పగలంతా కాలం నదిలో
దృశ్యాలు, ముఖాలు, ఉద్వేగవలయాలు ప్రవహించిపోతాయి
నది ఒడ్డున చెట్టులా నిలిచి
నదిమీద వల విసిరినట్టు నా చూపుల్ని విసిరి జీవనసారాన్ని సేకరించుకొంటాను.
సాయంత్రమవుతుంది
నా రోజులపత్రాలు సాయంత్రంలాగే రంగులుమారి చీకటిలో రాలిపోతాయి
మరొకరోజుని రాల్చుకొన్న చెట్టునయి
చీకటితో నల్లబడిన కాలం నదిలో నా ప్రతిబింబం జాడ వెదకబోతాను
చెట్టూ, నదీ, ప్రతిబింబమూ, చీకటీ ఒకటే దిగుల్లోకి తమని కోల్పోతాయి
తమ స్వభావాల్ని మరిచి
తన ప్రతిబింబాలలోకి నది తానే ప్రవహిస్తుంది
చెట్టు ప్రతిబింబం చెట్టులోకి ప్రవహిస్తుంది
సమస్తాన్నీ దాచవలసిన చీకటి సమస్తంలో దాగొంటుంది
జీవితం పసిపాప ఇవాళ్టి పగటిబొమ్మని పట్టుకొని
‘ఇది కూడా నే కలగన్న బొమ్మకా’దని శూన్యంలోకి విసిరేసి
చిరంతన శాంతిలో కొత్తబొమ్మని కలగంటుంది
“నా రోజులపత్రాలు సాయంత్రంలాగే రంగులుమారి చీకటిలో రాలిపోతాయి”
చాలా బావుంది.
చాలా బాగుందండి,.3 వ స్టాంజా వివరిస్తారా,.చివరి వాక్యాలు గొప్పగా వున్నాయ్,.
బాగుంది సర్……
చాలా మంచి కవిత, బీవీవీ
మీరు తాత్వికతని అనుభూతిలోకీ తక్షణ ఉద్వేగాల్లోకీ మార్చే భాష బాగుంటుంది.
ముఖ్యంగా ఈ పంక్తులు:
“సాయంత్రమవుతుంది
నా రోజులపత్రాలు సాయంత్రంలాగే రంగులుమారి చీకటిలో రాలిపోతాయి”
దృశ్యం ఎంత నశ్వరమో స్పురించినపుడు కలిగే సాంద్రమైన దిగులుని మూడవ స్టాంజా అనుభవంలోకి తెస్తుందనుకొన్నాను భాస్కర్ గారూ.
నా కవిత్వాన్ని ఆలోచన చేసే చోటునుండి గాక, అనుభూతి పొందే స్థలం నుండి చదువుకోవాలనుకొంటాను తరచూ. ‘మీ కవిత్వం అర్థం చేసుకొంటున్నాను’ అని ఎవరైనా అంటే విచారం కలుగుతుంది. నా కవిత్వం పనిచేసేది అర్థాలకన్నా లోతైనచోట.. ఎక్కడ భయసుఖదు:ఖాది స్పందనలు తొలిసారి చలిస్తాయో అక్కడ అని నా అభిప్రాయం. అంటే మేధతో కాకుండా, హృదయంతో నా పదాల్ని తాకినపుడు అవి లోతైన దిగులునో, శాంతినో కలిగిస్తాయి అని.
అఫ్సర్ గారూ, నా అభిప్రాయం సరిగానే ఉండనిపించింది మీ స్పందన చదివాక.
అఫ్సర్ గారికీ, భాస్కర్ గారికీ, సుబ్రహ్మణ్యం గారికీ, విజయ్ కుమార్ గారికీ ధన్యవాదాలు.