ఏమైందనో, ఎప్పుడొస్తావనో
ఏదో ఒకటి
అడుగుతావనే అనుకున్నా
నా గుండె వాకిట్ల
ఏవో నాలుగు ఉపశమనపు మాటలు
చల్లుతావనే అనుకున్నా
ప్రమేయంలేని ద్వంద్వ యుద్ధంలో
పైరస్ పంచ్‌కు తూలి
బారికేడు మీద ఒరిగినప్పుడు
ఆసరాయై నిలబెడతావనే అనుకున్నా
ఎండి పిడుచ కట్టుకపోయిన నాలుకమీద
నాలుగు నీళ్ళ చుక్కలు
చిలకరిస్తావనే అనుకున్నా
దిగులు మేఘం దట్టంగా కమ్ముకొని
ఒంటరి చీకటి భయపెట్టినప్పుడు
కౌగిలివై కాస్తంత అభయమిస్తావనే అనుకున్నా
నా జీవితాకాశం మీద
సూర్యున్ని మబ్బు మింగేసినప్పుడు
చిరు దివ్వెవై దారి చూపుతావనే అనుకున్నా
జ్వరం వాసన దేహాన్ని ఆవరించినప్పుడు
కరుణతో కాసింత ప్రేమ సుగంధాన్ని
చిలుకరిస్తావనే అనుకున్నా
రుచులు మరిచి
డెలీరియంలో నాలుక పలువరించినప్పుడు
అమ్మ చేతి మామిడి తొక్కువై
అక్కున చేరుతావనే అనుకున్నా
ఒంటరి శూన్య సౌధంలో
తెరలు తెరలుగా తన్నుకొస్తున్న
దుఃఖం కల్లెను ఎల్లవోసుకుంటున్నా
కానికాలంల కాలం చేస్తే
గొంతులో కాసిన్ని
తులసి నీళ్ళైనా పోస్తావా?
మాసిపోయిన మనిషిని
మిగిలిపోయిన కవిత్వంలోనన్నా బతికిస్తావా?
రచనా కాలం: 1 అక్టోబర్ 2013
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్