

ఆమె సిగ్గు పడుతూ, చిరునవ్వు నవ్వుతూ “నా మాటలకు మీరు బాగానే వ్యాఖ్యలు చేస్తారు లెండి. నేనంటున్నది ఎదురింట్లోకి ఓ రెండు వారాల క్రితం వచ్చి చేరినవాళ్ళ గురించి. మంచి ఫ్యామిలీలా ఉన్నారు. వాళ్ళకు మన కాలనీ కొత్త కదా. అందుకే వెళ్ళి, వాళ్ళకేమైనా కావాలా తెలుసుకుందామా?” అంది.

“అహఁ, ఇంతకూ వాళ్ళది ఏ ఊరట?” అని అడిగాను.

“ఊరుకాదండీ. సిటీ. బెంగుళూరు” అంది కండ్లెగరేస్తూ.

ఇంకా ఏదో చెప్పబోతుండగా “ఓహో, వాళ్ళు బెంగుళూర్ వాళ్ళని ఎలా తెలుసు? మంగుళూరువాళ్లు కాకూడదా?” అన్నాను సంభాషణను పొడగిచాలని.

“మంగుళూరు ఆమె పుట్టినిల్లటండీ”

“ఓహో, అలాగా? మరి ఆమె మెట్టినిల్లు?”

“బెంగుళూర్”

“బాగుంది. మరి పిల్లలు బృందావనంలో ఉన్నారా?”

“పోనిద్దురూ. మీరు మరీను. వాళ్ళకు పిల్లలు లేరట. పెండ్లై పదేండ్లైందట. వైద్య పరీక్షలన్నీ చేయించుకున్నారట. ఇద్దరిలో ఎవరికీ లోపం లేదట. అయినా సంతాన భాగ్యం అన్నది భగవంతుని లీల కదండీ”

“బాగానే రాబట్టావే లోగుట్టు విషయాలు” అన్నాను ఆమెను మెచ్చుకుంటూ, నాలో నేనే సంతోషపడుతూ.

“అది కాదండీ. మన పక్కింటి పిన్ని మొన్న వాళ్ళింటికి ఆవకాయ పట్టుకెళ్ళి అలా వాళ్ళ విషయాలను కొన్నింటిని ఆరా తీసుకొచ్చింది”

“బాగుంది. మరి నువ్వు బెండకాయ వేపుడు పట్టుకెళ్ళి గొలుసుకథ లోని మిగతా భాగాన్ని తీసుకొచ్చెయ్”

“అబ్బా. మీరు నా ప్రతి మాటను జోకుకింద లెక్క కట్టుతారు” అని నవ్వింది మా ఆవిడ నిండుగా.

?ఏం చెయ్యను? మీ నాన్న నిన్ను ఓ చార్టర్డ్ అకౌంటెంటుకు కట్టబెట్టాడుగా మరి, ఆఫీసు పని అయిపోయాక నీతో కలిసి ఇంటిలెక్కలు సరి చూసుకోమని?” అన్నాను నాటక ఫక్కీలో.

“చాల్లెండి మీ వరస” అన్నది ఆమె, కోపం నిండిన మొహంతో.

విషయం మించకముందే సంభాషణను మారుస్తూ “మన పిల్లలేం చేస్తున్నారు? అని అడిగాను.

“బాబుగాడు నాన్న నాన్న అంటూ మీ నామ మంత్రాన్ని జపిస్తున్నాడు. నిద్రనుండి లేవగానే వాడు మిమ్మల్ని చూడాలిగా? వాడిని బాత్ రూంలోనికి పంపించి వచ్చాను”

“మరి చాలా సేపైందే వాడు బాత్ రూంలోకి వెళ్ళి” అని అడిగాను ఆశ్చర్యంతో.

“డోంట్ వరీ. వాడు మీకుమల్లే బాత్ రూంలో చాలా సమయం తీసుకుంటాడు. టవల్ కోసం వాడు బాత్ రూంలోంచి గొంతు చించుకుని అరుస్తున్నప్పుడు వెళ్తాన్లెండి” అన్నది నవ్వుతూ.

“మన చిట్టి చిన్నమ్మ ఏం చేస్తుందీ?”

“ఏం చేస్తుంది? మీ లాగే కంప్యూటర్ ఆన్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటోంది. దానికి రేపు ఏదో కంప్యూటర్ పరీక్ష ఉన్నదట”

“టవల్ ప్లీజ్” బాత్ రూంలోంచి వచ్చిన కేక డ్రాయింగ్ రూం వరకు వినబడింది.

మా ఆవిడ “శ్రీరాం, వస్తున్నా” అంటూ గబగబా వెళ్తూ గడప దాటుతున్నప్పుడు “నేనడిగిన విషయాన్ని దాటేశారు” అంది.

నిక్కచ్చిగా చెప్పాలంటే నాకు మా ఎదురింటివాళ్ళతో పరిచయం చేసుకోవాలనే ఉంది. మా ఎదురింటామె ముందు కూర్చుని ఆమెను మనసారా చూడాలనే ఉంది. ఆమెతో ముచ్చట్లు పెట్టాలని ఉబలాటంగా కూడా ఉంది. కాని ఎందుకో త్వరగా వెళ్ళాలనిపించట్లేదు. ఆమె అందాన్ని, శరీరపు ఎత్తుపల్లాలను దూరంనుండే చూపులతో ఆస్వాదించాలని ఉంది. ఇలా అనుకుంటూనే దూరపు కొండలు నునుపు కాకూడదని కూడా ఆశ పడ్డాను. ఆమెను అలా చూడాలనే కోరిక నాకు అత్యాశలా అనిపించింది. కొన్ని మనకు దొరకవని, వాటిని సాధించలేమని తెలిసి కూడా వాటికోసం అర్రులు చాచడం నా లాంటి వాళ్ళ ప్రవృత్తా? ఇలా ఆలోచిస్తే మస్తిష్కం వేడెక్కి అనవసరంగా వ్యాకోచిస్తుందని భయపడి, స్కూటర్ ను బయటికి తీసి స్టార్ట్ చేస్తూ “నేనలా వెళ్ళి ఇప్పుడే వస్తానోయ్” అని శ్రీమతినుద్దేశించి ఓ నోటీసులాంటి కేక వేసి, ఓ స్నేహితుని ఇంటివైపు వెళ్ళాను.

నా మిత్రడైన రఘురాంతో ఓ రెండు గంటల సేపు బాతాఖానీ కొట్టుకుంటూ కూర్చున్నాను. వాడేమో తన పక్కవాటాలో ఉన్న అందాల రాణి సౌందర్యాన్ని ఆనందిస్తూ ఆమె ప్రేమలో చిక్కుకున్న సంగతి చల్లగా చెప్పాడు. వాడు కట్నం ఆశలో చిక్కుకుని రెండేళ్ళ క్రితం ఓ పెద్దింటి అమ్మాయిని పెండ్లి చేసుకున్నాక, వాడి శ్రీమతి మొదటి కాన్పులోనే కవలపాపలను కన్నది. వాడితో నాకు బాగా చనువు ఉండడంతో “బేటా, ఇక ఇప్పట్నుంచే కట్నం కోసం డబ్బులు కూడబెట్టు” అని ఆట పట్టించాను.

వీడి గొడవ నా కోతిమనసు కంటే సీరియస్ గా ఉందనుకుంటూ వాడినుండి వీడ్కోలు తీసుకుంటుండగా “ఆమె నాతో లేచిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పిందిరా. ఆమె దగ్గర నగానట్రా బాగానే ఉన్నాయట. వాళ్ళ నాన్న ఆమె పేరున బ్యాంకులో పది లక్షలకు పైనే ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడట. ఏం చెయ్యమంటావ్ నన్ను?” అని అడిగాడు నా రెండు చేతులూ పట్టుకుని.

“మీ వదినను అడిగి చెప్తాను. తెలుసులే ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్ అని. నాకు కొద్దిగా సమయం ఇవ్వు. ఏం చెయ్యాలో చెప్తాను” అని అక్కడినుంచి మా ఇంటిదారి పట్టాను.

నేనే ఓ చవటననుకుంటే రఘురాం గాడు చవట క్యూబ్ గా తేలాడు అనుకున్నాను. పరాయి పురుషుల పెళ్ళాల మీద మోజు పడడం సబబేనా? అలా మోజు పడడానికి కారణమేంటి? ఇది సైకలాజికల్ డిజార్డరా? భర్తల్ని ప్రేమించే భార్యలుండగా వైస్ వర్సా ఇదేమి రోగమో?

ఎందుకో గాని మా ఎదురింటావిడ నామెదడులో తళుక్కున మెరిసింది. ఆ దంపతులు వైద్యపరీక్షలు చేయించుకున్నారట. కాని ఏమీ తేలలేదట. లోగుట్టు పెరుమాళ్ళకెరుక!

మకాంను ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి మార్చమని ఎవరో చెప్పారట. ముప్ఫై ఏళ్ళు ఉండి ఉంటాయి ఆమెకు. తన చదువు పూర్తి కాకముందు తన మేనమామ కొడుకుతో ఆమెకు పెళ్ళైందట. కాపురానికొచ్చి పదేళ్ళయిందని పాతబస్తీలో వాళ్ళ పొరుగింటి నుండి వచ్చినామె తెచ్చి కాకికబురు. పెండ్లి అయి రెండేళ్ళే అయింది కనుక ఇప్పుడే పిల్లలు వద్దని ఆ దంపతులు భీష్మించుకుని కూర్చున్నారన్నది ఆ ఇంటిలో కొత్తగా పనికి కుదిరిన మంగమ్మ వాంగ్మూలం.

ఇటువంటి విషయాల్లో అనుభవజ్ఞుడినైన నా అంచనా ప్రకారం పాతబస్తీ నుండి వచ్చి కబురే సబబుగా ఉందనిపించింది. అయినా మా ఆవిడ తరచుగా వాడే ‘ఆ పాడు గొడవలన్నీ మనకెందుకు’ అన్న ఊతపదంను మనసులోనే అనుకున్నాను. కాని, అన్ని విషయాల్లోనూ తల దూర్చే నా మనసు ఎందుకో గాని మా ఎదురింటాయన మీద అసూయతో సలసల మరగడం మొదలు పెట్టింది. ఆ జంటను చూస్తే ఆమె కాకి ముక్కుకు దొండపండులా ఉన్నదనిపించింది. పెండ్లిళ్ళు అన్నీ స్వర్గంలోనే నిర్ణయించబడతాయనే లోకోక్తి మీద నాకు నమ్మకముంది. అయినా మనకెందుకులే ఈ లేనిపోని గొడవ అనుకుంటుండగానే స్పీడ్ బ్రేకర్ నా ఆలోచనలకు బ్రేక్ వేయడంతో స్కూటర్ ఆగిపోయింది. మళ్ళీ కిక్ కొట్టి స్కూటర్ ను స్టార్ట్ చేసి, కొన్ని నిమిషాల్లోనే మా ఇంట్లో అడుగు పెట్టాను. స్కూటర్ స్టాండ్ వేస్తుంటే పిల్లలిద్దరూ పెద్ద ఫిర్యాదుతో ముంగిలి లోకి వచ్చారు. వాళ్ళ వెనుక కొంగుతో చేతులు తుడుచుకుంటూ, కొంటెగా చిరునవ్వులు వెదజల్లుతూ నాశ్రీమతి.

ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని అర్థమైంది.

మధ్యాహ్న భోజనాల తర్వాత నా పడకగది లోకి వెళ్ళి బడలిక తీర్చుకున్నాను. సాయంత్రం కండ్ల బడలికను తీర్చుకునేందుకు డాబా పైకి వెళ్ళాను!

యథావిధిగా నా కండ్లు ఎదురింటావిడ రాక కోసం నిరీక్షించడం మొదలెట్టాయి. ఏదో వంకతో ఆమె డాబా మీదికి వస్తుంటుంది. నేను ఆమె కండ్లలో కండ్లు పెట్టి చూస్తుంటాను. ఆమె తన పెదవులపై చిరునవ్వును చిందిస్తూ ఉంటుంది. నా మనసుకు అది ఆహ్లాదకరంగా ఉంటుంది. మా ఆవిడ పైకి వచ్చే లోగా ఆమె వెళ్తూ టాటా ఉన్నట్టు చేతులతో సైగ చేసింది.

మంగమ్మ వచ్చి మేడపైన బట్టలు ఆరేసి వెళ్ళింది. కొన్ని నిమిషాలు అలా గడిచిపోయాయి. రోదసిలో వేలాడుతున్నట్టనిపించింది నాకు. జీవంలేని నాకండ్లు జీవం కోసం తహతహలాడుతున్నాయి. కాని ఆమె ఆచూకీయే లేదు. మా ఆవిడ మేడ మీదికి రాకముందే ఎదురింటావిడ ఓ సారి కనిపించి వెళ్తే మహా ఆనందంగా ఉండేదనిపించింది.

చంద్రోదయమైంది.

“ఏమండీ, బోర్ కొడుతోందా?” అంటూ మెట్లెక్కుతూ ఉదయించింది నా చంద్రమతి, సౌభాగ్య లక్ష్మి, అర్ధాంగి, పెండ్లైన కొత్తలో నా హృదయరాణి, తర్వా ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నా శ్రీమతి.

“న్యాచురల్లీ” ఏడ్వలేక నవ్వానన్నట్టు అబద్ధం చెప్పాను, నాకెదురుగా ఉన్న ప్లాస్టిక్ కుర్చీని లాగుతూ.

“ఈ రోజు వాతావరణం బాగుందండీ” అంది మా ఆవిడ.

నాకు సరైన పదాలు దొరక్క ఊఁ కొట్టాను అయిష్టంగానే.

ఆమె రఘురాం గురించి ఆరా తీసింది.

వాడు తన పక్కింటావిడతో జరుపుతున్న శృంగార లీలల గురించి క్లుప్తంగా చెప్పి, అలాంటి పరిస్థితిలో వాడేం చేయాలి, అని చంద్రమతి సలహా అడిగాను.

ఆమె ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకుని ఒక్క ముక్కలో ఇలా చెప్పింది “గప్ చిప్ గా సతీసమేతంగా ఏ అర్ధరాత్రో ఇల్లు ఖాళీ చేసి, రహస్య స్థలానికి వెళ్ళమని చెప్పండి”

ఈ ఆడవాళ్ళ బుర్రలు మామూలు బుర్రలు కావనుకున్నాను. ఆమె తీర్పు నాకు న్యాయబద్ధంగానే తోచింది.

వెంటనే రఘురాంకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాను. వాడు మా ఆవిడ చెప్పిన విధంగా చేయడానికి ఒప్పుకున్నాడు. నాకెందుకో హాయిగానే అనిపించింది.

“నాకు థాంక్స్ చెప్పాడు వెధవ” అన్నాను చంద్రమతితో. ఆమె నవ్వింది, నిండు వెన్నెలను వెదజల్లే చంద్రునిలా.

చుక్కలు చక్కగా కనిపిస్తున్నాయి విశాలమైన ఆకాశంలో. కాని మా ఇంటికెదురుగా ఉన్న చిన్న మేడ మీదనా కండ్లకు కావలసిన ఆకారం కనపడలేదు. ఆ ఒక్క విషయాన్ని మినహాయిస్తే చంద్రమతి చెప్పినట్టు వాతావరణం నిజంగానే సహజంగా హాయిగా ఉంది, ఏదో ఆహ్లాదకరమైన కథను చదివినట్టు, లేక హుషారును కలిగించే ఒక నవలను చదవడం పూర్తి చేసినట్టు.

ఉషోదయమైంది.

మనసులో, గండెలో, చెవుల్లో పక్షుల కిలకిలా రావాలు కదలాడినట్టు ఓ అనుభవం.. కటిక చీకటి నిండిన రాత్రిలో అమావాస్య లాంటి వాతావరణం.. మస్తిష్కం చుట్టూ వల వేసినట్టు, అందులో అనుమానాల మిణుగురు పురుగులు దేదీప్యమానంగా వెలుగుతున్నట్టు ఓ ఫీలింగ్.
ఆమె రాకతో అన్నీ చెల్లాచెదరయ్యాయి, హుష్ కాకి అయ్యాయి.

మా ఎదురింటి ఆమె డాబా పైకి రాగానే మా వైపు చూస్తూ “ఎట్లా ఉన్నారు అక్కయ్య గారూ! బాగున్నారా?” అని పలకరించింది మా ఆవిడను. చంద్రమతిని అక్కయ్య అని సంబోధించినందుకు మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. వదిన గారూ అని పిలవనందుకు సంతోషించాను.

“ఉషా! బావగారెక్కడ?” అని మా ఆవిడ ఎదురింటావిడను అడిగింది.

ఓహో, ఆమె పేరు ఉష అన్న మాట. మాటవరుసకైనా చంద్రమతి నాకు ఆమె పేరు చెప్పలేదు. ఎంతైనా ఆడది కదా. అసూయో లేక మరేదో అయిఉంటుందని నన్నునేను సముదాయించుకున్నాను.

“వస్తున్నారు, కుర్చీలతో” అని నవ్వింది ఆవిడ.

అంతలోనే రానే వచ్చాడు ఆమె మొగుడు చక్కని చుక్కకు తోకలా, తోకచుక్కలా డాంబరు మొహంతో.
కొన్ని క్షణాల ముందు ఎంతో ఆనందంగా ఉన్న నా మనసు వాడిని చూడగానే పూర్తిగా వ్యతిరేక స్థితికి మారింది.

నా చూపులు వాడు వేసుకున్న గళ్ళ లుంగీ మీద పడ్డాయి. అది కొత్త లుంగీలా లేదు. ఇక మా ఆవిడ కూడా గళ్ళ మాక్సీయే వేసుకుంది.
ఓర్నీ, ఇదేమి యాదృచ్ఛికం?!

నేను వాడి పెళ్ళాన్ని సాయంత్రాల్లో చూస్తున్నట్టు వాడు నా పెళ్ళాన్ని ఉదయాలలో… అలాంటివి ఎన్ని ఉదదయాలో?!

నేను ఏడు గంటలకే ఆఫీసుకు వెళ్ళిపోతాను. వాడేమో పది గంటలకు వెళతాడట. నేను ఆఫీసునుంచి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి చేరుకుంటాను. వాడేమో రాత్రి ఆలస్యంగా వస్తాడట.

ఎంతైనా నేను మగ పురుగును కదా. మరి ఆడవాళ్ళలో సహజ సంపదల్లా ఉండే ఈర్ష్యాద్వేషాలు, అనుమానాలు నాలోనూ ఎందుకు ఉండకూడదు? పైగా నేను మిస్టర్ మొగుడిని! నా అందాల పెళ్ళానికి స్మార్ట్ హజ్బెండ్ ను.

‘ఛఛ. నన్ను మనసారా ప్రేమించే నా అర్ధాంగినే శంకిస్తున్నాను. గళ్ళ మేక్సీ గళ్ళ లుంగీ వేసుకోవడం కాకతాళీయం కావచ్చుగా?’ అనుకున్నాను మనసులో.

**** (*) ****