సంపాదకీయం

వాకిలి ఇకనుండి వారానికోసారి

జనవరి 2018

మొన్నటి డిసెంబర్ సంచికతో వాకిలికి ఐదేళ్ళు నిండాయి. ఒక మిత్రుడు చెప్పినట్టు ఇక వాకిలికి బాలారిష్టాలన్నీ తీరిపోయినట్టే లెక్క.

ప్రధాన స్రవంతికి చెందిన అచ్చుపత్రికల్లో సమకాలీన సాహిత్యం కనుమరుగవుతుడటం వలన వెబ్ పత్రికలమీద మరింత భారం పెరిగిపోతున్న సందర్భం ఇది. అచ్చు పత్రికలకున్న పరిమితులవల్ల కావొచ్చు, వ్యాపార ధోరణి వల్ల కావొచ్చు, ఇప్పుడు సాహిత్యం సింగిల్ పేజీకి మాత్రమే పరిమితమయింది, అదీ వారానికి ఒక్కపేజీకి మాత్రమే! దీనివల్ల, సీరియస్ సాహిత్యాన్ని ఆశించే పాఠకులకు నిరాశే ఎదురవుతుంది. ఇప్పుడేర్పడుతున్న సీరియస్ సాహిత్యపు ఖాళీని పూరించడానికి, స్థలపరిమితుల్ని, భావపరిమితుల్ని దాటుకుని వాకిలి తనవంతు బాధ్యత తను నిర్వహిస్తుంది. ఇక ముందు కూడా నిర్వహించబోతోంది.

ఒక పత్రికను నడిపించడం పైకి కనిపించినంత సుళువైన పనేం కాదు. గత ఐదేళ్ళ నుండి అన్ని రకాల సాహిత్య ధోరణులకు తలుపులు తెరిచి, సమతూకం పాటిస్తూ, ప్రాంతాలతో, భావజాలాలతో నిమిత్తం లేకుండా కేవలం సాహితీ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని రచనలను ఎన్నికచేసి ప్రచురిస్తూ వస్తున్నాం. ఈ ఐదేళ్ళలో సంపాదకులుగా మేము నేర్చుకున్నది ఎక్కువే. ఇప్పుడు సీరియస్ పాఠకులు ఏం కోరుకుంటున్నారు, రచయితలు ఏం కోరుకుంటున్నారు అనే విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన కూడా వచ్చింది. అందుకే అటు పాఠకులకు ఇటు రచయితలకు మరింత దగ్గరవ్వడంకోసం ఈ కొత్త సంవత్సరంనుండి వాకిలి ఫార్మాట్ లో కొన్ని మార్పులు చేస్తున్నాం. ఇప్పటి వరకు వాకిలి ఒక మాస పత్రికగా మీ ముందుకు వచ్చింది. ఇకనుండి నెలకొకేసారి అన్ని రచనలను ప్రచురించకుండా, ప్రతి ఆదివారం కొన్ని మేలైన వాటిని ఎన్నుకుని ప్రచురిస్తాం. ఇలా చేయడంవల్ల సంపాదకుల మీద నెలాఖరుకల్లా ఒక సంచిక పూర్తి చేయాలన్న ఒత్తిడి తగ్గి, రచనల ఎడిటింగ్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధపెట్టేందుకు వీలవుతుంది. ప్రతీ రచన గురించి రచయితతో కూలంకషంగా చర్చించే వీలవుతుంది.

వాకిలిలో ప్రచురించే రచనల స్థాయి ఒక మెట్టు పెంచాలన్న ఉద్దేశ్యంతో ఈ మార్పు చేస్తున్నాం. ప్రతి నెలా వాకిలిని ఇష్టంగా చదివి, రచనలపై స్పందన తెలియజేస్తూ, మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్న పాఠకులు, ఈ మార్పును స్వాగతించి, ఎప్పట్లాగే సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. మరింత వైవిధ్యంతో, మరిన్ని ప్రయోగాత్మక రచనలతో మీ ముందుకు రావాలనుకున్న మా ఈ సంకల్పాన్ని ఆశీర్వదించండి.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో…