డైరీ

ఎటువైపు తడిమినా చల్లగా తగిలే అన్ని రాత్రుల లాంటిదే ఒక రాత్రి..

మే 2016

ర్కశంగా మాకింగ్ బర్డ్ అరుపు. అటొమాటిక్ లైట్ సెన్సిటివ్ గడియారంలోంచి.
లైట్లార్పకుండా కాసేపు సోయి తప్పినందుకు ఖోపం.

అదిరిపడి
ఎక్కడుందో తెలీని గందరగోళంలో ఇక్కడ కాక ఎక్కడికైనా సరే
పారిపోబోయి
బొక్కబోర్లాపడి
భళ్లున పగిలి
పక్కనే, అడ్డదిడ్డంగా పడివున్నది
ఇంకో పద్యం – జస్ట్ లైక్ ఎనీ అదర్ నైట్

చెవిపక్కన తడిచిన జుత్తు. ప్రాణాన్ని నిలిపే ధార. కంటి చివర.

“నువ్వు అందరిలా కాదు. డిఫరెంట్ గా ఆలోచిస్తావు. యు థింక్ ఔట్సైడ్ ద బాక్స్. అందుకే నిన్ను నా ఫ్రెండ్ లిస్ట్లో కలుపుకున్నాను.” దూరంగా, దూ…రం… గా….. విసిరేసుకునే పర్వర్టెడ్ స్నేహాలు.

రెక్కకు బురద అంటిన సీతాకోకను నేను. ప్రేమించగలవా అంతే ఇష్టంతో? ఐ స్టిల్ థింక్ ఔట్సైడ్ ద బాక్స్. ఐ స్టిల్ హావ్ వండర్ఫుల్ థింగ్స్ టు సే. ఏం? మాటసాయం మరీచికా!

ముడుచుకుని. షెల్ – అల్చిప్పలో. ఇక వద్దు. ఒక్క కాంతి రేఖ కూడా.
ఒక్క ఇసుక కణం – ఎట్లాగో సందు చేసుకుని.
ఒక ముత్యం – ఎప్పటికో.
అప్పటిదాకా, ఒక్క గాయం – ఎడతెగకుండా సలుపుతూ
బతకనివ్వదు
చావనివ్వదు
మానిపోదు

సెకన్ల ముళ్లు. గుండెకేసి కాలాన్ని బాదుతోంది.

దిగంతాలకావల చిర్నవ్వు ఈటెతో నా స్వాప్నికుడా! యు ఆర్ అన్ టచబుల్ ఫర్ అవర్ కన్వీనియెన్స్.

వెలివాడతో ఇబ్బందేం లేదు. పిడికిలెత్తనంత కాలం.

ధూళిలో కలిసాకే. చచ్చిసాధిస్తాడా వాడు? వెలికితియ్ నిజాన్ని… వాడి సెన్సిటివిటీని బుగ్గి చేసిన ఇజాన్ని. పుట్టిన క్షణంలోనే చెంప పగలగొట్టినోడి మీద తిరగబడతాడా వాడు?

నరకం అంటే పోలీసు వ్యానొక్కటేనా. సిగరెట్ పొగల మధ్య, పద్యానికి మత్తుగా రక్తం పులుముతున్న బ్లాక్ లేబుల్ విస్కీలున్నాయ్. జాగ్రత్త!

ఎన్నటికీ అందుకోలేం. ఒకరినొకరం.
నీకూ నాకూ మధ్య లేలేత వెలుగు. పారదర్శకమే కానీ కఠినం.
పగలగొట్టలేం. దాటిపోలేం.

పర్సనల్ ఫ్రీడమ్ – అన్నింటికీ. అన్నింటినుంచి.

మరెందుకు ఆ ఏడుపు? ఎందుకు భయాల్, రహస్య తమాషాల్?

నమ్మకము లేక ప్రేమ లేదు. ప్రేమ లేని ఎడల మోహములేదు. ప్రేమ యనగా – అనుక్షణం తపన… బాగుండాలని, బాగుంచాలని.

ఓహ్ ప్లీజ్. గ్రో అప్. టైమ్స్ హావ్ ఛేంజ్డ్. ఇది డైనమిక్ ప్రపంచం గురూ – అఫైర్ కూ రిలేషనిషిప్ కూ, స్వేచ్ఛకూ బాధ్యతారాహిత్యానికీ, గుండెకోతకూ విరహానికీ తేడాల్తెలియని అసలుసిసలు హైక్లాస్ ప్రపంచం. యెస్, యెస్! ఐ యామ్ పార్ట్ ఆఫ్ ఇట్.

ప్రేమ!
ఒక స్నేహం. ఒక పలవరింత. ఒక కౌగిలింత. ఒక ముద్దు. అమూల్యం.
అశాశ్వతం.
అనుమానం. అవమానం.
అప్రేమ!!!!!

ట్రై టు అండర్ స్టాండ్. ఒకసారి ఒకర్నే ప్రేమించాలని రూలేం లేదు. నీతీ-నియమం అన్నాడా చలం? ఎప్పుడు? ఎక్కడ? “స్త్రీ” ఎవరు?

సర్లే…

ఒక్కపేరాలో శ్రీధర్ పెళ్లాం పట్ల నీ బాధ్యత కూడా కడిగేసుకున్నావు. ఆమె ఒక్క కన్నీటి చుక్కా నీ కలంలో సిరాను డైల్యూట్ చెయ్యలేకపోయింది.. పెద్దపిల్ల పెళ్లి చేసి జన్మతరింపజేశావు. ఎవరిది “ఆత్మార్పణం”, చలం???

గొంతులో బాకు దిగిన ఆత్మగౌరవం. అల్లల్లాడిపోతోంది. ఎవరికేం పట్టింది? “మైదానం”లో మనసులు పారేసుకున్నాక.

ప్రేమించినవాడికీ శరీరాన్ని అమ్ముకోలేని సిల్లీ “చుక్కమ్మా”, ఎప్పటికైనా ప్రేమంటే రాజేశ్వరిదేనమ్మా!

“లవ్ యు …”
“ఊ…”
నిట్టూర్పు. సుదీర్ఘంగా.

నెవర్ బిలాంగింగ్ మైన్
యు ఆర్ టు మి
యామై టు యూ?

ఉండీ లేనట్టు
లేకుండానే ఉన్నట్టు
గొంతులో చిక్కుకుని ప్రాణం

“దట్ స్టుపిడ్ హార్ట్ ఈజ్ కండీషండ్. ఇగో తప్ప మరేం లేదు.” సమాధానపరుస్తున్నాననుకుని – మెదడు, ఫట్ ఫట్ మని నరాలు చిట్లిస్తూ, రియాలిటీనీ ముఖాన ఛెళ్లున విసిరుతూ.

మబ్బులు కమ్మినా. వెన్నెల రగిలినా.
చిక్కటి రాత్రిలో తోడు. అటూ ఇటూగా అమరినవి. ఒక కూటమి తరువాత ఒకటి.
వెర్రి నమ్మకం. ఎక్కడికీ పోని చుక్కలని.

ఫేక్ స్టార్స్ ఆన్ ద సీలింగ్!

కనీసం నకిలీ వెలుతురైనా లేదు.
అర్థరాత్రి సియాచిన్ లో ఎర్రని హిమానిపాతం. మణిపూర్ యోనిలో దిగిన బయొనెట్ దేశానికి పహారా కాస్తోంది. పాలెస్తీనా కాదు, ఇంటి ముంగిలి ఇది. పాపాయిల ఏడుపులతో దద్దరిల్లుతోంది కాశ్మీరు లోయ.

గుండెమీద నుంచి దడదడలాడుతూ వెళ్లిపోయిన ఆఖరి రైలు ఆఖరి పెట్టెనుంచి నిన్నందుకోబోయి
జారిపడిన ఒక స్వరం.

కంకర్రాళ్ల మీద దొర్లి, దొర్లి, దొర్లి… దొ…ర్లి… దొ…

నొప్పి. ఇక ఏ నొప్పీ తెలియనంత నొప్పి!

**** (*) ****