తలపోత

చివరి క్షణం వరకు ఆయన యువకుడే

జనవరి 2013

 

పుట్టుకతో వృద్ధులైన కుర్రవాళ్ళమాటేమోగాని,ఎంత వయసు వచ్చినా మరణించేవరకు యువకులుగా ఉన్న కొందరు విశిష్ట వ్యక్తుల్ని నేను చూసాను. వారిలో పెమ్మరాజు వేణుగోపాలరావుగారు ముఖ్యులు.

అటువంటి స్వభావం ఏర్పడటానికి జీవితంపై ఆయనకున్న ఆశావహమైన దృక్పధమే కారణం. ఆయనతో అనేకసార్లు జరిపిన సంభాషణల్లో ఎప్పుడూ గతంలో జరిగినదాని మీద చింత, గతమంతా గొప్పదన్న నాస్టాల్జియా, ముందేమవుతుందోనన్న ఆందోళన, ఏమీ చెయ్యలేమన్న నిస్పృహ – ఇటువంటివేవీ ఎప్పుడూ కనిపించేవికావు. విశాలమైన జీవితం, అపారమైన అవకాశాలు తన ముందు ఉన్నాయని, వాటిని సద్వినియోగ పరుచుకోవటానికి తనుచెయ్యవలసిన కృషిఏమిటనేదానిమీదే ఆయన దృష్టిఉండేది. నలభైలలో ఉన్న నాకులేని ఇటువంటి ఆశావహమైనదృష్టి,ఎనభైలకి చేరువవుతున్నఆయనకెలా ఏర్పడుతుందోఅని ఆశ్చర్యంకలిగేది. విశ్రాంతిపై ఆయనకున్న అవగాహన కూడా అటువంటిదే. ఎనభై యేళ్ళు దాటాక, ఇటీవలే పదవీ విరమణ చేసినా, అది పూర్తి విరమణగా ఆయన భావించ లేదు. తన స్థానాన్ని భర్తీ చేసేవరకు అక్కడ తన ఆఫీసు ఉండనిస్తారని, ఎప్పుడైనా వెళ్ళివస్తూఉండవచ్చని చెప్పారు. ఇటువంటి అలుపెరుగనితత్వం ఆశ్చర్యం కలిగించటమే కాకుండా, తరువాతి తరాలవారికి ఆదర్శంగా నిలుస్తుంది.

వేణుగోపాలరావుగారి పేరు నేను అమెరికారాకముందే విన్నాను. 1991లో అట్లాంటాలో TANA Conference జరిగినప్పుడు, రావుగారు సావనీరు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో నా సోదరుడు ఫణీంద్ర అట్లాంటాలోనే ఉండేవాడు. ఆపనిలో తనుకూడా ఆయనకు కొంత సహకారం అందించాడు. అప్పుడు నేను ఇండియానుంచి పంపిన “వాన వార్తలు”అనే కవితనుఆయన అందులో చేర్చుకున్నారు. 98లో నేను అమెరికా వచ్చినతరువాత ఆయనతోప్రత్యక్ష పరిచయం ఏర్పడింది. అట్లాంటాకి మా ఊరు 3-4 గంటల డ్రైవింగు సరిపోయే దూరంలోనే ఉండటంతో, తరచు వెళ్ళటం సాధ్యపడింది. 2000 ఆటా కాస్ఫరెన్సులోనూ, అదే సంవత్సరం చికాగోలో జరిగిన సాహితీ సదస్సులోనూ ఆయన నిర్వహించే కార్యక్రమాలు దగ్గరగా చూడటం జరిగింది.

అట్లాంటా వెళ్ళినపుడు, మేం ఏ వేళకు వారింటికి వెళ్ళినా, రావుగారు, ఆయన సతీమణి లక్ష్మిగారు ఎంతో ఆప్యాయంగా ఆదరించేవారు. పైన చెప్పిన సాహితీ సదస్సుకి వెళ్ళినప్పుడు, నాకు తెలియక టిక్కెట్లు అట్లాంటా నుంచి తీసుకున్నాను. తిరుగు ప్రయాణంలో ఫ్లైటు అర్థరాత్రికి అట్లాంటా చేరుతుంది. అంత రాత్రివేళ మా ఊరు డ్రైవ్ చెయ్యటం కష్టం కాబట్టి, రాత్రికి వారింటిలో ఉండవచ్చునా అని అడిగాను. లక్ష్మిగారు వెంటనే, “మేము నిశాచరులమే. రండి” అన్నారు. మేము వారింటికి చేరేసరికి బహుశ ఏ రెండో కావస్తోందేమో. నిద్రలోంచి లేచి, తలుపు తియ్యటం కాకుండా, దంపతులిద్దరూ పుస్తకం చదువుతూ మాకోసం నిద్రపోకుండా ఎదురుచూసిన దృశ్యం నాకింకా కళ్ళలో మెదుల్తుంది. వారి ఆతిథ్యం ఎంత ఆత్మీయంగా ఉంటుందో చెప్పటానికి ఇదొక ఉదాహరణ.

మేమేకాకుండా,మా ఇంటికి ఇండియానుంచి బంధుమిత్రులెవరైనా వస్తే, వారిని అటాంటా తీసుకువెళ్ళినప్పుడు, పెమ్మరాజువారి ఇంటికి కూడా తీసుకువెళ్ళటం అలవాటుగామారింది. మా ‘సిటీ పాస్‌’లో సాధారణంగా ఐదు దర్శనీయ స్థలాలుంటాయి – CNN, Coke Museum, Hindu Temple, Swami Narayan Temple, చివరిగా పెమ్మరాజువారి ఇల్లు. వారింట్లో చూడదగిన విశేషాలు అనేకం కనిపిస్తాయి. ఆయనకు సాహిత్యమే కాకుండా,రంగస్థలం ,చిత్రలేఖనం, శిల్పం, చెక్కపని, తోటపని వంటి అనేక వైవిధ్యమున్న విషయాల్లో ఆసక్తి, ప్రవేశంఉన్నాయి. ఇక్కడ కేరం బోర్డు దొరకని రోజుల్లో ఆయన స్వయంగా తయారు చేసుకున్న బోర్డు, ఇటీవల వెయ్యి చిన్న చిన్న శివలింగాలతో ఆయన నిర్మించిన శివలింగం, పెరట్ళో రకరకాల చెట్లు, మొక్కలు, తెలుగు అక్షరాలతో కూర్చిన సిమెంటు పలకలు – ఇలా అనేకం మనకు ఆసక్తి కలిగిస్తాయి. అలాగే బేస్‌మెంటులో ఉన్న లైబ్రరీ, వర్కుషాపులు కూడా.వీటితోబాటు లక్ష్మిగారు పాక ప్రావీణ్యంతో చేసే వంటలు. అంపశయ్య నవీన్, వి.ఆర్.విద్యార్థి గార్లు2006లో మా ఊరు వచ్చినప్పుడు, అట్లాంటాకి, అక్కడపెమ్మరాజువారి ఇంటికి తీసుకు వెళ్ళాను. ఆ సందర్భంలో విద్యార్థిగారు ఆ దంపతుల మీద ఒక కవిత రాసారు. దానికి “మిధునం” అనేపేరు నేను సూచించాను. ఈ వ్యాసం చివర ఆ కవిత ఇస్తున్నాను.

రావుగారి తరంలో అమెరికాకి వచ్చిన తెలుగువారిలో ఎక్కువమంది పాశ్చాత్య విలువల్లోని మంచిని గ్రహించి, తమ జీవితాల్లో అమలు చేసారు. ఆవిధంగా వారు ఇప్పుడు వచ్చేవారికంటే ఎక్కువగా ఇంటిగ్రేట్ అయారని నాకనిపిస్తుంది. భార్య పట్ల సమభావం, ఇంటిపనులలో పాలు పంచుకోవటం, సమయ పాలన, తీసుకున్న పనిని అంకితభావంతో పూర్తి చెయ్యటం , సమావేశాలకి వెళ్ళినప్పుడు కోటు, టై ధరించి డ్రెస్ అప్ కావటం, స్వలాభాపేక్ష లేకుండా కమ్యూనిటీకి పనికివచ్చే కార్యక్రమాల్లో పాల్గొనటం వంటివి. ఇవన్నీ వారినుంచి నేర్చుకోవలసినవే.

రావుగారు వృత్తిరీత్యా న్యూక్లియర్ ఫిజిక్సులో ప్రొఫెసర్‌గా సుదీర్ఘకాలం పనిచేసారు. ఆయనకు భాతీయ తత్వశాస్త్రంలో ఉన్న ఆసక్తివల్ల సైన్సుకి దానికి సమన్వయం సాధించే ప్రయత్నం ఆయనలో కనిపిస్తుంది. ఈ అంశంపై ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు ప్రత్యక్షంగా నేను వినకపోయినా, ఆయన రచనల్లో ఇటువంటి అన్వేషణ నేను గమనించాను. అంతేకాకుండా, సైన్సుకి సంబంధించిన సాంకేతిక పదాలు, ఇతివృతాలతో కవిత్వం రాసిన అతి కొద్దిమందిలో రావుగారు కూడా ఒకరు. ఆయన కవితా సంకలనాలు “కాస్మిక్ కవిత” (1989), “లోకానికి చాటింపు” రెండిటిలో ఈ రకమైన కవితలనేకం కనిపిస్తాయి. ఒక ఉదాహరణగా, “సూక్షంలోకం సంభాషణలు” అనే కవితనుంచి “ఎలక్ట్రానుల స్వగతం”,“పరుగెడుతున్న ఫోటాన్లు” అన్న ఖండికల నిస్తున్నాను. ఇవి కఠినమైన సైన్సు విషయాల్ని మానవీకరణతో సులభంగా ఆయన ఎలా చెప్పారో చూపించటమేకాకుండాఆయన హాస్య చతురతకి అద్దం పడుతూ, సైన్సు చదివిన విద్యార్థులకు ఆనందం కలిగిస్తాయి.

ఈ రెండు పుస్తకాలతోబాటు, 2006లో ఆయన భర్తృహరి శృంగారశతకాన్ని సరళమైన తెలుగులోస్వచ్చంద పద్యాలుగా“శృంగార భర్తృహరి” అనేపేరుతోఅనువాదం చేసారు. ఇదికాక, ఆయన నిర్వహించిన సంపాదక బాధ్యతలు, వివిధ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో అయన నిర్వహించిన బాధ్యతలు లెక్కలేనన్ని.వంగూరి ఫౌండేషన్ సంపాదకులుగా, వారి వివిధ సాహిత్య కార్యక్రమాలు, ప్రచురణల సందర్భంలో విశిష్టసేవలందించారు. ఎంతోమందికి ఆయన గురువుగా, మార్గనిర్దేశకునిగా ఉపయోగపడ్డారు. ఆయన చాలాకాలం అధ్యాపకునిగా పనిచెయ్యటం వలన, ఎంత సంక్లిష్టమైన విషయాన్నైనా అందరికీ అర్థమయే విధంగా వివరించటం ఆయనకు అలవడింది.

“లోకానికి చాటింపు” పుస్తకానికి వెల్చేరు నారాయణరావుగారు చివరి మాట రాసారు. అందులో ఆయన చెప్పిన ఒక సంఘటన రావుగారి మృదు స్వభావానికి ప్రతీకగా నిలుస్తుంది. వీరిద్దరూ హైస్కూలునుంచి ఏలూరులో సహాధ్యాయులు. వాళ్ళు ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకొనే రోజుల్లో, ఒకసారి,వెల్చేరుగారుఏలూరు నుంచి వైజాగ్ వెళుతోంటే, రావుగారి నాన్నగారు, మంచి మామిడిపళ్ళ బుట్ట జాగ్రత్తగా కుట్టించి, తన కొడుక్కి అందజేయమని ఆయనకిస్తారు. వెల్చేరుగారు దానిని రైలులోపైబెర్తు మీదపెట్టి, దిగేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోతారు. దానికి చాలా బాధపడుతూ, ఆ విషయం రావుగారికి చెబితే, ఆయన “ఓస్ ఇంతేనా” అంటూ, వెంటనే, “నారాయణరావు ద్వారా పంపించిన మామిడిపళ్ళు అందాయి. చాలా బాగున్నాయి.” అని వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాసి పోస్టులో పడేస్తారు. “వేణుగోపాలరావు పద్యాల్లో అప్పుడు – నేను మామిడిపళ్ళు మర్చిపోయినప్పుడు – నిశ్చింతగా నవ్విన మనస్సే నాకిప్పుడు కనిపిస్తుంది” అని రాస్తారు వెల్చేరుగారు. అటువంటి నిశ్చింతకలిగిన, నిర్మలమైన మనస్సుని ఆయన జీవితాంతం కాపాడుకున్నారు.

గత నెలలో సహస్ర చంద్ర దర్శనం పండగ జరుపుపుకున్నప్పుడు వెళ్ళి అభినందించాం. ఆయన మరిన్ని చంద్ర దర్శనాలు చేస్తారని ఆశించామేగాని, ఇంత త్వరలోనే విడిచిపెట్టి వెళతారనుకోలేదు.

రావుగారినిప్రత్యక్షంగా, పరోక్షంగా ఎరిగినవారికే కాకుండా , అమెరికాలోని తెలుగువారందరికీఆయన చిరస్మరణీయులు.

 

మిథునం

సూర్యుడు

రసవాదంతో

పరిసరాల్ని సువర్ణం చేస్తూ

కొండెత్తు

చెట్లగుంపుల్లో

పక్షులపాటల దర్బారు

సౌజన్యాన్ని వెదజల్లుతూ

చెట్లమధ్య

చుట్టూ

మృదులశాద్వలపు

తివాచీలు.

ఇంట్లో

ఘోషించే శ్రుతులు

పలవరించే అక్షరాలు

ఉలిస్పర్శకు

దేవతలై

దీవించే దారువులు

గీతల్లో

పరిభ్రమిస్తూ

రంగుల ఖగోళాలు

బ్రహ్మీపుత్రియై

నలభీములకు చెల్లెలై

గృహ ‘లక్ష్మి ‘

అతిథులను ఆదరిస్తూ.

జడలు పెంచని

కమండలం ధరించని

త్రిదండం తిప్పని

తపోధనుడై

గృహ ‘పాలకుడు ‘

నిరంతరం

అంరర్ యానంలో.

-వి.ఆర్.విద్యార్థి

 

 

ఎలక్ట్రానుల స్వగతం

“ఇదేదో వింతగాఉంది?

ఇంత వేడి, ఇంత ఒత్తిడి

విద్యుదయస్కాంత క్షేత్రం మధ్య

ఈ నా అవస్థకి నేనే కారణంట.

అయస్కాంత సముద్రంలో

మునిగి తేలుతూ ఉండాలట!

ఏ జన్మలో ఎక్కడ

విశ్రాంతి దొరుకుతుందో!

ఫోటాన్లని చూస్తే ముద్దొస్తుంది.

ఎంత మంచివి?

అస్తమానూ కొత్త విషయాల

గురించే మాట్లాడుతుంటాయి.

ఎక్కడో ఉన్నాయట

పరమాణువులు, అణువులు

మంచి మంచి ప్రదేశాలు.

అక్కడ కాస్త రెస్టు తీసుకోవచ్చునేమో!”

 

పరిగెడుతున్న ఫోటాన్లు

సిరియన్ నుంచి బయల్దేరింది ఒక ఫోటాను

రెండవది సూర్యుడినించి వస్తోంది

‘నమస్కారమండీ! ఏవూరుమీది?’

‘సూర్యుడినుంచి ఇప్పుడే బయట పడ్డాను.

అసలు బయట పడనేమో అనుకున్నా.

కాని, అదృష్టం బాగుంది.’

‘నేను సిరియను నుంచి బయటపడి

చాలా కాలం అయింది

అంతు దరి కనిపించటంలేదు నా ప్రయాణానికి.

తోడు దొరికావు నా అదృష్టం.

నీవేమైనా విలువగల వార్త

మోస్తున్నావా?’

‘భూమిమీద నరుడొకణ్ణి కలుసుకోవాలి’

‘నేనూ అటువేపే వస్తున్నా

క్లోరోఫిల్ని కలుసుకోమని నాకు ఆర్డరు’

‘ఎక్కడినుంచి వస్తాయి నీకు ఆర్డర్లు?’

”నాకు తెలీదు. అది నాపని అని మాత్రం తెలుసు’

‘అదృష్టవంతురాలివి

నీకేమవుతుందో నీకు తెలుసు

ఈ నరుడెవడోనాకేమీ తెలీదు

అతనికి బ్రహ్మజ్ఞానం కావాలిట.

అది నే మోసే భారం.

అటు చూడు వంకర టింకరగా

పరిభ్రమిస్తోన్న న్యూట్రినోలని’

‘అలసినట్టున్నాయి.

కొంచెం వెనకబడుతున్నాయి.’

‘వాళ్ళకి అలసటేమిటి?

పనీ లేదు పాటా లేదు.

నాకు వాళ్ళంటే మహా చిరాకు.’

‘వాళకీ, మనకీ మధ్య

ఏదో నాన్లోకల్ ఫీలింగున్నట్లుంది.

ఈ అవినాభావ సంబంధం

తెలిస్తే బాగుండును.

భూమి మీద ఎవరికయినా తెలుసేమో?’

 

‘నాకూ అదే అనిపిస్తోంది.’