ఈ శీతాకాలపు ఉదయం. రాత్రంతా మంచుముక్కలా బిగుసుకొన్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండితెరల కాంతిలోంచి జారుకొంటూ గడ్డిపరకలపై కన్నుతెరిచాయి. ఇక చాలనుకొంటూ కాంతిబాజా మ్రోగిస్తూ కనిపించనిచోటికి నిన్ను పిలుస్తూ మాయమయ్యాయి. ఈ ఉదయం తొడుక్కొన్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్తసంతకాలు చేస్తున్నాయి. మనుషులు సరే. ఎప్పట్లానే ప్రాణాన్ని పట్టుకోమంటే దేహాన్ని తాకుతూ, ఇంత బంగారుకాంతికీ రవంతైనా కరగని ఇనుపస్పందనలతో, మోసపోయామని తుప్పుపట్టిన పాటనే మ్రోగిస్తుంటారు. నువ్వూ అంతే. ఓ గాలితెర అన్నీ వదలి రమ్మన్నా వినకుండా, భాష వృధా అనుకొంటూనే, దానికి తొడిగిన లిపిని విప్పుతూ, మడతలు పెడుతూ నీదికాని ఆట మళ్ళీ మొదలుపెడతావు.
మళ్ళీ ఒక విరామం. దాన్లోకి బట్టల్లేకుండా దూకాలని తెలిసికూడా, జ్ఞానంతో మసకబారిన కళ్ళనైనా తుడుచుకోకుండా మునుగుతావు. రంగుల్లేని విరామం నీ రంగుల్ని ఒప్పుకోదు. నిన్ను ఒప్పుకోని విరామాన్ని నువ్వూ ఒప్పుకోవు. నీకింకా చాత కాలేదు, నదిలోకి నీ నీడని విడిచి దూకటమెలానో. మరోసారెపుడైనా ప్రయత్నించు నీడలేకుండా నడవటానికి. నువ్వు బాధకాదు, నీ నీడ బాధ. నీకు తెలియకపోయినా పోయేదిలేదు. నీ నీడకి తెలిసీ ఉపయోగం లేదు.
తెలీదు. మళ్ళీ విరామమో, కాదో. ఇప్పటికి చాలు. అలా వీధిలోకి వెళ్ళి, తెల్లని ఎండలో సంచరించే రంగురంగుల చీకట్ల ధూళి చల్లుకురావాలి. మరి బ్రతకాలి అందర్లో ఒకడిలా. అందర్లానే అయిష్టంగానో, ఇష్టంగానో అర్థంకాకుండానే.
ఏ దైవమో విడిచిన బాణంలా ముందుకు దూసుకుపోతుంది కాలం. ముందు వెనుకలుగా మార్చుకొంటున్న వాక్యాల్లోంచి కూడా కాలం ముందుకు వెళ్ళిపోతుంది. చూసినవేవీ గుర్తుండవు. గుర్తుండేలా చూడాల్సినవీ లేవు. స్మృతి కన్నా మరపు సుఖం. రాసిన రాతల కన్నా వెనుకనున్న తెల్లకాగితం ఎక్కువ చెబుతుంది. చూసినవి మరిచిపోవద్దు, చూసేవాడిని మర్చిపోతే చాలు. పదాల నెందుకూ, వాటిలో నింపిన అర్థాల నెందుకూ, మరిచిపోతే చాలు మాట్లాడేవాడిని.
ఆకాశపు నగారా అదేపనిగా మ్రోగిస్తో చెబుతోంది జీవితం. నీ అంతట నువ్వు బ్రతకనపుడు, బ్రతుకు నిన్ను బ్రతికించుకొంటుంది. ఎందుకూ బ్రతకాలనుకోవటం, చావాలనుకోవటం. పుట్టి, పోవుటలు నాటకము, నట్టనడిమి ఈ చూపొక్కటి నిజము. ఇటునించి అటు వెళ్లినపుడు అశ్వత్థవృక్షం అర్థమవుతుంది.
మరి వెళ్ళిరానా అన్నావు ఆరోజు. ఆ మాట కోసమే ఎదురుచూస్తుందన్న నిజాన్ని మర్యాదగా బయటికి రానివ్వకుండా, సరే మరి అంది. భూమ్మీద వేల జీర్ణపత్రాలు రాల్చినవాడివి, సరే లోలోపల అప్పటికే మూసుకొన్న తలుపుల్ని గుర్తుపట్టి కూడా ఏమీ తెలియనంత ప్రశాంతంగా బయటికి నడిచావు. నీడల లిపి తెలుసు గనుక ప్రేమ నుండి లభించిన స్వేచ్ఛని ఇట్టే పోల్చుకొన్నావు. ఇంటి క్రీనీడలో ఆమె నీడ చిక్కగా కరిగిపోయింది. ఆమె హృదయంలోంచి బయటకు వచ్చాక ఆకాశం మరింత నిర్మలంగా కనిపించింది.
ఇంత దు:ఖం ఎలా మోయనంటావు బరువు కనబడనీయని తేలికైన మాటల్లోకి తడుముకొంటూ. మోసేవాణ్ణి దించేస్తే, జీవితం మోసుకొంటుంది, నీకేం పని అని ఆ జెన్ సాధువు. అతను లేకపోతే నా జీవితం బోసిపోతుంది మరి అంటావు. అదీ సంగతి అని నవ్వుతూ నువ్వొదలని మాటల్నీ, నీడల్నీ నీకు విడిచి నిర్లక్ష్యాన్ని భుజాని కెత్తుకొని నీటిమీద నడుస్తూ వెళ్ళిపోతాడు. బరువుగా ఉండటమే బ్రతకటమని నమ్ముతాం గనుక, తేలికైన జీవితం తెలియకుండానే వ్రేళ్ళ సందుల్లోంచి జారిపోతుంది.
. . .
కాలం మరికొంత వెన్నలానో, వెన్నెల్లానో, కొవ్వులానో కరిగాక నువ్వూ, నేనూ, నిందలూ ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోదాం. కాలం లేనిచోట నిలిచే విద్య తెలియలేదు గనుక, మరోసారెపుడైనా మళ్ళీ కలుద్దాం కొత్త పాతమొహాలతో. అప్పటి శీతాకాలపు ఉదయంలోంచి కూడా దేవుడేం చెప్పేదీ వినబడకుండా శబ్దాలతో మనని వెచ్చగా కప్పుకొందాం, అచ్చం ఇలానే. ఇంతకు ముందులానే.
**** (*) ****
“ఏ దైవమో విడిచిన బాణంలా ముందుకు దూసుకుపోతుంది కాలం. ముందు వెనుకలుగా మార్చుకొంటున్న వాక్యాల్లోంచి కూడా కాలం ముందుకు వెళ్ళిపోతుంది. చూసినవేవీ గుర్తుండవు. గుర్తుండేలా చూడాల్సినవీ లేవు. స్మృతి కన్నా మరపు సుఖం. రాసిన రాతల కన్నా వెనుకనున్న తెల్లకాగితం ఎక్కువ చెబుతుంది. చూసినవి మరిచిపోవద్దు, చూసేవాడిని మర్చిపోతే చాలు. పదాల నెందుకూ, వాటిలో నింపిన అర్థాల నెందుకూ, మరిచిపోతే చాలు మాట్లాడేవాడిని.”
చాలా బాగుంది ప్రసాద్ గారూ! మూడు సార్లు చదివాను మొత్తం, ప్రతీసారీ కొత్తగా అందగిస్తూనే ఉంది!
చాలా బాగా వ్రాసారు ప్రసాద్ గారు. ఆద్యంతం అమోఘం
. ఓ గాలితెర అన్నీ వదలి రమ్మన్నా వినకుండా, భాష వృధా అనుకొంటూనే, దానికి తొడిగిన లిపిని విప్పుతూ, మడతలు పెడుతూ నీదికాని ఆట మళ్ళీమొదలుపెడతావు.బరువుగా ఉండటమే బ్రతకటమని నమ్ముతాం గనుకఆకాశపు నగారా అదేపనిగా మ్రోగిస్తో చెబుతోంది జీవితం. జీవితం తెలియకుండానే వ్రేళ్ళ సందుల్లోంచి జారిపోతుంది. .చాలా బాగుంది ప్రసాద్ గారూ!
“బరువుగా ఉండటమే బ్రతకటమని నమ్ముతున్నాం కనుక తెలియకుండానే తేలికైన జీవితమంతా వేళ్ళ సందుల్లోంచి జారిపోవడం ”
“కాలం..వెన్నలనో, వెన్నెల్లనో ……….కరిగిపోయాక నువ్వు ,నేను , నిందలు..ఎవరి దారిన వారెళ్ళి పోతాం..”
జెన్ సాధువు..,
బంగారు కాంతికి కరగని ఇనుప స్పందనలు ,మోసపోయామని పడుకునే తుప్పు పాట
చదివిన కొద్ది…. నిజ జీవితమే కనపడి, ఇలాగా? బతికేస్తున్నానని ..దిగులు లాటి భావన .
చదివిన తర్వాత నా మనోగతమిది.
నాకు నచ్చింది.