వ్యాసాలు

అమెరికాతో మాట్లాడుతున్న తెలుగు కథ

ఆగస్ట్ 2016

నేను అమెరికా రావడం వల్లనే కలం పట్టి రచయితనయ్యాను. ఆ పట్టడమే అమెరికాలో ఉన్న తెలుగు వారి కథ మిగతా తెలుగువారి కథలకన్నా విభిన్నమైనది, వారి కథల్ని వారే చెప్పుకోవాలి అనే స్పృహతో కలం పట్టాను. సుమారుగా గత ఇరవయ్యేళ్ళల్లోనూ నేను రాసిన కథల సంగతి అలా ఉంచితే, ఇతర రచయితల కథలు చదవడమూ, ఆయా రచయితలతో జరుపుతున్న సంభాషణలూ, నాకు చాలా ఉత్తేజాన్నిస్తూ వస్తున్నాయి. వీరందరూ కూడా తాము ఇక్కడీ జీవితంలో చూస్తున్న అనుభవిస్తున్న దర్శిస్తున్న ఆయా జీవన వైవిధ్యాలను తమ కథల్లో చిత్రించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంచేత నా మొట్టమొదటి అనుకోలు – అమెరికా తెలుగు వారి కథలకి ఒక ప్రత్యేకత ఉన్నది, వారి కథలని వారే చెప్పుకోవాలి – అనే నా మొట్టమొదటి స్పృహ నిజమే అని నాకు పదేపదే రూఢి అవుతున్నది. ఆ ఉత్తేజంతో నాకు చిక్కిన ప్రతి వేదికమీదా అమెరికా తెలుగు కథ జయపతాకాన్ని ఎగురవెయ్యడానికి నాకు చేతనైన ప్రయత్నం చేస్తున్నాను.

తెలుగు సాహిత్యం అంటే నన్నయ్య దగ్గరనో, తెలుగు కథ అంటే బండారు అచ్చమాంబనో గురజాడ అప్పారావు వద్దనో మొదలు పెట్టాక్కర్లేదు. అలాగే అమెరికా తెలుగు కథ అంటే స్వర్గీయ మల్లికార్జున రావు (మనకు తెలిసి అచ్చయిన తొలి ఉత్తరమెరికా రచయిత) గారి దగ్గర మొదలు పెట్టక్కర్లేదు. చరిత్ర విశ్లేషణ చేసేవాళ్ళకి కావలసిన విషయాలవి. కథలో ఏం జరుగుతోందీ, కథ ఏం చేస్తోందీ అని పరిశీలించాలంటే ప్రస్తుత వర్తమానంతోనే మనకి పని. నిజానికి వర్తమానాన్ని కథ పట్టించుకున్నంత గాఢంగా మరే సాహిత్య ప్రక్రియా పట్టించుకోదని నా విశ్వాసం.

మిగతా తెలుగు రచయితలకి లేని, కోరుకున్నా సులభంగా లభ్యం కాని ఒక గొప్ప సౌలభ్యం, ఒక వనరు, అమెరికా తెలుగు రచయితలకి ఉంది. అదేవిటంటే, మనవారు కాని మనుషులతోటి సంపర్కం. ఒక ఇచ్చిపుచ్చుకోవటం, ఒక మానవ సంబంధం. సాహిత్యం అనేది వ్యక్తిగత అనుభవం నించి సార్వజనీనమైన ఒక సత్యానికి నడిచే దారి అని మనం నమ్మితే – మనం కాని వారు, అవతలి వారితో మమేకం అవగలగడం, వారితో ఒక ఎంపతీ ఏర్పడడం రచయితకి నిజంగా గొప్ప వరం. అలాంటి వరం మన అమెరికా తెలుగు రచయితలకి అబ్బింది.

కాకపోతే ఇప్పటిదాకా వచ్చిన అమెరికా తెలుగు కథల్లో వస్తువు ఎక్కువగా మనం వదిలి వచ్చేసిన మాతృదేశపు జ్ఞాపకాలనే అల్లుకుని ఉంది అనేది స్పష్టం. అమెరికాలోని జీవితాల్ని చిత్రించిన కథల్లో కూడా, ఇక్కడి కార్లు, మాల్సు, ఒకానొక పాశ్చాత్య జీవన విధానపు నేపథ్యంలో ఎక్కువగా భారతీయ కుటుంబాల పాత్రలతోనే కథ నడవడం ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని తప్పు పట్టాల్సిన అవసం లేదు. ఎందుకంటే ఇది మనకి పూర్తిగా అనుభవమైన, చిరపరిచితమైన వాతావరణం. తెలియందాన్ని గురించి రాయడానికి ప్రయత్నించి చెయ్యి కాల్చుకునే కంటే తెలిసిందాన్ని గురించి రాయడం మేలు అనే రచయిత ఆలోచనతో నేను ఏకీభవిస్తాను. కానీ అదే సరిపోదు. రచయితలుగా మనం ఈ పరిధిలోనే ఇమిడి పోతే మనకి అయాచితంగా దొరికిన ఒక గొప్ప వనరుని మనం చేజేతులా వృధా చేసుకుంటున్నట్టే.

ఎందుకు మన వాళ్ళ కథల్లో ఎంతసేపూ మనకి మనమే కనిపిస్తున్నాం, మనకి భారతీయేతరులతో పరిచయాలూ స్నేహాలూ లేవా? ఉన్నై. మన పొరుగింటి వారు, ఉద్యోగాల్లో మన తోటి ఉద్యోగస్తులు, ఇతరత్రా జీవితంలో అవసరమయ్యే సవాలక్ష లావాదేవీల్లో ఎదురయ్యే మనుషులు – తెల్ల అమెరికన్లు, నల్ల అమెరికన్లు, లాటీనోలు, మా డెట్రాయిట్ లోనైతే మధ్యప్రాచ్యం వారు, మినియాపొలిస్ లోనైతే సోమాలీలు, ఇంకా ఇతర ఆసియా దేశాల వారు .. ప్రపంచం నలు మూలల్లో ఎన్ని రకాల తెగల మనుషులున్నారో అందరూ ఇక్కడ తారస పడే అవకాశం ఉంది. మరెందుకు వాళ్ళెవరూ ఎక్కువగా మన కథల్లో కనబడ్డం లేదూ అంటే – వారితో జరిగే సంపర్కం మన జీవితాలని ప్రభావితం చేసేంత బలమైనది కాకపోవచ్చు. ఇది ఒక కారణం. దీనికన్నా ముఖ్యమైన కారణం, మన అనుభూతులు ఉద్వేగాలు వాళ్ళకి చెందవు, వాళ్ళవి మనకి చెందవు అనే ఒక తన-పర భావన అని నా అభిప్రాయం. ఇది ఒక అడ్డుగోడ. ఈ అడ్డుగోడని దాటితేనేగాని మనం ఇందాక చెప్పుకున్న ఎంపతీ పుట్టదు. గత పదేళ్ళలో వస్తున్న అమెరికా తెలుగు కథలని పరిశీలిస్తే ఈ గోడని అధిగమించే లక్షణం మన కథకుల్లో చాలా బలంగా కనిపిస్తోంది, మంచి ఆలోచనతో, మంచి క్వాలిటీతో మన తెలుగు కథకుల రచనలు వస్తున్నాయని నేను గర్విస్తున్నాను.

ఒక అమెరికన్ చిత్రకారుడు ఆమె ఎవరో తెలియకుండా ఒక తెలుగు వనిత బొమ్మని పెయింటింగా వేసిన ఇతివృత్తంతో యద్దనపూడి సులోచనారాణి అప్పట్లో ఒక మంచి కథ రాశారు. అది చాలా పాపులర్ అయింది కూడా. ఇదే కాన్సెప్టుతో కథ ఎత్తుకుని, ఆ చిత్రకారుడికి ఒక విశేషమైన, విశిష్టమైన నేపథ్యం కల్పించి, తద్వారా ఆయా పాత్రల మనోభావాలనూ, పరిణితినీ చక్కగా చిత్రిస్తూ గొర్తి సాయి బ్రహ్మానందం గారు రాసిన చక్కని కథ ‘అహిగా’. ఇందులో అమెరికన్ చిత్రకారుడు ఒక నేటివ్ అమెరికన్ జాతికి చెందినవాడు అవడమే కాకుండా, వారికి పారంపర్య దత్తమైన చోటనే అతనూ కుటుంబమూ నివాసముండడం, ఇంకా కొంత వరకూ ఆధునిక జీవితానికి దూరంగా ఉండడం ఈ కథ నేపథ్యానికీ, ఆ కథానాయకుని పాత్రకీ ఒక ప్రత్యేకతని ఆపాదించింది. అతను తన జీవితంలో ఎదుర్కున్న అనుభవించిన ఘటనలు అతని చిత్రకళని ఎలా ప్రభావితం చేశాయి, అది చూసిన (నేను అని కథ చెబుతున్న) ఆ భారతీయ వనిత ఎటువంటి ఉద్వేగాలు అనుభవించింది, ఇదంతా సమర్ధవంతంగా చిత్రిస్తూ చివరికి ఒక అనూహ్యమైన మలుపుతో పాఠకుడికి ఒక థ్రిల్ కలిగేలాగా కథను ముగించారు రచయిత.

ఈ పద్ధతిలో నేను చదివిన ఇంకో మంచి కథ, మిత్రుడు, కవి, విన్నకోట రవిశంకర్ రాసిన తోడు అనే కథ. ఇందులో కూడా నేను అనే పత్ర – బహుశా రచయితే ఈ నేను కావచ్చు, లేదా మనవంటి ఇంకో భారతీయ వ్యక్తి కావచ్చు – కథ చెబుతున్నాడు. కానీ కథలో జరిగే ముఖ్య సంఘటనలు, ఉద్వేగాలు ఏవీ ఈ నేను పాత్రకి చెందినవి కాదు. ఈ కథ అంతా అతని సహోద్యోగి అయిన కెవిన్ అనే లెబనీస్ అమెరికన్ వ్యక్తికి, అతని కుటుంబానికి సంబంధించిన కథ. పనిలో పనిగా, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, తోటి మనిషిని గురించి పట్టించుకో వలసిన అవసరం, ముందటి తరాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన ఇప్పటి తరం వారి బాధ్యత – ఇత్యాది విషయాలన్నీ అలవోకగా కథలో చోటు చేసుకుంటాయి. ఒక విట్నెస్ లాగా కథని బాగా చెప్పడం కష్టం. కానీ ఈ కథలో ఆ టెక్నిక్ ని చాలా సమర్ధవంతంగా నిర్వహించారు రవిశంకర్. కథ ముగిసేటప్పటికి, అరే ఈ లెబనీస్ వాళ్ళు కూడా మనలాగానే ఉన్నారే, వాళ్ళకీ మనకుండే సమస్యలే, మనకుండే ఆనందాలే – అనే ఒక సత్యం – మన పరిధిని కొద్దిగానైనా విశాల పరిచే ఆలోచన ఒకటి మన మనసులో నాటుకుంటుంది.

స్థల కాల పరిస్థితులని పరిశీలిస్తూ, జీర్ణించుకుంటూ, మన చుట్టూ ఉన్న ఇతర నేపథ్యాల మనుషులతో కలుసుకుంటూ పట్టించుకుంటూ మమేకమవుతూ మన కథా రచయితలు మంచి కథలు రాస్తున్నారు. జీవితాన్ని రాస్తున్నారు.

**** (*) ****