సంపాదకీయం

ఏప్రిల్ వొకటి విడుదల!

ఏప్రిల్ 2013

చార్లీ చాప్లిన్ సినిమా మొట్ట మొదటి సారి ఎప్పుడు చూశానో గుర్తు లేదు.

ఆ మాటకొస్తే,  ఆ తరవాత చాప్లిన్  ఏ సినిమా ఎన్ని సార్లు చూశానో కూడా గుర్తు లేదు.

అందులో నేను మళ్ళీ అనుభవించలేని పసితనమేదో వుంది, అది నన్ను కవ్విస్తుంది, నవ్విస్తుంది. ఏడ్పిస్తూ నవ్విస్తుంది. నవ్విస్తూ ఏడ్పిస్తుంది. నవ్వుకీ, ఏడ్పుకీ మధ్య వుండే ఈ స్థితేదో నాకు కావాలి, నన్ను కుదురుగా వుండనివ్వడానికి!

నేను కుదురుగా లేను అనుకున్న స్థితిలో చాప్లిన్ ని వెంటనే ఆశ్రయిస్తాను.  వొక్కో సారి తన మూకీ భాషలో, ఇంకో సారి కేవలం చేష్టలే భాష అయిన ఘోషలో నన్ను వెంటనే నిటారుగా నిలబెట్టేస్తాడు చాప్లిన్.

ఇప్పుడు అలా తెర మీది చాప్లిన్ నే కాదు, మన లోపలి చాప్లిన్ ని కూడా నిద్ర లేపి మనకి మనమే చక్కిలిగింతలు పెట్టుకోవాలి. మన మీద మనమే జోకులు వేసుకోవాలి. వాటికి మనమే కడుపుబ్బ నవ్వుకోవాలి.

అవును చాలా అవసరం!

కాసేపు గొప్ప సిద్ధాంతాలేవీ చెప్పద్దు. కళ్ళు తిరిగే మార్కెట్ సూత్రాలతో కన్ను కప్పవద్దు. సాహిత్యంలోకి మార్కెట్ నీ, మార్కెట్ లోకి సాహిత్యాన్ని తరుముకెళ్లే నకిలీ వ్యూహాలేమీ నేర్పద్దు.

సమూహాల్ని పిచ్చి మొహాల్ని చేసి సొంత కీర్తి కోసం ఆత్మవంచనలూ పరవంచనలూ వద్దు.

మనం మిద్దె మీద మిద్దె కట్టుకుంటూ ఆకాశంలోకి దూసుకుపోతూ ఇతరులకు చెట్టు కింద కాపురాల ఆదర్శాలు బోధించవద్దు.

నిత్యజీవితంలోకి రాజకీయ ప్రకటనల్ని మోసుకొచ్చి రాజకీయమే జీవితానికి పర్యాయ పదంగా మార్చుకోవడం వద్దు.

మనసారా వొక నవ్వు నవ్వుకుందాం ఈ ప్రలోభాల వంచనల మీద!  కీర్తీ వ్యామోహాల పరుగుపందేల మీద!

కడుపుబ్బా నవ్వుకుందాం కడుపు మంటలు చల్లారే దాకా!

కెరటకెరట కెరటాలుగా నవ్వుకుందాం బతుకులోని  అల్పత్వాలన్నీ గాలికి ఎగిరిపోయేలా!

 

-అఫ్సర్