కవిత్వం

టెంపరరీ ఫైల్స్

సెప్టెంబర్ 2016

“అసలు ఇంతకాలం ఏమైపోయావు?”
కొన్ని మాటలు దాటాక
కథ మళ్లీ మొదలవుతుంది
నువ్వూ, నేనూ చెరో అవతారం ఎత్తుతాం
ఇంకో పోరాటానికి సిద్ధమవుతాం

ఏమైనా ఊహించుకుంటామా!
ముందుగా ఎటు వెళ్ళాలో దారులు వెతుకుతాం
నువ్వు ముందు నేను వెనుక
ఆహాహా కాదు, ఈ విషయంలో నేనే ముందు
చెప్పము కానీ, ఆట గెలిచే వ్యూహాలు
విడివిడిగా ఇద్దరమూ పన్నుతూంటాం

ఇక షో ముగిస్తోందనగా
తెరలు దించడానికి తాళ్లు గట్టిగా పట్టుకుంటాము
మరి ‘లైట్, కెమెరా, యాక్షన్’ మనమే చెప్పామెందుకు?
స్టేజీ మీద అలవోకగా నటించినది కూడా మనమే
సరి, ప్రతీ అంకానికీ ముందే సంభాషణలు రాసుకుని
చాటుగా వీపు వెనుక దాచుకు తిరిగేదీ మనమే

ఇంతాచేసి, చూసిన సినిమాకి ఇంకోసారి వెళ్లినట్లే!
మరో పాత్ర ప్రవేశించే వరకూ వృత్తాలలో సాగుతాం
అరె పిచ్చీ… గొలుసులదేముంది? లంకె తెగగానే జారిపోతాయి
మరి కోపమో? కారణమే మరిచిపోయేంతగా మిగిలిపోతుంది