ఎడిటర్స్ పిక్

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

మార్చి 2017

దన కామరాజు పుస్తకాలపై మోజుతో, తనకు చదువురాకపోయినా ఎవరి చేతైనా చదివించుకుందామని వాటిని గుట్టుగా దాచుకున్న ఒక ముసలావిడ ఉజ్జాయింపుగా ఓ వందేళ్ల క్రితం తెలుగు సాహిత్యానికి అనుకోకుండా ఓ మేలు చేసింది. చదువొచ్చిన ఒక కుర్రాడి చేత ఆ పుస్తకాలను చదివించుకుంది. కులవిద్య అయిన పంచాగంతో పాటు, సంస్కృతమూ చదువుకుంటూ పండితుల దోవలో పోవాల్సిన ఆ కుర్రాడికి తెలుగు మీద మోజు పెరగటానికి ఆమె కూడా అలా కారణమయ్యింది. ఆ కుర్రాడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. పాండిత్యం వద్దనుకున్నాడు, అవధానాలు వద్దనుకున్నాడు. కథలు చెప్పాలనుకున్నాడు. అలా ఇలా కాదు: “భాష పరసీమలు చూడాలి. గజం యెత్తు పుస్తకాలు రచించాలి”. ఇదీ లక్ష్యం. తెలుగు సాహిత్యంలో శ్రీపాద ఒక అపూర్వమైన సంభవం. ఆయన పండితుల దారిలో పోకుండా కథలు చెప్పాలని పూనుకోవటం తెలుగు సాహిత్యానికి గ్రహస్థితి బాగున్న కాలం. ఆయనకు ఇంగ్లీషు రాదు, పైపైచ్చు హిందీ అంటే పిచ్చి కోపం. దాంతో ఆ మేధస్సు ఈ నేలలో వేళ్లూనుకుని ఇక్కడి సారంతో చేవదేరింది. చుట్టూ ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లోని మనుషులపై ఎంతో ఇష్టంతో వాళ్ళ మాటల్లోనూ చేతల్లోనూ కవిత్వాన్ని చూసి ఉప్పొంగిపోయి, వాటిని కథల్లో పెట్టాలని ఉబలాటపడ్డాడాయన. ఆయన ఆత్మకథ “అనుభవాలూ జ్ఞాపకాలూను” లో కథలు రాయాలనే జ్వరం ఆయన్ని ఎలా పట్టుకుందో చదువుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఇంత ప్రపంచంలో, ఇన్నిన్ని బృహత్ కార్యాలు దొర్లే లోకంలో కథలు చెప్పటం మీద ఆయన పెంచుకున్న మక్కువ చూస్తే, కథలు చెప్పేందుకు వీలుగా జీవితాన్ని దిద్దుకున్న మంకుపట్టును చూస్తే, ఇలా ఉండాల్రా రాసేవాడు అనిపిస్తుంది. ఆయన కథల్నీ, కథల కున్న శక్తినీ చిత్తశుద్ధితో నమ్మాడు. మార్పు తెస్తాయనీ, మంచి చేస్తాయనీ నమ్మకంతో రాశాడు. అందుకే కాలంలో కలిసిపోయినా, కథల్లో మిగిలాడు.

శ్రీపాదగారి గురించి నెట్లోనూ, ఇతర పాతపత్రికల్లోనూ వచ్చిన వ్యాసాల, ఆడియోల సమాహారమే ఈ నెల వాకిలి ఎడిటర్స్ పిక్.

***

1. ఆయన కథల్లో బాగా ప్రాచుర్యం పొందిన మార్గదర్శి కథ ఆడియో కొత్తపాళీ గారి గొంతులో:

Part 1:

Part 2:

Part 3:

Part 4:

Part 5:

Part 6:

Part 7:

Part 8:

Part 9:

Part 10:

Part 11:

మార్గదర్శి కథ పి. డి. ఎఫ్ (కథానిలయం)

***

2. “శ్రీపాద కథల్లో స్త్రీలు – స్వయం నిర్ణయత్వం” అనే శీర్షికతో ఈమాట పత్రికలో వచ్చిన వ్యాసం (ఆటా సభల ప్రసంగాల నుంచి):

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తన చిన్నతనంలో రాజమండ్రిలో వారాలు చేసుకుంటూ చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఒక విశేషాన్ని తన స్వీయచరిత్రలో ప్రస్తావించారు. ఓ వారం శాస్త్రిగారికి భోజనం పెట్టాల్సి వచ్చిన ఓ గృహిణి, వాళ్ళఇంట్లో ఏదో కాస్త ఖరీదయిన పిండివంట కాబోలు వండింది. మరి ఆ వంటకం తక్కువే అయిందో, లేక వారాలబ్బాయికి ఇంత ప్రియమైన పదార్థం పెట్టనొల్లకో “కారణం ఏమైతేనేమి` పంక్తిలో నలుగురి సమక్షంలో భోంచేస్తున్న శాస్త్రిగారిని ఉద్దేశించి, ‘ఎలాగూ ఈ పదార్థం నీకు ఇష్టం లేదుగా బాబూ,’ అంటూ గడుసుతనంగా ముందరికాళ్ళకు బంధం వెయ్యబోయింది…

పూర్తి వ్యాసం ఇక్కడ చదవచ్చు

***

3. “కవులు- ప్రచురణలు” – కిన్నెర పత్రికలో పుస్తకాల ప్రచురణ గురించి శ్రీపాద రాసిన వ్యాసం:

***

4. శ్రీపాద వీలునామా: (“అనుభవాలు, జ్ఞాపకాలు” పుస్తకంనుండి)

పురిపండా అప్పలస్వామి గారికి,

ఇవాళ తెల్లవారేటప్పటికి నాకివాళ పక్షవాతం సందేహం కలిగింది. మీరు హైదరాబాదు నుంచి ఎప్పుడు వస్తారు?

నాగేశ్వరరావుగారికి కథల పుస్తకాలు ఇచ్చెయ్యదలచుకున్నాను. వెనక ఒకమాటు వారు సేపీకి 3.00 మూడు రూపాయలు చొప్పున బేరం చేసి స్థిర పరచుకున్నారు. ఇప్పుడు ఆ రేటున పైసలు చెయ్యండి. కుదరకపోతే మీ ఇష్టం వచ్చినట్టు పైసలు చెయ్యండి. తక్కిన పుస్తకాలున్నూ యిప్పించెయ్యండి. వారికి నాలుగు వేల చిల్లర నేను బాకీ. నవలలూ, నాటకాలూ వగైరా కాపీరైట్లూ, స్టాకు అంతా యిప్పించండి. మీకు సాధ్యమైన ధరకు యిప్పించి రుణం లేదనిపించి అదనంగా యిస్తే అది నా భార్య చేతికి ఇవ్వండి. నా కుటుంబానికి మీరే సాయం చెయ్యగలరు.

పుస్తకాల వ్యవహారం పూర్తిగా పరిష్కరించి మరీ వెళ్ళాలి మీరు. ‘అనుభవాలు – 2′ విశాఖపట్టణం పంపాలి. పోషకులకూ తక్కినవారికీ, రాజమండ్రిలో మైలవరపూ, వింజమూరీ, రామచంద్రపురంలో దువ్వూరీ, చావలీ, వేపా వారికి మాత్రమే యిచ్చాను. వేపావారు 116 ఇస్తామన్నారు. ఇప్పుడే కొంత ఇవ్వవచ్చు. కాకినాడ సాహిత్యవేత్తగారంటే శ్రీ పార్థసారథిగారు. వారికి నా యెడ చాలా దయ. మీరు చెపితే నాకు గాని నా కుటుంబానికి గాని వారేమైనా సాయం చేసి చేయించవచ్చు.

నా కుటుంబం చెట్టుకింద వుంది. మీరు సాయం చెయ్యండి. విశాఖలో కూడా ఏమైనా వీలవుతుందేమో చూడండి. నాగేశ్వరరావుగారి వ్యవహారం మీరే పరిష్కరించడం నా ఆశ. మీరు మిక్కిలి ఘనంగా సన్మానించారు. మీకు శ్రమ మాత్రమే కలిగించాన్నేను. శ్రీ సింహాచలంగారి స్నేహం నాకు మహా మేరువు. వారికి నా కృత జ్ఞత సరిగా చూపించలేకపోయాను.

మీకు నేను బరువైనట్టే నిశ్చయం. మీలాగ మనసిచ్చిన వారు నాకు మరొకరు లేరు. మీ రుణం తీర్చుకోలేను. అది తీర్చుకోవడానికైనా మరో జన్మం బెత్తుతాను. ఒకటి కాదు, పది, వంద ఎత్తుతాను. ఒక సామాన్యుడికి మీరూ, సింహాచలం గారూ కనకాభిషేకం చేయించారు. ఇది నాకు పరమేశ్వరుడు చేయించలేనిది. ఇలాంటి స్థితిలో నేను భారం అయిపోతున్నాను. విచారించను. అది తీర్చుకోవడానికైనా మరో జన్మ యెత్తుతాను కనక.

నాకేమీ విచారం లేదు. నా భార్య నన్ననేక విధాల కాపాడింది. చిన్నప్పణ్ణుంచీ దాన్ని కష్టపెట్టాను గాని సుఖ పెట్టలేకపోయాను. ఇప్పుడు ఇక ఆ వూసే లేదు కదా?

నిరర్థక జన్మ అయిపోయింది నాది.

రచనలయినా సాపురాసి అన్నీ జాతికి సమర్పించుకోలేకపోయాను.

పరమేశ్వరుడు మీకు సకల సుఖాలూ కలిగించాలి. సారస్వత సేవలో మీకు సాఫల్యం పూర్తిగా కలిగించాలి. మీ కలం జాతిని ఉద్ధరిస్తుంది.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

**** (*) ****