కవిత్వం

ఈ రాత్రి!

జూలై 2016

నిజంగా మరణించిన క్షణాల్లో జీవించానిపుడు
ఏదీ పట్టదు నాకు, ఆఖరుకు నువ్వు కూడా!
నవ్వులా నన్ను దాచుకుంటూ మురిసిపోతున్నప్పుడు
సాగిపోతూన్న తీరం వంపున హటాత్తుగా నీకెదురవుతాను

జడలుదులిపి గాలితో అల్లరి చేస్తున్నానేగానీ
పక్కనున్నావన్న ఉనికి కన్నా
రాత్రిలో మనం ఉన్నామన్న అతిశయమే ఎక్కువగా

పాడు నాతో కలిపి, లయతో జతకలుపు
వద్దొద్దు కళ్ళు కలపకు, కలలు అవసరమే లేదు
పదాలను పలుకుతూ వేరువేరుగా ఎపుడైనా కలుద్దాం

కిటికీనే తెరిచాను కానీ ఆకాశాన్నే ఇచ్చావే!
శూన్యంలో ఒంటరిగా తేలాలనుకున్నా
కాళ్ళు నేల వదలవు..ఖర్మపు బతుకు!

ఆత్మను అలవోకగా అలరించినపుడు
వెర్రెక్కించే చల్లగాలికీ, పాటల జోలకీ, స్నేహపు జోడుకీ
ఆనందాన్ని పెనవేసుకున్న చేతులతో
మౌనమైన ఇష్టాన్ని మెత్తగా చెప్పింది…
ఈ రాత్రి!