గెస్ట్ ఎడిటోరియల్

తూకానికి రెండు కథలు

నవంబర్ 2015

కథలో చాలా మంచి మెసేజి పెట్టాను, ఒకసారి చూడండి అని ఒక రచయిత మిత్రుడి మెయిలు. తరవాతెప్పుడో ఆ కథని ఒక జాలపత్రికలో ప్రకటించారు. అక్కడ “మెసేజి ఇవ్వాలని కథలు రాస్తూ ఉంటే ఇలాంటి కథలే వస్తాయి,” అని మరో రచయిత మిత్రుడి పుల్ల విరుపు వ్యాఖ్య. తరవాత ఆయనతో జరిపిన పరస్పర సంభాషణలో “మెసేజి ఇవ్వాలనుకుంటే వ్యాసం రాసుకోవాలి గానీ కథ రాయడం ఎందుకు?” అన్నారాయన. అంతే కాదు, “మంచి కథ జీవితాన్ని ప్రతిబింబించాలి.” అని కూడా చాలా ఘట్టిగా అభిప్రాయ పడ్డారాయన.తెలుగు కథా రచయితల్లో చాలా మందికి కథలో ఏదో ఒక సందేశం ఉండాలి అనే ఉద్దేశం ఉన్నది. ఊరికే ఉండడం కాదు, చాలా బలంగా ఉన్నది. నా మాట నమ్మనక్కర్లేదు. ఏ పత్రికనైనా, కథల సంకలనాన్నైనా మచ్చుకి చూడండి. దాదాపు ఎనభై శాతం కథలు ఏదో ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. సంఖ్యలో తక్కువేమో గానీ పట్టుదలలో తక్కువ కాని వారు ప్రత్యర్ధి వర్గం వారు. వీరి వాదన ప్రకారం కథకుడు కహలోకి జొరబడ కూడదు. అనవసరపు వ్యాఖ్యానాలు చెయ్య కూడదు. ఇక సందేశాలా? శుద్ధ అనవసరం. వీరికి కథ అంటే, నిత్య స్రవంతిలా సాగుతున్న జీవితానికి పక్కన ఒక విడియో కేమెరా పెట్టి కొద్ది సేపు రికార్డు చేసిన ఒక షార్టు ఫిల్ము.ఈ రెండు వాదనలని గురించీ ఆలోచిస్తూ ఉంటే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారివి ఓ రెండు కథలు గుర్తొచ్చాయి నాకు.

మొదటిది ‘మార్గదర్శి’. కేవలం “ఉద్యోగంలో చేరి చెడిపోకు, వ్యాపారం చేసి బాగు పడు” అనే ఒకే ఒక్క సందేశం ఇవ్వడం కోసం రాయబడిన కథ. 1928లో భారతి పత్రికలో తొలిసారి అచ్చయినప్పుడు ఎంత పొడుగుందో కానీ శ్రీపాదవారి కథల సంపుటిలో నేను చదివిన వెర్షను 55 పేజీల పొడుగుంది. దానికి తోడు ఒక పాత్ర ఏకధాటిగా చెప్పినట్లు ఒకే గొంతులో రాసుకొచ్చిన కథ. ఇలా ఈ కథ బాహ్య లక్షణాలన్నీ ఇక్కడ ఏకరువు పెడుతుంటే ఈ కథ అంటే భయమేస్తుంది. ముట్టుకో బుద్ధి కాదు.

నాకు గుర్తొచ్చిన రెండో కథ పేరు ‘గూడు మారిన కొత్తరికం’. తీరా చూస్తే ఇందులో ఏమీ కథ లేదు. అంటే, ప్లాటూ, ట్విస్టులూ, సస్పెన్సూ .. ఇలాంటివి. అసలు నిజానికి జరిగే పెద్ద సంఘటనా ఏవ్హీ లేదు. పైన చెప్పినట్టు ఏ మాత్రం వ్యాఖ్యానం లేని నిజజీవిత చిత్రణ అన్నమాట. అట్లాంటి దాన్ని 50 పేజీల కథ రాశారా? అయితే పరమ బోరు కొడ్తుందన్న మాట. టీవీలో డెయిలీ తెలుగు సీరియల్లాగా సాగదీసి వొదిలి పెట్టుంటారు – అనుకుంటామా, అనుకోమా?

ఈ రెండూ కూడా నాకు అమితంగా ఇష్టమైన కథలు. సంవత్సరానికి ఒకట్రెండు సార్లు ఈ కథలున్న సంపుటాల్ని బయటికి తీసి ఒక్కో కథా రెండు మూడు సార్లు చదువుకుంటాను. అంత ఇష్టం. అంటే, ఈ “సందేశం ఉండాలా వద్దా” అనే తక్కెడకి రెండు పళ్ళేల్లోనూ సమంగా తూగే రెండు కథల్నీ శ్రీపాదవారే రాసి చూపించారన్న మాట!

ఆయనే మార్గదర్శి కథలో, కథ చెబుతున్న శంభుశాస్త్రి నోట ఇలా పలికిస్తారొక చోట: “కథలంటే పైపైని ఉన్నాయనుకున్నావేమో? అవి కల్పించడానికి చాలా గొప్ప ప్రతిభ ఉండాలి. వాటి విలవ తెలుసుకోడాని కెంతా పరిజ్ఞానం ఉండాలి. అవి చెప్పడాని కెంతో నేర్పుండాలి. కథలు కళ్ళకి వెలుగిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి మనస్సుకి ఉత్సాహమూ ఉల్లాసమూ కల్గిస్తాయి. జడునకున్నూ కల్పనా శక్తి ప్రతిపాదిస్తాయి.”

అట్లాంటి కథలున్నప్పుడు సందేశం ఉండాలా వద్దా అని వాదనెందుకు?

మనమూ కందాం అట్లాంటి కలల్ని, కథల్ని.

**** (*) ****

Credits:
1. ‘మార్గదర్శి’ కథ లింక్: కథానిలయం