ఇక్కడ సంభాషణల్లో మిత్రులెవర్నైనా మెచ్చుకునేటప్పుడు ఆ వ్యక్తి brought out the best in me అనే ప్రయోగం తరచుగా వాడుతూ ఉంటారు. ఈ మాట నాకు చాలా నచ్చుతుంది. ప్రతి మనిషిలోనూ మంచివి, చెడ్డవి గుణాలు కలగలిసే ఉంటాయి. అంతేకాకుండా, సాధారణంగా మనకు మనంగా చేసే పనులకన్నా, ఎదుటి వారికి స్పందించి చేసే పనులు, చెప్పే మాటలే ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా కొందరు మనలో నిద్రాణంగా ఉన్న మంచి లక్షణాల్ని తట్టిలేపితే, మరి కొందరు మనలో ఉన్నట్టు మనకే తెలియని తామస గుణాల్నివెలికితీస్తారు. మన స్పందన అనే గీటురాయి నుపయోగించి ఎవరు ఎటువంటివారన్నది తెలుసుకోవటం ఒక పధ్ధతి.
సాహిత్యం కూడా ఒక మిత్రుని వంటిదే. ఎదుటివారిని అర్థం చేసుకోవటం, వారి కష్టసుఖాలను మనవిగా అనుభవించ గలగటం అది నేర్పిస్తుంది. దైనందిన జీవితంలో మన అనుభవంలోకి రాక మరుగున పడిపోయిన అనేక సున్నితమైన అనుభూతులను సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం మనలో కలిగిస్తాయి. మంచి సాహిత్యం ఎప్పుడూ గుర్తింపు లేకుండా చీకటిలో మిగిలిపోయిన వాటిపై వెలుగును ప్రసరింపచేస్తుందన్నది కేవలం కవితా వస్తువులు, అంశాలకే పరిమితం కాదు, మన అనుభూతులకు కూడా అది వర్తిస్తుంది. పువ్వులు వాడిపోకుండా పదేపదే నీళ్ళు చల్లి వాటిని తాజాగా ఉంచినట్టు, ఎవరో పలికిన అమృత వాక్యాలు మన మనససుల్ని నవనవోన్మేషంగా ఉంచటానికి దోహద పడతాయి. ఇదే సాహిత్యానికున్న అతి పెద్ద అవసరం, దాని ప్రయోజనమూను. ఎన్ని శతాబ్దాలు గడిచినా వేరే ఏ ప్రత్యామ్నాయమూ దీని స్థానాన్ని తీసుకోలేవు. ధనం, వస్తువు, ఇతర వినోదాలు అంతకంతకూ జీవితంలో మరింత ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకొనే ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ విషయం ఒక సారి చెప్పినదే అయినా, మళ్ళీమళ్ళీ గుర్తు చెయ్యాలనిపిస్తుంది.
తనకు పుస్తకాలు చదివే అలవాటు లేదని, దానివల్ల నష్టమేముందని ఇటీవల ఒక మిత్రుడు నన్నడిగాడు. నిజమే, సాహిత్య స్పర్స, పుస్తకాలు చదివే అలవాటు లేకపోయినా జీవితాన్ని ఆనందంగా, అర్థవంతంగా, నలుగురికీ ఉపయోగపడే విధంగా గడిపేవారు అనేకమంది ఉంటారు. అయితే, పుస్తక పఠనం వల్ల అది మరింత కాంతివంతం అవుతుందని నా నమ్మకం. ఏదీ కాకపోయినా, జీవితంలో అవసరమైనప్పుడు కనీసం ఒక మిత్రునిగానైనా పుస్తకం ఉపయోగపడుతుంది గదా. ఆ విషయమే అతనికి చెప్పాను. సమాచార విప్లవం వల్ల విజ్ఞానం వివిధ వనరుల ద్వారా విస్తృతంగా లభ్యమౌతోంది. అనేక మంది అనేక విషయాలపై తమ అభిప్రాయాలు వెల్లడించటం, వాటిపై చర్చ నడపటం జరుగుతోంది. ఈ ఉధృతిలో మన విరామకాలం ఎక్కువగా తెరలు, గోడలకి వినియోగమై పోవటం వల్ల, పుస్తకానికి దూరమయ్యే ప్రమాదం ఉన్నదా అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. దీనిపై ఎవరికి వారు అంచనా వేసుకోవటం మంచిది.
త్వరలోనే మరొక సంవత్సరం మన నుంచి శెలవు తీసుకుంటున్న సందర్భంలో విరమణ గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి. అందరికీ ఉన్నట్టే కవులు, రచయితలకు కూడా విరమణ వయస్సు ఉంటుందా? అనే సందేహం అప్పుడప్పుడూ కలుగుతుంది. వ్యక్తులను బట్టి అది ఉండవచ్చు, ఉండకనూ పోవచ్చు. కొందరు తొలి వయసులో బ్రహ్మాండమైన రచనలు చేసి, వయసు పెరిగిన కొద్దీ ఆ సామర్థ్యం తగ్గినట్టుగా కనిపిస్తారు. దీనికి వ్యతిరేకంగా జరిగే పరిణామం, అంటే వయసు పెరిగేకొద్దీ మెరుగైన రచనలు చెయ్యటం కొందరి విషయంలో మనం గమనిస్తాం. కొందరు మొదలు పెట్టటమే ఆలస్యంగా మొదలు పెడతారు. ఏదిఏమైనా , రచనలు ఎప్పుడు మొదలుపెట్టాలన్నదానికి బాహ్య ప్రేరణ ఉపయోగపడినా, ఎప్పుడు ఆపాలన్నది మాత్రం తమంతట తాముగానే తెలుసుకోవటం మంచిది. అటువంటి సంయమనం పాటించగలిగే రచయితలు అరుదుగా ఉంటారు. వారు అభినందనీయులు.
అలాగే, కాలంతోబాటు కొత్త తలపులు చిగురిస్తూనే ఉంటాయి. కొత్త కలాలు గళాలు విప్పుతూనే ఉంటాయి. ఈ వాకిలిలో విరబూస్తున్న అటువంటి నూతన కుసుమాలకు కూడా ఆభినందనలు!
(Picture : Keri Muller - Cape Town (South Africa) )
మీ అభిప్రాయాలూ చాల సమర్ధనీయం .కృతజ్ఞతలు.కీప్ ఇట్ అప్
మీ సూచనలు కవులు తప్పక తెలుసుకోవలచిన సమయం. ఆది సాహిత్య విలువలకు మంచిది.
రవిశంకర్ గారూ మీ మాటలు కూడా నీళ్లు చల్లిన పూవులు మాదిరిగా తాజాగానే ఉన్నాయి.మంచి మాటలు పదేపదే అయినా మననం చేయటం మేలే చేస్తాయి కదా .యిక విరమణ గురించి యిందులో ఎందుకు ప్రస్తావించారో గానీ ,అది ఒక ప్రత్యేక చర్చ గా పెట్టి వుంటే బాగున్నని పించింది .