కథ

కారు పున్నమి

జూలై 2013

మెమోరియల్ డే వీకెండుకి అభినవ్ ని చూసుకునేది నావంతొచ్చింది. స్లీపింగ్ బేర్ డూన్స్ చూడ్డానికి వెళ్దామని ప్లాన్ చేశాను. ఈ సారి ట్రిప్ అంతా, ఎక్కడా ఏ ఒడిదుడుకులు రాకుండా రిజర్వేషన్లూ, అక్కడికెళ్ళాక ఏ పూట ఏమేమి చెయ్యాలీ అన్నీ జాగ్రత్తగా తయారు చేశాను, మధ్య మధ్యలో అభినవ్ ని కూడా వాడి ఇష్టాయిష్టాలు కనుక్కుంటూ. వాడికీ పన్నెండేళ్ళొచ్చాయిగా. తనే అన్నాడు, హైకింగ్ చేద్దామని.

వాళ్ళమ్మ శుక్రవారం ఎప్పుడైనా వచ్చి వాణ్ణి పిక్ చేసుకోమన్నది . అసలు శుక్రవారం శలవ తీసుకుందామని ప్రయత్నించాను కానీ క్లయంట్ స్టేటస్ మీటింగుకి నేను లేకుండా కుదరదని బాసు పట్టు పట్టాడు. అంత ముఖ్యమైన మీటింగు సరిగ్గా లాంగ్ వీకెండుకి ముందు పెట్టడానికి అతనికైనా బుద్ధుండాలి, మీటింగ్ కావాలని డిమాండ్ చెయ్యడానికి ఆ క్లయంట్ కైనా బుద్ధుండాలి.

పదిన్నరకి సెల్ మోగింది. అభినవ్. క్లయంట్ మేనేజర్ ఏదో ప్రశ్న అడుగుతున్నాడు అప్పుడే. అదేదో బిల్లింగ్ కి సంబంధించిన ప్రశ్న కావడంతో ఎకౌంట్స్ మేనేజర్ ని ఆ ప్రశ్నకి ఎరవేసి ఇప్పుడే వస్తానని బయటికొచ్చాను. రెస్ట్ రూములోకి వెళ్ళి అభినవ్ కి కాల్ చేశాను.
“నానా, ఎప్పుడొస్తున్నావ్? నేను రెడీ.”
“వచ్చేస్తున్నాను అభీ. ఇదిగో ఈ మీటింగ్ ఇప్పుడే ముగించేస్తున్నా. ఇంకో అరగంటలో రోడ్డెక్కేస్తా.”
“నిజంగా?”
“వొట్టు!”
పదకొండున్నరకి మళ్ళీ మోగింది ఫోన్. వాడే. వాణ్ణి నిరాశ పరచలేను. మా బాసు ఏదో కహానీ చెబుతున్నాడు క్లయంటుకి. గబగబా రెండడుగుల్లో బయటికొచ్చి ఫోనెత్తా.
“నానా, దగ్గరికొచ్చేశావా?
“లేదు అభీ. మీటింగ్ అనుకున్న దానికైనా కొంచెం సాగింది. ఇంకొక్క పదే పది నిమిషాలు, వోకే? పది నిమిషాల్లో నిజంగా రోడ్డు మీదుంటా.”
అవతల్నించి నిశ్శబ్దం.
“అభీ?”
“యా.”
“వచ్చేస్తా అభీ.”
“నానా, ఇది పోయిన చలికాలంలో డిజ్ఞీ ట్రిప్పులాగా అవదు కదా?”
వాడు నా డొక్కలో తన్నినట్టయి, ఒక్కసారిగా ఊపిరాడలేదు. ఒక్క క్షణం తరవాత కోలుకున్నాను.
“ప్లీజ్ అభీ. అంతా చాలా చక్కగా ప్లాన్ చేశాను. ఇది వరకట్లాగా కాదు, వోకే? ఒక్క గంట ఓపిక పట్టు, వోకే? గంట కూడా కాదు, ముప్పావు గంట. నేను పదిహేను నిమిషాల్లో బయల్దేరేస్తా. డ్రైవింగ్ ఒక అరగంట. ఫార్టీ ఫైవ్ మినిట్స్. నీ ముందు ఉంటా, వోకే?”
“సరే నానా.”
నిరుత్సాహం ఎంత వాడిగా ఉంటుందో? కసిక్కిన దిగింది గుండెలో.
పన్నెండు, పన్నెండున్నర, ఒంటి గంట .. ప్రతి అరగంటకీ అభి కాల్ చేస్తూనే ఉన్నాడు. కాల్ ఎత్తి వాడి గొంతులో నిరాశ వినే ఓపిక ఇక లేకపోయింది. క్లయంటులని సాగనంపి హడావిడిగా కారెక్కేప్పటికి రెండు. అపరాధ పరిహారం ఏదో నేరుగానో చెల్లించుకుందాములే అని బయల్దేరాను.

ఆ వీకెండు ట్రాఫిక్లో పడి ట్రాయ్ నించీ నోవైలో అభినవ్ వాళ్ళమ్మ ఉండే సబ్-డివిజన్ లోకి తిరిగేప్పటికి గంట పట్టింది. హైవే దిగి గ్రాండ్ రివర్ అవెన్యూ మీదికి తిరుగుతుంటే లెక్సస్ హుడ్ కిందినించి ఏదో విచిత్రమైన చప్పుడు వచ్చింది. డేష్ ఇండికేటర్స్ లో ఏమీ తేడా లేదు. ఇప్పుడిదేమి గోలరా నాయనా! లాభంలేదు, ఈ లెక్సస్ మరీ పాతదైపోయింది.

ఇప్పుడిప్పుడే కాస్త సెటిలవుతున్నాం కదా, ఇది మార్చి ఏ కొత్త BMWనో, మెర్సిడెసో తీద్దాం అనుకుంటూ ఉండగా .. ధన్ .. ఈ డైవోర్సు, చెత్త చెదారం .. అభీ వాళ్ళమ్మ నన్నూ నా బేంక్ ఎకవుంటునీ ఉతికారేసింది. ఇంకొన్నాళ్ళు దీంతో సర్దుకోక తప్పదు.
అప్పటికే పడమరకి తిరిగిన సూర్యుడు గూబ వాయగొడుతున్నాడు. పోనీలే కనీసం ఏసీ అయినా పని చేస్తోంది.
ఆ యింటి డ్రైవ్ వేలో ఒక మెర్సిడిస్ కొత్తగా నల్లగా ధగధగలాడుతూ కనబడింది సందు మలుపు తిరగ్గానే. దొంగ మొహంది, నా దగ్గర దోచుకున్న కష్టార్జితంతో దర్జా వెలగబెడుతోంది రాణీగారు. ఇదిగో ఈ ప్రాజెక్ట్ పూర్తై బోనస్ చేతికొస్తే దీని బాబులాంటి కారు కొంటా!

అభినవ్ కి కాల్ చేద్దామని సెల్ తీస్తున్నాను, ఇంతలో వాడే కనిపించాడు డ్రైవ్ వేలోకి నడుస్తూ, తన చిన్న కేరీ ఆన్ సూట్కేసుతో. కారు ఆగంగానే తనంతట తనే సూట్ కేసు వెనక లోపల పెట్టి నా పక్కన ఎక్కి కూర్చున్నాడు.
వాడేం మాట్లాడలేదు.
“అన్నీ తీసుకున్నావా? మీ మమ్మీకి చెప్పక్కర్లేదా?” అన్నాను.
తీసుకున్నాను అన్నట్టు తలూపుతూ, “చెప్పేశాను.” అన్నాడు క్లుప్తంగా.
“మీ మమ్మీ కొత్త కారు కొందా?”
“శ్రీనివాస్ అంకుల్ కొన్నారు. మెర్సిడెస్.”
డేం శ్రీనివాస్! వాళ్ళిద్దరూ ఎక్కడి కెళ్తున్నారో?
సబ్ డివిజన్ లోనించి బయటికొచ్చి గ్రాండ్ రివర్ ఎక్కంగానే మళ్ళీ చప్పుడయింది కారు హుడ్ కింది నించి.
“కారుకి ఏంటి సమస్య?” అన్నాడు అభినవ్.
“ఏమో. ఇందాక హైవే దిగగానే వచ్చింది ఇలాంటి చప్పుడే. పొద్దున కూడా బాగానే ఉంది, మరి సడన్ గా ఏమయిందో?” ఏమీ కాకూడదని నిశ్శబ్దంగా ప్రార్ధిస్తున్నాను.
“మన ట్రిప్ కి ముందు ఎక్కడైనా చూపిస్తే బెటర్.” అన్నాడు అభినవ్.
“ఇప్పటికే లేటయింది. ఇంకా లేటవుతుందేమో?”
వాడేం మాట్లాళ్ళేదు.
తూర్పుకి వెళ్ళే ట్రాఫిక్ లైట్ గానే ఉంది. దాంతో స్పీడు పెంచాను. కాసేపు కొంత తగ్గినట్టయ్యి, ఆ చప్పుడు ఇంకా విజృంభించింది తీవ్రతలో.
“నానా, సర్పెంటైన్ బెల్ట్ అనుకుంటా. నీ అభిమాన మెకానిక్ ఉన్నాడుగా మార్క్! ఎక్కువ సేపు పట్టదు. కనీసం చెక్ చేయించుకుంటే బెటర్.”
వీడు నా మీద మౌనవ్రత సహాయ నిరాకరణం లాంటిదేదో చేస్తాడని మనసులో ఫిక్సైపోయి ఉన్నా .. కనీసం ఈ విధంగానైనా మాట కలిపాడు.
“నీకు కార్ల గురించి ఇంత ఎలా తెలుసు?” వీడిలో ఇలాంటి అభిరుచి నేను ఇంతకు మునుపెన్నడూ గమనించలేదు.
“నాకిష్టం. వీలున్నప్పుడల్లా పుస్తకాలు చదువుతూంటా, వీడియోలు చూస్తుంటా.”
“అలాగా? మరి నాకు చెప్పలేదేం? ఈ సారి నిన్ను ఆటోషోకి తీసుకెళ్తా ఉండు.”
“అక్కడేముంది, కొత్త టెక్నాలజీ మజా ఏంఉంది. మొన్న శ్రీనివాస్ అంకుల్ నన్ను క్రైజ్లర్ మ్యూజియంకి తీసుకెళ్ళారు. అక్కడ వింటేజి కార్లు, మసిల్ కార్లు భలే ఉన్నాయి.”
మళ్ళీ శ్రీనివాస్! డేం శ్రీనివాస్!! నా కొడుకు మీద వాడికంత ప్రేమేంటో?
ఫార్మింగ్టన్ హిల్సుకి ఎగ్జిట్ తీసుకునేటప్పటికి కారు చప్పుడు ఇంకా ఎక్కువయింది. ఇక తప్పదని మార్క్ గరాజ్ వేపుకి పోనిచ్చాను.
ముందున్న ఆఫీసు గదిలో ఒక తెల్ల ముసలమ్మగారు మాత్రం ఉంది. కౌంటర్ దగ్గర ఎవరూ లేరు.
వర్కుషాపులోకి వెళ్ళే తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాను. నాతో పాటే అభినవ్ కూడా వచ్చాడు. మూడు కార్లు పట్టేంత చోటులో ఒక జాక్ మీద ఒక పాతకాలపు లింకన్ కారు ఎత్తబడి ఉంది. దానికి మూడు చక్రాలు లేవు. నాలుగో చక్రాన్ని కూడా ఊడదీసి కింద పడేసి మెకానిక్ మావేపుకి చూశాడు. ఎవరో కొత్తబ్బాయి. మెక్సికనో ఇంకేదన్నా హిస్పానిక్ దేశాన్నించి వచ్చినట్టున్నాడు.
మమ్మల్ని చూస్తూనే, “చిన్న పిల్లలు ఇక్కడ రాకూడదు. ఏమన్నా అయితే మార్క్ నన్ను తిడతాడు.” అన్నాడు ఒకమాదిరి యాసతో.
“మార్క్ ఏడీ?”
“బేంకు కెళ్ళాడు. ఇప్పుడే వస్తాడు. అక్కడ ముందు గదిలో కూర్చోండి ప్లీజ్”
“నేను పాత కస్టమర్నే.”
“అయినా సరే,” అన్నాడతను, మరో మాట లేదన్నట్టుగా.
అతనలా కచ్చితంగా అనడం ఎక్కడో కుట్టినా, కొంచెం మెచ్చుకున్నాను కూడా.
సరేనని ముందు గదిలోకొచ్చి కూర్చున్నాం. అక్కడున్న తెల్ల ముసలావిడ నాకేసి అనుమానంగా చూస్తోంది. ఇదెక్కడి వెధవ గోల అనుకుంటూ నేను రిమోట్ తీసుకుని టీవీ పెట్టి ఛానళ్ళు తిప్పుతున్నా.
ఉన్నట్టుండి అవతలి కుర్చీలోనించి ఆ ముసలావిడ, “నువ్వు ముస్లిమువా?” అంది గట్టిగా.
ఒక్క క్షణం ఉలిక్కిపడి, “ఎవరు, నేనా?” అన్నా కొంచెం అయోమయంగా.
“నువ్వే. చెప్పు. ముస్లిమువా?”
“కాదు.”
“హమ్మయ్య. అయితే పరవాలేదు. ముస్లిమువైతే నిన్ను కస్టమరుగా తీసుకున్నందుకు మార్కుని నాలుగు తిడదాం అనుకున్నా. ఈ దేశం నాశనమై పోతోంది, అడ్డమైన వాళ్ళనీ లోపలికి రానిచ్చి. ఎప్పుడైతే ఒక నల్లజాతి వాణ్ణి అధ్యక్షుడిగా ఎన్నుకున్నామో, అప్పుడే ఐపోయింది…”
ఆవిడ మాట్లాడే పిచ్చి వాగుడు అభినవ్ కూడా వింటున్నాడా అని ఆదుర్దాగా వాడి వేపు చూశాను. వాడు తన పీయెస్పీలో ఏదో గేం ఆడుకుంటున్నాడు. ఆవిడ మాటలు విన్నట్టు లేదు. ఐనా ఇప్పుడు నేను చెయ్యగలిగిందీ ఏమీ లేదు. వాడూ పెద్దవాడవుతున్నాడు, వాడికీ తెలియాలిగా రకరకాల మనుషులుంటారని. ముసలావిడ ఆపకుండ మాట్లాడుతూనే ఉంది.

“నా జాను అదృష్టవంతుడు. ఈ ఘోరాలన్నీ చూడాల్సి రాకుండానే వెళ్ళిపోయాడు. నేను మిగిలున్నాను. ఈ మార్కు గాడికి బొత్తిగా దేశభక్తి లేకుండా పోతోంది. అక్కడ షాపులో చూశావా?”
“చూశాను. లింకను కారు.”
“లింకను కారు నాదే. అది కాదు విషయం. అక్కడ మెకానిక్కు. వాడు మెక్సికను వాడు. బహుశా దొంగతనంగా ఈ దేశంలోకి వచ్చుంటాడు. వాళ్ళందరూ దొంగ వెధవలే. మార్కుకి చెప్పాలి, ఈ వెధవల్ని పనిలోకి తీసుకోవద్దని.”
ఇంతలోకి లోపలి తలుపు తెరుచుకుని మార్క్ వచ్చాడు. నాకేసి చూసి ఒక్క నిమిషం అంటూ నవ్వి, ముసలమ్మ గారితో, “మిసెస్ రాబిన్సన్. మీ బ్రేకులు మార్చాలి. అలాగే టైర్లు కూడ పాతవై పోయాయి. ఎలాగూ చక్రాలు తీశాము కాబట్టి టైర్లు కూడ మార్చేసుకుంటే మంచిది మీరు. ఏం చెయ్యమంటారు?”
“చెయ్యాలసిన వన్నీ చెయ్యి, మార్క్. నా జాను ఉన్నన్నాళ్ళూ ఆ లింకన్ని తన ప్రాణంతో సమానంగా చూసుకున్నాడు. దాని బాగు విషయంలో నేనెప్పుడూ ఖర్చుకి తగ్గను. కానీ ఒక్కటే మాట. నువ్వే చెయ్యాలి పని. ఆ ఇల్లీగల్ వాడు నా కారు ముట్టుకోవడానికి వీల్లేదు.”
మార్క్ నా వంక, ‘చూశారా, ఇదీ వ్యవహారం’ అన్నట్టు అర్ధవంతమైన చూపొకటి విసిరి ఆవిడతో “అలాగే మిసెస్ రాబిన్సన్.” అన్నాడు.
ఆ తరవాత అతనికి నా సమస్య క్లుప్తంగా చెప్పాను.

‘విషయం ఏంటో చూద్దాం. ఒక పది నిమిషాల్లో తెలుస్తుంది’ అని లెక్సస్ తాళం తీసుకుని వెళ్ళిపోయాడు.
ముసలామె కునికి పాట్లు పడుతోంది. అభి తన గేం లో మునిగి ఉన్నాడు. నాకు ఆకలేస్తోంది. అభి దగ్గిరికి వెళ్ళడంలో ఆలస్యమవుతోందనే ఆందోళనలో లంచి సరిగ్గా తినలా.
పదినిమిషాలైంది, ఇరవై నిమిషాలైంది. మార్క్ రాలేదు. ఇంతలో షాపు లోంచి ఏదో పోట్లాట జరుగుతున్నట్టు గొంతులు బిగ్గరగా వినిపిస్తున్నాయి. ఏవిటో విషయం అని లోపలి తలుపు తెరుచుకుని షాపులోకి అడుగు పెట్టాను.
మార్క్ అరుస్తున్నాడు. “నీ సొమ్మేం పోయింది? మాట్లాడకుండా చెప్పిన పని చెయ్. అసలే రోజులు బాలేవు. ఎట్లాగైనా ఈ బిజినెస్ ని నిలబెట్టుకోవాలని నానా పాట్లూ పడుతున్నా నేను. ఆవిడ బ్రేకులూ టైర్లూ మళ్ళీ మారిస్తే కనీసం వెయ్యి డాలర్లు ఆదాయం. నీకో వందిస్తాలే. చెప్పిన పని చెయ్.”
ఆ హిస్పానిక్ మెకానిక్ అన్నాడు, “ఇది తప్పు మార్క్. నేను చెయ్యను. పోయిన వారం ఆవిడ వచ్చినప్పుడు చేసిందే తప్పు. కొత్త టైర్లు, కొత్త బ్రేకులు .. మళ్ళీ వారంలోగా ఇంకో వెయ్యి బిల్లా? మోసానికైనా హద్దుండాలి. అందులో ముసలామెని, మతి సరిగ్గా లేని ఆమెని మోసం చేస్తే ప్రభువు నిన్ను క్షమించడు, మార్క్! నేను మాత్రం చెయ్యను. నువ్వు గనక చేస్తే, కచ్చితంగా పోలీసులకి చెబుతాను.”
అతను చేతిలో ఉన్న పనిముట్టు కిందకి విసిరేసి గరాజ్ డోరులో నించి బయటికి వెళ్ళిపోయాడు.
మార్క్ మొహంలో రంగులు మారాయి, కానీ ఇంక చెయ్య గలిగిందేమీ లేదని గ్రహించినట్టున్నాడు. గాఢంగా నిట్టూర్పు వదిలాడు.
నేను గబగబా ముందు గదిలోకి వచ్చేశాను. వాళ్ళ సంభాషణని నేను విన్నానని అతనికి తెలియటం నాకు ఇష్టం లేకపోయింది. నేను వచ్చేసిన రెండు నిమిషాల్లో మార్క్ కూడ గదిలోకి వచ్చాడు. ఆ చప్పుడికి ముసలమ్మగారు కళ్ళు తెరిచింది.
తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతో మార్క్ “మిసెస్ రాబిన్సన్, మళ్ళీ అన్నీ జాగ్రత్తగా పరిక్ష చేశాను. మీ లింకన్ బ్రేకులు, టైర్లూ బాగానే ఉన్నై. ఏమీ మార్చనక్కర్లేదు. హోసె కార్లోస్ దాని చక్రాలు బిగించి కిందకి దింపుతాడు. ఇంకో పది నిమిషాల్లో మీరు దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు.” అన్నాడు.
షాపు కిటికీలోనించి హోసె కార్లోస్ చక్రాల్ని బిగించడం కనిపిస్తోంది. ముసలమ్మ గారు కోపంతో ఊగిపోతూ, ఏయ్ మార్క్ అని గట్టిగా పిలుస్తున్నా వినిపించుకోకుండా మార్క్ షాపులోకి వెళ్ళిపోయాడు. ఆవిడ ఏదో గొణుక్కుంటూ కుర్చీలో కూలబడింది.
నా లెక్సస్ పని పూర్తయ్యేటప్పటికి గంట పట్టింది. అభినవ్ చెప్పినట్టుగానే, సర్పెంటైన్ బెల్టు వదులైపోయి పనికి రాకుండ పోయింది. మార్క్ బిల్లు నా ముందు పెట్టినప్పుడు అంశాలన్నీ జాగ్రత్తగా పరిశీలించాను ఎక్కడ నాక్కూడ టోపీ వేస్తున్నాడోనని. అన్నీ సరిగ్గానే ఉన్నై. చెల్లించాల్సింది చెల్లించి, అభినవ్ తో కలిసి కారెక్కాను.
“ఏరా అభినవ్, ఆకలేస్తోందా? ఏమన్నా తిందామా?”
ఆరు దాటింది. ఇప్పుడు బయల్దేరి స్లీపింగ్ బేర్ కి వెళ్లడం సాధ్యం కాదు. వెళ్ళినా ఏ అర్ధరాత్రికో చేరతాం.
వాడు ఆలోచిస్తున్నాడు.
“ఇక్కడే టాకో బెల్ ఉందిగా? తినేసి, స్టార్ ట్రెక్ సినిమా కెళ్దాం.”
“మరి మన ట్రిప్?”
“రేప్పొద్దున్నే తెల్లారుజామునే బయల్దేరుదాం, వోకే? పదింటికల్లా అక్కడికి చేరిపోతాం. నిజానికి మనం వేసుకున్న ప్లానులో ఏదీ మిస్సవ్వక్కర్లేదు.”
టాకో బెల్ లో నేను రెస్ట్ రూం కి వెళ్తే అక్కడ ఒకతను పరిచయమైన మొహంలాగా కనబడింది. ఒక్క క్షణంలో వెలిగింది.
“నువ్వు హోసె కార్లోస్ కదా” అన్నాను.
అతనూ నన్ను గుర్తు పట్టినట్టుగా నవ్వి తలూపాడు.
మిగతా ట్రిప్ అంతా ఏ అవాంతరాలూ జరక్కుండా సవ్యంగా జరిగింది. ఒక రోజు రాత్రి ఆ ఇసుక తిన్నెల మీద తిరగడానికి వెళ్ళాం. ఆ రాత్రి పౌర్ణమల్లే ఉంది. వెన్నెల్లో ఆ తిన్నెలు, బీచి, మిషిగన్ సరోవరం – ఏదో మాయలోకంలోకి వెళ్లినట్టుగా ఉంది. అభినవ్ నోరు తెరిచి స్పష్టంగా ఏదీ చెప్పడు కానీ బాగానే ఎంజాయ్ చేశాడని అనుకున్నా నేను.
నెలరోజుల తరవాత మళ్ళీ వాడు నాతో గడిపే వంతొచ్చినప్పుడు, ఈ సారి ఏమీ ఆలస్యం లేకుండానే వాణ్ణి ఎక్కించుకుని బయల్దేరాను. అయితే, ఫార్మింగ్ టన్ లోకి తిరక్కుండా ఇంకా ముందుకు పోతున్నాం.
వాడు కొంచెం ఆశ్చర్యంగా చూసి, “ఎక్కడికెళ్తున్నాం?” అన్నాడు.
“చిన్న సర్ప్రైజ్ నీకు.”
ఇంకో పది నిమిషాల్లో సౌత్ఫీల్డులోకి తిరిగి చిన్న ఇళ్ళుండే ఒక సబ్ డివిజన్లోకి ప్రవేశించాము. మేము చేరుకున్న ఇంటి ముందున్న చిన్న డ్రైవ్ వేలో సిమెంటు దిమ్మల మీద నిలబెట్టి ఉన్న కారు కంకాళం, ఎన్నో సరికొత్త భాగాలతో మెరుస్తోంది.
ఇద్దరం దిగాము.
ఆ అసంపూర్తి కారుని చూసి వాడి కళ్ళు పెద్దవయ్యాయి.
“అది .. అది .. వింటేజ్ డాడ్జి ఛార్జర్!” అన్నాడు తన కళ్ళని నమ్మలేనట్టు.
“అవును. ఇది 66 మోడల్.” కారుకి అవతల వేపునించి హోసె కార్లోస్ మా వేపుకి వస్తున్న హోసె కార్లోస్ అన్నాడు
“అభీ, నీకు ఈ కారు కొనిపెట్టలేను కానీ, ఈ వేసవి అంతా, నువ్వు నాతో ఉండే సమయంలో ఈ కారు మీద నువ్వు పని చెయ్యొచ్చు. ఇతనే హోసె కార్లోస్. I hope you have fun.” *