కవిత్వం

తొలి సంధ్య

డిసెంబర్ 2014

మె
కల అవతలి అంచుకి
నన్ను లాక్కెళుతోంది.

“ఇప్పుడే కదా ఎదో ఒక మొదలంటూ అయ్యింది!”, అరిచాను కలవరపడుతూ
అలవాటయిన పరిసరాల్లోకి తిరిగివెళ్ళడానికి ప్రయత్నిస్తూ.

నా చెయ్యి వదిలేసిందామె.
కానీ, ఆమె చిరునవ్వు
కదలనివ్వదు నన్ను ఇసుమంతైనా.

విభ్రమంగా అడిగింది
“అక్కడేముందో నీకు తెలీదూ -
అంతా విరిగిన ఎముకలే”
(నాకు తెలుసు – కానీ, కానీ..
నాకున్నదల్లా అవే!)

ఆమె చిరునవ్వుతో నన్ను చూసింది మళ్ళీ
(ఓహ్! కట్టిపడేసే ఆ మందహాసం!!)

నాలో ఉప్పొంగుతున్న ఆశలకు
అచ్చెరువొందుతూ, మెల మెల్లగా
ఆమెకు నా చేయందించాను.

తామరపూలు నిండిన మడుగువైపు ఎగిరిపొయ్యాం.
(వదిలొచ్చిన కల మా వెనుక వేగంగా కరిగిపోతుంటే
భయంతో వొణికింది మనస్సు)

మడుగులోకి దూకుతూ
అరిచిన ఆమె మాటలు
వినిపించలేదు, కానీ
అప్పుడెప్పుడో ఎక్కడో
అణిచేసిన కలలను మళ్ళీ రేపుతూ
నా అణువణువునూ తడిపేసాయి
మెరుపు తుంపరలు. నా చుట్టూ లేచాయి
వందలకొద్దీ తూనీగలు.

తామరతూళ్ళ నడుమ కనుమరుగవతూ
చివరొక్కసారి అరిచిందామె, ఈసారి స్పస్టంగా
“ఇదిగో! ఇదీ అసలైన ఆరభం!”