కరచాలనం

దారి దొరికింది. ప్రయాణం మొదలైంది.

జనవరి 2013

నా కవిత్వం నేను నా పాఠకుడితో జరిపే ఉదాత్త సంభాషణ. జీవితం ప్రసాదించే దు:ఖాన్ని స్వీకరించి, నేను నా పాఠకుడి సమక్షంలో – జీవితాన్ని ప్రేమించటంలోకీ, జీవితం లోలోతుల్లోని విలువల్లోకీ చేసే ప్రయాణం. కఠినమైన శిలలాంటి నిద్రనుండి, పూవులా కోమలమైన మెలకువలోకి నడుస్తూ, పాఠకుని నడవమని మృదువుగా చేయందివ్వటం. అయితే, ఈ కవిత్వం వెనుక ఉన్న జీవితానుభవం ఏమంత అందమైనదీ, ఆసక్తికరమైనదీ కాదనుకొంటాను. ఈ క్షణానకూడా, నేపధ్యమెందుకు, నా కవిత్వం చదివి చూడండని చెప్పాలని బలంగా అనిపిస్తూ వున్నా, పాఠకుడికి కవి నేపధ్యంపై ఉండే సహజమైన ఆసక్తిని కాదనలేక, నా సంక్షిప్త చిత్రాన్ని పరిచయం చేస్తున్నాను.
సాహిత్యం పట్ల ఒకరికి  ఆసక్తి ఎందుకు కలుగుతుంది. బహుశా వెలుపలి జీవితం తన లోలోపలి జీవనాసక్తికి తృప్తి కలిగించనప్పుడు లేదా వెలుపలి జీవితాన్ని తెలుసుకోవడానికి తన శక్తి చాలనప్పుడు ఆ తృప్తికోసం, శక్తి కోసం సాహిత్యంలోకి తొంగిచూస్తామేమో. ఇప్పుడు వెనుతిరిగి చూసుకొంటే, ఇతర కారణాలెలా వున్నా ఇవి రెండూ నన్ను పుస్తకాలవైపు కదిలించి వుంటాయనుకొంటాను. మా నాన్నగారు తను చదువుకొనే రోజులలో సాహిత్యం పట్ల కొద్దిపాటి అభిరుచి కలిగివుండటం మినహా, నాకు సాహిత్య నేపధ్యం కాని, వాతావరణం కాని లేవు. నన్ను సాహిత్యజీవిని చేసిన మరొక కారణం అసాధారణ సున్నితత్వం. నేను జీవించాలని ఆశించే ఉదాత్తమైన, సున్నితమైన ప్రపంచాన్ని పుస్తకాలలోనే వెదుకుకొనేవాడిని.

నేను మొదట పాఠకుడిని. బాల్యంలో చందమామ వంటి పుస్తకాలు నా మొదటి స్నేహితులు. తరువాత జీవితంలో ఆయా వయస్సులలో కలిగే ఉద్వేగస్థితులని బట్టి డిటెక్టివ్, పాపులర్ నవలలు పాఠకుడిగా నా మలి దశ. అయితే అవి నాలోపలి పాఠకుడి ఊహా, ఆలోచనా శక్తులకి తృప్తి కలిగించకపొవటం వలన క్రమంగా సీరియస్ సాహిత్యం నా దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో  మా ఊరి లైబ్రరీలో దొరికిన చాలామంది రచయితలని సీరియల్‌గా చదవటం గుర్తుంది. సీరియల్‌గా అంటే ఉదాహరణకు, విశ్వనాధ సత్యనారాయణను మొదలుపెడితే ఆయన పుస్తకాలన్నీ దొరికిన మేరకు వరుసపెట్టి చదివేయటం. ఈ అలవాటు చాలాకాలం అలానే వుండేది. ఆ రోజుల్లో గుర్తున్నంతవరకూ, శరత్, ప్రేంచంద్ మొదలైన చాలామంది రచనలు చదువుకొన్నాను.
నేను ప్రధానంగా నవలాసాహిత్యాన్ని ఇష్టపడేవాడిని. కానీ, ఇంటర్ చదువుతున్నపుడు, కొన్ని భావాలో, ఆలోచనలో తోసుకువస్తుంటే కవిత్వం రాయటం ద్వారా కవిత్వంతో నా అనుబంధం మొదలైంది. స్వభావరీత్యా చొరవ తక్కువ మనిషిని కావటం వలన, మనుషుల్లొకీ, సందర్భాలలోకీ చొచ్చుకుపోయే తత్వం లేకపోవటం వలన కూడా బహుశా నా అనుభూతుల్ని కవిత్వంలోకి అనువదించుకోవటం మొదలుపెట్టివుంటాను.

అప్పటి లెక్చరర్లు నాకవిత్వాన్ని ఇష్టపడి, నువ్వు కవిత్వం చదువు, అప్పుడు మరింత బాగా రాయగలుగుతావు అన్నపుడు మొదటిసారి మహాప్రస్థానం చదివాను. అది చదివాను అనటం కన్నా బట్టీ పట్టాను అనటం సరైనదనుకొంటాను. శ్రీశ్రీ శబ్దశక్తి, ఊహావరణాల్ని కదిలించే భావజాలం చాలాకాలం ఉత్తేజం కలిగించాయి. ఏపని చేసినా దానిలో లీనమైపోయే స్వభావం వలన, శ్రీశ్రీని చదివిన రోజుల్లో అదే వేగంతో చదివిన కమ్యూనిష్టు సాహిత్యమూ, తాపీ ధర్మారావూ, గురజాడా, రాహుల్ సాంకృత్యాయన్ వగైరాల ప్రభావంతో సమసమాజం రావాలనీ, ఒక్కొక్కసారి  ఉద్యమంలో కలిసిపోవాలనీ కూడా అనిపించేది.

శ్రీశ్రీని పరిచయం చేస్తూ, తనని పరిచయం చేసుకొన్న చలం రాసిన వ్యాసాలు సమాజంలోని అనేక చీకట్ల మీద తీవ్ర ధిక్కార స్వభావాన్ని నింపేవి. అయితే లోలోపల ఒక వెలితి సదా వెంటాడుతూ ఉండేది. ఆ వెలితి నాలోని ఉద్వేగాలకన్నా, అభిప్రాయలకన్నా ఇంకా చాలా లోతున ఉన్నది. దానిని అర్థం చేసుకొనే దారి కోసం వెదుకుతూ జిడ్డు కృష్ణమూర్తిని చదివినప్పుడు, ఈయన నాకు కావలసిన ముఖ్యమైన విషయమేదో చెబుతున్నారని అనిపించేది. అయితే నేను కేవలం తెలుగు మీడియం విద్యార్థిని కావటం వలన, నా చుట్టూ నన్ను నడిపించే ఎలాంటి ఆసరా లేకపోవటం వలన, అప్పటికి కృష్ణమూర్తివి తెలుగులో వచ్చిన ఒకటి రెండు పుస్తకాలు మినహా మరేవీ చదివే అవకాశం రాలేదు.

ఈ ఉపరితల ఉద్వేగాల నుండి మరింత లోతుకి వెళుతున్నపుడు, క్రమంగా ఇతర రచయితలకంటే చలం అత్యంత సన్నిహితుడిగా కనిపించేవారు. ముఖ్యం ఆయన నిజాయితీ, సున్నితమైన సంవేదనలు, లోతైన ఆలోచనలు, అంతంలేని సత్యాన్వేషణ ఇవన్నీ నన్ను పూర్తిగా ఆవరించేవి. చిన్నపుడు ఒక కథకుడిగా పరిచయమైన టాగోర్, చలం వలన మళ్ళీ కవిగా పరిచయమయ్యారు. చలం అనువదించిన టాగోర్ కవిత్వం చదువుకోవటం నాలోని ఉపరితల ఉద్వేగాలనుండి శాంతి వైపుగా, సత్యాన్వేషణ వైపుగా నడిచేలా చేసింది.

కొన్ని సందిగ్ధతలు, కొన్ని సమాధానాలు, వెంటాడుతున్న లోలోపలి వెలితి. ఈ దశలో, బలీయమైన హేతుదృక్పధం వలన, సాంప్రదాయిక ఆధ్యాత్మిక విశ్వాసాలూ, పద్ధతులూ అంతగా ఆకర్షించకపోవటం వలన నిజంగా నాకు సమాధానం దొరికేదెక్కడ అనుకొంటూ వుండగా, మళ్ళీ చలమే రాసిన, భగవాన్ స్మృతులు, వెలుగురవ్వలు అనే రెండు పుస్తకాలని సమీపించాను. మొదటిది చలం శ్రీ రమణమహర్షి గురించి ఆయన భక్తుల నుండి సేకరించిన అనుభవాలు. రెండవది, ముఖ్యంగా జెన్, భారతీయ మిస్టిక్స్ జీవితాలలోని సంఘటనలను చెప్పే కథానికలు. ఈ రెండు పుస్తకాలలో అత్యంత సరళమైన, ప్రేమాస్పదమైన జీవితాన్ని చూసినప్పుడు, అవి సత్యాన్ని గొప్ప సిద్ధాంతచర్చలనుండి, మత విశ్వాసాలనుండి విముక్తం చేసి కరతలామలకంగా చూపినపుడు వీటి గురించి కదా ఇన్నాళ్ళూ వెదుకుకొన్నాను అనిపించింది. శ్రీ రమణమహర్షి, జెన్ సాధువులు పరిచయమైన ఆ రోజులు సాహిత్యాన్ని ఆశ్రయించి బ్రతికిన నాకు, సాహిత్యం ఇచ్చిన గొప్ప కానుకలుగా ఈనాటికీ అనిపిస్తూ వుంటుంది.

దారి దొరికింది. ప్రయాణం మొదలైంది. సత్యాన్వేషణ వెలుపలి జీవితాన్ని మరింత దుర్భరం చేసింది. ఆ సత్యమేదో తెలియాలి. అది మినహా, మిగతావన్నీ ఏమంత విలువలేనివి. ఆ క్రమంలో నేనెక్కడున్నానో, సత్యమెక్కడవుందో, మధ్యలో ఈ దు:ఖమేమిటో అర్థం చేసుకొంటూనే ఇంకా నడుస్తూవున్నాను. నిజానికి అక్కడితో నా సాహిత్య ప్రయాణం పాఠకుడిగా చివరికి వచ్చి, కవిగా ప్రారంభమయింది. చలం చెప్పినట్టు నాకూ, ప్రపంచానికీ మధ్య బహిరంతర యుద్ధారావం మొదలైంది. తరువాత కూడా సాహిత్యం చదువుకొన్నా బాగా ఎంపిక చేసిన రచనలు మాత్రమే చదివేవాడిని. క్రమంగా సాహిత్యం వెనుకపడి, సత్యాన్వేషణకు సహాయం చేసే రచనలు చదవటం ప్రధానమయింది. ఇదంతా నా ఇరవైలలోని ప్రయాణం.

అప్పుడు, నాలోపలి ప్రయాణాన్ని రికార్డు చెయ్యాలని శ్రీ భగవాన్ని   ఉద్దేశించి రాసిన కవితలూ, ఇతర భావాల నుండి ఎంపిక చేసిన వాటితో ఆరాధన సంపుటి ప్రచురించాను. తరువాత జీవన స్థితిగతుల వలన, ఆరాధన సాహిత్యలోకాన్ని చేరకపోవటం వలన చాలాకాలం ఏమీ రాయలేదు. ఆ సమయంలో ఇస్మాయిల్ గారు పరిచయం కావటం తో, ఒక సందర్భంలో నేను రాసిన హైకూలని ఆయనకు చూపించటం, ఈ ప్రక్రియ నాకు తగినదిలా అనిపించి, వరుసగా మూడు హైకూ సంపుటులు ముద్రించటం జరిగింది. ఆ రోజుల్లోనే కొప్పర్తిగారు తణుకు బదిలీ అయి రావటం వలన, ఆయన ఆసరా కవిగా నన్ను నేను అంచనా వేసుకోవటానికీ, సరిదిద్దుకోవటానికీ ఉపకరించింది. మొదటి హైకూసంపుటి నాటికి నాకు హైకూ గురించి అంతగా తెలియదు. అప్పటికే ఉన్న తాత్వికనేపధ్యం వలన  హైకూ ఒక నిశ్శబ్దానుభవాన్నివ్వాలని మాత్రం అనిపించింది. తరువాత అలంకారరహితంగా, ఆలోచనారహితంగా నిర్మలమైన హైకూ అనుభూతిని ఇవ్వటం కోసం సాధన చేస్తూ మూడవసంపుటి నాటికి దానిని సంపూర్ణంగా సాధించగలిగానని అనిపించింది.

కానీ, ఎప్పటికప్పుడు నిరుత్సాహం కమ్ముకొంటూనే వుండేది. గొప్పకీర్తి రావాలనీ, పురస్కారాలు రావాలనీ ఏనాడూ ప్రబలంగా కోరుకోలేదు. అవి రానందుకు బాధపడలేదు. కానీ, ఇది గొప్ప కవిత్వం అని గ్రహించినవాళ్ళు కూడా దానిని పదిమందికీ చేర్చేందుకు తమకు చాతనయిన ప్రయత్నం చేయకపోవటం, ఫలితంగా ఇలాంటి సాహిత్యానికి ఎదురుచూసే పాఠకులకి ఇలాంటి కవిత్వం ఒకటి వుందని కూడా తెలియకపోవటం మాత్రం తరచూ బాధ కలిగించేవి. అదే నిరుత్సాహంతోనూ, వెలుపలి జీవితంలో ఉండే సహజమైన వత్తిడులతోనూ మళ్ళీ కవిత్వానికి దూరమయ్యాను. మధ్యలో, హైకూలు రాస్తున్నపుడు రాసిన వచన కవితలతో 2004లో నేనే ఈ క్షణం ముద్రించటం మినహా, పది సంవత్సరాలు కవిత్వరచనను విడిచిపెట్టాను.

మళ్ళీ క్రితం సంవత్సరం, 2011లో, సాహిత్యమిత్రుల పలకరింపులతో పాటు, నేను మాట్లాడితీరవలసిన విషయాలున్నాయని నాకు కూడా గట్టిగా అనిపిస్తూ వుండటంతో, ఒకటిరెండు కవితలతో నెమ్మదిగా మొదలై సుమారు నాలుగు నెలలలో ఒక ఉధృతిలో వందకుపైగా కవితలు రాసాను. వాటిని కొంత ఎడిట్ చేసి, పదేళ్ళలో అప్పుడపుడు రాసిన కొన్ని కవితలు చేర్చి ఆకాశం సంపుటి ముద్రించాను. సాహిత్యప్రపంచం నుండి యధాప్రకారం ఉదాసీన ప్రతిస్పందన. సాహిత్యాన్ని ఉద్దరిస్తున్నామని చెప్పేవారు తెలుగునాట జరుపుతున్న సాహిత్యవిలువల పతనాన్ని ఇరవైయేళ్ళకుపైగా చూస్తున్నవాడిని గనుక, ఇదేమంత ఆశ్చర్యం కలిగించలేదు. కాని, పాఠకులలో మానవవిలువలు వికసించేందుకు ఉపకరించని, వారు తమ  జీవితాన్ని మరింత ప్రేమించేలా చేయని సాహిత్యం వారికి దూరమవుతుందని మన సాహిత్యవేత్తలు చాలామంది గ్రహించకపోవటం మాత్రం విచారాన్ని కలిగిస్తుంది.

ఇన్నాళ్ళకి రెండుమూడు అవార్డులు వచ్చి ప్రసాద్ కవిత్వాన్ని చదవమని పాఠకులకి రెకమెండ్ చేస్తున్నందుకు ఒక విషాదభరితమైన సంతోషంతో ఇప్పుడు ఈ మాటలన్నీ మీతో పంచుకొంటున్నాను. అయితే అవార్డులూ, కీర్తీ రావటంకన్నా నా అక్షరాలు, నేను ఆశించినట్టు, పాఠకుల హృదయాలను నిర్మలమైన కన్నీటితో, గాఢమైన శాంతితో, మెలకువలాంటి మౌనంతో నింపాయని తెలిసినపుడల్లా మాత్రం నా కవిత్వసాధన వృధాకాలేదని సంతోషం కలుగుతూ వుంది. ఆకాశం వలన ఇలాంటి అరుదైన స్పందనలని ఇటీవల చాలామంది పాఠకులనుండి వింటూవున్నాను.