కవిత్వం

నేను తెలంగాణను-2

05-ఏప్రిల్-2013

మబ్బుల మాటునుంచి
దుంకుతున్న చంద్రవంకల జలపాతం
ఎత్తిపోతల.

అనాది కాలంల
ఆచార్య నాగార్జునునికి ఆశ్రయమిచ్చి
బౌద్ధాన్ని బతికించిన బంగరుకొండ
నా నందికొండ
అతి పెద్ద ద్వీప ప్రదర్శనా దీపం.

నిండు కుడి పాలిండ్ల కుండతో
ఎండిన ఎడమ దాయితో
నిగనిగలాడుతున్న నిండుగర్భిణి
మహిమాన్విత మానవ కట్టడం
దేశ ఆధునిక దేవాలయం
నాగార్జునసాగరం.

ఆకుపచ్చ కొంగు కప్పుకున్న కచేరి కొండమీద
కొలువుదీరిన సంకెళ్ళ బావి
పోతన్నను సంకనెత్తుకొని లాలించిన
సర్వజ్ఞభూపాలుడి వసంతోత్సవ వేదిక
రాజులేలిన కొండ
గతించిన చరిత్ర నుదిటి సింధూరం
రేచర్ల పద్మనాయకుల రాచకొండ.

తెలంగాణ దక్షిణ మహాద్వారాన్ని
అలికి ముగ్గులు పెట్టిన ముత్తైదువ
మూసి,అహల్య,దుంధుభి
పెదవాగు,పాలేరు,మున్నేరుల
మిశ్రమ విభ్రమ లోహజల నిర్మిత
నల్లగొండ కాళ్ళ కడియాలు కృష్ణ.

నేల ముంగిళ్ళ కరువు చెదను
తన టర్మినేటర్‌ జలంతో
ప్రక్షిప్తం చేస్తున్న డిండి.
శ్రీమీనాక్షి అగస్తేశ్వరుని
నెత్తిన నిలిచిన తరగని జలనిధి
మూసిని ముద్దాడి
గోదావరితో సంగమించి
యవ్వనోత్తేజం పొందిన కృష్ణ ఓడరేవు
వాడపల్లి.

త్రిభువన మల్లవిక్రమాదిత్యుడల్లిన ఒంటి రాతిగూడు
పశ్చిమ చాళుక్యుల పరాక్రమ ప్రతీక
భువనగిరికోట.
ఆంధ్రమహాసభ చేతికి ఎర్రజెండందిచ్చిన
చారిత్రక చైతన్య జ్వాల
భువనగిరి.

యోగానంద, గండభేరుండ
జ్వాలోగ్ర రూపాలు విసర్జించి
యాదరుషి విత్తిన
లక్ష్మీనరసింహుడి గుడి
యాదగిరి గుట్ట.

ఆదినాథ్‌,వేమీనాథ్‌
మహావీర తీర్థంకరులు కొలువుదీరిన
శ్రీశ్వేతంబర జైనదేవాలయ కిరీటధారి
రాష్ట్రకూటుల రాజనగరం
నా నల్లగొండ కొంగుబంగారం
కొలనుపాక.

తెలంగాణ ఒంటి మీద మెరిసిన
పట్టు పీతాంబరం
వినోభాబావే పాదం తగిలి
భూదానోద్యమమై పుష్పించిన పడతి
పోచంపల్లి.

నిరంతర నిశ్చల నీడ
ఛాయాసోమేశ్వరాలయ లీల
శాస్త్రసాంకేతికాలిప్పని చిక్కుముడి.
మర్కట మాణిక్యాల మణిహార ధారి
పచ్చల సోమేశ్వరుని శోభ కీర్తిపతాక.
మాఘమాస బ్రహ్మోత్సవ సంరంభం
చెన్నకేశవుని శిఖరప్రాయ కళాకాంతి.
కల్యాణ చాళుక్యుల కళాపోషణ
కలికితురాయి పానగల్లు.

కాకతీయుల కళలాకాశం మీద
విరబూసిన వెన్నెల
రేచర్ల రెడ్ల రాజనగరు
పినవీరభద్రుడి
శాకుంతలం మొగ్గతొడిగిన
పిల్లలమర్రి.

ఉత్కృష్ఠ జీవన విధాన పాయసాన్ని
మతం మట్టిలో కలిపినప్పుడు
తల్లడిల్లి తండ్లాడిన
ఫణిగిరి.

మూతినాకుడోళ్ళు ముచ్చటపడ్డ
ప్రభుత్వచిహ్న స్వర్ణకలశం
పద్మనాయకుల దేవరకొండ సౌరభం.

జైలు లోపలి
దేశోద్ధారక గ్రంధమాల.
గంగుకు
చిల్లరదేవుళ్ళ రాజ్యంలో
మోదుగుపూల వనపు
దారిచూపిన ప్రజల మనిషి
తెలంగాణ గోర్కీ
వట్టికోట.

పదహారుబండ్ల జాతరకు రొమ్ములెదురొడ్డి
ప్రజాసైన్యాన్ని నడిపించిన కలం యోధుడు యాదగిరి.

మన వూళ్ళోకూడ
ఆకాశం మీద అరుణరేఖలు గీసి
సాయుధపోరుకు ఊపిరులూదిన కాంచనపలి
కండ్లల్ల రుధిర భాష్పాలతో
భుజాన అక్షరాయుధాలతో
పల్లెటూరి పిల్లగాండ్లకు
ప్రజాపోరు సంఘరైతన్నలకు
యుద్ధ విద్యలు నేర్పిన
ప్రజాపోరు నౌక సుద్దాల.

భూమి,భుక్తి, విముక్తి కోసం
బానిసలచేతకి బందూకులందించి
ప్రపంచ పరమాశ్చర్యపు
వీర తెలంగాణ పోరు వీణ మీటి
విముక్తి దారులల్ల
త్యాగాల ఎర్ర తివాసి పరిచినోళ్ళు
రేణికుంట,కుర్రారం రామిరెడ్డిలు.

అడవి దారులల్ల
ఆయుధాల నీడలల్ల
అలుపెరుగని బాటలు నడిచి
భూస్వామ్య గడీల కోటలు కూల్చి
నిరంకుశం మీద నిప్పురవ్వలౌనోళ్ళు
పేదోళ్ళ బతుకులంటె పానమిడిసినోళ్ళు
ఆరుట్ల,రావి, భీంరెడ్డిలు.

ఆకాశ అవకాశాల్లోనే కాదు
ఆయుధ ధారణలోనూ
సాయుధ పోరుల్లోనూ
నిర్వంద్వర్థాలు నా ఆడబిడ్డలు
ఆరుట్ల కమల
మల్లు స్వరాజ్యం
అతివల అసమాన ధీరత్వ ప్రతీకలు.

నిరంతరం మోగుతున్న కరువు దరువులకు
బీటలువారుతున్న బీడుగుండెల నేల
పాదరసమై కాళ్ళకింది నంచే జారిపోతయి నీళ్ళు
ఎండిన కన్నీటి మనసుల నాలుకలు తడుపవు.
విధి భూమిపొరలల్ల నింపిన విషాన్నే
కడుపుల ఒంపుకుంటరు
కాళ్ళొంకర, కండ్లొంకర
మర్రి ఊడలలెక్క వొంగిన ఎన్నుపూసలు
అకాల వార్ధక్య అష్ఠావక్రులు బిడ్డలు
జాతి నీటిబిందువుకు పట్టిన గార ష్లోరోసిస్‌.

భూమి,భుక్తి, విముక్తి కోసం
బానిసలచేతకి బందూకులందించి
ప్రపంచ పరమాశ్చర్యపు
వీర తెలంగాణ పోరు వీణ మీటి
విముక్తి దారులల్ల
త్యాగాల ఎర్ర తివాసి పరిచినోళ్ళు
రేణికుంట,కుర్రారం రామిరెడ్డిలు.

అడవి దారులల్ల
ఆయుధాల నీడలల్ల
అలుపెరుగని బాటలు నడిచి
భూస్వామ్య గడీల కోటలు కూల్చి
నిరంకుశం మీద నిప్పురవ్వలౌనోళ్ళు
పేదోళ్ళ బతుకులంటె పానమిడిసినోళ్ళు
ఆరుట్ల,రావి, భీంరెడ్డిలు.

ఆకాశ అవకాశాల్లోనే కాదు
ఆయుధ ధారణలోనూ
సాయుధ పోరుల్లోనూ
నిర్వంద్వర్థాలు నా ఆడబిడ్డలు
ఆరుట్ల కమల
మల్లు స్వరాజ్యం
అతివల అసమాన ధీరత్వ ప్రతీకలు.

నిరంతరం మోగుతున్న కరువు దరువులకు
బీటలువారుతున్న బీడుగుండెల నేల
పాదరసమై కాళ్ళకింది నంచే జారిపోతయి నీళ్ళు
ఎండిన కన్నీటి మనసుల నాలుకలు తడుపవు.
విధి భూమిపొరలల్ల నింపిన విషాన్నే
కడుపుల ఒంపుకుంటరు
కాళ్ళొంకర, కండ్లొంకర
మర్రి ఊడలలెక్క వొంగిన ఎన్నుపూసలు
అకాల వార్ధక్య అష్ఠావక్రులు బిడ్డలు
జాతి నీటిబిందువుకు పట్టిన గార ష్లోరోసిస్‌.

గుట్టలతో గూడులల్లి
ఆకాశానికి ఎరుపు రంగద్దిన
నీలగిరిని
నల్లగొండను
నేను తెలంగాణను.

(రచనాకాలం: నవంబర్‌ 2011)