కబుర్లు

మధురాంతకం రాజారాం అవార్డుల విజేతలు

26-ఏప్రిల్-2013

ప్రసిద్ధ  రచయిత మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా  ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు 2011 కి స.వే రమేశ్, అఫ్సర్ లకు, 2012 కి మహమ్మద్ ఖదీర్ బాబు, వి. చంద్రశేఖరరావులకు ఇస్తున్నట్టు మధురాంతకం నరేంద్ర ప్రకటించారు. ఈ అవార్డులు మే 18 న హోసూరులో జరిగే కథకుల సదస్సులో ప్రదానం చేస్తారు. ఈ సారి హోసూరులో ఈ సదస్సు పెద్ద యెత్తున నిర్వహించే సన్నాహాలు చేస్తున్నామని నరేంద్ర చెప్పారు.

ఆయా సంవత్సరాలలో కథా రచనలో, కథాసాహిత్య విమర్శ రంగాలలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ఇస్తూ వుంటారు. ప్రతి ఏటా ప్రచురితమయ్యే కథావార్షికలోంచి ఒక ఉత్తమ కథకి, ఆ కథా వార్షికకి సింహావలోకనం రాసే విమర్శకుడికి ఈ అవార్డు లభిస్తుంది.

స. వే. రమేశ్, అఫ్సర్ ఇద్దరూ వాకిలి పాఠకులకు తెలిసిన వారే. సరిహద్దు భాషలో తెలుగు కథాపటానికి సరికొత్త హద్దులు గీస్తున్న కథకుడు రమేశ్. ‘ఆనవాలు’ శీర్షిక ద్వారా వాకిలిలో అఫ్సర్ పరిచితులే. అఫ్సర్ గారికి ఈ అవార్డు కథ సాహిత్య విమర్శకి లభించడం ఈ సారి విశేషం. 2010 లో ‘కథ-స్థానికత’ శీర్షికన కథాసాహిత్యం మీద ఆయన రాసిన వ్యాసాలు పుస్తకంగా వచ్చాయి.

దర్గామిట్ట కథల రచయితగా ఖదీర్ బాబు ఎందరికో ఆత్మీయుడు. కథాకథనంలో కొత్తదనం ఖదీర్ ప్రత్యేకత. వి.చంద్రశేఖర రావు గారు కూడా కథారచయితగా ప్రసిద్ధులు. 2012 కథా వార్షికకి ఆయన సింహావలోకనం రాశారు.