కవిత్వం

నేను తెలంగాణను -1

01-మార్చి-2013

దగాపడ్డ నేలను.
నయవంచకుల అంతర్గత వలసను
నేను తెలంగాణను.

క్షతగాత్ర సేనను
చెరబడ్డ గీతాన్ని
కాలపు రంపపు కోతకు
నెత్తురోడుతున్న దానను
నేను తెలంగాణను.

చాతుర్వర్ణపు కోరలుతీసి
చాపకూడుకు పీటవేసి
బసవడిమీద ద్విపద పురాణాన్ని ఊరేగించి
పండితారాధ్య చరిత్రమై వెలిగిన వీరశైవుడిని
ఆది కవిని
నేను పాల్కుర్కి సోమనాథున్ని.

ఇమ్మనుజేశ్వరాధముల’ ధిక్కరించి
కవితా సరస్వతికి అచ్చమైన తొవ్వ దీసిన
పరమ భాగవతోత్తముడిని
పోతానామాత్యుడిని
నేను బమ్మెరను.

నిజాం నవాబు బూజు దులప
జైలుగోడల మీద కురిసిన
అగ్నిధారను.
తిమిరంతో సమరానికి
కోటి రతనాల రుద్ర వీణ మీటిన
సాంస్కృతిక సైనికున్ని
నేను దాశరథిని.

ఊరి చెలిమల మాటను
కవిత్వ జలపాత భాషచేసి
మోదుగపూల వనంతో పదం కలిపిన
నా గొడవను
తెలంగాణ భాషాదినోత్సవ యాదిని
నేను కాళోజి నారాయాణరావును.
ప్రతాపరుద్రుని నాగేటి చాళ్ళల్లో
మొలకలకు పాలుకుడుపుతున్న తడిజాడని
నేను పాకాల చెరువును.

ఉలి పట్టిన చేతికి దక్కిన
అరుదైన పేరినీ నృత్య శిఖరాన్ని.
ఇతిహాసపు పచ్చబొట్టుతో వికసించినదాన్ని
నీటి ఉయ్యాలలో ఇటుకలకు జోలపాడే
మహత్తర కాసారాన్ని
నేను రామప్పను.

ఏనెలను కలిపి కట్టుకున్న జల గోపురాన్ని
పంల చేల మనుషుల కోసం వేలాడే వంతెనను
నేను లక్నవరాన్ని

కాకతీయుల శిల్పకళాసంపద
మణిహారాన్ని
వేయి స్తంభాల గుడిని
నేను ఓరుగల్లును

ఏకశిలనెక్కి పారజూసిన
కాకతీయ పౌరుషాన్ని
శత్రువు పొలిమేరల్లో
రగిలిన అగ్ని కణాన్ని
నేను రాణి రుద్రమదేవిని.

ఆధిపత్యాల మీద
అలుపెరుగని పోరుసలిపిన
ఏడుగడియల జానపద కథానాయకున్ని
సర్వాయి పాపన్నను
నేను ఖిలాషపురంను.

బరిబాతల ఆడించిన
ఆటనే కొంగుకారంగా మలుచుకొని
నిజాం గడీల కండ్లల్ల కొట్టిన
తీరొక్క పువ్వుల బంగారు బతుకమ్మను
గడ్డిపోచలకు యుద్ధతంత్రం నేర్పిన బురుజును
నేను వీర బైరాన్‌పల్లిని.

పచ్చని చెట్లకు నిండు ప్రాణాలను నిలేసి
కాల్చబడ్డ బందూకులం
చరిత్ర నుదిటిమీద చెరిగిపోని గాయాన్ని
అమర ధామమై మండుతున్న అగ్నివీణను
మరో జలియన్‌వాలా బాగ్‌ని
నేను పరకాలను.

రైతుల రెక్కల కష్టంమీద ఇరగబూసిన
చెమట పూల పరిమళాన్ని మూటగట్టుకున్న
ఎల్లలు దాటిన ఎవుసపు అంగడిని
నేను ఎనుమాములను

బుడ్డగోచిగాళ్ళను సాయుధం చేసి
వీరవిప్లవ పోరుకు ఊపిరులూదిన
గుత్పల సంఘాన్ని
తొలి అమరుడను
దొడ్డికొమురయ్యను
నేను కడివెండిని

విస్నూరు కండకావరాన్ని
వేటాడి పొతం పెట్టిన
మట్టిమనుషుల సామూహిక ఆగ్రహాన్ని
సామాజిక జన చైతన్యాన్ని
నేను జనగామను.

ఇసప్పురుగు
విసునూరు దేశముఖ్‌ పడగమీద
కాళింది నృత్యం చేసిన బందగీని
నేను కామరెడ్డిగూడాన్ని.

నేలమ్మ పంట కొంగులాగిన
జాగీర్దారుల మీద ఎత్తిన కొడవలిని
సాహస వనితను
చాకలి ఐలమ్మను
నేను పాలకుర్తిని.

కోటానుకోట్ల మూర్తులకు
పోతపోసిన బంగరు సంస్కృతిని
హస్తకళామతల్లిని
నేను పెంబర్తిని.
చెమటోడ్చిన చేతులకు
కడుపునిండా ముద్దపెట్టిన మిల్లును
నా బిడ్డల ఒంటిమీది గుడ్డను
అజంజాహీ మిల్లును
నేను ఓరుగల్లును

అక్షరాలకు దిక్కుచూపి
ఉద్యమాల చాళ్ళల్లో విత్తుకొని
అడవి సిగన ఎగురుతున్న రగల్‌ జెండాని
కాకతీయ చదువుల ఒడిని.

కలల దీపాన్ని కొండెక్కకుండా నిలుపుకొని
కాలుకు బలపం కట్టుకొని
రికాంలేకుండా కన్నీటి పాట పాడిన
ఆరు థాబ్దాల పోరు డిమాండును
జన శంకరుడిని
నేను తెలంగాణ సర్వనామాన్ని.

నమ్మిన ప్రజాకోటి కొంగుబంగారాన్ని
శాకంబరీ సంబరాన్ని
నిండు తటాకాన్ని
అపర భద్రకాళిని
నేను ఓరుగల్లును.

స్వయంభూదేవలయాన్ని
పొదుముకున్న ఏకశిలను
గుట్టకింద మొలిచిన గుండు చెరువును
కాకతీయ పురావైభవ ప్రతీకను
కాకతీయ శిలా తోరణాన్ని
నేను ఓరుగల్లు ఖిల్లాను.

దోపిడి పాలకులమీద దూసిన కత్తిని
ప్రజలకొరకు పారిన నెత్తుటి వాగును
నేను జంపన్నను
సామ్రాజ్య”వాదాన్ని నిలువరించిన
సైనిక కవాతును
చిలుకల గుట్టమీద వెలిసిన
కుంకుమ భరిణను
ఎత్తుకెత్తు బంగారాన్ని
సజీవ అధివాస్తవిక చిహ్నాన్ని
నేను సమ్మక్కను, సారలమ్మను
నేను ఓరుగల్లును, పోరుగడ్డను

నేను తెలంగాణను.