గెస్ట్ ఎడిటోరియల్

మనసారా మాట్లాడుకుందాం రండి..

జనవరి 2015

న్నెన్ని పత్రికలు, కాగితాలమీదనూ, కంప్యూటరు తెరలమీదనూ?

మళ్ళీ సరికొత్తగా ఇంకో పత్రిక అవసరమా?

ఇంతకు మునుపే ఒకరు చేసేసిన ఘనకార్యం దేన్నైనా మళ్ళీ మనం కొత్తగా మొదలు పెట్టినప్పుడు ఎవరైనా అడిగే ప్రశ్నే ఇది. ఆ ఘనకార్యం నిజంగా ఘనమైనదే అయితే ఈ ప్రశ్నకు తగినంత తృప్తికరమైన సమాధానం ఇచ్చుకోవాలి కూడాను. వాల్మీకి రామాయణం రాసేశాడని విశ్వనాథ రాయకుండా ఊరుకున్నాడా? “మరల నిదేల రామాయణం బన్నచో ..” అంటూ తన కారణాలు వరస పెట్టి చెప్పి మరీ కల్పవృక్షానికి బీజం వేశాడు. సవాలక్ష పత్రికలున్నాయని చెప్పి ఇంకో పత్రిక మొదలు పెట్టకుండా ఊరుకోవాలా? అందులోనూ ఒక మంచి పత్రిక అవసరం ఉందని కచ్చితంగా మనకి తెలిసినప్పుడు?

రెండేళ్ళ కిందట వాకిలి తలుపు తీస్తూ “ఇదొక అరమరికలు లేని సాహిత్య సంభాషణ” అని ప్రకటించారు సంపాదకులు. తొలి సంచిక తాజాగానూ, స్నేహపూర్వకంగానూ, వెరసి ఆహ్లాద భరితంగానే అనిపించింది. వెనువెంటనే ఒక అనుమానమూ తలెత్తింది .. ఇదే క్వాలిటీని వీళ్ళు ఎంతకాలం నిలుపుకోగలరూ అని. ఎందుకంటే అనేక జాల జ్వాలా యుద్ధాల క్షతగాత్రుణ్ణి నేను. కానీ ఈ రెండేళ్లలోనూ ఈ జాలపత్రిక చరిత్రను గమనించిన వారెవరైనా ఈ వాకిలి సహృదయ సాహిత్య సంభాషణా వేదికగా స్థిరపడిందని ఒప్పుకోవలసిందే. ఆ విషయంలో సంపాదకులను అభినందించ వలసిందే.

కొత్త కవిత్వానికీ, కవిత్వాన్ని గురించి కొత్త చర్చలకీ వాకిలి మంచి ప్రాంగణం అయింది. అక్షర శీర్షికలో రకరకాల కొత్త కవిత్వం ఆవిష్కృతమయింది, సీనియర్ – జూనియర్ భేదం లేకుండా. Mango Bites తో తెలుగు కవితల ఆంగ్ల అనువాదాలని అందించడం ప్రశంసనీయమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం ఇంకా విరివిగానూ, మేలురకంగానూ కొనసాగాలని నా ఆశ. వ్యాసాలలో తెలుగు భాషా నుడికారాలను పరామర్శించిన ఎలనాగ గారి రచనలు, సాహిత్య భాషను స్పృశించిన కాసుల లింగారెడ్డి గారి రచనలూ బాగా పనికి వస్తాయి, ముఖ్యంగా రచయితలకూ, కవులకూ. వచన రచనల్లో పెద్దిభొట్ల వంటి వెనకతరం రచయితలనూ, ఊబిలోదున్న వంటి ముందుతరం రచనలనూ కొత్త దృష్టితో విశ్లేషించడం బావుంది. అదే ఒరవడిలో కొత్తగా పేరు తెచ్చుకుంటున్న కథకుల రచనలనీ సానుభూతితో కూడిన విమర్శతో ప్రోత్సహించడం కూడా బావుంది.

కథలను, కథకులను గురించి మంచి చర్చలు జరిగినంతగా కొత్త కథలు రాలేదు అని నాకున్న ఒక్క కంప్లెయింటు.

ఐతే ఇదంతా ఒక యెత్తూ, ఆయా శీర్షికల కింద పాఠకులు రాసిన వ్యాఖ్యలు మరొక యెత్తు. వ్యాఖ్యలను నియంత్రించడం జాలపత్రికా సంపాదకులకు కత్తిమీద సాము వంటిది. ఒక పక్కన వ్యాఖ్యాతలకు తమ అభిప్రాయాలను చెప్పడానికి తగిన స్వేఛ్ఛను ఇస్తూనే, వ్యాఖ్యలు శ్రుతి మించకుండా ఉండేట్లు చూడడం, వాదోపవాదాలు సభామర్యాదకు లోబడి ఉండేట్లు సమతుల్యత పాటించడం అంత తేలికయిన విషయం కాదు. మహామహా టైంస్ లాంటి అంతర్జాతీయ పత్రికలే ఈ సమస్యలో తలమునక లవుతున్నాయి. ఈ విషయంలో వాకిలి పత్రికది అదృష్టమే – సాహిత్యమంటే కాస్తో కూస్తో అభిమానమున్నవారే ఈ వాకిలి గుమ్మం తొక్కుతున్నారు. రచయితలకు ఉత్సాహం కలిగేట్లు రంగవల్లుల మీద పూరేకుల జల్లుల్లా వ్యాఖ్యలను చిలకరిస్తున్నారు.

గతమెంతొ ఘనమైనదే. సంతోషం. మరి ముందు కాలపు మాట?

ప్రపంచ సమీకరణాలు మారుతున్న సందర్భమిది. వ్యాపార రథ కేతనాల రెపరెపల్లో గువ్వపిట్టల గుసగుసలు వినబడకుండా పోతున్న కాలమిది. ఇంద్రచాపపు రంగులన్నీ అటు నలుపో ఇటు తెలుపో అన్నట్టు రెండుగా ఘనీభవిస్తున్న సమయిమిది. ఐనా కొన్ని సత్యాలు సర్వకాలికాలు, సార్వజనీనాలు. పోలీసు పట్టు ఉక్కు పిడికిలే, రావిశాస్త్రి కథల్లోనైనా, అమెరికా నగర వీధుల్లోనైనా! సామ్రాజ్యవాదం రాబందే .. మూడొందల యేళ్ళ కిందట యూరోపియన్ కొలోనియలిజమైనా, గత శతాబ్దపు అమెరికను దాష్టీకమైనా, ఇహ ఇప్పుడు చాప కింద నీరులా వ్యాపిస్తున్న చైనా కబంధ హస్తమైనా. కొన్ని కొన్ని మాటలు నిక్కచ్చిగా చెప్పుకోక తప్పదు. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం? ఆదర్శాల ముసుగులు తొడుక్కుంటే ఊపిరాడక మనమే మగ్గిపోతాం. ఇజాలకీ భేషజాలకీ చోటిస్తే ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే ఉండడమే కాదు .. చీడ పట్టి చివికిపోతుంది కూడాను. మనుషులం కదా, మాట్లాడుకోకుండా ఎలాగు?

అందుకే, గొంగళీల్ని విదిలించేసి, ముసుగులు వొలిచేసి, కళ్ళక్కట్టిన గంతల్ని విప్పేసి మనసారా మాట్లాడుకుందాం.

రండి, వాకిలి సిద్ధంగా ఉంది. మీకోసమే తలుపు తీసింది. దానికిక కొత్త పారాణి పూత పూద్దాం.

**** (*) ****