కవిత్వం

ఏకాంత మధుసేవ

మే 2014

సహచరులెవ్వరు లేకుండానే
పూకొమ్మల మధ్య
ఒంటరిగా కూర్చొని
మధుపాత్ర చేతికి తీసుకుంటాను

నేను చెయ్యెత్తి
చంద్రునికొక ఛీర్సుకొడతాను
అప్పుడు,
తను,నేను, నా నీడ
కలిసి ముగ్గురమవుతాము.

కాని,
చంద్రుడు త్రాగడు
నా నీడ నిశ్శబ్దంగా
నన్ను అనుసరిస్తుంది

నా నీడతో, చంద్రుడితో
నేను
సంతోషంగా
వసంతకాలపు అంచులదాకా
ప్రయాణిస్తాను.

నేను పాడితే
చంద్రుడు నాట్యం చేస్తాడు
నేను నృత్యిస్తే
నా నీడ కూడ నాట్యం చేస్తది.

మేము నిశ్చింతగా
జీవన సంతోషాల్ని పంచుకుంటాము
తాగిన తర్వాత
తమతమ దారుల్లో విడివడుతుంటాము

నిత్య సంచారులమే అయినప్పటికీ
మేము నిరంతర స్నేహాలము
మరొక వెన్నెల వీధిలో
మళ్ళీ కలుస్తాము.

 

(Li Po “Drinking Alone by Moonlight” అను కవితకు స్వేచ్చానువాదము)