పడుగు

‘పడుగు’ కొత్త కాలమ్, ఫిబ్రవరి సంచిక నుంచి..

ఫిబ్రవరి 2014

మమతలు,బంధాలు, ఆత్మీయతలు కాలం చేసినట్టే, తీరాల ఇసుకల మీది నురగల రాతలా కాలం చెరిగిపోయినట్టే, బహిరంతరాల్లో ఉద్యమాల ఉద్వేగాల ఉద్దీపనల్లో వెలిగిన కవిత్వం నీలో,నాలో సామాజిక ఉపరితలపు పొరల్లో, పునాదుల్లో మరణిస్తుందా? కొత్త శాస్త్రసాంకేతిక సంద్భాలు, కొత్త సామాజిక సంబంధాలు, కొత్త విలువలు, సరికొత్త ప్రాధాన్యాలు కొంత ఆజ్యం పోస్తున్నాయా? వస్తువినిమయ ప్రపంచంలో కవిత్వం కాలం చేస్తుందా? రాయడం, పత్రికాధిపతుల్ని పట్టుకునే ప్రయత్నం చేయడం, జీతపు రాళ్ళను కరిగించి ప్రెస్‌ చుట్టూ తిరగడం, ఆవిష్కరణకు అందరి కాళ్ళు పట్టుకోవడం, కష్టపడి కాపీలను పంచడం, రివ్యూల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవడం కవుల్ని కష్టాల కడలిలోకి నెట్టేస్తుందా?

సంస్కృత సమాసభూయిష్ట దుర్గంధసౌధాల్లోంచి, కులమతాల సంకుచిత చిదంబర రహస్య గదుల్లోంచి, ఆధిపత్య అణచివేత సంకెళ్ళనుంచి కవిత్వం నూత్న యవ్వనాన్ని సంతరించుకొని నిలబడుతుందా? వ్యక్తివాద కీర్తికండూతి శాలువాల్ని చింపుకొని, ప్రలోభ శకలాలకు శవపేటిక సిద్ధం చేసి, మాసిపోయిన కాలాలమీద, పాకురు పట్టిన కళాల పాళీలమీద మరింత ఉత్తేజపు వెలుగును ప్రసరిస్తుందా? ఒక విశ్వమానవున్ని జెండాగా ఎత్తిపట్టి, చిట్టచివరివాని ఆకాంక్షల ఎజెండాని భుజానికెత్తుకొని కష్టజీవికి నలుదిక్కులా (ఇరువైపుల మాత్రమే కాదు) నిలబడుతుందా? వాక్యాల కీళ్ళు విరిచి పాదాలుగా పేర్చి ఇదే కవిత్వమనే బుకాయింపునుంచి తన్ను తాను కాపాడుకుంటుందా? తిట్లదండకాన్ని పక్కన పెట్టి, బూతురోతకు గీతం పాడి స్వానుభవాల్ని సమిష్టి అనుభూతుల సత్కళగా తీర్చిదిద్దుకుంటుందా?

కవులు మరణిస్తారు.కాలం కరిగి పోతుంది.విలువలు మారిపోతాయి. కాని ఎవరో ఒక ఆంగ్ల కవి అన్నట్టు ‘కవిత్వం కాక్రోచ్‌ లాంటిదే’. అది అంత తేలిగ్గా అంతర్ధానం అవ్వదు. అది అస్తిత్వ ఉద్యమాల్ని అక్కున చేర్చుకుంటది. అంతర్జాతీయ అక్రమాల్ని, అణచివేతల్ని ధిక్కరిస్తది. సందిగ్ధానికి లోనైన సమాజానికి దిశానిర్దేశం చేస్తది. ఎన్ని లోపాలున్నప్పటికీ అది అంతిమంగా ప్రజల పక్షాన నిలబడుతది. “Literature and art are for oppressed people not for any of the other group” అనేది నిరూపిస్తది.

ఇదిగో తెలుగు సమాజంలో అట్లాంటి పాత్ర నిర్వహిస్తున్న కవిత్వాన్ని, కవుల్ని ఒక్కసారి మననం చేసుకుందాం. రైతు బిడ్డను కదా! చిన్నప్పుడు కొట్టనంపు రామయ్య పటేలుతో పాటు ‘పడుగు’ పెట్టి, బంతి తొక్కించి నువ్వు గింజలు రాసి పోసినట్టే ఈ పంటల పండుగ(సంక్రాంతి) నుంచి సాహిత్య ‘పడుగు’ ద్వారా కవిత్వపు గట్టి గింజలనేరుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ‘పడుగు’ మన ‘వాకిలి’లో ఫిబ్రవరి 2014 సంచిక నుంచి..