కవిత్వం

రైనా బీతి జాయే …!!

ఏప్రిల్ 2014

రైనా బీతి జాయే …!!

ఎందుకొస్తారు ఎవరైనా .. ఆకాంక్షలని అదిమిపెట్టి, జీవితానికి స్తేపిల్ గా గడిపేస్తున్న, వ్యగ్ర మోహ ప్రపంచంలోకి , అనుభూతులని తాకట్టు పెట్టి , ఎంత సంతోషంగా ఉన్నామో అని , దుఃఖంగా మురుసుకునే ముసిరిన మనసుల్లోకి .. ఎందుకు రావాలి ఎవరైనా .. నీ జ్ఞాపకాల నీడల్లో సేదదీరుతూ.. అనుభూతుల్లో నాని , నాని చిరునవ్వుగా కన్నా మేలాంకలిక్ గా మారిన నీ దగ్గుత్తికని నువ్వంత ప్రేమిస్తున్నప్పుడు .. చోటులేని తనంతో ఉక్కిరిబిక్కిరి అవరా .. జ్ఞాపకాలు అవమేమో అని బెంగేట్టుకుంటున్న నీ ప్రస్తుత శకలాలు ..? ఎవరో ఆపే ఉంటారు.. కన్నీరు తోనో, నిస్సహాయత తోనో, కరుణ తోనో… ఇవేవీ కాకుండా ..విడిచిన బట్టల్లా మరచిపోయే మొహంతోనో.. స్వైరత్వం మరణం కన్నా మహాపాపమనే సాంప్రదాయవాదం తోనో.. విషయం ఏదన్నా .. ఆగటం ఖాయం.. నువ్వు రావన్న వార్త మాత్రమే నా వచనానికి వర్తమానం అన్నది కూడా నిశ్చయం .. జ్ఞాపకం కాలేని తెలివైన ప్రియతమా .. నేనిప్పుడు జ్ఞాపకాలు లేని మనిషిని.. విరహాన్ని విరజాజి మల్లే అనుభవించే అస్కలిత రాధను .. నీ ఆభద్రతని మోసే కుబ్జని కానందుకు.. మాసిన జ్ఞాపకాల మంగళ స్నానం చేసినంత సంతోషం .. నీ భవిష్యత్ భయాల అష్టావక్రాలు మోయనందుకు నా మనసు ఉల్లాస విశుద్ధం పంజరమే ఒక ప్రపంచం… చిన్ని పిట్టా.. ఎగరటమే స్వేచ్ఛ కాదు ..!! –సాయి పద్మ
కహా సే ఆయీ బదరా?
నిత్యం వడివడిగా విచ్చుకొనే ముడుచుకొనే మొహాల రంగుల్లో , నువ్వేక్కడున్నావో, నాకు తెలియలేదు. ఉన్నది నువ్వో కాదో కూడా అర్ధం కాలేదు. ఇంత సంఘర్షణ అవసరమా, వెలి అయినా , వెలితి లేకుండా బ్రతికేస్తున్నా కదా అనుకున్నా ఒకసారి…!
సమాజపు శబ్దాలకి , కవిత్వపు ఇయర్ ప్లగ్స్ పెట్టి, అప్రాప్తాలనీ, అవ్యక్తాలనీ తలచుకుంటూ , ఆనందంగానే ఉన్నానుగా అనుకున్నా మరోసారి ..!
ఇంకేదో ఉందని రాలిన గుల్మొహర్ గుత్తుల దగ్గర్నుంచీ, కనపడే ముళ్ళతో కనబడి, చిదిమితే కన్నీరెట్టుకొనే కలబంద దాకా చెప్పింది. కహా సే ఆయీ బదరా.. ఈ పాట విన్నప్పుడల్లా వచ్చే దుఖమూ చెప్పింది.
చెప్పినదాన్ని వినటం, రెక్కలున్నాయని ఎగరటం తెలియని దాన్ని కనుక ఇక్కడే , ఇలాగే కూలబడ్డాను. మహా మొహానికి మోకాలడ్డుతూ..!
ప్రపంచమో పంజరం.. చిన్ని పిట్టా .. దాటి ఎచటికి ఎగిరేవు ?

March 27, 2014 1:00 AM
(జయభేరి మొదటి భాగం – కవిత 5)


దేహ ఉగాది

నిత్యం ఉగాది శరీరంలోనే ఉంది..
వగరు స్పర్శల వొణికే కొత్తదనం,
నమూనా మూసల్లో నలిగే చేదుదనం
ప్రియాన్వితంలో వొదిగే తియ్యదనం
నిష్టూర స్పర్శల పుల్లదనం
మమ’ అనుకోని తడిలేని గొడ్డు కారం
చెమరింతల అమరికలో అలవాటైన ఉప్పదనం
మళ్ళీ వచ్చి కలవరపెదతావెందుకు ఉగాదమ్మా
దేహమో రణరంగాల ఉగాది పచ్చడీ,
మనసో , విడదీయని తోరణాల పచ్చని జ్ఞాపకం అయినపుడు..!!

March 21, 2014 12:21 PM
(జయభేరి మొదటి భాగం – కవిత 6)