వచ్చిన ఋతువులే మళ్ళీ వస్తాయి
గడచిన సంవత్సరాలు అదే పేరుతో
తిరిగి ప్రత్యక్షమవుతాయి
కాని, బ్రతుకు ఋతువులు మాత్రం తిరిగి రావు
ఒకసారి పోగొట్టుకున్న రోజులు
ఇక ఎప్పటికీ దొరకనే దొరకవు.
జీవన చక్రం
సృష్టి లక్షణమైతే కావచ్చుగాని,
జీవితం ఒక సాదాసీదా సరళరేఖ
జీవనయానం
క్రమం తప్పని కవాటాలతో
ఏకోన్ముఖంగా సాగే పరిమిత యాత్ర
భ్రమణం ఒక భ్రమ
నీకు దక్కిన కాలశకలం
ఆదీ అంతమూ కలిగిన
అతి సాధారణమైన
బల్లపరుపు నేల.
ఆశలు రాలిపోతాయి
కోరికలు మండి మండి
కొడిగట్టి పోతాయి
కేశాలు కూడా తిరిగిరాని
ఒంటరి దశలో
క్లేశాలేవో పలుమార్లు వచ్చి పోతాయి
ఎప్పటికైనా మళ్ళీ తలలెత్తటానికి
తప్పులు మాత్రం మనసు పొరల్లో మిగిలి పోతాయి.
ఏకోన్ముఖం కవితలో సరళరేఖ లాంటి ఎప్పటికీ తిరిగి రాని జీవన ప్రస్తావనాన్ని చాలా బాగా ప్రస్తావించారు.
మీరింకా ఎంతో బాగా రాస్తారు కదా? …
చాలా బావుంది రవి.