మొదటి స్త్రీ:
ఓ ప్రియుడా ..!
జీవిత చరమాంకం లోనూ మోహపు చారికలే గుర్తొస్తున్నాయి
దశాబ్దాల ప్రణయపుటలు ఒకటీ ఒకటీ చెద పడుతున్నా
నా అస్తిత్వం వివశ వివస్త్రాల వేదనలో నిస్త్రాణమవుతున్నా
నులిపోగులా ఉన్న నమ్మకం, మెదడు లోగిల్లో నులిపురుగులా మారినా
స్థలకాలాదుల కతీతంగా , నేనే ఏమారిపోయినా
మనఃసాగరాల ఘోషలో, ఉప్పునీటి అభిషేకాలలో
నమ్మకంగా నీ ప్రేమని వెతుక్కుంటూనే ఉన్నాను
మరుజన్మని నమ్మని కారణంగా దేహంలో చరిస్తున్నా గానీ
నీ మనస్సావరణంలో నా సంచారం నియంత్రితమని తెలీదూ
ఇంతకీ వోయి ప్రియుడా …
ప్రేమించావా ? నమ్మించావా ???
రెండవ స్త్రీ:
వోయి స్వమాతృ ప్రియుడా..!
తల్లితండ్రులను కావడి భుజాలపై మోసిన శ్రావణకుమారుడు ఆదర్శమైతే
తల్లిని ఇష్టకామ్యార్ధ ప్రియునికి అప్పగించిన నేను శ్రవణకుమారినే
అనర్ఘ రత్నంలాంటి నా బాల్యం, మీ ప్రణయఘట్టాల చర్వితచరణం
నా తల్లిని, ముళ్ళకంచెల సాంప్రదాయపు కళ్ళనుండి కాపు కాస్తావనుకున్నా గానీ,
ఆ కంచెని ఇష్టంగా , ఆమె వొంటికి చుడతావనుకోలేదు
ఎంత ముచ్చటేసే మేధావితనం! మీ సాంప్రదాయపు కర్ర విరక్కుండా
ఆమె స్వేచ్చా స్వప్నాన్ని , సుప్త భుజంగాన్ని చేసావు
మొగుని వెనుక తలదించుకున్న అవనత మేధని చూడటం అలవాటైనా
ప్రియుని వెనుక ధీర అవుతుందన్న ఆశ .. బేలగా మారింది
దించుకున్న పాపిటలోని అరుణారుణ సింధూరం
నిన్ను ఆహ్లాదించిందేమో గానీ, నాకు వొళ్ళు జలదరిస్తోంది
ఇంతకీ నా తల్లి ప్రేమికుడా ..!!
వాంచించావా ?? వంచించావా???
ఒకానొక పురాపురుషుడు:
ఓ ప్రియ మహిళలారా .!!
పాలకులు పాలితులైనా, పాలితులు పాలకులైనా
సృష్టి, స్థితి, లయ, కార్యా కారణాలు గతులు తప్పవూ
నాలాంటి పాలక పురుషుల మతులు చేడిపోవూ..
ఇంత అర్ధం కాదేమిటమ్మా ? మీ అందరికీ ?
సహజీవనం అని మాటవరసకి అన్నాం గానీ, సహగమనం అని మనసులో అనుకున్నాం కదా
ప్రాయోపవేశం ఐచ్చికమే , సీతకైనా, మరో చీర కట్టిన నాతికైనా
ఐచ్చికం వెనుక ఉన్న ఇచ్చ మాత్రం మాదే సుమా ..
అవనత, ఆజ్ఞాపాలిత, తనూలతిక .. అహో.. ఎంత అందమైన ఆభరణం
మోకులతో కట్తెలనీ, తాళ్ళతో జంతువునీ , సూత్రంతో ఇల్లాలినీ ,
అనుమానపు మంత్రంతో ప్రియురాలినీ కట్టడి చేస్తాం , ఆ మాత్రం తెలియనివారా?
లోకకళ్యాణ సదాశయానికి అది నిర్ధారిత సదాచారం
ఇంతకీ ప్రియ పాలిత మహిళలారా ..
నమ్మారా ?? నమ్మినట్లు నటించారా??
కొన్ని ఆలోచనల పరమార్థాల సమన్వయం బాగుంది
అభినందనలు
నులిపోగులా – నూలిపోగు
మరుజన్మని నమ్మని -> మరుజన్మ నమ్మని…….ఈ పదాలను ఒకసారి చూడండి
నిగూడంగా ఉంది. అర్ధవంతంగా ఉంది. పాఠకుడి చేత మళ్ళీ చదివింపజెస్తుంది. బావుంది
స్త్రీలు నమ్మారా? నమ్మినట్లు వంచించారా ? ప్రశ్న లొ చాలా అర్ఢం ఉంది.
నటిస్తూ… నమ్మిస్తూ.. జీవిస్తున్నట్టు నటిస్తున్నారేమో…
ప్రాయోపవేశం ఐచ్చికమే , సీతకైనా, మరో చీర కట్టిన నాతికైనా
ఐచ్చికం వెనుక ఉన్న ఇచ్చ మాత్రం మాదే సుమా ..
ఇది మాత్రం నులిపోగులంత వ్యాధిగ్రస్త జీవన వాస్తవం