కబుర్లు

హంసిని 2013 అవార్డుల విజేతలు

16-ఏప్రిల్-2013

“వాకిలి’ పాఠకులకు సుపరిచిత అక్షర స్వరం మోహనతులసి ఈ ఏడాది మరో అవార్డు గెల్చుకుంది. ప్రతి యేటా ఉగాదికి ప్రకటించే హంసిని అవార్డు తులసికి లభించింది. గత ఏడాది తులసికి ఇస్మాయిల్ అవార్డు కూడా లభించింది.  హంసిని వెబ్ సాహిత్య పత్రిక కవిత్వానికిచ్చే మిగిలిన రెండు బహుమతులు డాక్టర్ గరిమెళ్ళ నారాయణకీ, మామిడి హరికృష్ణకీ లభించాయి. ఈ ముగ్గురు కవుల గురించీ ఇవీ న్యాయనిర్ణేతలు రాసిన వ్యాఖ్యలు:

 “మెలకువ’లో రాసుకున్న ఉద్వేగ వాక్యాలు మోహన తులసి కవితలు

          క్లుప్తతా, తేలిక భాషలో గాఢమయిన భావనల వ్యక్తీకరణా, సరళంగా విచ్చుకునే తాత్విక స్వరం…ఇవీ తులసి కవిత్వాన్ని పట్టిచ్చే మూడు లక్షణాలు. తులసి కవిత్వం ప్రకృతి గురించి పాడినట్టే అనిపిస్తుంది, కానీ, ఆ ఆకులందున అణగిమణగి ఒక లోతయిన భావన  కనిపిస్తుంది. సున్నితమయిన అనుభూతుల పలవరింతలాగే వుంటుంది, కానీ, ఆ పలవరింతలో ఒక నిబ్బరంతో కూడిన తాత్విక అన్వేషణ కనిపిస్తుంది. సరళమయిన భాషలోంచి సాంద్రమయిన భావాలని పలికించవచ్చు అనడానికి తులసి కవిత్వం ఉదాహరణ.

ఈ అవార్డుకు ఎంపిక అయిన కవిత “మెలకువ”లో ఈ లక్షణాలే కనిపిస్తాయి. మన జ్నాపకాల్లో ఒదిగే ప్రతి వ్యక్తీ -తులసి ఈ కవితలో చెప్పినట్టు – కొండగుర్తులాంటి  ఒక భావన. ఒక ప్రవాహం మాదిరిగా కొట్టుకుపోయే స్నేహాలూ, వాటి ఉద్వేగాలూ ఆ ఉద్వేగాలు దాటి, కొంచెం మెలకువలోకి వచ్చి ఆలోచిస్తే, ఆ స్నేహాలు కొన్ని విలువల సంకేతాలని అర్థమవుతుంది. అందుకే, తులసి అంటుంది-

 

వాన పడుతుంటే ఏదో చెట్టుకింద ఆగినప్పుడు

గతానికంటిన తీపిబాధ గుర్తొస్తుందే

ఆకుల మీదుగా జారే జల్లులో అది వడకడదాం  - అని.

 

ఎక్కువ సాంద్రతతో తక్కువ రాసే తులసి త్వరలో పుస్తక రూపం ధరించాల్సిన అవసరం వుంది, ఇప్పటికే ఆమెకంటూ మంచి పాఠకులు వున్నారు కనుక!

మోహన తులసి మిగిలిన కవితలు ఇక్కడ చదవండి

 ***

బతుకు పాఠాలు నెమరేసుకునే గరిమెళ్ళ

 

హంసిని రెండో బహుమతి గెలుచుకున్న గరిమెళ్ళ నారాయణ  సామాజిక దృష్టి వున్న కవి. తెలుగుకవిత్వంలో అనుభూతినీ, సామాజిక వ్యాఖ్యానాన్ని జోడించి కొరడా మెరుపులు మెరిపించే కవులు క్రమంగా తగ్గిపోతున్నారు. చాలా కాలం తరవాత ఆ ఖాళీని భర్తీ చేస్తున్న స్వరం గరిమెళ్ళ నారాయణ గారిది. సూటిగా కవిత్వం చెప్పడం నారాయణ దారి. కానీ, రాసిన ప్రతి వాక్యంలోనూ పదును సాధించాలన్న తపన వల్ల అది కవిత్వంగా మారుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వున్న వారు కవిత్వం రాస్తే అందులో ఒక విధమయిన హేతుబద్ధతా, సునిశిత పరిశీలనా శక్తి కనిపిస్తాయి. నారాయణ గారి కవిత్వంలో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. ఆ రంగాల సమతుల్యత ఆయన కవిత్వ వ్యక్తిత్వంలో కలగలసి పోయి వుంటుంది. ఆయన వచనం రాసినా ఆ ధోరణి బలంగా కనిపిస్తుంది.

హంసిని బహుమతి గెల్చుకున్న ఆయన కవిత ‘ ఉల్క పడింది.’ ఇందులో  కొంత వచనం వున్నప్పటికీ నారాయణగారి కవిత్వ శక్తిని అది బలహీనం చేయలేదు. ఆయనంటారూ:

ఉల్క పడింది!

జన సమర్ధం

ఉలిక్కి పడేలా

బతుకు కలలను

అతి కిరాతకంగా బూడిద చేసేస్తూ

అవయవాల ను రక్తసిక్త గుట్టలుగా పోసేసిన

అమానవీయ ముష్కర ఉల్క

దిల్-సుఖ్ నగర్లో రాలి  పడింది.

 

కొన్ని సంఘటనల్ని తీసుకుని వాటి మధ్య అంతస్సూత్రాన్ని వెతుక్కుంటూ చివరికి ఆ సంఘటనల పట్ల ఒక నిర్ణయాత్మక వైఖరికి దారి చూపే ధోరణి ఇందులో కనిపిస్తుంది.

***

తెలంగాణ పల్లె నుంచి ఒక మావిచిగురు లేఖ మామిడి హరికృష్ణ కవిత్వం

కొంత మందికి ఇంటి పేర్లు బాగా కలిసి వస్తాయి. హరికృష్ణ ఇంటి పేరు ‘మామిడి’ కావడం యాదృచ్ఛికమే కానీ, అతని కవిత్వంలో ఉగాది నాటి తొలి మామిడి కాయల వగరూ, పులుపూ, కొబ్బరి ముక్కలాంటి texture వుండడం మాత్రం యాదృచ్ఛికం కాదు. రెండు దశాబ్దాల పైబడి కష్టపడి సాధించుకున్న కవిత్వ శిల్పం హరికృష్ణది. ఒక పల్లె నుంచి వచ్చిన అమాయకత్వమూ, పట్నం నేర్పబోయిన గడుసుతనమూ కలిస్తే హరికృష్ణ కవిత్వం.

హంసిని ఎంపిక చేసిన ‘ఊరు ఉర్కబోతున్నది’ కవితలో కూడా అలాంటి హరికృష్ణే కనిపిస్తాడు. హరికృష్ణ ల కవిత్వం ఒక దృశ్య సాక్షాత్కారం…చూడండి ఈ కవితలో ఎలాంటి తెలంగాణ పల్లె పటం గీస్తున్నాడో!

పచ్చని పొలాలు – తీరొక్క పంటలు

యేరు వాక పున్నాలు – బైటి వంటలు

గొబ్బెమ్మలు – దసరా పిల్ల నెత్తురు బొట్లు

మచ్చ గిరి సామి గుడి కాడ గణపయ్య మట్టి బొమ్మలు

తాళ్ళ కుంట చెర్వు కాడ బతుకమ్మ ఆటలు

పెద్ద బడి మైదానం ల సాధనా సురుల మాయలు

అమాస బజార్ లల్ల దీపాల ముసి ముసి యెలుగులు

సకినాలు- సత్తు పిండి -కుడుములు – బచ్చాలు

వడ్ల గుమ్మిలు- గంజి కూరాళ్ళు

సద్దన్నం- చింతకాయ తొక్కు

ఎర్ర మన్ను అరుగులు

గడపలల్ల ఎదురు సూపులు

వాకిట్లల్ల ముగ్గులు

 

ఒక సాధారణ దృశ్యాన్ని ఎంత నీటుగా గీస్తాడో, ఒక భావనని కూడా అంతే నీటుగా దీటుగా దృశ్యంలా గీస్తాడు ..ఈ ఉదాహరణ చూడండి

గీ ఊరు బతుకేందిరా బై

బతికితే పట్నంలనే బతకాలె

గక్కడి రాస్తా మీద నడుత్తాంటేనే కడుపు నిండుతది

మనూల్లె ఏంపాడు వడ్డది

పంది లెక్క గీ ఊళ్ళే పది దినాలు బతికేదాని కంటే

నంది లెక్క పట్నంల నాల్గు దినాలు బతికినా సాలదానే

***

గియ్యాల మా ఊళ్లె అందరు అయ్యవ్వలు

గాల్ల పోరగాల్లను

పట్నంల ఏదన్న పని సూస్కోరాదు కొడ్కా

అని సాగతోలుతాండ్లు

 

హరికృష్ణ కూడా త్వరలో పుస్తక రూపం దాల్చాల్సిన కవి.

*** * ***

హంసిని విజేతల పూర్తి జాబితా ఇక్కడ: http://hamsini.andhraheadlines.com/Ugaadi.htm