కథ

తోడు

జూలై 2013

“This was many years back …” అంటూ మొదలుపెట్టాడు కెవిన్. నేను అప్రయత్నంగా నా చేతిలో ఉన్న సెల్‌ఫోను నొక్కి టైము చూసుకున్నాను. కెవిన్ ఇలా మొదలుపెట్టాడంటే ఆ మొనోలాగ్ కనీసం ఒక గంటసేపైనా ఉంటుందని తెలుసు. అది ఎక్కువగా తన జీవితంలో జరిగిన సంఘటనలతో, ఆత్మస్తుతీ, పరనిందా కలిపి సాగుతుంది. ఇదివరకు చెప్పిన విషయాలే వందోసారో, నూట పదోసారో మళ్ళీ అంత కొత్తగానూ చెప్పబోతాడు. ఈ టీములో ఐదారేళ్ళ సర్వీసులో ఇలాంటి అనుభవం ఎన్నోసార్లు ఎదురయింది. కానీ, బాసు కదా, ఏమీ అనటానికిలేదు. దీన్నుంచి బయటపడే మార్గం ఒక్కటే .. ఆయనకైనా, నాకైనా ఫోను వస్తే, సంభాషణ తెగిపోతుంది. అక్కడినుంచి మెల్లగా జారుకోవచ్చు. మా టీంలో ఎవరైనా ఇలా ఆయన మాటల వలలో చిక్కుకుపోయినప్పుడు, వేరే వాళ్ళు ఆ వ్యక్తి సెల్‌ఫోనుకి కాల్‌చేసి రక్షించాలనే ఒప్పందం ఒకటి మేమంతా ఒకసారి పరిశీలించాంగాని, ప్రతిసారీ అలా జరిగితే ఆయన కనిపెట్టేస్తాడని అది అమలు చెయ్యలేదు. ఇకపోతే, మిగిలింది ఆయనకేదైనా ఫోను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ వేచి ఉండటమే.

ఆయన ఏదో చెబుతున్నాడు. ఆ మోనోలాగ్ శాఖాచంక్రమణం చేస్తూ, ఎక్కడెక్కడికో వెళుతోంది. నేను అంతకు ముందు ప్రోగ్రాములో ఎదురైన సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తూ, వినకుండానే ఊ కొడుతున్నాను. అంతలో “మా అంకుల్ గురించి నీ కిదివరకు చెప్పాను కదా?” అని అడిగాడు. ఆయన చెబుతున్నదాని మీద మనసు పెట్టకపోవటం వల్ల, ప్రశ్న అర్థం చేసుకోవటానికి కొంత సమయం పట్టింది. అది తెలియకుండా, కొంచెం గుర్తు చేసుకుంటున్నట్టు నటించి “…ఎవరూ, మౌన్‌టెన్సులో ఉంటారు ఆయనే కదా?” అన్నాను. “ఆయనే, ఇప్పుడు కొంచెం కష్టాల్లో ఉన్నాడు ” అన్నాడు.

కెవిన్ మాతృదేశం లెబనాన్. కాలేజీ చదువు కోసం ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయాడు. మతం మార్చుకోవటం, అమెరికన్ అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం వంటివి జరిగిపోయాయి. పిల్లల్లో ఒకరికి అమెరికన్ పేరు, మరొకరికి అక్కడి పేరు పెట్టుకున్నాడు. ఇప్పటికీ, లెబనాన్ ఎంత అందమైన దేశమో, అక్కడ రియల్ ఎస్టేటు వేల్యూ ఎంత వేగంగా పెరుగుతోందో, ఆ సమాజం ఎంత రెజిలియంట్‌గా ఉంటుందో మొదలైనవి వివరించి చెబుతూ ఉంటాడు. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఒకవైపు బాంబులు కురుస్తున్నా, మరొక వైపు నిర్మాణం నిరాఘాటంగా జరిగిపోయేదట. ఇప్పుడక్కడ పరిస్థితి చాలా బాగుందని, అరబ్బులు వెకేషన్‌కి లెబనాన్ రావటనికే ఎక్కువ ఇష్టపడతారని చెబుతాడు. అక్కడ అంతర్యుద్ధం జరిగే రోజుల్లో వాళ్ళెవరైనా అమెరికా వచ్చెయ్యాలనుకుంటే, గ్రీన్‌కార్డులు కొంత ఉదారంగా ఇచ్చారట. అప్పుడు ఈయన తల్లితండ్రులైతే రాలేదుగాని, తండ్రి సోదరుల్లో ఒకరిద్దరు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళలో ఇప్పుడు చెబుతున్న బాబాయి కూడా ఒకరు. ఆయన ప్రపంచ బ్యాంకులో మంచి హోదా ఉన్న ఉద్యోగమే చేసి రిటైరయ్యాడు. ఎప్పుడూ వివిధ దేశాల అధినేతలతో చర్చల్లో పాల్గొంటూ చాలా బిజీగా గడిపేవాడట. రిటైరయ్యాక, మేముండే ఊరికి కొంత దూరంలో ఉండే మౌంటెన్సులో ఏదో చిన్న ఊరిలో సెటిల్ అయ్యాడు. మా ఊరు నుంచి కారులో మూడు నాలుగు గంటల ప్రయాణం ఆ ఊరికి. కెవిన్ అడపా తడపా అక్కడికి వెళ్ళివస్తూ ఉంటాడు. పెద్దయనకి ఎక్కువ ఊసుపోక, Best Buy లాంటి ఎలక్ట్రానిక్ స్టోర్లకి వెళ్ళి, కనపడిన సాఫ్ట్‌వేర్లేవో కొనుక్కు వస్తుంటాడు. అవి ఇన్‌స్టాల్ చెయ్యటం, ఉపయోగించటం ఆయనకి చేతకాదు. ఇన్‌టర్నెట్‌లో click here అని ఉన్న చోటల్లా క్లిక్ చెయ్యటంవల్ల, ఎక్కడెక్కడి వైరస్‌లూ ఆయన కంప్యూటర్ మీదే ఉంటాయి. కెవిన్ వెళ్ళినప్పుడల్లా, వాటిని తొలగించటం, ఆయన కొనుక్కున్న అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చెయ్యటం వంటివి చేస్తుంటాడు. నీకు e-మైలు ఒక్కటీ ఉంటే సరిపోతుంది, ఇవేవీ కొనకని చెప్పినా ఆయన వినిపించుకోడు. కెవిన్ ఒక నెల రోజులు కనబడకపోతే, రమ్మని అదే పనిగా ఫోన్లు చేస్తుంటాడు.
“ఏమయింది ఆయనకి?” అని అడిగాను.

“ఈ మధ్య ఎందుకో అన్నీ త్వరగా మర్చిపోతున్నాడు. ఆయనతో చాలా ఇబ్బందిగా ఉందని మా ఆంటీ, కజిన్ గొడవ చేస్తున్నారు. నేను వెళ్ళి కూడా చాలా రోజులయింది. ఈ మధ్య పరిస్థితి మరింత దిగజారిందేమో తెలియదు.” అన్నాడు.

కెవిన్‌కి కూడా గత కొన్ని నెలలుగా, మనుషులు, అప్లికేషన్ల పేర్లు గుర్తుకు తెచ్చుకోవటానికి మహా ఇబ్బంది పడుతున్నాడు. ఆ మాట ఎప్పుడూ ఆయనతో అనలేదుగాని, ఇదేదో ఫేమిలీలోనే ఉందన్నమాట అనిపించింది ఇది వింటే.

“అయ్యో పాపం. మరుపన్నది ఎవరికి వచ్చినా కష్టమే.” అన్నాను.

“అవును. ఈ వీకెండ్ ఒకసారి చూసి రావాలి. బహుశ శుక్రవారం మధ్యాహ్నమే బయల్దేరతాను. ఏదైనా అత్యవసరమైనవి వస్తే నువ్వు చూసుకో ..” అని ఇంకేదో చెప్పబోతున్నాడు.

ఇంతలో నా ఆఫీసు ఫోను మోగింది. వెళ్దామా వద్దా అని సందేహిస్తున్నంతలో ఆగిపోయింది. ఆయనది గమనించినా, గమనించనట్టు ఇంకేదో మాట్లాడబోతున్నాడు. ఇంతలో నా సెల్ మోగింది. అదివిని “నీ కోసం ఎవరో డెస్పరేట్‌గా ట్రై చేస్తున్నారు” అన్నాడు. చూస్తే ఎవరో కష్టమరు. “అవును. సరే, శుక్రవారం మధ్యాహ్నం నేను చూసుకుంటాను.” అంటూ బయటకు నడిచాను.

ఆ తరువాత ఆయన అంకుల్ విషయం నేను ఎక్కువ ఆలోచించలేదు. అనుకున్నట్టుగానే ఆయన శుక్రవారం బయల్దేరి వెళ్ళాడు. కాని, ఎందువల్లనో మరుసటి వారం మొదటి మూడు రోజులు ఆయన ఆఫీసుకి రాలేదు. గురువారం వచ్చాడుగాని, రోజంతా ఏదో బిజీగా ఉన్నట్టు అనిపించటంతో నేను కలవలేదు. సాయంకాలం ఇంటికి బయల్దేరబోతూ, ఓకసారి ఆయన ఆఫీసులోకి తొంగి చూసాను. కొంచెం విచారంగా కనిపించాడు.

“ఏమయింది, మూడు రోజులుగా రాలేదు. మీరు అంకుల్ ఇంట్లో ఏమైనా పని పడిందా?” అని అడిగాను.

“అవును. మా ఆంట్ చనిపోయింది.” విచారంగా చెప్పాడు.

“అయ్యో, అలాగా! sorry to hear that. ఏమయింది. మనం గతవారం మాట్లాడే సమయానికి బాగానే ఉన్నారు కదా?” అని అడిగాను.

“అవును. కారు ఆక్సిడెంట్ జరిగింది. నీకు తెలుసు కదా, ఆవిడకి దాదాపు ఎనభై ఏళ్ళు. శుక్రవారం ఏదో పని మీద కారు తీసుకు వెళితే, అది కంట్రోలు తప్పి చెట్టుని కొట్టిందట. నేను వెళ్ళే సమయానికి తెలిసింది. మా అంకుల్ కారు తీసికెళితే, ఆయనకి తిరిగి వచ్చే దారి గుర్తుండట్లేదుట. అందుకని, ఏది కావాలన్నా ఆవిడే వెళుతోంది.” వివరించాడు.

నాకు వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే, చాలా బాధ కలిగింది. పెద్ద వయసులో ఎవరూ తోడు లేకపోతే ఎలాగ? ఆవిడ కూడా వెళ్ళిపోయాక ఆయనెలా ఉంటాడో అని ఆలోచిస్తున్నాను. అంతలో, మళ్ళీ కెవినే చెప్పటం కొనసాగించాడు.

“ఈ మధ్య ఆవిడకి ఓపిక తగ్గిపోయింది గాని, ఇదివరకు నేను వెళితే ఎన్నో రకాల డిష్‌లు చేసిపెట్టేది. మా అంకుల్‌కైతే, భోజనం, బట్టలు, మందులు అన్నీ ఆవిడే చూసుకునేది. ఆవిడ అన్నీ అమర్చి పెడితే, ఆయన చక్కగా పేటియోలో సిగార్ కాల్చుతూ కూర్చునేవాడు.”

“మరిప్పుడెలాగ?” అన్నాను. అంతలో, ఆయన కజిన్ దగ్గర్లోనే ఉంటుందన్న విషయం గుర్తుకు వచ్చి ఆ విషయం అడిగాను.
“ఉంది. కాని, ఆవిడ వల్ల పెద్ద ఉపయోగంలేదు. తను విడిగా ఉంటుందిగాని, పెళ్ళి చేసుకోలేదు. డబ్బు కోసం తండ్రి మీద ఆధారపడుతుంది. ఆయనేమో కూతురు ఏది కావాలంటే అది కొని, అతి గారాబం చేసాడు. ఇప్పుడు, తండ్రి ఆస్తి మీదే ఆమెకి మక్కువ. తండ్రి నెలాగైనా ఇక్కణ్ణించి పంపించి, ఆ ఇల్లు అమ్మేయాలని చూస్తోంది.”

“అదేమిటీ? ఈ వయసులో ఆయన్ని ఎక్కడికి పంపిస్తుంది?”
“లెబనాన్‌కే తిరిగి పంపాలని ఆమె ప్లాను. అక్కడ మా బంధుమిత్రులు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళంతా బాగా చూసుకుంటారని చెబుతుంది. ఈయనకి వెళ్ళటం ఇష్టం లేదు. పోనీ ఈ ఊళ్ళో ఏదన్నా రిటైర్మెంట్ హోం లో చేర్పిస్తే, నేను చూసుకుంటానని చెప్పాను. దానికీ ఒప్పుకోదు. నేనేదో ఆయన ఆస్తి మీద కన్నువేసి, అలా అంటున్నాననుకుంటుంది…” ఆయనింకేదో చెప్పబోతుండగా, ఆయన ఫోన్ మోగింది. కాలర్ ఐడీలో పేరు చూసి “let me take this call” అంటూ ఫోను వైపుకి తిరిగాడు.

కెవిన్‌తో సంభాషణ మధ్యలో భంగమైనందుకు మొదటిసారిగా చింతిస్తూ, నేను బయటకు నడిచాను. నా ఆఫీసులో టెర్మినల్ ఎదుట కూర్చుని ఉన్నా, కెవిన్ బాబాయి గురించి, మొత్తంగా వృద్ధాప్యం గురించి ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. నిజంగా ముసలితనం ఇంత నిస్సహాయంగా, దయనీయంగా మారుతుందా? రైటైర్‌మెంటు తరువాత జీవితం హాయిగా, ఆనందంగా గడుస్తుందని అనుకోవటం మిధ్యేనా? ఇక్కడ రిటైర్మెంటు వయసంటూ ప్రత్యేకంగా లేకపోవటం వల్ల, అనేకమంది వయసుపైబడినా, రకరకాల కారణాలవల్ల ఉద్యోగంలో కొనసాగుతూ ఉంటారు. గ్రోసరీ షాపుల్లోనూ అక్కడా, ముసలివారు చెకవుట్ దగ్గర కేషియర్లుగా తటస్థ పడితే, నాకు చాలా బాధ కలుగుతుంది. వారు పనిచేస్తున్నది ఆర్థిక కారణాల వల్లనే అని తేలిగ్గా ఊహించవచ్చు. కెవిన్ బాబాయికి ఈ ఇబ్బందులేవీ లేవు. కావలసినంత డబ్బుంది. కాని, శరీరం సహకరించకపోతే, బ్రతుకు దుర్భరమే కదా. “చివరి విందులో చివరికి తననెవరు మోసం చెస్తారో జీసస్‌కు తెలుసు” అన్నట్టు, జీసస్‌కి తెలుసేమోగాని, మనం పెంచి పోషించిన శరీరంలో ఏ భాగం చివరికి మనని మోసం చేస్తుందో, మొదట నిస్సహాయతకి అంతిమంగా మృత్యువుకి ఎలా అప్పగిస్తుందో ఎవరికీ తెలీదు. మనిషి జీవితంలో దీని కంటె విషాదకరమైన అంశం మరొకటి ఉండదనిపిస్తుంది. ఇటువంటి ఆలోచనలతో నాలో నేనే మధన పడుతూ ఉండిపోయాను.

ఇది జరిగిన రెండు వారాల తరువాత ఒక మధ్యాహ్నం కెవిన్ నా ఆఫీసులోకి వచ్చి విషాదవదనంతో చెప్పాడు – “ఇప్పుడే మా కజిన్ ఫోను చేసింది. మా అంకుల్ ఉదయం నుంచి కనిపించటం లేదట. కారు తీసుకుని ఎటో వెళ్ళి తిరిగి రాలేదట.ఏమై ఉంటాడో? నేనొకసారి వెళ్ళి రావాలి.” ఆ మాట వింటే నాకు చాలా ఆందోళన కలిగింది. కెవిన్ బాబాయికి ఏదో విధంగా సహాయ పడాలని నాకనిపించింది. “నేను కూడా వెతకటానికి మీతో వస్తాను, మీ కభ్యంతరం లేకపోతే.” అన్నాను. కెవిన్ ఒక్క క్షణం ఆలోచించి సరే రమ్మన్నాడు. టీంలో మిగతావారికి పని అప్పగించి, మేమిద్దరం బయట పడ్డాం. కెవిన్‌కి ఇంటి దగ్గర ఎవరూ లేరు. పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్ళిపోయారు. భార్య వేరే ఊరిలో ఉద్యోగం చేస్తుంది. ఇక నా విషయానికొస్తే, నేనెలాగూ ఒంటిగాడినే. అందుకే సరాసరి ఆఫీసు నుంచే ఆ ఊరు బయల్దేరాం. కెవిన్‌లో ఆందోళన కనిపిస్తోందిగాని, వాళ్ళ అంకుల్‌ని కనుక్కో గలుగుతామనే విశ్వాసం కూడా ఆయన మాటల్లో ధ్వనిస్తోంది. “ఆయనకి జ్ఞాపకం ఉండదని తప్పిస్తే, మిగతా ఇబ్బందులేవీ లేవు. డ్రైవింగు కూడా బాగానే చేస్తాడు. దారితప్పి ఎటో వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉండి ఉంటాడు. కొంత వెదికితే జాడ తెలుస్తుంది.” అన్నాడు. ఆతరువాత, కెవిన్ తన సహజ ధోరణిలో అవీ ఇవీ దారిపొడుగునా మాట్లాడుతూనే ఉన్నాడు. నేను పరధ్యానంగా ఊ కొడుతూ, రోడ్డుని, పరిసరాల్ని పరిశీలిస్తున్నాను. ఎక్కడైనా బ్లూ లైటుతో ఉన్న ఆగిఉన్న పోలీస్ కారో, వెలిగే ఎర్రలైట్లతో ఎమర్జెన్సీ వాహనమో కనిపిస్తే చాలు, నా గుండె వేగంగా కొట్టుకునేది. మేము ఊరు చేరేసరికి, దాదాపు చీకటి పడుతోంది. అలసిన ముసలి సూర్యుడు, ఎవరూ గమనించకుండా కొండలవెనుక అదృశ్యమవుతున్నాడు.

వాళ్ళ ఇంట్లో ఆయన కజిన్ ఒక్కతే కూర్చుని ఉంది. ఆమెకు సుమారు ఏభై ఏళ్ళు ఉండవచ్చు. నన్ను పరిచయం చేసాక, “ఏమైనా తెలిసిందా” అని అడిగాడు కెవిన్. ఆమె లేదన్నట్టు తల ఊపింది. ఆ తరువాత, ఆ రోజు ఉదయం ఏమి జరిగింది, గత రెండు మూడు రోజులుగా ఏమైనా చెప్పుకోదగింది జరిగిందా – మొదలైన విషయాలు ఆమె నడిగి తెలుసు కున్నాడు. రెండు రోజుల క్రితం లెబనాన్ ప్రయాణం గురించి వాళ్ళిద్దరికీ చిన్న గొడవ జరిగిందని, తను టిక్కెట్లు బుక్ చేసేసానని చెబితే, ఆయన చాలా అప్‌సెట్ అయాడని చెప్పింది. ఆయన ఇంత హఠాత్తుగా మాయం కావటానికి బహుశ అదే కారణం కావచ్చు. పోలీస్ కంప్లయింటు ఇచ్చానని, కమ్యూనిటీలో కొందరు మిత్రులు కూడా మధ్యాహ్నం నుంచి వెతుకుతున్నారని చెప్పింది. కెవిన్‌కి ఆ ఊరు, పరిసరాలు బాగానే తెలుసు కాబట్టి, మేమిద్దరం వెతకటానికి బయల్దేరాం. ఆ రాత్రి చాలా పొద్దు పోయేవరకు వాళ్ళ బాబాయి తరుచు వెళ్ళే ప్రదేశాలన్నీ గాలించాం. ఎక్కడా ఒక క్లూ కూడా దొరకలేదు. ఆ రాత్రికి అక్కడే ఉండి, మర్నాడు పగలంతా మేం కొంత దూరంలో ఉండే ఆయన మిత్రుల ఇళ్ళు వగైరా అన్నీ వెతికాం. ఎక్కడా జాడ తెలియలేదు. పోలీసులు కూడా ఏక్టివ్‌గా వెతుకుతున్నారని తెలిసింది. ఆయన క్రెడిట్ కార్డుగాని, ATM కార్డుగాని ఎక్కడైనా వాడినట్టు తెలిస్తే, ఆయన ఎటు వెళుతున్నాడో కొంత ఐడియా వస్తుంది. పోలీసులు ఆ సమాచారం సేకరిస్తున్నారు.

ఆ మర్నాడు మాకు ఆఫీసులో చాలా ముఖ్యమైన మీటింగు ఉండటం వల్ల, ఆరోజు సాయంకాలం మేం బయల్దేరక తప్పలేదు. మళ్ళీ ఒకటి రెండు రోజుల్లో వస్తానని, ఈలోగా ఏదైనా సమాచారం దొరికితే వెంటనే తనకు తెలియజేయమని తన కజిన్‌కి చెప్పి కెవిన్ బయల్దేరాడు. తిరిగి వెళుతున్నపుడు ఆయన చాలా విచారంగా కనిపించాడు. వచ్చేటప్పుడు ఆయన మాటల్లో ఉన్న విశ్వాసం ఇప్పుడు కనిపించటం లేదు. ఎక్కువ తన అంకుల్‌తో తనకున్న అనుబంధం గురించే మాట్లాడాడు. తన చిన్నప్పుడు అంతా చాలా దగ్గర్లోనే ఉండేవాళ్ళమని, బాబాయి తనకెప్పుడూ అండగా నిలిచేవాడని చెప్పాడు. ఇక్కడికి వచ్చాక, తనకి అవసరమైనప్పుడు ఆయన ఎలా సహాయం చేసిందీ, అలాగే ఇటీవలి కాలంలో తన తోడు ఆయనకి కావలసి వచ్చినప్పుడు, తనకోసం ఎంత వాత్సల్యంతో ఆయన ఎదురు చూసినదీ వివరంగా అనేక సంఘటనలు ఉదహరిస్తూ చెప్పాడు. ఆ మాటలు వింటోంటే నాకు కూడా చాలా దుఃఖం కలిగింది. ఆయనకేమీ కాకుండా, క్షేమంగా తిరిగి రావాలని దేవుణ్ణి కోరుకున్నాను.

మేం తిరిగి వచ్చే సరికి బాగా చీకటి పడింది. కెవిన్ ఇల్లు మా ఇంటికి చాలా దగ్గిరే. నిన్ను డ్రాప్‌చేసి వెళతానని ఆయనన్నాడుగాని, ముందు మీ ఇంటికి వెళితే, అక్కణ్ణించి నేను నడిచైనా వెళ్ళగలనని చెప్పాను. వాళ్ళ ఇల్లు , అటూ ఇటూ ఇళ్ళు లేకుండా, కొంత ఐసొలేటెడ్‌గా ఉంటుంది. డ్రైవ్ వే చాలా పొడవుండి, చుట్టూ చెట్లుండటం వల్ల ఇల్లు బయటకి కనిపించదు. మేము నెమ్మదిగా లోపలికి వెళ్ళే సరికి, అక్కడ మరొక కారు ఆగి ఉంది. ఈ కారు ఎవరిదబ్బా అనుకుంటూ కెవిన్ హడావిడిగా కారు దిగి, అటువైపు పరిగెత్తాడు. కొంచెం దూరంలో అనుసరించిన నాకు కారులో ఒక వృద్ధుడు కూర్చుని ఉండటం, అది చూడగానే కెవిన్ కళ్ళలో నీరు తిరగటం లీలగా కనిపించింది.

***

ఆ తరువాత చాలా రోజులు నాకు, వీలున్నప్పుడల్లా ఏట్రియం రిటైర్మెంట్ హోంకి వెళ్ళటం, అక్కడ ఆప్యాయంగా మాట్లాడే ఒక వృద్దునితో కాలక్షేపం చెయ్యటం అలవాటుగా మారింది. ఆయనకి నేనెవరన్నది గాని, నా పేరుగాని ఎన్ని సార్లు చెప్పినా గుర్తుండవు. అయినా ఫరవా లేదు. తన సుదూర గతం నుంచి ఆయన నెమరువేసుకునే అనేక అనుభవాలు ఎంత సేపు విన్నా, ఆసక్తికరంగానే ఉంటాయి. *