సంపాదకీయం

వాకిలి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

జనవరి 2014

కల నిజమయి ఎదురుగా నడుచుకుంటూ వస్తే?! అంతకన్నా ఇంకేం కావాలి! కొన్ని కలలు నిజమవుతాయి! సరిగ్గా ఏడాది క్రితం ఒక అందమైన కలతో పుట్టిన వాకిలి సగర్వంగా పన్నెండు సాహిత్యపుటడుగులు ముందుకేసి ఈ రోజు వార్షిక సంచికగా మరింత కొత్తగా అలంకరించుకుని మీ ముందుకు వచ్చింది.

వాకిలి లేని ఇల్లును ఊహించుకోలేం! అలాగే సందడి లేని ఇల్లు ఆత్మ లేని దేహం లాంటిది. ఏ ఇంటి వారి అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటి వాకిలి ఉంటుంది. కానీ ఈ ‘వాకిలి’ ఒక్కింటి వాకిలి కాదు. అనేక తెలుగు ముంగిళ్ళను కలిపి కుట్టిన అచ్చమైన స్వచ్ఛమైన సాహిత్య వేదిక. ఎలాంటి అరమరికలు లేని సాహిత్య సంభాషణలను ఆహ్వానిస్తూ, మీ అందరి సాహిత్య అభిరుచులకు తగ్గట్టుగా రూపుదిద్దుకుంటూ, నెల నెలా మీ ముందుకు వస్తూంది. నిజానికి మేము ఈ వాకిలిని ఊడ్చి కల్లాపి చల్లే వాళ్ళము మాత్రమే! ఈ వాకిలికి అసలైన ఆత్మ, అందమైన ముగ్గుల్లాంటి మీరే, పాఠకరచయిత(త్రు)లే!

ఐదువందలయాభైకి పైగా రచనలు, రెండువందలయాభై మంది రచయితలు, ౩ మిలియన్ వెబ్ హిట్స్… ఇదీ వాకిలి మొదటి సంవత్సరం రిపోర్ట్ కార్డ్. మీరు పంచిన ప్రేమ, మీనించి లభించిన స్పందన, మీ ప్రోత్సాహం కారణంగానే ఈ రోజు వాకిలి ఇలా నిలబడింది. అందుకు మీకందరికీ ధన్యవాదాలు!

వాకిలిని మరింత మెరుగుపరుస్తాయన్న నమ్మకంతో ఈ వార్షిక సంచిక నుంచి వాకిలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తున్నాము. ఈ మార్పులు మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాం.

వాకిలి ఇకనుంచి మాసపత్రిక గానే వస్తుంది. ‘ఈ వారం కవిత’కు మేము అనుకున్న స్థాయిలో రచనలు రాకపోవడం వలన ఆ శీర్షికను ఇంకా కొనసాగించాలా లేదా అని ఆలోచిస్తున్నాము.

వాకిలి ముందునుంచీ కవిత్వానికి పెద్దపీట వేస్తూ వస్తుంది. ఇకనించి కూడా కవిత్వాన్ని ప్రేమించేవారికోసం నెల నెలా కవిత్వంతో పాటూ ఒక ‘తెలుగు అనువాద కవిత’, ఒకటి రెండు ఇంగ్లీష్ అనువాదాలు, ‘నీరెండ మెరుపు’ లాంటి కవిత్వానికి సంబంధించిన శీర్షికలు, కవిత్వ సమీక్షలు, కవులతో ముఖాముఖం ప్రచురిస్తాము. ఇంతే కాకుండా నారాయణ స్వామి గారి ‘కవిత్వ ప్రపంచం’, కోడూరి విజయ కుమార్ గారి ‘కిటికీలో ఆకాశం’ ఉండనే ఉన్నాయి.

సాహిత్యానికి సంబంధించిన అన్ని అంశాలను స్పృశిస్తూ, వివిధ కోణాలు ప్రతిఫలించేట్టుగా వాకిలిని తీర్చిదిద్దే దిశగా ఈ సంచిక నుండి కొన్ని ప్రయోగాత్మకమయిన కొత్త కాలమ్స్ మొదలవుతున్నాయి. నవలా సాహిత్యాన్ని స్పృశిస్తూ మైథిలి అబ్బరాజు గారు రాసే ‘కడిమిచెట్టు’, గోదావరి జ్ఞాపకాలను పంచుతూ కాశీ రాజు గారు రాసే ‘కాశీ మజిలీలు’, మోహన తులసి గారి కలం నుంచి జాలువారే మ్యూసింగ్స్ ‘మోహన రాగం’తో పాటు సమకాలీన తెలుగు కథల మీద చర్చకి నాందీ పలికే మరో రెండు కొత్త శీర్షికలు ‘చర్చ’, ‘కథా కథనం’ ఈ సంచిక నుండి వస్తున్నాయి.

ఇప్పటివరకు ప్రచురితమైన ప్రతీ సంచికకి మేము అడిగిన వెంటనే రచనలు పంపిన రచయిత(త్రు)లందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. వాకిలికి ఇలాగే రచనలు పంపిస్తూ, మనసు విప్పి మీ అభిప్రాయాలు రాస్తూ, చర్చల్లో పాల్గొంటూ, ముందు ముందు కూడా మీరు ఇలాంటి సహకారాన్నే అందిస్తారని ఆశిస్తూ,

నూతన సంవత్సర శుభాకాంక్షలతో,

మీ
వాకిలి సంపాదకబృందం.