కవిత్వం

పిల్లా… నీ పేరేంటిలా…

01-మార్చి-2013

పదహారణాల తెలుగు పిల్ల ఖాదర్ లక్ష్మి
మెరకవీధి .. శివాలయం పక్కన
రెండో సందు..పాతబడ్డ కొత్త ఇల్లు
” శివుడు నా చుట్టమే…
వాడి గుడికీ, నా ఇంటికీ చుట్టాలు తక్కువే..”
అంటూ నవ్వే చక్కదనాల పిల్ల

పిల్లా.. నీ పేరేంటిలా ఉందంటే…
ఏమే వోసే అంటావేంటి.. మర్యాద నేర్పలేదా
అంటూ నీలిగే పిల్ల..
పుట్టే పిల్లలు చస్తున్నారని… పస్తులుండి
దర్గా దగ్గర పొర్లించి పొర్లించి పెట్టారట పేరు..
వాళ్ళకప్పుడే తెలుసేమో..
బ్రతుకంతా పోర్లాడాలని
కళ్ళల్లో నీళ్ళతో.. కిసిక్కున నవ్వే పిల్ల
మనిషి నలుపే.. నిలువు నిపాదం మెరుపే..

ఖాదర్ లక్ష్మి నా చుట్టమూ కాదు.
స్నేహితమూ కాదు..
డాన్సింగ్ పిల్లింటి కొచ్చావా
అంటూ పెద్ద కళ్ళేసుకొని అడగ్గానే
ఆ కళ్ళ వాకిళ్ళలో ఇల్లుకట్టేసుకోవాలన్నంత ప్రేమ నాకు..
నాకు స్నేహితురాళ్ళు ఉండరమ్మాయ్
అంతా రాళ్ళేసేవాళ్ళే
అంటూ.. కిలకిలా నవ్వే పిల్ల

విరిగుతూ ఉండే పల్లెటూళ్ళ స్టేజీల్లో
పెరుగుతూ ఉండే మగాళ్ళ కోరికల గేజీల్లో
వొళ్లు హూనమయ్యేలా డాన్సాడే పిల్ల
వొళ్ళు బాలేకపోతే మా వాళ్ళు చూసుకుంటారు
మనసు బాలేకపోతే నువ్వే రావాలమ్మాయ్
అంటూ ఆజ్ఞాపించే పిల్ల

కాకిలాంటి వాడితో కవురంపింది ఓసారి
ఖాదర్ లక్షి .. విచారంగా ఉంటె..
మనసంతా ఒకటే ఖరాబైంది..
” నువ్వు బాగా చదువుకున్నావు కదా.. చురక లాంటి చురుకు ప్రశ్న”
ఏదో..అలా అలా.. నీళ్ళు నములుతూ నేను
ఓ మాటడుగుతా ..చెప్పమ్మాయ్ …
ఆ ముగ్ధ మనోహరి ముందు మౌనంగా తలాడిస్తూ నేను..

గొప్ప గొప్పోళ్ళు రంగు హంగు స్టేజీ లెక్కి ఆడేది ఈ డాన్సే కదా…
వాళ్ళ మీద లేని ముండ కేసులు..
మా పేద ముండల మీదేందుకు ??.. గట్టిగా కనుక్కో..
హుకుం చేస్తూ ధిక్కార స్వరం ఖాదర్ లక్ష్మి..

నిజమే.. ఎందుకు.. డాన్సు బేబీ డాన్సులకు..
వొళ్ళంతా చూపిస్తూ ఊగిపోతున్న తరానికీ
వాళ్లకి కాపలా కాస్తున్న ఖాకీలకు..
వేస్తున్న వెర్రి పోలికేకలకు…
అలవాటైపోయి..ఇప్పుడే నిటారైంది నా నడుం..
నేనోటి చెప్తా వినమ్మీ ..
వాళ్ళ మెడ తగిలించో లంజ కేసు..
డాన్సాడే ప్రతీదీ.. లంజ ముండ కాదని చెప్పు..
లేదా మా అందరిదీ
ఒకటే జాతని వోప్పుకోమను…
మాకు పోటీగా తప్పుకోమను..
చెప్పిందో తీర్మానం…

మొదలైంది.. నాలో అంతర్మధనం..
చర్మాలను దాటి.. కణాలను కుదిపి..
మెదడుని మెదిపే … అస్తిత్వ ప్రశ్న..
ఇంతకీ .. ముండలెవరు.. ?? వాళ్ళా మనమా..
చిలకలూరిపేట నుండి
చీకాకులం దాకా ఒకటే ప్రశ్న…

అసలు సిసలు స్టేజీ ఇప్పుడెక్కింది ఖాదర్ లక్ష్మి .
డాన్స్ ఆడడానికి కాదు…ఆడించడానికి…!!

(రికార్డింగ్ డాన్సులు చేసేవాళ్ళు, వ్యభిచార వృత్తి చేయరు ( సర్వ సాధారణంగా).. వ్యభిచారం వృత్తిగా చేసుకున్నవాళ్ళు డాన్సులు అడాల్సిన అవసరం లేదు. లీగల్ గా రికార్డింగ్ డాన్సర్లపై కేసు నమోదు చేయాలంటే వేరే సెక్షన్ లేదు. అందువల్ల ప్రోస్టిట్యూషన్ కేసులు నమోదు చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ కుటుంబాలు, పిల్లలు చాలా మనో వేదన, ఇంకా హరాస్మెంట్ కి గురి అవుతున్నారు. ” డాన్సు బేబీ డాన్సు మీద లేని కేసులు.. మా మీదేందుకు?? ” అని ఒక రికార్డింగ్ డాన్సర్ అడిగిన ప్రశ్న ఈ కవితకి ప్రేరణ. దీని ద్వారా వచ్చే దూషణ, భూషణ, తిరస్కారాలకు నేనే పూర్తి బాధ్యత. — సాయి పద్మ )