కవిత్వం

భయపడతావెందుకు?

జనవరి 2013

అచంచలమైన ఆత్మ విశ్వాసాన్ని ప్రకటిస్తూనే
అశాశ్వత అందాన్నెందుకు వెతుకుతావు?

అనంత శూన్య మహా నాదంలో
అపస్వరమెందుకు వింటావు?

అంతరీక్షణ ప్రళయ తాండవం లో
ఆత్మను ఎందుకు అభాసు చేసుకుంటావు?

జీర్ణించుకోలేక నువ్వు కక్కిన వమనం ..
ఒకప్పుడిష్టంగా భుజించిన కీర్తుల విందని ఎందుకు గ్రహించవు ?

నీ ఆకళ్ళ వాకిళ్ళలో
మనఃదీపాన్నెందుకు కొండెక్కిస్తావు?

చీకట్ల మిణుగుర్ల ఊతంతో నడుస్తూ..
అస్తిత్వ వెలుగులంటే భయపడతావెందుకు?

నిజాన్నే చూస్తానంటూ
ఆత్మ విధ్వంసపు దుప్పట్లో శీతముసుగేస్తావెందుకు?

అస్ఖలిత బ్రహ్మచారినంటూ
అప్రాప్త సుందరి కోసం అర్రులు చాస్తావెందుకు?

తెగిపడిన బతుకు శకలాల నడుమ
స్వప్న స్ఖలనాన్నెందుకు ఆశిస్తావ్ ?

స్త్రీ కావడమే సర్వైశ్వర్య మైనప్ప్పుడు
మేధను మధించని ఇల్లాలి వవుతావెందుకు?

మనిషి కావడమే మహోత్కృష్ట మైనప్పుడు
మేధో మైధునం లో కాగిపోతావెందుకు ?

మహోన్నత కళల అవిష్క్రుతి మాని
మద్యం సీసావై మగ్గిపోతావెందుకు ?

అంతులేని ఆవేదనతో విరిగిన వేణువుకు
మరిన్ని గాయాలను గరుపుతావెందుకు ?

అవధులు లేని అనురాగం మనస్సు దాల్చి..
అక్షరాన్ని సాకి, పెంచి, తరించి..
అమ్మా’ అని పిలువరాక ..లంజా’ అంటావెందుకు?