కవిత్వం

ఉండిపోతే..

మార్చి 2016

ఒంటరిగా ఒక పిలగాడు. వాడంటే చీకటికీ ఇష్టమే. చల్లగా కమ్మేస్తుంది వాడిని. మరెవరూ, మరేదీ ఇవ్వలేనంత ప్రేమతో.
వాడు అందర్లో చీకటిని వెతుక్కుంటాడు.

“ఉండు”

“….”

“ఉండూ”

“…ఏదీ కాసింత … చో… టు”

“నీదేంటో నీకు తెలిస్తే బాగుండు.”

పురివడిన కలల్ని చెదరగొడుతూ గు గ్గు గ్గూ అంటూ కిటికీలో ఒక పావురం. వాడంటే పక్షులకు ఇష్టం. రెక్కలున్న వాళ్లకు కూడా. పక్షులు ఎగిరిపోతాయి. రెక్కలున్న వాళ్లు… ఈరోజో, రేపో, వాడి తడికళ్లను తప్పించుకోగలిగిన క్షణాల్లో…

“ఏం? ఉంటావా?”

“మ్.. నాకు కేటాయించిన అరలోనా?”

“కాదు. నాకళ్లల్లో…”

“అబ్బ, ఎంత ముతక! ఇంకేదైనా చెప్పు.”

“ఉంటానంటే చెప్తా.”

ఆ పిలగాడికి నవ్వంటే ఇష్టం. ఏదీ చెప్పలేనప్పుడు నవ్వేస్తే సరి. నవ్వితే, ఆవలిస్తాడు. ఇష్టంగా.

“గులాబీ అమ్మాయీ…”

“కాదు! ఆకుపచ్చ అమ్మాయి. స్కై బ్లూ అబ్బాయీ …”

“మ్… ను.. వ్వూ, నే….”

“వా… ళ్లూ…”

“ఎప్పుడూ రాద్ధాంతాలు… సిద్ధాంతాలు…”

కరుకు అని తాను అనుకుంటాడుగానీ, మెత్తగా వుంటాయి వాడి చిటపటలు. వాడి గొంతులో ఒక జీర. ఎప్పుడూ. దుఃఖంగా. ఓపలేక, పాటలు కూడా వాడిని అల్లుకుపోతాయి.

“సరే, ఉంటాగానీ, నాతో రా మరి. చూడు, అడవి సూరీడు. వెళ్దాం పద ఆ చివరి…”

“ఇప్పుడు ఉండు. ఆ చివరివరకు అంటూ ఏదీ లేదు…”

అణువణువునూ మింగేస్తూ ఒక చీకటి గుహ. ఆ చీకటి వాడే, భయంతో వణికినప్పుడు వెచ్చని వెలుతురూ వాడే.