కిటికీలో ఆకాశం

‘మనిషి వేళ’కై తపించిన సిద్దారెడ్డి పద్యం

జూన్ 2015

మర్థుడైన కవికి తెలుసు – తన ధర్మాగ్రహాన్ని కవిత్వ ఫిరంగిలో ఎట్లా దట్టించి కుళ్ళిన వ్యవస్థ పైకి వదలాలో! అందులోనూ, ఒక తెలంగాణ జానపదుని భాషతో తెలుగు కవిత్వాన్ని శుద్ధి చేసిన సిద్దారెడ్డి లాంటి కవికి అది మరింత బాగా తెలుసు. అందుకే, చుట్టూ వున్న సమాజంలోని ఒకానొక దౌర్జన్యాన్ని ఆయన తన కవిత్వంలో మన ముందు పరిచినపుడు, అదంతా ‘కేవల రాజకీయ సంభాషణ‘ లాగా వుండదు. ఒక తెలంగాణ ఊరి మనిషి తన సహజాతమైన ఒక లయాత్మక భాషలో తన బాధనూ, కోపాన్నీ మన ముందు ఏకరువు పెడుతున్నట్టు వుంటుంది. బహుశా, సిద్దారెడ్డి మొత్తం కవిత్వ తాత్వికతని ఆయన ఈ కవితా వాక్యాలు పట్టిస్తాయి -

‘జీవితంలో ఇంత దయా
ఇంత ప్రేమా
ఇంత ధైర్యమూ లేకపోతే
అది మనిషి పుటకేనా ?’

అంత దయా, ప్రేమా, ధైర్యమూ వున్నాయి కాబట్టే తెలంగాణ ఉద్యమంతో ఆయన అంతగా మమేకమై పోయాడనుకుంటా!

సిద్దారెడ్డి చాలా కవితలను చదివినపుడు, ఆయన ఒక సూక్ష్మ స్థాయి వస్తువును తీసుకుని, కవితలో ఆ వస్తువుని స్థూల స్థాయికి తీసుకు వెళ్లి, ఆ వస్తువుకూ రాజ్యానికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వున్న సంబంధాన్ని చదువరి మనసులో ప్రకంపనలుగా ప్రవేశపెట్టడం కనిపిస్తుంది.
ఉదాహరణకు కార్పోరేట్ ఆసుపత్రుల ఆగడాల పైన సిద్దారెడ్డి రాసిన ‘మనిషి వేళ’ కవిత చదవండి!
ఒకానొక తెలంగాణ ఊరి నుండి హైదరాబాద్ మహానగరంలో కార్పోరేట్ ఆసుపత్రి వైద్యం కోసం వొచ్చిన ఒక సామాన్యుడి దుఃఖం కనిపిస్తుంది.

మనిషి వేళ

వేళ కాదు
మనిషిని చూడదానికిది వేళ కాదు
రక్తం తొణికిసలాడ వొచ్చు – స్వరం ఏమారవచ్చు
కన్నీళ్లు అదిమి పట్టుకుని కబురు కోసం చూడు
జీవితం పంచుకున్న ప్రాణమే కావొచ్చు గాక
చూపు కోసం గుండె సుడి తిరుగనీ గాక
మన మనిషిని చూడదానికిది వేళ కాదు
కౌంటర్లో డబ్బులు కట్టేతందుకు వేళ లేదు
అవయవాలు పెకిలించే నొప్పికి వేళ లేదు
శరీరంలో ఏం జరుగుతున్నదో తెలియదు
ఐ సి యు లో ఏం జరుగుతున్నదో అంతకంటే తెలియదు
‘పేషెంట్ ఈస్ సేఫ్‘ మాటలు వినీ వినీ మనసు మూగదైంది

కాలం ప్రాణంతో ఆడుకుంటది
కార్పోరేట్ వైద్యం సెంటిమెంటుతో ఆడుకుంటది
పాసులున్నా అనుమానం పొడుస్తున్నా
మన మనిషిని చూడడానికి మనకు వేళ కాదు

అర్థరాత్రి గుండెల మీద కూచుంటది
దున్నిన పొలం ఎగిరొచ్చి నరాలు మీటుతది
ఊరి ఆత్మలు గేటు ముందట తచ్చాడుతై
ఎంత బతిలాడినా బావురుమన్నా
మన మనిషిని చూడడానికి ప్రవేశం లేదు
‘పేషెంట్ ఈస్ ఇన్ గుడ్ కండీషన్‘
ఎవరి కండీషన్ ఎవరికెరుక ?

నిరీక్షనొక హింస
నిశ్శబ్ద వరండాలో టీవీలు భయంకర హింస
ఇంత దుఃఖంలో అంత వినోదం – ఎంత అసంబద్ధత?
ప్రాణం కాపాడేతందుకే వాలు చూస్తరట
పైసల కోసమే మనం చూస్తమట
ఎంత అసంబద్ధమైనదీ గీత
మన గీత బాగున్డకే గద మనం ఇక్కడ

తెల్లటి మాయ బిరబిరా నడయాడుతది
స్ట్రెచర్ మీద జీవితం కుల్లిపోతది
కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి
కర్టెన్లు రోగిని ఓదార్చుతుంటై
జీవితం పంచుకున్న ప్రాణం విలవిల్లాడుతది
ఒకరి కాలి ముళ్ళు ఒకరు తీసిన క్షణాలు
ఇన్ని సూదులు గుచ్చినా ఏమనవు
ఇవతల ఎంత తండ్లాడినా లోపలికి అనుమతి లేదు
అనుమతి దొరికేసరికి చూడదానికేమీ వుండదు
చూడదానికేమీ మిగలనప్పుడు
మనిషిని తీసుకెళ్ళడానికి వేళ లేనే లేదు

‘వేళ కాదు‘ అన్న మాటతో కవితను ప్రారంభించడంలోనే కార్పోరేట్ ఆసుపత్రులలో వుండే అరాచక వాతావరణంలో నలిగిపోయిన ఒక సామాన్యుడి ఆక్రోశం ధ్వనిస్తుంది. ‘మన మనిషిని చూడదానికిది వేళ కాదు/ కౌంటర్లో డబ్బులు కట్టేతందుకు వేళ లేదు’ అన్నప్పుడు గానీ, ‘కాలం ప్రాణంతో ఆడుకుంటది / కార్పోరేట్ వైద్యం సెంటిమెంటుతో ఆడుకుంటది‘ అన్నప్పుడు గానీ, ‘ప్రాణం కాపాడేతందుకే వాలు చూస్తరట/ పైసల కోసమే మనం చూస్తమట’ అన్న కవితా వాక్యాల దగ్గర గానీ పైకి వ్యంగం ధ్వనించినా, ఆ మాటల వెనుక వేదన, కొండొకచో కార్పోరేట్ ఆసుపత్రులలో మనకూ ఎదురైన కొన్ని అనుభవాలూ జ్ఞప్తికి వొచ్చి గుండెని మెలిపెడతాయి.

‘ఊరి ఆత్మలు గేటు ముందట తచ్చాడుతై / ఎంత బతిలాడినా బావురుమన్నా / మన మనిషిని చూడడానికి ప్రవేశం లేదు’ అని బాధపడుతున్నాడు కవి. ఇంతకూ, ‘ఊరి ఆత్మలు’ అన్న మాట ఎందుకు ప్రయోగించినట్టు ? ‘పట్నం ఆత్మలు‘ వుండవనేనా? ఊరి ఆత్మలు మాత్రమె ఒక మనిషిని ‘మన మనిషి‘ అనుకుంటాయా?

‘ఒకరి కాలి ముళ్ళు ఒకరు తీసిన క్షణాలు / ఇన్ని సూదులు గుచ్చినా ఏమనవు’ అన్న కవితా పాదాల దగ్గర ఒక్కసారి ఆగిపోతాము. ఏవో కొన్ని సూదులు గుచ్చయినా పట్నం లోని ఖరీదైన ఆసుపత్రుల డాక్టర్లు కట్టుకున్న వాళ్ళని బతికిస్తారనే ఆశతోనే కదా ఆ అమాయకులు ఇంత దూరమూ వొచ్చేది !

మొత్తంగా ఈ కార్పోరేట్ ఆసుపత్రులు అమాయక ఊరి ప్రజల అజ్ఞానంతో ఎంత దారుణంగా ఆడుకుంటాయో కవిత చివరి పాదాలలో మనసు చివుక్కుమనేలా చెప్పడం కనిపిస్తుంది -
‘అనుమతి దొరికేసరికి చూడదానికేమీ వుండదు / చూడదానికేమీ మిగలనప్పుడు / మనిషిని తీసుకెళ్ళడానికి వేళ లేనే లేదు‘

తమ వేళలన్నీ డబ్బులు సంపాదించుకోవడానికే కేటాయించుకున్న కార్పోరేట్ ఆసుపత్రులకు ఇక ‘మనుషులకు’, వాళ్ళ పేదరికాలకూ, వాళ్ళ దు:ఖాలకూ వేళల్ని కేటాయించే తీరిక ఎక్కడుంది ? వాటిని నియంత్రించే బాధ్యత వున్న రాజ్యానికి సమయం ఎక్కడ వుంది ?

**** (*) ****