కవిత్వం

కంట్రోల్ ఆల్ట్ డిలీట్

ఆగస్ట్ 2016

ఖరున అందించిన టీ చేదుగా తగిలింది
కప్పు అడుగున చక్కెర కలవక మిగిలిపోయింది

***

మెట్లవద్ద ఎదురుపడ్డ మొహమాటపు తెర
స్ట్రాటజీల వలసలో సర్రున చిరిగింది
వర్షాకాలపు సాయంత్రాలను సాగనంపుతున్నప్పుడు
చిలిపి మువ్వల రింగ్ టోన్ సవ్వడి మదిని తాకిందా?

ఒక స్నేహం నాది, ఒక అనుభూతి నీది
కరచాలనాల కత్తిరింపులతో
వెక్కిరింతల పట్టు పోగులు అల్లినపుడే
అవును, అక్కడే, అలజడి భూతం పట్టింది
ఏదీ ఇటు నిలబడు, ఈ ఫ్రేమ్ లో సెల్ఫీ దిగి
ఇంకాసేపు సమయాన్ని
డబ్బాల ఆల్బమ్ లో దాచి, తాళం పడేసుకోవాలి

***

గుండెతడి పంచుకున్నాక కళ్లు తడవక మానవు
‘స్పెషల్ సింప్లిసిటీ’ లో ఆక్సిమొరాన్లు వెదకకు
క్షతగాత్రులమేగా, గుర్తించి సరిహద్దులు గీసుకుందాం

కానీ సుడిగాలిలేని తుఫానులో తడబడి నిలబడుతూ
“వద్ద”న్న కొద్దీ కిటికీరెక్కల మధ్య పేరు నలుగుతోందా…
తప్పుకదూ, వేరు జాతి అయినందుకు గాయపరుచుకు తీరాలా?