‘వాకిలి’లో మా మొదటి అడుగు మాకు తృప్తినిచ్చింది. మీ నించి లభించిన ప్రతిస్పందన, మీరు చూపించిన ప్రేమ మాకు కొండంత అండని భరోసాగా ఇచ్చింది. మారుమూల తెలుగు పల్లెల నించి దూరదేశాల దాకా కూడా ఎందరో ‘వాకిలి’ లో తమ ప్రవేశాన్ని అందమయిన/ ఆహ్లాదకరమయిన అనుభవంగా చెప్పారు. ఎందరో రచయితలు మా తొలి అడుగులో అడుగు కలిపి ఇక ముందు వాకిట్లో మనమంతా కలిసే వుంటామని, హాయిగా మనసు విప్పి మాట్లాడుకునే ఆరోగ్యకరమయిన, స్నేహపూర్వకమయిన వాతావరణం వాకిట్లో కనిపిస్తోందని అన్నారు.
ఇలాంటప్పుడు రెండో అడుగు వేయడానికి కాస్త బెరుకుగా వుంటుంది. మీలో మొలకెత్తిన కొత్త ఆశల్ని నిలబెట్టుకోగలమా,మీలోపల ననలెత్తిన కొత్త అభిరుచి చిగుర్ల వూపిరి కాపాడుకోగలమా అన్నది ఇప్పుడు మా ముందు వున్న బెంగ. ఆ బెంగ అలా మమ్మల్ని లోపల కాసింత దిగులు పెడుతూండగానే ఇదిగో ఈ రెండో అడుగు మీ వైపు!
2
తెలుగు కథా కేతనాన్ని ఢిల్లీలో ఎగరేసిన ప్రసిద్ధ కథకులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారికి ఈ సంచిక అంకితం చేస్తున్నాం. బెజవాడలో పెద్దిభొట్ల వారి వీధి ఎంత మందికి తెలుసో మాకు తెలియదు కానీ, తెలుగు కథానగరంలో పెద్దిభొట్ల సంతకం తెలియని వారు మాత్రం వుండరు.చాలా మంది కథకులు పల్లెల గురించి మాట్లాడతారు. బాధపడతారు. శ్రమజీవుల కన్నీళ్లని వాక్యాలుగా పొంగిస్తారు. కానీ, మాకు అర్థమయినంత మటుకు నిజమయిన మార్క్సిస్టు రచయిత మధ్యతరగతిని నిర్లక్ష్యం చెయ్యలేడు. మధ్యతరగతి కంటే దగుల్బాజీ లేదని కదా మార్క్సూ లెనినూ ఎక్కడో రాశారు. అలాంటి మధ్యతరగతి హృదయాన్ని, బుద్ధినీ కథలుగా మలిచిన అరుదయిన రచయిత పెద్దిభొట్ల.
అవార్డుల మీద మనకిప్పుడు పెద్దగా గౌరవం లేదు ఆ మాటకొస్తే! అవార్డుల్ని వెతుక్కుంటూ రచయితలు పరుగు పందాలు మొదలెట్టాక ఆ అవార్డుల మీదనే గౌరవం పోయింది. ముఖ్యంగా సర్కారీ వ్యవస్థలతో ముడిపడి వున్న అవార్డులు! పెద్దిభొట్ల వారికి పాఠకుల నించి లభించిన ప్రశంసలే తప్ప వేరే అవార్డులు అంతగా వరించిన దాఖలాలు లేవు. దానికి కారణం – ఆయనకి అవార్డులూ కమిటీలూ వాటి చుట్టూ జరిగే రాజకీయ తంతుతో ఎప్పుడూ ఏవగింపు. ఆయన ఏనాడూ అవార్డు అడ్రసు పట్టుకొని వెళ్లలేదు.ఇప్పుడు ఈ సాహిత్య అకాడెమీ అవార్డు కూడా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది మాత్రమే! ఈ సందర్భంగా‘వాకిలి’లో ఆయనకు అక్షర సత్కారం చేసుకునే అవకాశం దక్కినందుకు మాకు సంతోషంగా వుంది. మేము అడగ్గానే అంతకు ముందే వున్న వేరే రాత ప్రణాళికల్ని వాయిదా వేసుకుని పెద్దిభొట్ల వారి గురించి రాసిచ్చినందుకు సుజాత, అక్కిరాజు భట్టిప్రోలు, ఆలమూరు సౌమ్య, మంచి ముఖాముఖీ చేసిన పెద్దిభొట్ల వారి చిరకాల మిత్రుడు, ప్రముఖ కథకుడు వంశీ కృష్ణ గారికి మా ధన్యవాదాలు.
3
ఈ నేపధ్యంలో వర్తమాన తెలుగు కథా సాహిత్యం మీద తగినంత చర్చ జరగాల్సిన అవసరం వుందని ‘వాకిలి’ అనుకుంటోంది. ఇందులో భాగంగా సమకాలీన కథల మీద చర్చలకి నాంది పలికే కొన్ని శీర్షికల్ని మేం ప్రకటించబోతున్నాం. మొదట ‘కథలోపలి కథ’ అనే శీర్షిక ఈ సంచికతో మొదలవుతోంది. పాఠకులు గానీ, రచయితలు గానీ ఎవరయినా ఈ శీర్షికకి రాయవచ్చు. కథ రాయడం వొక ఎత్తు అయితే, ఆ కథని భిన్నంగా చదవడం ఇంకో ఎత్తు. కథ రాయడం వెనక రచయితలు ఎంత కష్ట పడతారో, ఆ కథనీ, కథాహృదయాన్ని అర్థం చేసుకోవడానికి పఠితకు అంతే ప్రయత్నం కావాల్సి వుంటుంది. కథ చదివాక ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలన్న ఆసక్తి సహజం. ఆ ఆసక్తిని అలా కాపాడుకోండి. వొక కథ చదివాక మీ ప్రశ్నల్ని గుర్తుపెట్టుకుని, వాటిని రాసి మాకు పంపండి. అవి ఆ కథ రచయితకు పంపి మేం సమాధానాలు సంపాదిస్తాం. ఈ పని మీకు మీరుగా కూడా చెయ్యవచ్చు. మీరే నేరుగా ఆ రచయితని సంప్రదించి, ఆ ప్రశ్నల్నీ, సమాధానాల్ని మాకు పంపించవచ్చు. దీనికి వొక నమూనాగా ఈ సంచికలో ‘కథలోపలి కథ’ శీర్షికలో ఇస్మాయిల్ పెనుకొండ కన్నెగంటి చంద్ర కథ ‘ చిట్టచివరిది’ చదివాక ఆయన స్పందనా, ఆయన చంద్రతో చేసిన చిరు ముఖాముఖీ మీకు అందిస్తున్నాం. వచ్చే నెల ఈ శీర్షికకి మీరే రాయవచ్చు. కానీ, వొక సారి మాకు ముందుగా తెలియజేయండి, మీరు ఏ రచయితని, ఏ కథని ఎంపిక చేసుకున్నారో!
సాహిత్యం పై లోతైన ప్రేమతో కూడిన చదువరితనాన్ని పెంచేలా చేస్తున్న పత్రిక ప్రయత్నాలకు అభివందనం.
ఇంతే అందంగా ఆహ్లాదంగా అలరిస్తూ ఆలోచింపచేస్తూ హత్తుకుంటూ మునుముందుకు సాగాలని కోరుతూ..
Keep Going!
Best Wishes.
గంట పాటు సాగే నా బస్ జర్నీ.. నిముషాలుగా మార్చింది వాకిలి. జస్ట్ లవ్ టు రీడ్ ఎవ్రి ఆర్టికల్ హియర్
అడుగుల నుండి పరుగులు పరుగుల నుండి దుముకుడు ఇలా వాకిలి పత్రిక అందంగా పరుగు లంకించుకోవాలని ఆశిస్తూ….
అభినందనలు!!!
గరికపాటి పవన్ కుమార్
రెండవ సంచిక వచ్చేసరికి రచనల స్థాయి పెరిగింది.చాలా బాగుంది.అన్నీ చదివిస్తున్నాయి.ఇటువంటి అంతర్జాల పత్రికలూ ఇంకా ఇంకా అవసరం. సంపాదక బృందానికి ప్రత్యేకంగా అభినందనలు.
కొత్తగా రాస్తున్నవారికి,ముందుతరం వారికి ‘వాకిలి’ వారధిగా నిలవాలి.
చాలా మంచి ప్రయత్నం. ఊరికే కథలూ గట్రా చదువుకోవడం కాకుండా రచయితలు వాళ్ళ సాహిత్యం గురించి మాట్లాడుతుంటే చదవడానికి బావుంది.
వాకిలి తొలి అడుగు ఆహ్లాదకరంగా..ఒత్తుగా కళ్ళాపి చల్లిన పచ్చని వాకిట్లో కి అడుగు పెట్టినట్లు గా హాయిగా ఉంది. ఆర్భాటాలు, హంగులకు ప్రాముఖ్యం లేకుండా సాహిత్యాభిమానుల్ని అందరికీ వాకిట్లోకి చడీ చప్పుడూ లేకుండా తీసుకొచ్చి కూచోబెట్టింది ఈ పత్రిక!
రాయడమే కాక, ఆ రాతల మీద చర్చ జరగాలి. “బాగుంది” అని ప్రశంసించడమే కాక ఎందుకు బాగుందో ఏది బాగుందో కూడా పాఠకులు చర్చిస్తే ఇది మరింత మంది సాహిత్యాభిమానుల్ని ఆకర్షిస్తుంది.
కొత్త శీర్షిక కూడా సృజనాత్మకంగా ఉంది!
వాకిట్లో కి మరింత మంది సాహితీ ప్రియులు చేరాలని ఆకాంక్ష !!
స్నేహాంజలి. మంచి ప్రయత్నము. ఇంతటి భాగ్యము అందిస్తోన్నందుకు ధన్యవాదములు.
baagundi