కవిత్వం

సాయంత్రపు నడక

సెప్టెంబర్ 2014


నువ్వు నడవక తప్పదని వైద్యులు చెప్పినపుడు
రోజువారీ పనుల్నీ అటూఇటూ సర్ది
ఖాళీ సాయంత్రాలని సృష్టించడం కష్టంగా తోచింది కానీ,
రోగాలూ మేలుచేస్తాయని నడక మొదలయ్యాక తెలిసింది

కాలేజీస్థలంలోని వలయాకారపు నడకదారిలోకి
గడియారమ్ముల్లులా చొరబడినప్పుడు
విస్మృత ప్రపంచమొకటి నీ వెలుపలా, లోపలా కన్ను తెరుస్తుంది

చుట్టూ మూగిన చిక్కటి చెట్లు
వేల ఆకుపచ్చని ఛాయల్ని
వెలుగుకీ, చీకటికీ మధ్య మెట్లుకట్టి చూపిస్తాయి

అడుగుకొక రూపం దాల్చుతూ చెట్లు
రహస్యసంజ్ఞలతో పిలిచే అదృశ్యలోకాల్లోకి
ఆశ్చర్యంగా దారితప్పుతావు కాసేపు

లోపల ముసురుకొన్న చిక్కుల్లోంచి
అకాశాపు మైదానంలో ఆడుకొనే పిల్లగాలుల్లోకీ
సాయంత్రపు కిరణాల జారుడుబల్లల మీదికీ వాలిపోతావు

దారినీ, మనస్సునీ ఇరుకుచేసే సహపాదచారుల సంభాషణల్లోంచి
విశాలత్వంలోకి ఎగిరేందుకు చూపుని ఆకాశం వైపు మళ్ళిస్తావా
‘వచ్చావా’ అంటుంది ఆకాశం

‘నీ అనారోగ్యం పంపిస్తే నువు ఇక్కడికి రాలేదు,
నేను రప్పించుకొంటే వచ్చా’ వన్నట్లు నిర్మలంగా నవ్వుతుంది

అనాది ఆకాశం క్రింద అనాది హృదయ స్పందన ఒకటి
మౌనంగా ప్రేమ వృత్తాలు చుడుతుండగా
చిక్కబడుతున్న చీకటిలోపల నీడలూ, చెట్లూ, నువ్వూ
నిశ్శబ్దంలో ప్రవేశించే చివరి శబ్దాలలా కరిగిపోతారు