కవిత్వం

ఎవరు? ఎవరు?

ఆగస్ట్ 2015

సిపాపల్ని కాగితం పడవలుగా చేసి
కాల ప్రవాహంలో వదిలి పెడుతున్నదెవరు?
అలల తాకిడికి ఉయ్యాల లూగే పడవల్ని చూసి
ఆనందంతో కేరింతలు కొడుతున్నదెవరు?

మసి పట్టిన ఆకాశానికి
ప్రతి ఉదయం వెల్లవేస్తున్నదెవరు?
నిశి పట్టిన మౌనవ్రతాన్ని
వేల పక్షి గొంతుకలతో భగ్నం చేస్తున్నదెవరు?

నిలకడలేని నన్ను
ప్రపంచమనే పదబంధ ప్రహేళికలో
ఒక నిలువు ఆధారంగా
నిలబెట్టినదెవరు?
ఎప్పటికీ ఎవరూ పూరించని విధంగా
ఈ ప్రహేళికను రూపొందించినదెవరు?

చుట్టూ వరికంకులు విరగకాస్తున్నా
ప్రతి మెతుకు మీదా పట్టుబట్టి
ఒక పేరు రాస్తున్న దెవరు?
నిండు వెలుగుల కోసం
నిత్యం పరితపిస్తుంటే
బ్రతుకు దీపాల్ని ఒకటొకటిగా
ఆర్పివేస్తున్న దెవరు?

 

(మొదటి ప్రచురణ: తానా తెలుగు వెలుగు 2015)