ప్రత్యేకం

మానససరోవరాల మథనం విముక్త

ఫిబ్రవరి 2016

వోల్గా రచనలు బహుశా ఇరవయ్యేళ్ళుగా పరిచయం. వారిని నేరుగా కలిసింది బహుశా 2002లో, హైదరాబాదులో వారి అస్మిత కార్యాలయంలో. ముఖాముఖంగా కలిసింది అప్పుడే అయినా సాహితీ బంధువులందరికీ ఉండే ఒక అవగాహనతో స్నేహంతో చాలా సేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నేను మళ్ళీ అమెరికా తిరిగి వచ్చిన తరవాత కూడా కొత్తగా వోల్గా కలంనించి వెలువడే కథల్ని ఆసక్తిగా గమనిస్తూనే ఉన్నాను. వోల్గా కథల సంపుటి విముక్త కి కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి వచ్చిందని తెలిసి ఆనందమయింది.

వోల్గా మొదటినించీ కూడా స్త్రీవాద ప్రేరణతో, ఆ స్పృహతోనే రచన చేస్తూ వస్తున్నారు. స్త్రీలకి సాధారణంగా వ్యవస్థాగతంగా ఎదురయ్యే నిర్బంధాలు, కష్టాలు, వాటికి పరిష్కారాలు, మహా అయితే కొంత చట్టానికి సంబంధించిన చర్చ – సాధారణంగా స్త్రీవాద కథల్లో నవలల్లో కనబడే ఈ చట్రాన్ని దాటి, వోల్గా తన రచనల్లో ఆయా ముఖ్య స్త్రీపాత్రల అంతర్మధనాన్నీ, తద్వారా వాళ్ళ వ్యక్తిత్వంలో ఎదుగుదలనీ చిత్రించడానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. ఈ వరుసలో ప్రయోగం అనే పెద్ద కథ ఒక మంచి ప్రమాణం. ఆ కథలో నాయిక సమాజాన్ని గురించి గమనించి విశ్లేషించడమే కాక, తనను తాను కూడా తరచి చూసుకుని తనకేమి కావాలో తెలుసుకుని, సాంప్రదాయకమైన వివాహ బంధాన్ని తోసి పుచ్చినట్లే, ఆదర్శపు రంగు పులుముకున్న ప్రేమ ప్రతిపాదనని తన ఆదర్శానికి తక్కువైనదిగా గుర్తించి దాన్ని కూడా నిర్మొహమాటంగా తిరస్కరిస్తుంది.

రామాయణం పాత్రలని సమకాలీన భావజాలంతో పునరుజ్జీవింప జేసి వచ్చిన కథలు కూడా మనకు కొత్త కాదు. చలం దగ్గిర్నించీ కొడవటిగంటి కుటుంబరావు దగ్గర్నించీ మొన్న మొన్నటి డి. ఆర్. ఇంద్ర వరకూ రకరకాల ఆధునిక దృక్పథాలతో రామాయణ పాత్రలతో కథలు రాశారు. కొన్నిటిలో రామాయణ ఘట్టాలను ఆధునిక స్పృహతో విశ్లేషించారు, మరి కొన్నిటిలో పాత్రల స్వభావాలనే మార్చేసి కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. ఒక విధంగా ఈ ప్రయత్నాలన్నీ మన సంఘంతో మన జీవితాల్తో మన మనసుల్తో రామాయణం ఎంతగా పెనవేసుకుని పోయిందో చెబుతున్నాయనిపిస్తూ ఉంటుంది నాకైతే.

వోల్గా ఎప్పణ్ణించో స్త్రీవాద దృక్పథంతో కథలు రాస్తూ వస్తున్నారు. రామాయణ నేపథ్యంగా తెలుగులో కోకొల్లలుగా కథలు వచ్చాయి. ఈ రెండు ధోరణులనూ ఇప్పుడు విముక్తలో కలిపి పేనడం వలన వోల్గా కొత్తగా సాధించినదేమిటి అనే ప్రశ్న సహజంగా పుడుతుంది. ఈ కథలలో మొదటగా నేను చదివిన కథ మృణ్మయనాదం. నాకు బాగా నచ్చిన కథ కూడా. రామాయణగాథలో ఎక్కడా సీత అహల్యని కలుసుకున్నట్లుగా నాకు గుర్తు లేదు, బహుశా అరణ్యవాసంలో సీతారాములు దర్శించిన అనేక ముని దంపతుల్లో అహల్యా గౌతములు కూడా ఉన్నారేమో. కానీ ఈ మృణ్మయనాదం కథలో అహల్య కథని ప్రాణంగా పెట్టి, అక్కడక్కడా సీతకీ అహల్యకీ ఏకాంత సమావేశాలు తటస్థింప జేసి, ఆ సమావేశాల ఫలితంగా సీత ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా రూపు దిద్దుకున్నట్టు, తనకు తరువాత ఎదురైన విషమ సమస్యలను స్థిరచిత్తంతో ఎదుర్కొనే దృఢత్వాన్ని సంతరించుకున్నట్టూ చిత్రించారు వోల్గా. కథనం కూడా వస్తువుకి తగిన శిల్పంతో ఆకట్టుకోవటమే కాక పాఠకుల మనసుల్లోనూ బలమైన ముద్ర వేస్తుంది. ఈ సంపుటిలోని మిగతా కథల్లో కూడా, శుర్పణఖ, ఊర్మిళ వంటి ఇతర (అంతగా ముఖ్యం కాని) స్త్రీపాత్రలతో సీత సంభాషణలనూ, తద్వారా సీత ఆలోచనలలో జరిగే పరిణామాన్ని చిత్రించారు. ఈ పాత్రలను Sita’s foils అన్నారు ప్రముఖ రామాయణ విశ్లేషకులు ఆచార్య పాలా రిచ్మన్. అంటే సీత స్వభావానికీ ఆలోచనలకీ వ్యత్యాసంగానూ, కొంత విరుద్ధంగానూ ఉంటూ, తద్వారా సీత వ్యక్తిత్వాన్ని మరింత ప్రతిఫలింప చేస్తున్నాయని భావం. (సాహిత్యంలో ఇదొక పద్ధతి, ముఖ్యంగా పురాణాలలో మనకు బాగా కనబడుతుంది).

ఇంతకు మునుపు వోల్గా కథల్లో నవలల్లోని నాయికలకూ, ఈ కథల్లో సీతకూ చాలా తేడా ఉంది. ఆ నాయికలు కొంతవరకూ విశ్లేషణ చేసుకోవడంతోనో, అక్కడి సమస్యకు పరిష్కారం కనుక్కోవడంతోనో ఆగిపోయారు. సీతకి పరిష్కారాలు కనుక్కోవలసిన పని లేదు, ఎందుకంటే కథలో ఏమి జరిగిందో రామాయణం చెప్పేసింది (ముఖ్య ఘట్టాలను మార్చే ప్రయత్నమేదీ వోల్గా చెయ్యలేదని గమనించాలి). అందుకని ఈ కథలలో తన తోటి స్త్రీపాత్రలతో జరిగే సంభాషణలు సీతకి కేవలమూ ఆలోచనలు రేకిత్తంచడానికి మాత్రమే కాక, తనను తాను మథించుకుని ఆ మథనంలో నించి, తానేమిటి, తన జీవితమేమిటి, తన జీవితానికి అర్ధమేమిటి అనే ఒక విలువైన తాత్త్విక నవనీతాన్ని ఆవిష్కరిస్తున్నది ఈ సీత.

ఒక పౌరాణిక కథా నేపథ్యంలో సీత జరిపిన మానసిక మథనం, ఆవిష్కరించిన నవనీతం ఇప్పుడు చదువుతున్న ఈ నాటి స్త్రీపురుషులకి నేరుగా ఏమన్నా నేర్పుతున్నదా అంటే – ఎవరి మథనం వారు చేసుకోవాలి అని కావచ్చు. ఒక విధంగా అలా నేరుగా ఏమీ చెప్పకపోవడమే ఈ కథల గొప్పదనం కూడా. ఈ సమస్యకి ఇదీ పరిష్కారం అని అరిటిపండు వొలిచి చేతిలో పెట్టే ఆధునిక నీతిబోధలుగా తయారైన ప్రస్తుతపు తెలుగు కథలనుండి కొంచెం ఎడంగా, కించిత్ గర్వంగా తలెత్తుకు నిలబడుతున్నాయి ఈ కథలు.

మరోసారి విముక్త సీతకీ వోల్గాకీ అభినందనలు.

Click here to read my translation of the story “Mrunmaya Nadam”.

**** (*) ****