వ్యాసాలు

ఆదిలో ఒక పద్య పాదం

నవంబర్ 2017

నా అభిమాన విషయం వచన కవిత్వమే గాని, ఈ వ్యాసంలో పద్య కవిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు ముచ్చటిస్తాను. తొంభైల్లో అనుకుంటా ఒకసారి పద్యం విషయంలో వచన కవులకి, పద్య కవులకి మధ్య వివాదం నడిచిన సందర్భంలో. చేకూరి రామారావు గారు ఇద్దరికీ సర్దిచెప్పబోయి, ఇరువర్గాల ఆగ్రహానికీ గురయ్యారు. అప్పుడు మిత్రులాయనకి సరదాగా “ఉభయ కవి శత్రువు” అనే బిరుదు నిచ్చారు. అందువల్ల, అటువంటి ప్రయత్నమేదీ ఇక్కడ చెయ్యటం లేదు. వచన కవుల దృష్ట్యా పద్య కవిత్వాన్ని వివరించటం, ఛందోబద్ధమైన పద్య రచనాభ్యాసం, ఆసక్తి వచన కవులకెలా ఉపయోగపడుతుందనే విషయం పరిశీంచటం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.

ఏ విద్యయినా మొదట్లో కొన్ని నియమ నిబంధనలకి లోబడి నేర్చుకోవటం కద్దు. సంగీతం నేర్చుకునేవాళ్లు స్వర స్థానాలు సరిగ్గా పలికేట్లుగా గొంతును నియంత్రిస్తారు. పెయింటింగు నేర్చుకోవటానికి రేఖా చిత్రాలలో గీతలు దాటకుండా రంగును వెయ్యటం సాధన చేస్తారు. కవిత్వ రచనలో ఛందస్సు ఇటువంటి ప్రయోజనాన్నే నెరవేరుస్తుంది. ఈ సందర్భంలో “Learn the rules like a pro so you can break them like an artist” అని పికాసో చెప్పిన మాటలు గుర్తుచేసుకోవాలి. ఛందస్సుల సర్ప పరిష్వంగమన్నది పెద్దమాట గాని, ఛందో బందోబస్తులు తెంచాలంటే ముందు అవేమిటో తెలుసుకోవాలి గదా!

పద్య రచన వల్ల పదాల పొందిక ఎలా ఉంటుందో, ఒక చట్రంలో అవెంత తేలికగా ఒదుగుతాయో తెలుస్తుంది. భాషలో, వాక్య నిర్మాణంలో సహజంగా ఉన్న లయ, పొందిక అవగతమౌతాయి. ఉదాహరణకి “సామవేదము జానకి రామశర్మ” అనే పేరు, ఏ మార్పులూ లేకుండా ఒక గీత పద్యపాదంగా సరిపోతుంది. అలాగే, “లావు కారప్పూస పావు కేజి” అన్నది పూర్తి పాదం కాకపోయినా, సీస పద్యంలో అరపాదంగా సరిపోతుంది. ఈ ఉదాహరణలు పద్యంలో ప్రత్యేకత ఏమీ లేదని దానిని ఎగతాళి చెయ్యటానికి కూడా ఉపయోగించవచ్చు. కాని, అదే సమయంలో మరో కోణం నుంచి చూస్తే, వాక్యంలో సహజమైన నడకని, లయని ఛందస్సు ఎంత బాగా పట్టుకొని, తనలో ఇముడ్చుకొందో అని మనకు ఆశ్చర్యంకలుగుతుంది.

పద్యంలోని యతి ప్రాసల వల్ల అక్షర మైత్రి మీద పాధమిక అవగాహన ఏర్పడుతుంది. కవన్నవాడు మనిషికి మనిషికి మధ్య, మనిషికి ప్రకృతికి మధ్య ఉండే స్నేహాన్ని అర్థం చేసుకోవాలంటే అంతకంటే ముందు అక్షరానికి, అక్షరానికి మధ్య స్నేహం గురించి తెలుసుకోవటం ముఖ్యం. నిత్య జీవితంలో జరిగే సంభాషణల్లో, మనం ఉపయోగించే సామెతల్లో, అనేక చోట్ల వాక్యం రెండు భాగాలుగా విడివడటం, అక్కడ అక్షర మైత్రి ఉన్న పదం రావటం మనం గమనించవచ్చు.(ఊరంతా ఒకదారైతే, ఉలిపికట్టె దొకదారి.. వంటివి.) దీనినిబట్టి అక్షర మైత్రి తెలుగు భాషకు సహజమైన ఆభరణమని భావించాలి. కవిత్వం రాయాలనుకునే వారికి తాము రాసే భాషకున్న సహజ లక్షణాల గురించి అవగాహన ఉండటం ఎంతైనా అవసరం.

ఛందస్సులో పాటించే గణాలు, యతి ప్రాసల పరిమితుల వల్ల, అందుకనుగుణంగా పదాలు కూర్చాలి కాబట్టి, పదాల ఎంపిక, పదాన్వేషణ అలవాటౌతాయి. దీనివల్ల కవికి పదాల మీద అధికారమే కాదు, మమకారం కూడా ఏర్పడుతుంది. కవికి పదాల మీద ప్రేమ ఉండాలి. ప్రతి పదానికీ రంగు,రుచి,వాసన ఉంటాయన్న స్పృహ ఏర్పడాలి. ఒక ప్రసిద్ధ అమెరికన్ నవలాకారుడు తను రాస్తుంటే, డిక్ష్నరీలు, థెసారేస్ లు వెనక నుంచి ఎలుగెత్తి పిలుస్తూ ఉంటాయని అంటాడు. బాష మీద, పదాల మీద అటువంటి మోహం కొందరు కవులు, రచయితల కుంటుంది. ఐతే, భాషలో, పదాలలో నిరాడంబరత పాటిస్తూ గొప్ప కవిత్వం రాసినవారు లేరా అంటే, తప్పకుండా ఉన్నారు. అది కవిత్వ రచన విషయంలో వారి వారి దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. దానిని గాంధీ గారు కొల్లాయి కట్టటం, రమణ భగవాన్ గోచీతోనే గడపటం మొదలైన వాటితో పోల్చవచ్చు. కవితకు భాష ఆహార్యం వంటిది. మనకు తగిన ఆహార్యం మనం ధరించినట్టే, తన కవితకు సరిపోయే భాషను కవి ఎన్నుకుంటాడు. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. గాంధీగారు గాని, రమణ భగవాన్ గాని వస్త్రధారణలో పాటించిన నిరాడంబరత స్తోమతుకు సంబంధించినది కాదు. అలాగే, కవి నిరాడంబరత పాటించినా, అది పద సంపద లేకపోవటంవల్ల ఏర్పడినదై ఉంటే శోభించదు. తను నేర్చిన పదాలు వాడినా, వాడక పోయినా, ఆ పద సంపద కూర్చుకోవటానికి చేసిన కృషి ఏదో ఒక విధంగా ఆ కవి కవితాశక్తిని పెంపొందించటానికి ఉపయోగపడుతుంది.

పద్య రచనలో మరొక ఉపయోగం పదాల పరిమితి. ఒక పద్యంలో ఇచ్చిన గణాలలో, నాలుగు పాదాలలో చెప్పదలుచుకొన్న భావం పూర్తి కావాలి. వచన కవిత్వం రాయాలనుకున్నవారు కూడా తమకు అపరిమితమైన స్థలం ఉందని భావించరాదు. కవిత అన్నది గుడి వంటిది.. ఇంకా చెప్పాలంటే గర్భగుడి వంటిది. అందులో ప్రతి అంగుళం విలువైనది, పవిత్రమైనది. మంచి కవిత్వం రాయాలనుకునే కవికి తను రాసే కవిత మీద ఇటువంటి గౌరవం ఉండటం ఎంతో అవసరం.

నిబంధనల గురించి చర్చించేటప్పుడు, ఒకవేళ నిబంధన లెక్కువైపోతే ఏమవుతుందనే విషయం కూడా మాట్లాడాలి. ఏవిద్య లోనైనా నిబంధనలెక్కువైతే ఆ విద్య వినోదంగా మారిపోతుంది. కవిత్వంలో అష్టావధానాలు, శతావధానాలు మొదలైనవి ఇటువంటివే. ఒక విధంగా చెప్పాలంటే, వచన కవిత్వం ఏ దారీ తెలియని అడవిలోనో, ఎడారిలోనో మన దారి మనమే వెతుక్కుంటూ, మన రూల్సు మనమే రూపొందించుకొంటూ నడవటం లాంటిది. పద్య కవిత్వం చక్కని రహదారిలో అన్ని ట్రాఫిక్ నిబంధనలూ పాటిస్తూ నడవటం లాంటిది. ఇకపోతే, అష్టావధానాలు, శతావధానాలవంటివి సర్కస్ లో తీగ మీద నడవటంతో సమానం. ఇవి చాలా ప్రత్యేకమైన నైపుణ్యానికి సంబంధించినవి కాబట్ట్టి, ఇతర కవులు వాటి గురించి అంతగా చింతించవలసిన పనిలేదు. ఐతే, వీటివల్ల అనుకోని పరిణామం ఒకటి జరుగుతుంది. అదేమిటంటే, కొత్తగా కవిత్వం రాయాలనుకునే యుకవులు వీటిని చూసి, పద్య కవిత్వం కేవలం వినోదం కలిగించటానికే ఉపయోగపడుతుందని పొరపాటుపడి, దానికి దూరమౌతారనిపిస్తుంది. వీరు సాధారణంగా కవిత్వాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు గనుక, అటువంటి ధోరణి వచన కవితల్లోనే ఎక్కువగా కనిపించటం చూసి, పద్యకవిత్వం వినోదాత్మకమని, వచన కవిత్వం ఆలోచనాత్మకమని భ్రమపడే అవకాశం ఉంది. దీనిని నివారించటానికి, ఎప్పుడూ జనాకర్షణ మీదే దృష్టి పెట్టకుండా, మనసును కదిలించి, ఆనందంతోనో, విషాదంతోనో కళ్ళు చెమరింపజేసే గొప్ప పద్యాలకు ప్రచారం కల్పించవలసిన అవసరం పద్య కవులకుంది.

వచన కవులు ఛందస్సును వదిలిపెట్టినా, ఒక సంప్రదాయాన్ని మాత్రం వదులుకోలేక పోతున్నారు. అది ఆశు కవిత్వం. ఏదైనా సంఘటన గురించి విన్నప్పుడు, లేదా వార్తా పత్రికలలో పతాక శీర్షికలుగా చదివినప్పుడు వెనువెంటనే స్పందించి, ఒక కవిత రాసేసి, ఆ వార్త కరెంట్ గా ఉన్నప్పుడే ఆ కవిత అచ్చు కావాలని ప్రయత్నించటం. నా దృష్టిలో ఆశుకవిత్వానికి దీనికి పెద్ద తేడాలేదు. “ఆశు కవితా సన్యాస మెప్పించవే!” అని రాయప్రోలువారు అర్థించి ఎన్నో దశాబ్దాలయినా , అది మన తెలుగు కవుల జీన్స్ లో స్థిరంగా ఉండిపోయిందేమో అనిపిస్తుంది.

మొత్తం మీద చెప్పాలంటే, అది యే రకమైనదైనా, కవిత్వం మౌలికంగా భాషకు సంబంధించిన ప్రక్రియ. అందువల్ల, ఆ భాష మీద అవగాహన, పదాల మీద ప్రేమ, అక్షర మైత్రిని గురించిన జ్ఞానం, పదాన్వేషణపై ఆసక్తి – ఇవన్నీ కవికి ముఖ్యమైనవే. వచన కవిత్వం రాయటం చాలా తేలికని, దానికేవిధమైన శిక్షణ, అభ్యాసం అవసరం లేదని భావించటం సరికాదు. ఒక మాటలో చెప్పాలంటే, ప్రతిభ, ఆసక్తులతో బాటు కవికి వ్యుత్పత్తి కూడా కావాలి. కాని, చాలా మందికి ఉత్పత్తి మీద ఉన్న ఆసక్తి వ్యుత్పత్తి మీద లేకపోవటం మన దురదృష్టం.

కొందరు ప్రముఖ వచన కవులు మొదట్లో రాసిన పద్యాలు పరిశీలిస్తే, ఛందోబద్ధ పద్య రచన గురించి నేను చెప్పే వాదానికి బలం చేకూరుతుంది. పద్య రచనలో వారు కనబరచిన ప్రతిభ, తత్ఫలితంగా ఏర్పడిన పునాది తరువాతి కాలంలో గొప్ప వచన కవిత్వం రాయటానికి దోహద పడి ఉంటుందని నా ఉద్దేశం. ముందుగా, శీశ్రీ పద్యాలు కొన్ని పరిశీలిద్దాం. శ్రీశ్రీ రాసిన పద్య ఖండికల్లో “సుప్తాస్థికలు” నాకు చాలా ఇష్టమైన ఖండిక.

అవి ధరా గర్భమున మానవాస్థికాప
రంపరాలు సుప్త నిశ్శబ్ద సంపుటములు!
అటనొకే దీర్ఘ యామిని! ఆ నిశాశ్మ
శాన శయ్యకు ప్రాతః ప్రసక్తి లేదు!

అని మొదలయ్యే ఈ ఖండిక ఎంతో గంభీరంగా సాగుతుంది. చివరిలో-

ఆ మనుష్యాస్థికలు నిద్రలో మునింగి
సంచరించును భైరవ స్వప్న వీధి
అవి చలించును తనుచర్మ కవచమెపుడొ
బ్రతికిన దినాల తలపోత బరువు చేత!

అస్థికల స్వప్నవీధి, తలపోతల వంటివాటి గురించి చెప్పటం గొప్ప ఊహ. శ్రీశ్రీ కవితాశక్తి, కవిత్వంలోని గాఢత ఈ పద్యాలలో తొంగిచూస్తాయి. యౌవనంలో ఉన్నప్పుడు మృత్యువు మీద ఒక రకమైన మోహం ఉంటుంది. బహుశా అటువంటి స్థితిలోనే ఈ ఖండిక రాసి ఉండవచ్చు.

శ్రీశ్రీ మరొక ఖండిక “ఖండ శశి” కూడా చెప్పుకోదగినదే.

ఆ పశ్చిమాశా విషాదాంత కావ్యమై
వ్యాపించు కాల మేఘాళిలో పొడచూపి,
ఖండేందు మూర్తి! ఆకాశ కర్పరమెల్ల
నిండు నీగ్రుడ్డి వెన్నెల ధూమ ధూపమై!

పై పద్యంలోని ధూమమే, మహా ప్రస్థానంలోని “ఆ రాత్రి” అన్న కవితలో

గగనమంతా నిండి పొగలాగు క్రమ్మి
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను

అన్నప్పుడు పొగలాగ మారి ఉంటుంది. నిజానికి, “ఆ రాత్రి” అన్న కవిత కూడా వచన కవిత కాదు. అందులో ఉన్నవన్నీ ద్విపదలు. మహా ప్రస్థానంలో మాత్రా ఛందస్సులో అనేక కవితలున్నా, చాలా ప్రాథమికమైన గణ ఛందస్సులో ఉన్న కవిత బహుశా ఇదొకటే అనుకుంటాను.

కవికుల తిలకుడు బాల గంగాధర తిలక్ కూడా మొదట్లోను, ఆ తరువాత కాలంలోనూ పద్య కవితలు రాసాడు. ఆర్.యస్.సుదర్శనం గారు తిలక్ పద్య కవిత్వం గురించి రాసిన వ్యాసంలో “ప్రభాతము-సంధ్య” అనే సంకలనం గురించి చెప్పారు. అది దొరకలేదుగాని, మరొక సంకలనం “గోరువంకలు” చూసాను. తిలక్ కవితల్లో సహజంగా ఉండే పద/భావ సౌకుమార్యం, మెత్తదనం ఈ పద్యాలలో అడుగడుగునా కనిపిస్తాయి.

ఉదాహరణకు

ప్రతిదినమేగు బాష్పకణ భారనిరోధ దిశాంతనేత్రమై
ప్రతి వకుళమ్ము రాలు శిశిరాత్తదళాంతగళోచ్ఛనాదమై
ప్రతి తెలివేకువన్ తొలగి రాలెను తారలు గాజుపూసలై
అతివ కదల్పకీ వయసు టద్దపుమేడ పునాది గోడలన్.

అన్న పద్యం ఎంతో మృదుమనోహరంగా ఉంటుంది. నండూరి రామమోహన రావుగారు దీనిని తనకిష్టమైన పద్యాల్లో ఒకటిగా చెప్పారు. తిలక్ తన అత్యుత్తమమైన వచన కవితలు వెలువరించిన అరవైలలో కొన్ని పద్య ఖండికలు కూడా రాసాడు. వాటిలో “అద్వైత మాన్మధము” చెప్పుకోదగినది. సీత రామునిపై తన ప్రేమను తెలియజేస్తూ చెప్పే ఈ పద్యాలు గొప్ప కవితా విలువలతో కూడి ఉంటాయి. ఉదాహరణకు -

నా యానందపు మేడలో మొదటి వీణా నాదమై మ్రోగి, నా
ప్రాయోద్యాయమునందు మంద పవన ప్రాలంబమై వ్రేలి, నా
యీ యేకాంతము నందు సిగ్గువయి నన్నిట్లేచి, నా స్త్రీత్వపున్
సాయాహ్ణమ్ముల రాగరంజిత దిశా సందోహమై వ్రాలినన్
ఏమయి పోయినానొ యిటు లేమరిపోయిన నన్ను నేనుగా
నీమెయి చీకటింట గురుతింపగ నెట్టుల నేర్తు..

రాముడు నల్లనివాడు కదా! ఆయన మేనిని చీకటిల్లని చెప్పటం ఎంతో హృద్యంగా ఉంది. ఇటువంటివే ఎన్నో పద్యాలలో తిలక్ కవితా వైభవం వెలుగొందుతూ కనిపిస్తుంది.

మూడవ కవి గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిపండితుడు కాబట్టి, ఆయన పద్యాలు ప్రౌఢంగా ఉంటాయి. అంతేకాకుండా, ఆయన కవిత్వంలో సాధారణంగా కనిపించే ఊహా వైచిత్రి, తాత్వికత, శ్రామిక జన పక్షపాతం వంటివి పద్య కావ్యాల్లో కూడా కనిపిస్తాయి. శేషేంద్ర ప్రసిద్ధి పొందిన పద్య కావ్యాలు ఋతుఘోష, పక్షులు. ఉదాహరణకి –

చిక్కని చిగురాకు జీబులో పవళించి
యెండు వేణువు కంఠమెత్తి పాడె
తలిరాకులూడిచి తపసిగా మసలిన
నగ్నవల్లికయు పర్ణముల దాగె
జిలుగు సీతాకోకచిలుక రూపము దాల్చి
కీటకయోగి కంకేళి గవిసె
శిశిర వ్రతాచార జీర్ణమారుతమూర్తి
యలరు గిన్నెల గంధమలదు కొనియె
ఇచ్ఛ ప్రకృతిలో రెక్క విచ్చెనేమొ
యెడద పురుషునిలో మొగ్గదొడిగె నేమొ

అంటూ వసంతం గురించి,

కనక మేఖల వోలె గగనమ్ము జఘనమ్ము
నింద్రచాపము కుండలీకరించె
జాజి దండల వోలె జలదమ్ము కబరిలో
సౌదామినీమాల సంచలించె
చిలిపి నవ్వుల వోలె చిన్కు ముత్యాలలో
నీహార మధురిమ నివ్వటిల్లె
అందెల రవళిగా ఆశాపథమ్ములం
దంబుదధ్వనులు మోహంబుగొల్పె

అంటూ వర్ష ఋతువు గురించి చెప్పిన పద్యాలు శేషేంద్ర కవిత్వంలో ప్రౌఢతకి, గాఢతకి తార్కాణంగా నిలుస్తాయి.

పై ముగ్గురి కవిత రీతుల్ని పరిశీలించినప్పుడు, పద్య కవితలో పునాది తరువాతి కాలంలో వారికెంతగా ఉపయోగపడి ఉంటుందన్నది మనం ఊహించుకోవచ్చు. అందువల్లనే, కవిత్వం రాయాలనే ఆసక్తి ఉన్నప్పుడు తొలిదశలో పద్యం రాస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నాకనిపిస్తుంది. వచన కవులు తమ పద్ధతిలో కవిత్వం రాస్తూనే, పద్య కవిత్వాన్ని ఆస్వాదించటం, ఎప్పుడైనా వీలయితే అభ్యసించటం చేస్తే దానివల్ల ఆనందం కలగటమే కాదు, వారి కవితాశక్తి మరింతగా పెంపొందుతుంది.

**** (*) ****

(’10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’లో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం.)