ఆవలి తీరం

అమెరికాలో తెలుగు డయాస్పోరా నేపథ్యంలో నా కథలు

జనవరి 2013

చిన్నప్పటి నించీ కథలంటే ఇష్టం, చదవటమంటే  ఇష్టం. కథలు చెప్పడం కూడా ఇష్టమే. అయితే రాయాలి అనే కోరిక కలగలేదెప్పుడూ. సాహిత్యం అంటే ఒక కథనో నవలనో చదివి పడేసెయ్యడం కాదు, ఆలోచింపచేసే సాహిత్యం ఉన్నది, ఆస్వాదించాల్సిన సాహిత్యం ఉన్నది అని మొదటిసారి గ్రహింపుకి వచ్చింది వరంగల్లో ఇంజనీరింగ చదవడానికి ఆర్యీసీలో చేరినప్పుడు. రావిశాస్త్రి, కుటుంబరావు, బుచ్చిబాబు వంటి పేర్లు అప్పుడే పరిచయమయ్యాయి. ఆ తరవాత బాపట్లలో ఒక సంవత్సరం పాటు లెక్చరర్ ఉద్యోగం చేసినప్పుడు పరబ్రహ్మం అని నా రూమ్మేట్. అతను మంచి సాహిత్య పరిజ్ఞానం ఉన్న కుటుంబం నించి వచ్చాడు. అతనితో చర్చలు నా సాహిత్యాభిరుచికి పదును పెట్టాయి. అటుపైన రెండేళ్ళు కాన్పూరు  ఐఐటిలో ఎం.టెక్ చదివినప్పుడు అక్కడ ప్రవాసం ఉన్న తెలుగువారికోసం ఒక చిన్న తెలుగు లైబ్రరీ ఉండేది. దాన్ని నిర్వహించడం, దానికోసం విజయవాడనించి కొత్త పుస్తకాలు కొనుక్కు వెళ్ళడం చేస్తుండేవాణ్ణి. అప్పుడే మిత్రుల ప్రోద్బలంతో అక్కడి విద్యార్ధి జీవితం నేపథ్యంగా చిన్న చిన్న హాస్యనాటికలు రాశాను, తెలుగు సమితి ఉత్సవాల్లో ప్రదర్శించేవాళ్ళం. అక్కణ్ణించి అమెరికా వచ్చి పడ్డాను.

నేను భారతదేశం విడిచి ఉండకపోతే రాయాలనే తపన బహుశా కలిగేది కాదు నాకు. అమెరికా వచ్చిన తొలి రోజుల్లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా గ్రంధాలయంలోని తెలుగు విభాగం ఒక పెన్నిధిలాగా దొరికింది నాకు. తెలుగు సాహిత్యాన్ని బాగా చదివాను ఆ రోజుల్లోనే. 1993-94 ప్రాంతాల్లో కంప్యూటర్ నెట్వర్కు మీద నడుస్తున్న గ్రూపులు పరిచయమయ్యాయి. అందులో SCIT అనే గ్రూపులో తెలుగుకి సంబంధించిన అనేక విషయాల మీద చర్చలూ, వాదోపవాదాలూ జరుగుతుండేవి. అక్కడే అమెరికాలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన చాలా మంది రచయితలు, కవులు, సాహిత్య ప్రేమికులు పరిచయమైనారు. అనేక రకాల సాహిత్యాన్ని లోతుగా చదివిన పరిజ్ఞానం ఉన్నవారు, అనేక రచనలు చేస్తున్నవారితో చర్చలు రసవత్తరంగా ఉండేవి. సాహిత్యాన్ని గురించీ, సమాజాన్ని గురించీ, అమెరికను సమాజంలో మనవారి ఉనికిని గురించీ కొత్త విషయాలు అవగాహనలోకి రాసాగాయి. కొత్త ఆలోచనలు కలగసాగాయి. తెలుగుపత్రికల్లో ప్రచురితమవుతున్న సమకాలీన కథల పట్ల కొంత అసంతృప్తి మొలకెత్తింది. ఇంతకంటే బాగా మనం రాయలేమా అనిపించింది. అలా కొంచెం కసితో, కొంచెం గీరతో మొదటి కథ రాశాను.

రెండో కథ “తుపాకి” కి 1999 లో వంగూరి ఫౌండేషను వారి కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. కొన్ని పత్రికల్లోనూ, మూడు నాలుగు కథల సంకలనాలలోనూ చోటు చేసుకుంది, ఇంటా బయటా కథకుడిగా నాక్కొంచెం పేరు తెచ్చిపెట్టింది. కథ అంటే రాస్తానుగానీ దాన్ని ఎక్కడ ప్రచురించాలనేది ఆ రోజుల్లో పెద్ద సమస్య. భారత్‌లో పత్రికలకి పంపించాలంటే ప్రింటు తీసి, ఆయా పత్రికల చిరునామా సంపాదించి ఎయిర్ మెయిల్లో పంపాలి. వాళ్ళెవరూ తిరిగి సమాధానం రాసేవారు కాదు. కథని వేసుకుంటున్నారో తిరస్కరించారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈమాట వెబ్ పత్రిక మొదలయింది. వ్యవస్థాపక సంపాదకుల్లో ఒకరైన కె.వి.యెస్. రామారావుగారు నా పట్ల శ్రద్ధ చూపించేవారు. కథ పంపేదాకా వదిలిపెట్టేవారు కాదు. 1999 – 2002 మధ్యలో సుమారు 15 కథలు రాశానంటే, కేవలం ఆయన ప్రోద్బలమే.

ఆ తరవాత స్వాతి మాస పత్రికలో ఒక కథ, విపులలో ఒక అనువాద కథ ప్రచురితమైనాయి. విపులకి కథ పంపినప్పుడు అప్పటి సంపాదకులు చలసాని ప్రసాదరావుగారికి ఉత్తరం రాశాను. ఆయన వెంటనే జవాబు రాశారు, ఎంతో ఆప్యాయంగా ప్రోత్సహిస్తూ. నా కర్తవ్య నిర్దేశం కూడా చేశారు ఆయనే – నిజజీవితంలోనించి మన స్వంతమైన కథలు రాయాలని. అటుపై కొద్ది మాసాలకే ఆయన అస్తమయం గొప్ప లోటు. ఐతే ఆయన ఉపదేశం మాత్రం నా మనసుకి బాగా పట్టింది. అమెరికా జీవితం మీదనూ, అమెరికాలో భారతీయ ఇమిగ్రెంటు కమ్యూనిటీ మీదనూ దృష్టి పెట్టాను. అలాగని నాకథలన్నీ సమస్యల గురించే కాదు. కొన్ని సరదా కథలు, కొన్ని ప్రహసనాల్లా అనిపించే గల్పికలు. శైలిలో కూడా కొన్ని ప్రయోగాలు చేశాను – ఒక తల్లి గొడవ, పూర్వజన్మ వాసన, లోకస్ట్ వాక్ కార్నర్లో .. వంటి కథల్లో. ఆ సమయంలో రాసిన చాలా కథలు ఈమాట జాలపత్రికలోనే తొలిసారి వెలుగు చూశాయి. కొన్ని కథలు ఇక్కడ జరిగే వివిధ తెలుగు సభల జ్ఞాపికలు (సావనీర్లు)లో ప్రచురితమయ్యాయి. ఈమాటలో ప్రచురితమైన కథలు కొన్నిటిని రచన శాయిగారు తమ రచన పత్రికలో మళ్ళీ ప్రచురించారు. ఇదే సమయంలో తానా పత్రిక సంపాదకులుగా, తదుపరి తెలుగునాడి పత్రిక సంపాదకులుగా డా. జంపాల చౌదరిగారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది.

1998 లోనే మొదలైన డెట్రాయిట్ తెలుగు సాహిత్య సమితి వ్యవస్థాపక సభ్యుడిగా మొదటి నాలుగేళ్ళు సమితి కార్యకలాపాలు నిర్వహించాను. నెలకోసారి కలుసుకుని సాహిత్య చర్చలు జరపడమే కాక, భారత్ నించి వచ్చి ఇక్కడ పర్యటిస్తూ ఉండిన ప్రముఖ రచయితలు, కవులు చాలా మందితో గోష్టులు నిర్వహించాము. ఈ కార్యక్రమాలు ఇంకా ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఐతే ఈ చర్చలలో స్థానికుల స్వీయరచనలకి పెద్ద పీట వెయ్యలేదు ఎప్పుడూ. ప్రముఖ కథా రచయిత ఆచార్య ఆరి సీతారామయ్యగారు కూడా ఈ ప్రాంతంలోనే నివాసమున్నారు, చిరకాలంగా నాకు మిత్రులు, ఈ సమితిలో కీలక సభ్యులు మొదటినించీ. ఐనా మా స్వంత రచనల గురించి కానీ, లేక ఇతరత్రా అమెరికా తెలుగు రచయితల రచనల గురించి కానీ పెద్దగా చర్చించుకోలేదు ఎప్పుడూ. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది కొంచెం విచారించాల్సిన విషయం అనిపిస్తోంది. ఇతరత్రా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న తెలుగు సాహిత్య సభల్లో కూడా అమెరికను తెలుగు సాహిత్యాన్ని కూలంకషంగా చర్చకి పెట్టిన సందర్భాలు నాకు తోచటంలేదు. ఐతే నేను ఈ సభలకి హాజరైనది తక్కువే. అమెరికాని పర్యటిస్తున్న తెలుగు సాహితీవేత్తలతో ముచ్చటించినప్పుడు వారెవరూ అమెరికా తెలుగు సాహిత్యాన్ని పెద్దగా పట్టించుకున్నట్టుగా నాకు అనిపించలేదు. ఈ విషయంలో కవిత్వం కోంచెం మెరుగు పరిస్థితిలో ఉన్నదేమో గాని కథల పరిస్థితి అంతంత మాత్రమే. తెలుగు కథానికని ప్రాణంగా చూసుకునే సాహితీవేత్తలకి కూడా అమెరికా తెలుగు రచయితలు ఏం రాస్తున్నారు అనే అవగాహన కానీ, కుతూహలం కానీ ఉన్నట్టు నాకనిపించలేదు. సహజంగానే రచయిత పని ఒంటరితనంలో మునిగి ఉంటుంది. నేరుగా ముఖాముఖి చర్చించుకునేందుకు, తన రచనని బేరీజు వేసుకునేందుకు సహృదయులైన పాఠక విమర్శకులు తరచు దొరకరు. రచయితగా ఎదిగేందుకు తోటి రచయితలతో చర్చలు ఉపయోగపడతాయేమోనని అనిపిస్తూనే ఉంటుంది.  కానీ ఆచరణలో మాత్రం జరగలేదు.

ఇక్కడ రెండు మంచి అనుభవాలు చెప్పుకోవాలి. రెండూ తానా సభలకి సంబంధించినవే. 2000 సంవత్సరంలో జరిగిన ఒక ప్రత్యేక తానా సదస్సు సావనీరుకి కన్నెగంటి చంద్ర సంపాదకులుగా ఉన్నారు. నేనూ ఒక కథ పంపించాను. కొన్నాళ్ళయ్యాక, కొంత ఎడిట్ చేశాను, చూడండి ఇది మీకు ఆమోదమేనా అని చంద్ర నాకు మెయిల్ పంపారు. కథ చదవడం మొదలు పెడితే అది నా కథలాగా అనిపించలేదు. నేను పంపిన వెర్షనుతో పోల్చుకుంటే మొదటి రెండు పేజీలు ఎగిరిపోయాయి. మిగతా కథలో కూడా కొన్ని భాగాలు కత్తిరించబడినాయి. మొదట చాలా కోపమూ ఉక్రోషమూ వచ్చాయి, నా కథని ఇలా చిన్నాభిన్నం చేస్తారా అని. కొంచెం తమాయించుకుని చదివితే ఎడిట్ చేయబడిన వెర్షనులో చెప్పాల్సిన కథ అంతా ఉండడమే కాక, కథనం మరింత బిగుతుగా వడిగా సాగింది. చిన్నకథల్లో ఉండాల్సిన బిగువుని గురించి ఛెకోవ్ అన్నాడని చెప్పబడే కథారచన సూక్తికి ఇది మంచి ఉదాహరణ. ఎడిట్ చేసిన వెర్షనే చివరికి ప్రచురితమైందని వేరే చెప్పనక్కర్లేదు. చంద్ర స్వయంగా రచయిత, అంతేకాక మంచి సాహిత్యం రుచి తెలిసిన వారు కావడం వల్ల ఆ పని చెయ్య గలిగారు కానీ అందరు సంపాదకుల వల్లా జరగదిది.

రెండో అనుభవం 2005 డెట్రాయిట్ తానా సభల సావనీరుతో. సీతారామయ్యగారు, మద్దిపాటి కృష్ణారావుగారు సంపాదకులు. దీనికి కూడా ఒక కథ ఇచ్చాను. ఈ సారి సంపాదకులు Anonymous peer review పద్ధతి పాటించారు. కథని మరొక రచయితకి ఇచ్చి వారి నించి విమర్శ అందుకుని మళ్ళీ రచయితకి అందజేసి, ఆ విమర్శ ప్రకారం కథని మెరుగు పరచడం దీని ఉద్దేశం. కథా రచయిత ఎవరో విమర్శకులకి తెలియదు, విమర్శకులెవరో రచయితకి తెలియదు. నా కథకి బదులుగా నా చేతికందిన విమర్శని ఏం చేసుకోవాలో నాకర్ధం కాలేదు కొంతసేపు. ఆ విమర్శకులు చేసిన కంప్లెయింటు అర్ధమయింది గానీ, దాన్ని కథకి ఎలా అన్వయించాలో, ఎలా మెరుగు పరచాలో అర్ధం కాలేదు. విమర్శనీ నా కథనీ మార్చి మార్చి ఓ పది సార్లు చదివాను. సుమారొక వారం రోజులు ఆలోచించాను. అప్పుడు మెల్ల మెల్లగా దారి కనబడ్డం మొదలు పెట్టింది. సమస్య ఏవిటంటే, నేను రాసిన వాక్యాల మీద నాకు చాలా ప్రేమ. బహుశ ప్రతి రచయితకీ ఉంటుందేమో. చూస్తూ చూస్తూ ఏ వాక్యాన్నీ తొలగించడం ఇష్టం ఉండదు. ఆ ప్రేమ ఎంత గుడ్డిగా ఉంటుందంటే అనవసరపు వాక్యాలు, అతకని వాక్యాలు కథకి అడ్డం పడుతున్నాయని కూడా గ్రహించలేనంత. అలా ఆ విమర్శ దృష్ట్యా ఎడిటింగ్ మొదలు పెట్టినాక, కథని ఇంకా మెరుగు పరచేందుకు కూడా దారులు కనబడసాగినై. అలా కథ మొత్తం తిరగరాశాను. సంపాదకులు పాపం నా కథ కోసం ఓపికగా వేచి ఉన్నారు. మూలమైన కథ ఒకటే అయినా కాగితం మీద ప్రత్యక్షమైన రూపంలో మొదటి వెర్షనుకీ ఎడిట్ చేసిన వెర్షనుకీ చాలా తేడా వచ్చింది. ఖాండవవనం అనే పేరిట ప్రచురితమైన ఈ కథ నా కథల్లో నాకు చాలా తృప్తినిచ్చినది.

కథలకి ఇతివృత్తాలను ఎంచుకోవడంలో అడపాదడపా భారతీయ నేపథ్యపు కథలు రాస్తూ ఉన్నా, ముఖ్యంగా నా దృష్టి అమెరికా సమాజం మీదనే ఉన్నది ఇప్పటికీ. ఐతే నేను రాస్తున్నది డయాస్పోరా సాహిత్యమా కాదా అని పట్టించుకోలేదు. అసలు ఈ డయాస్పోరా సాహిత్యం అనే మాట సుమారు గత పది పన్నెండేళ్ళుగా వినిపిస్తున్నది తెలుగు సాహిత్యానికి సంబంధించి. నేను ఏ విధంగానూ పరిశోధకుణ్ణి కానుగనక దీనికి సంబంధించిన మూలాల్లోకి వెళ్ళలేను కానీ నాకు అర్ధమైనంతలో డయాస్పోరా అంటే తండ్రి తాతల దేశాన్ని వదిలి వేరే దేశానికి వలస వెళ్ళిన సమాజం, అక్కడ తమది కాని సంస్కృతి మధ్యలో మైనారిటీగా బతుకుతున్న సమాజం. డయాస్పోరా సాహిత్యం అంటే అటువంటి సమాజం రాసుకున్న సాహిత్యం. మాతృదేశంలో ఉత్పన్నమవుతూ ఉన్న సమకాలీన సాహిత్యానికీ అదే సమయంలో డయాస్పోరా ప్రజలు రాసుకుంటున్న సాహిత్యానికీ సహజంగా కొన్ని తేడాలు ఉంటాయి. డయాస్పోరా సాహిత్యానికి కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది విడిచివచ్చిన మాతృదేశంతో అనుబంధం. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్. దేశంతో అనుబంధం అంటే, ఊరు, రాష్ట్రం, దేశమే కాదు, తల్లిదండ్రులు, చుట్టాలు, మిత్రులు .. ఇదే ఆలోచనని ఇంకొంచెం పొడిగిస్తే భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా. వీటన్నిటి ప్రస్తావన అమెరికను తెలుగు కథల్లో తప్పకుండా ఉంటూనే ఉన్నది. డయాస్పోరా సాహిత్యంలో కనబడే స్పష్టమైన ఇంకో లక్షణం చుట్టూతా వ్యాపించి ఉన్న మెజారిటీ సంస్కృతితో జరిగే సంఘర్షణ. అంటే పోరాటం మాత్రమే కాదు, రెండు సంస్కృతులు ఢీకొన్నప్పుడు భావాల మార్పిడి కొంత జరుగుతుంది. తద్వారా మనుషుల్లో, వ్యవస్థలో కొంత మార్పు వస్తుంది. ఇమిగ్రెంటు అనుభవాల్లో ఇది చాలా ఆసక్తికరమైన విషయం.

ఈ లక్షణాలు కొన్నిటిని ఒక కథ ఉదాహరణగా చర్చిస్తే ఉపయోగంగా ఉంటుందేమో. ఇండియన్ వేల్యూస్ అనే కథ తీసుకుందాం.

http://www.eemaata.com/em/issues/200101/607.html

ఈ కథలో నేరుగా కనిపించే పాత్రలెవరూ భారత్ లో పుట్టి అమెరికాకి వలస వచ్చినవారు కాదు. అంచేత భారతదేశం అంటే ఏవిటి అని వారికి స్వీయానుభవం లేదు. కానీ కథకి మూలసూత్రమైన ఇండియన్ వేల్యూ సాంఘికంగా చాలా బలమైన కాన్సెప్టు. కథలో నేపథ్యంలో మాత్రమే కనిపించే తలిదండ్రుల ద్వారా ఈ ఆలోచన కథలోకి దిగుమతి అయింది. ఎంత చదువుకున్నా, ఎన్ని విజయాలు సాధించినా ఆడపిల్ల “ఆడ” పిల్లే, ఆమెకి తగిన వరుణ్ణి వెతికి పెళ్ళి చెయ్యాల్సిన బాధ్యత తమమీద ఉన్నది అని విశ్వసించి, దానికి తగిన చర్యలు చేపట్టినవారు వాసంతి తలిదండ్రులు. కొడుకు ఎంత ఎదిగొచ్చినా కోడలు సెలక్షన్ లో తమ ప్రమేయం కూడా ఉండాలి అని భావించి తదనుగుణంగా ప్రవర్తించిన కృష్ణ తలిదండ్రులు ఇక్కడ దిగుమతి అయిన సంస్కృతికి ప్రతినిధులు. భారతదేశమంటేనూ సంస్కృతి అంటేనూ నాస్టాల్జియా వంటి మధురోహలు ఏమీ ఇక్కడ కనబడవు గానీ, తమ అధీనంలో ఉన్నంతవరకూ ఆ సంస్కృతి చాయల్ని నిలబెట్టుకోవాలనే తొలితరం ఇమ్మిగ్రెంటు మనస్తత్వం వీరిలో ఉన్నది. కథలో ఒక తమాషా ఏవిటంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాసంతి, కృష్ణ ఇద్దరూ తమ తలిదండ్రుల ఆలోచననీ, విధి విధానాలనీ కొంత వరకూ అంగీకరించి ఆమోదించారు. ఎందుకలా అంగీకరించారో కథలో వాళ్ళే చెబుతారు. వాళ్ళసలు మొదటనే అంగీకరించి ఉండకపోతే అసలు కథే లేకపోవును. ఉన్నా అది తరాల మధ్య జరిగే సంఘర్షణగానో ఇంకోటిగానో ఉండేది. వాసంతి, కృష్ణలకి కాంట్రాస్టుగా నీరజ పాత్ర ఉన్నది. వాసంతి ఒప్పుకున్న కల్చరల్ హెజెమనీని (cultural hegemony) నీరజ ఎప్పటికీ ఒప్పుకోదు. నీరజ, వాసంతి ప్రాణస్నేహితులైనా నీరజ భావజాలం కానీ, ప్రవర్తన కానీ వాసంతి మీద ఏమీ ప్రభావం చూపించలేదు. కథ చివరిలో జరిగే క్లైమాక్స్ సన్నివేశంలో కృష్ణ ప్రవర్తన, వాసంతికి కలిగిన గ్రహింపు, చివరి పర్యవసానం – వారిద్దరూ పెరిగిన నేపథ్యము, చుట్టూతా ఉన్న సంస్కృతి, వారి సహజమైన వ్యక్తిత్వము – అన్నీ కలిసిన ఫలితం. కృష్ణ స్థానంలో మరో వెంకట్ ఉంటే వాసంతిని బతిమాలుకుని సుముఖురాల్ని చేసుకుని తను చేసింది తప్పుకాదని నిరూపించి పెళ్ళికి ఒప్పించేవాడేమో. వాసంతి స్థానంలో మరో లతిక ఉండి ఉంటే ఆ వెంకట్ మాటలు నమ్మేదో, లేక చెప్పు తీసుకుని అతని దవడ పగలగొట్టేదో. ఐతే అక్కడ ఉన్నది వాసంతి, కృష్ణ కాబట్టి కథ అలా పరిణమించింది. కథ మొదట్లో దిగుమతి భావజాలపు సూచనలు నేపథ్యమంతా పరుచుకుని ఉన్నట్టే అమెరికను సమాజపు, అందునా న్యూయార్కు నగరపు భావజాల సూచనలు కథ చివర్లో నేపథ్యంలో పరుచుకుని ఉన్నాయని, రెండు సంస్కృతుల మధ్యనా జరిగే సంఘర్షణ నేరుగా యుద్ధంలా కాక, ఆయా పాత్రల ద్వారా, ఆ పాత్రల వ్యక్తిత్వం ద్వారా పరోక్షంగా జరుగుతుందని రచయితగా నేను అనుకుంటున్నాను.

అమెరికను సమాజం నేపథ్యంగా నేను రాసిన, రాస్తున్న కథలన్నిటిలోనూ, సరదాగా రాసిన కథల్లో కూడా, ఇటువంటి సంఘర్షణని చిత్రించడానికి ప్రయత్నిస్తున్నాను. తెలుగు వలసవారు రాసినదంతా డయాస్పోరా సాహిత్యమే. కాదని ఎవరూ అనలేరు. అందులో కొన్నిరకాల విషయాలే ఎక్కువగా ఉన్నాయి, మిగతా విషయాలు లేవూ అంటే – అంతే మరి, మన వలసవారికి ఆ విషయాలే ఇప్పటికీ ఇంకా ముఖ్యమైన విషయాల్లాగా కనిపిస్తున్నాయి అన్న మాట – మాతృదేశాన్ని గురించి నాస్టాల్జియా, నివాసం ఉన్న దేశ సంస్కృతిని గురించి కొంచెం ఎగతాళి, లేదా ఇదే గొప్పది అనుకునే ఒక అభిమానం, పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళు, ఉద్యోగపు అభద్రత, రెండు సంస్కృతుల భేదాలు – ఇంకా ఇల్లాంటివి .. ప్రస్తుతానికి ఇంకా ఇవే మనవారికి ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఇతివృత్తాలు. అందుకే అవే మన సాహిత్యాన్ని నింపుతున్నాయి. ఈ విషయాలకి పరిమితమైనందువల్ల మనవాళ్ళు రాస్తున్నది డయాస్పోరా సాహిత్యం కాదు అనే వాదనకి అర్ధం లేదు. ఈ సాహిత్యం కొత్త పుంతలు తొక్కాలి అంటే వలస సామాజిక స్పృహలో కొత్త ప్రశ్నలు ఉదయించాలి, దానికి కొత్త అనుభవాలు రావాలి – ఉదా. ఒక తెలుగు కుటుంబపు అబ్బాయి ఇరాకులోనో ఆఫ్ఘనిస్తానులోనో సైనికుడిగా పనిచేస్తే? తమాషాగా, ఈ విషయంలో నిజజీవిత అనుభవాలకంటే సాహిత్యం వెనకబడి ఉన్నదని నా అనుమానం. నిజజీవితం చవిచూసిన అనుభవాల్ని నిజాయితీగా సాహిత్యంలో ప్రతిబింబించడానికి బహుశా ఇంకొంచెం సమయం పడుతుంది.