ఇక్తొమి – నేటివ్ అమెరికన్ తెగల్లో ఒకటైన లకోట తెగ లెజండరీ హీరో. జనాన్ని బురిడీ కొట్టించి, అవహేళన చేసి మరీ పాఠాలు నేర్పిస్తుంటాడీ మాంత్రికుడు. కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవడానికి తన ప్రాణం అడ్డం పెట్టడానికి వెనుకాడని వీరుడు.
ఇక్తొమి అంటే సాలీడు అని అర్థం. చెప్పాను కదా, వాడొక మాంత్రికుడు. వాడికి ఎన్నో రూపాలు. ఒకసారి మనిషిలాగా, ఇంకోసారి ఏదో జంతువులాగా, గాలి లాగా, మబ్బు లాగా – ఒక్కోసారి ఒక పాటై నిన్ను హత్తుకుంటాడు.
ఒక పాట. ఒక్క పాట – గుప్పెడు అక్షరాలు కలిసిన కొన్ని పదాలు. అంతే.
అంతేనా? అనుభవాల దారం పోగులను ఒక్కొక్కటి జత చేసి నీ చేతులతో నువ్వే అల్లుకునే జీవితంలో, ఒక్కోసారి సూరీడు వెళ్లిపోయి ఇక ఎప్పటికీ తిరిగిరాడనిపిస్తుంది. ఆ నొప్పికి, దుఃఖానికి ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తారు. గుక్క తిరగక, దిక్కుతోచక సగంలో ఆగిపోయిన నీ అడుగులను పట్టి నేలమీద వుంచి, కొత్త ఊపిరులూదే పదం ఇక్తొమి. పాట ఇక్తొమి. పాటగాడు ఇక్తొమి.
“సూరీడు వెళ్లిపోయాడని దుఃఖపడకు. కన్నీళ్లు నక్షత్రాలను చూడనివ్వవు.” అంటుంది ఒక ఇక్తొమి. తన పేరు వియొలెత పర్ర.
వియొలెత పర్ర
ప్రేమ, దైనందిన జీవితం గురించిన పాటలే కాక రాజకీయ పోరాటాల గురించి ఎన్నో పాటలు రచించి, పాడటమే కాకుండా ఎంతోమంది యువకళాకారులకు మార్గదర్శి అయిన వియొలెత పర్ర అక్టోబర్ 4, 1917లో చిలీ లో పుట్టింది. ఆమె తండ్రి మ్యూజిక్ టీచర్, తల్లి పొలంలో పని చేసేది. కానీ అప్పుడప్పుడు గిటార్ అందుకుని పాటలు పాడేది. చిన్నవయసులో గిటార్ వాయించడంలో, పాటలు కట్టడంలో నిష్ణాతురాలైంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న కుంటుంబానికి చేయూతనివ్వడానికి హోటల్లలో, సర్కసుల్లో పాటలు పాడడం మొదలుపెట్టింది. వియోలెత పన్నేండేళ్ల వయసులో తండ్రి మరణించాడు. ఆ సంఘటన ఆమె కుటుంబానికి పెద్ద దెబ్బ అయింది. కొన్నేళ్లపాటు కుటుంబమంతా చెల్లాచెదురై ఎన్నో ఊర్లు తిరిగి, చివరికి సాంటియాగోలో స్థిరపడ్డారు. సోదరితో కలిసి సాంటియాగోలో ఎక్కడ వీలుదొరికితే అక్కడ పాటలు పాడేది.
వియొలెత తన మొదటి భర్తను కలిసాక, చిలీ కమ్యూనిస్టు పార్టీలో సభ్యురాలైంది. చిన్నతనంలోనే పేదరికాన్ని అనుభవించిన వియొలిత, ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు ఉండాలని కోరుకుంది. ఆ భావాలన్నీ అమె పాటల్లో ప్రతిఫలించేవి. ఆ పాటల రిథం వేగవంతంగా ఉంటుంది. పాటలు నిరంకుశ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించినట్లు ఉంటాయి.
వియొలిత, తన కొడుకు అన్హెల్ పర్ర (Angel parra), కూతురు ఇసబెల్ పర్ర (isabelparra) లతో కలిసి, మరుగున పడిన చిలీ జానపద సంగీతాన్ని ఆ దేశానికి తిరిగి పరిచయం చేసింది. చిలీ ప్రజలు మరిచిపోయిన ఎన్నో వేల పాటలను సేకరించింది. జానపద సంగీతానికి, ప్రజాపోరాట స్పూర్తిని అద్దుతూ, ‘నుయెవే కాన్సియోన్ చిలీ’ (nuevecancionchileఅంటే ‘చిలీ కొత్త పాట’) పేరుతో నవ్య సంగీతోద్యమాన్ని ప్రారంభించింది. ‘నుయెవే కాన్సియోన్’ ఉద్యమం చిలీ దేశపు ఎల్లలు దాటి, ఉత్తర, దక్షిణ అమెరికాల్లోని ఉద్యమాలకు, పోరాటాలకు ఊపిరి పోసింది. విక్టర్ హర వంటి గాయకులకు పాటను ప్రజల దగ్గరకి తీసుకెళ్లగలిగే మాధ్యమమైంది. విక్టర్ హర ‘మ్యానిఫెస్టో’ అనే తన పాటలో “వియొలెత అన్నట్లు, నా పాట తన ప్రయోజనాన్ని కనుక్కుంది” అంటూ వియొలెత కు అద్భుతంగా నివాళి అర్పిస్తాడు . ‘నుయెవే కాన్సియోన్’ ఉద్యమానికి దేశాల సరిహద్దులే కాదు, స్థల కాలాల ఎల్లలు కూడా లేవు. ఇప్పటికీ సామాజిక స్ప్రహతో పాటలు పాడే ఎంతో మంది గాయనీ గాయకులు నుయెవే కాన్సియోన్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు.
ఆమె చివరి రోజుల్లో దేవుడిని ప్రస్తావిస్తూ కొన్ని పాటలు కూడా రాసింది. అయితే, వాటిలో కూడా పేదప్రజలకోసం ఆమె తపన కనిపిస్తుంది. ‘యో కాంతో ల డిఫరెంసియా’ అనే పాటలో, ‘సమాజంలోని వైరుధ్యాల గురించి పాడతాను’ అంటూ, ‘దేవుడా నా దృష్టి పేదల కష్టాలనుంచి మరలకుండా చూడు, రాజ్య దాష్టీకాన్ని సహించనివ్వకు’ అని అడుగుతుంది.
వియొలెత పర్ర రచించిన ఎన్నో పాటలు ఇప్పటికీ ప్రసిద్ధమే. అందులో ఒకటి, ‘గ్రాసియస్ అ ల వీద’ (జీవితమా, నీకు ధన్యవాదాలు). ఈ పాటను ఆమె తన జీవితం చివరికాలంలో రాసింది.
ఎంతో మందికి మార్గదర్శకురాలైన వియొలెత తన జీవితంతోనూ పలు పాఠాలు నేర్పింది. తన నలభయ్యవ ఏట యూరప్ లో పర్యటిస్తున్నప్పుడు గిల్బర్ట్ ఫవ్రె అనే స్విస్ దేశస్థుడిని ప్రేమించింది. రెండవ భర్త నుంచి విడాకులు తీసుకుని గిల్బర్ట్ తో కలిసి ఉంది. గిల్బర్ట్ వియొలెత కంటే ఇరవై ఏళ్లు చిన్నవాడు. వాళ్లు దాదాపు ఆరేళ్లు కలిసి ఉన్నారు. గిల్బర్ట్ తన సంగీతానికి బొలివియాలో మంచి స్పందన రావడంతో వియొలెతతో బంధం తెంచుకుని బొలివియా వెళ్లిపోయాడు. గిల్బర్ట్ తో విడిపోవడాన్ని తట్టుకోలేక పోయింది వియొలెత. అదే సమయంలో తన పాట పరంగా కూడా ఒంటరితనం అనుభవించింది. మొదటినుంచీ కమ్యూనిస్టులకు మద్దతునిస్తూ, యువ కార్యకర్తలకు తన వేదిక మీద అవకాశాలనిస్తున్న వియొలెత పాటలను, కమ్యూనిస్టు వ్యతిరేకులైన రేడియోలు
ఆమె పాటలు బ్రాడ్ కాస్ట్ చెయ్యడం తగ్గించాయి. ఆ కాలంలోనే వివిధ రంగాల్లో కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, మెరుగుపర్చుకోవాడనికి అవకాశంగా ఉంటుందని, ‘క్వీన్’ అనే టెంటును ఏర్పాటు చేసింది. మొదట్లో ఈ ఆలోచనకు మంచి స్పందన వచ్చినా, కొంతకాలం గడిచాక చాలా కొద్ది మంది అక్కడికి వచ్చేవారు. అన్ని వైపులనుంచీ ఒంటరితనం ఆమెను చుట్టుముట్టినట్లై డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.
5 ఫిబ్రవరి 1967:
వియొలెత మానసికంగా కుంగిపోయినప్పుడు చాలామంది స్నేహితులు ఆమెకు తోడుగా నిలిచారు. కానీ, “1973 ఎంతో దూరం లేదు. నీ పాట ఇంకెంత అవసరం అవుతుందో నీకు తెలీదు. చిలీ నేల మీద ఎర్రని వాన కురవబోతోంది. ఈ ఒక్క రాత్రి గడవనీ. కన్నీళ్లు తుడుచుకో వియొలెత!” అని అప్పుడు ఆమెకు ఎవరైనా చెప్పి వుంటే బాగుండేది. ఎవరి మాటా వినరానంత దూరం వెళ్లిపోయింది వియొలెత.
వెళ్లిపోయిందా? వియొలెత పాటను అప్పుడే ఇంకో ఇక్తొమి గొంతు అందుకుంది.
మెర్సిడెస్ సోస! వాయిస్ ఆఫ్ అమెరికా!
మెర్సిడెస్ సోస పాటలు రాయదు. పాటలు మరుగున పడకుండా, వాటికి తన గొంతునిచ్చి కొత్త ఊపిరి పోస్తుంది. ఆమె గొంతు విప్పగానే ఆ పాట నీలో మమేకమవుతుంది. మొద్దుబారిన నరాల్లోకి విద్యుత్తులా పాకుతుంది. ఇక జ్వలించడమే నీకు మిగిలే ఒకే ఒక్క ఆప్షన్.
మెర్సిడెస్ సోస 1935లో జులై 9 న అర్జెంటినాలో పుట్టింది. దియగ్విత అమెరిండియన్, మెస్తిసొ, స్పానిష్, ఫ్రెంచ్ కలగలిసిన రక్తం ఆమెది. ఆమె తల్లిదండ్రులు పెరొనిస్టా సానుభూతిపరులు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో అర్జెంటినాకు రుచి చూపించినవాడు ప్రెసిడెంట్ పెరొనిస్టా.
1960 ల నుంచే మెర్సిడెస్, తన భర్త మానుయెల్ ఆస్కర్ మతుస్ (Manuel Oscar Matus)తో కలిసి ‘నుయెవే కాన్సియోన్’ ఉద్యమాన్ని అర్జెంటినాకు పరిచయం చేసింది (అర్జెంటినాలో ఈ ఉద్యమాన్ని ‘నుయెవే కన్సియొనెరొ’ అంటారు.) 1971 లో వియొలీత పర్ర జ్ఞాపకార్థం ఒక రికార్డింగ్ చేసింది మెర్సిడెస్. అప్పటినుంచి మెర్సిడెస్ తన ప్రతి కాన్సర్ట్ లో ‘గ్రాసియస్ అ ల వీద’ పాట తప్పకుండా పాడుతుంది.
1976 లో అర్జెంటీనాలో జార్జ్ విదేల నిరంకుశ పాలన మొదలయ్యింది. సామాజిక సమస్యల మీద పాటలు పాడే మెర్సిడెస్ సోస మీద, ఆమె కుటుంబం మీద హత్యా ప్రయత్నాలు మొదలయ్యాయి. అయినా ఆమె దేశం వదిలి వెళ్లలేదు. 1979 లో ఆమె కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు స్టేజి మీదనే ఆమెను అరెస్టు చేశారు. అంతర్జాతీయ జోక్యం వల్ల ఆమెను విడుదల చేసి దేశం నుంచి బహిష్కరించారు. 1982 చివర, నిరంకుశపాలన చివరి దశలో దేశానికి తిరిగి వచ్చేసింది. దేశానికి వచ్చీ రాగానే యువ గాయనీ గాయకులతో కలిసి వరస పెట్టి దేశమంతా కాన్సర్టులు ఇచ్చింది. తన పాటతో దక్షిణ అమెరికాలో నియంతలకు ఎదురొడ్డి నిలిచిన మెర్సిడెస్ సోస ఎంతోమంది యువ గాయనీ గాయకులకు, సామాజిక కార్యకర్తలకు ప్రేరణగా నిలిచింది.
జీవితమంతా వామపక్ష కార్యక్రమాలకే ఉపయోగించింది మెర్సిడెస్ సోస. 2009లో 74 ఏళ్ల వయసులో అనారోగ్యం వల్ల మరణించింది.
‘గ్రాసియస్ అ ల వీద’… పాటను మెర్సిడెస్ సోసతో కలిసి పాడి, ఆ పాటకు కొత్త ఊపిరి పోసి తన కాన్సర్ట్ లో ఒక ‘సంతకం’ లాగా ఇప్పటికీ పాడుతోంది ఇంకో ఇక్తొమి జొయాన్ బయేజ్!
జొయాన్ బయేజ్!
తనకే ప్రత్యేకమైన తీక్షణమైన స్వరంతో సామ్రాజ్యవాదం కళ్ల ముందు పిడికిలెత్తి పాడుతోంది జొయాన్ బయేజ్.
అమెరికాలోని న్యూయార్క్ లో జనవరి 9 న 1941లో పుట్టింది. 13 ఏళ్లప్పుడు పీట్ సీగర్ పాటలు విని ఆయన సంగీతం వైపు ఆకర్షితురాలైంది. 15 వ ఏట పౌర హక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ను కలవడం ఆమె జీవిత గమ్యాన్ని నిర్దేశించింది. 1963లో, తన ఇరవై రెండవ ఏట, ‘గ్రేట్ మార్చ్ ఆన్ వాషింగ్టన్’ (Great March on Washington) సందర్భంగా పీట్ సీగర్ రాసిన పాట ‘వి షల్ ఓవర్ కమ్’ ను పాడి అందరి మన్ననలు అందుకుంది. “I Have A Dream” అంటూ మార్టిన్ లూథర్ కింగ్ ప్రసంగించింది ఈ మార్చ్ లోనే. అప్పట్నుంచి ఇప్పటిదాకా, అహింస, పేదరికం, పౌర హక్కులు, మానవహక్కులు, LGBT హక్కులు, పర్యావరణం వంటి ఉద్యమాలకు తన గొంతును అంకితం చేసింది. బాబ్ డిలన్ వంటి కొత్త గాయకులను తన స్వంత కాన్సర్టుల్లో పరిచయం చేసేది.
జొయాన్ బయేజ్ తో బాబ్ డిలన్ రెండేళ్లు కలిసి ఉన్నాడు. కొంత పేరు వచ్చాక బాబ్ డిలన్ ఆమెను వదిలి వెళ్లిపోయాడన్న ప్రచారం ఉంది. ఆ సంబంధం వీగిపోయిన కొన్నేళ్లకు ఆమె డేవిడ్ హారిస్ ను పెళ్లి చేసుకుంది. డేవిడ్ హారిస్ వియత్నాం యుద్ధం కోసం అమెరికా ప్రభుత్వం సైనికులను తరలించడాన్ని వ్యతిరేకిస్తూ జైలు కెళ్లాడు. అదే సందర్భంలో జొయాన్ కూడా అరెస్ట్ అయింది. డేవిడ్ తో సంబంధం కూడా ఎక్కువ రోజులు నిలువలేదు.
వ్యక్తిగత జీవితంలోని నిరాశానిస్పృహలకు విరుగుడు, పని చెయ్యడమే అని నమ్ముతుంది జొయాన్. ‘గ్రాసియస్ అ ల వీద’… అంటూ వొయొలెత రాసిన సూయిసైడ్ నోటును తలకిందులు చేసి, జీవితాన్ని సెలబ్రేట్ చెయ్యమని, అడుగు ముందుకు వేయమని గొంతెత్తి పాడుతుంది జోయాన్. వియొలెత పర్ర గొంతులోని మెలాంకలీ, మెర్సిడెస్ స్వరంలోని జ్వలనం తో పాటు జీవితం పట్ల ఉరకలేసే ఉత్సాహం జొయాన్ గొంతులో పలుకుతుంది.
సరైన సమయంలో నా జీవితంలోకి వచ్చిన పాటకు, ఆ మూడు గొంతులకు ధన్యవాదాలు తెలుపుతూ,’ గ్రాసియాస్ అ ల వీద‘ కు నా స్వేచ్చానువాదం:
జీవితానికి ధన్యవాదాలు
జీవితానికీ, జీవితమిమిచ్చిన అన్నిటికీ ధన్యవాదాలు
జీవితం నాకు రెండు నక్షత్రాలను ఇచ్చింది, వాటిని విప్పినప్పుడు
తెలుపు నుంచి నలుపును విడదీయగలుగుతున్నాను
రాత్రి ఆకాశం నిండా నక్షత్రాలు వెదజల్లి ఉండడం చూడగలుగుతున్నాను.
సమూహంలో కూడా నా ప్రియ స్నేహితుడిని కనుక్కోగలుగుతున్నాను.జీవితానికీ, జీవితమిమిచ్చిన అన్నిటికీ ధన్యవాదాలు
అన్ని రకాల శబ్దాలను వినగలిగే నిజమైన బహుమతిని ఇచ్చింది జీవితం
రాత్రీ పగలూ కీచురాళ్ల రొదనూ, కానరీ పక్షుల సంగీతాన్నీ
ట్రాఫిక్ రొదనూ, నిర్మాణాల శబ్దాలనూ, మొరిగే కుక్కలనూ, హఠాత్తుగా కురిసే వర్షాన్నీ
నాకు ప్రియస్నేహితుడి మృదు స్వరాల్ని వినగలుగుతున్నానుజీవితానికీ, జీవితమిమిచ్చిన అన్నిటికీ ధన్యవాదాలు
అమ్మ, స్నేహితుడు, అన్న, నాకు ప్రియమైన వారిభావోద్వేగాల్ని
వారి ఆధ్యాత్మిక మార్గాన్ని వెలిగించిన కాంతి యోచనల్ని చెప్పడానికి
నా గొంతుకు ఒక శబ్ద శక్తినీ, భాషనూ బహుమతిగా ఇచ్చింది జీవితంజీవితానికీ, జీవితమిచ్చిన అన్నిటికీ ధన్యవాదాలు
మహానగరాలు, నీటి గుంటలు, సముద్ర తీరాలు, ఎడారులు, ఎత్తైన శిఖరాలు,
మైదానాల మీదుగా మీ వీధిదాకా, మీ ఇంటి గుమ్మం దాకా
అలసిన ఈ పాదాలతోనే ముందుకు నడిచే కోరికను ఇచ్చింది జీవితంజీవితానికీ, జీవితమిచ్చిన అన్నిటికీ ధన్యవాదాలు
నా చుట్టూ సంఘటనలను చూసి చలించే హృదయాన్ని
మనిషి జ్ఞానం నుంచి పుట్టిన సమస్తాన్ని అస్వాదిస్తాను
చెడుకు మంచికి మధ్య దూరం లెక్క పెట్టగలుగుతున్నాను
నిర్మలమైన మీ కళ్లలో కళ్లు పెట్టి చూడగలుగుతున్నానుజీవితానికీ, జీవితమిచ్చిన అన్నిటికీ ధన్యవాదాలు
జీవితం నాకు నవ్వులిచ్చింది, కన్నీళ్లనిచ్చింది, వాటి వల్లనే నాకు
హృదయం ఉప్పొంగడానికీ, బద్దలవడానికీ మధ్య తేడా తెలిస్తోంది
అవే కదూ నా పాట లోని రెండు జీవన సత్యాలు
అదే నీ పాట, అదే అందరిదీ, ఔను అదే నా పాట.
**** (*) ****
Picture Credit: March on Washington (https://en.wikipedia.org/wiki/March_on_Washington_for_Jobs_and_Freedom)
” చుట్టూ సంఘటనలను చూసి చలించే హృదయమున్న” మమదా గ్రాసియాస్ ( Mamatha Konidela, Gratias! ).
Venceremos (We Will Win).
“Hoka Hey” : The Oglala Lakota war leader Crazy Horse’s battle cry “Hoka Hey” ( “A Good Day to Die ” )
in the Battle of the Little Bighorn ( near Little Big Horn river in eastern Montana Territory ) when his Sioux Lakota Indian tribe defeated General Custer and the 7th Cavalry Regiment of the United States Army in 1886 defending the Reno Hill.
( are part of the Tension between the native inhabitants of the Great Plains of the United States and the encroaching white European settlers ).
గొప్ప రైటప్ మమతా .. ఎన్ని కొత్థ గొంతుకలు.. పీక నులిమేస్తున్నా, సంగీతం వీడని ఎన్ని అనంత రాగాలు.. గొప్ప పాట.. నిజమే , జీవితమా , నీకు ధన్యవాదాలు
రామయ్య గారు, సియా: Thank you so much for sharing your thoughts.This is encouraging to continue these articles.
అనువాదం చాలా బాగా వచ్చింది. మూలాన్ని వెతుక్కొని మరీ చదివాను. మూలం “Gracias a la vida que me ha dado tanto” అంటే “ఇంత ఇచ్చిన జీవితానికి ధన్యవాదాలు”. కానీ అనువాదం లో సరిపోయింది (జీవితానికీ, జీవితమిచ్చిన అన్నిటికీ ధన్యవాదాలు). దీన్ని అనేక గొంతుకలు పాడినాయి (https://musicbrainz.org/work/5ac4f3e3-8838-34a6-9c14-6015e03c5459).
ధన్యవాదాలు.
–
రామారావు కన్నెగంటి