కవిత్వం

ఖాళీల అంచుల్లో…

02-ఆగస్ట్-2013

ముందుకీ వెనక్కీ నడుస్తూనే ఉన్నా..

కొన్ని అడుగులు నీతో,కొన్ని నాలోకి వేస్తూ
నీటి ఊట లాంటి ఆశల్ని, స్వేదజాలం చేసుకొని
ఉబికోస్తున్న ఆవేశాన్ని, వేసవి స్నానం లా కడిగేసిన
నీ నిబ్బరం నాకు అబ్బురం అప్పుడప్పుడూ
ముసుర్లలో,మొహమాటపు చెలమల్లో.

నువ్వు చెప్పలేని మాటల్ని విందామనే
అనుకున్నా ఈ పూట, అయినా నిశ్శబ్దం ఇంత సాధనేంటి నీకు?
జలతారు తెరలు పలచనే,అవే అద్దాలైతే
నువ్వూ,నేనూ,ఉంటాం అంతే, ఒకరికొకరు వినపడకుండా
ఒకే గదిలో రెండు వాచీల సమయాల్లా..

నీదో మౌనమైతే, నాదో అంతర్ముఖం
ఏమీలేని తనాల గురించి ఆలోచించటం మొదలెట్టా, రెండు రాళ్ల మధ్య ఖాళీల్లా
అనిపించిన సమూహాలన్నీ, పగుళ్ళలా కనిపిస్తున్నాయి ఇప్పుడు
నది కన్నా తీరమే బావుంది అనిపిస్తోంది,లోతుగురించి పట్టింపు లేనప్పుడు..
ఎన్ని అక్షరాల, కవిత్వాల,పద్యాల,పాదాల నడకలతో
తీరుతుందీ నీ మౌనపు మాటల మోహపు దాహం..!!