లోపలి మాట రాయాలనుకున్నప్పుడు అది నెగటి”వ్ షేడ్ లోనే వుండాలా? చెత్త కవితనే ఎన్నుకోవాలా? అట్లా కాకుండా ఒక మంచి కవితను తీసుకొని, అది అంతకంటె మంచిగ వుండే అవకాశాల్ని చూడొచ్చా? అనేది ఒక సందేహం. తెలుగు సాహిత్యంలో ఇప్పటికే విమర్శని అంగీకరించని వాతావరణం రాజ్యమేలుతున్న సందర్భంలో అది ఎట్లాంటి సంబంధాలకు దారితీస్తుంది. లబ్దప్రతిస్టులైన, అతి దగ్గరి వ్యక్తిగత సంబంధాలు గల వాళ్ళ రచనల పట్ల నా నిజమైన లోపలి మాటను బయటపెట్టడంలో నాకు ఒకింత అసౌకర్యం వుంది.అనుభవజ్ఞులు ఇప్పటికే ,నన్ను విమర్శా రంగంలోకి వెళ్ళవద్దనే సలహా ఇచ్చియున్నరు. ”ఇరువాలు” దున్నడం అలవాటైన వాన్ని కనుక ఇష్టమైన కవిత మీద ‘లోపలి మాట’ రాయడానికి సిద్దపడ్డాను. ఎందుకంటే ఇష్టం లేని దాన్ని దేన్నీ నేను చదవలేను.ఇక రాయడమన్నది ఊహాతీతమే.
గత ఇరవై ఐదు ఏండ్లుగా నాకు అత్యంత సన్నిహితుడు, ఒక రకంగా నాకు సాహిత్య గురువు లాంటి వాడు, లబ్ధప్రతిష్టు
డు, ఉద్యమాల చాళ్ళల్ల నడిచిన వాడు అయిన ఒక కవి కవితను ఎన్నుకున్న. అతనన్నా, అతని రచనలన్నా నాకు అత్యంత ప్రీతిపాత్రము.అనేక సందర్భాల్లో కలిసి నడిచిన వాళ్ళం. ఉద్యమమే ఊపిరిగా ‘భూమి స్వప్నా’న్ని శ్వాసిస్తూ, ‘ప్రాణహిత’లో ఈదులాడుతూ, ‘నది పుట్టువడి ‘గురించి ఎరుక చెప్పుతూ, ‘ఒక్క బాధ కాద’ంటూ తెలంగాణ దు:ఖాన్ని నాగేటి చాళ్ళల్ల గానం చేస్తూ ‘మొగులైంద’న్న ‘ఇగురం’ చెప్తున్న నిరంతర సాహితీ పథికుడతడు. ‘మరసం’ ద్వారా మంచి రచయితలను,కవులను వెలుగులోకి తెచ్చినవాడు.నా ‘జలపాత శబ్దం’ ప్రపంచానికి వినిపించి, ‘ఎన్నాద్రి’ ని ఒడిసిపట్టుకొని,’అందని చందమామ’ కోసం నేను పడుతున్న తాపత్రయాన్ని అభినందిస్తూ నాకు కవిత్వపు మెలుకువలు నేర్పిన సిధారెడ్డితో ‘తెలంగాణ రచయితల వేదిక’కు పురుడు పోసినప్పుడు వెంట నడిచాను.’జరసం’ ఆవిర్భావ సదస్సులో తన భాగస్వామ్యముంది. జరసం కవిత్వం ‘అలుగు’ దుంకినప్పుడు తను పాదాలు తడుపుకున్నవాడే.
అట్లాంటి ఒక తెలంగాణ ఉద్యమ కవి, పుట్టుకతోనే హేతువాద భావజాలాన్ని, సమసమాజ స్థాపన అవసరాన్ని గుర్తించిన
వాతావరణంలో పెరిగిన వాడు, నిరంతరం కమ్యూనిష్టు ఉద్యమాలతో వున్న నర్ర బాలసిద్దారెడ్డి కొడుకు. దేవిప్రియ అన్నట్టు బందారం లో విరిసిన మందారం. ఈ మద్యనే కాలం చేసిన తండ్రి యాది భావోద్వేగం కావచ్చు, నందిని సిధారెడ్డి ‘పిట్టకు పెట్టి’ అనే కవిత రాశాడు(25 మార్చి 2013 అంధ్రజ్యోతి దినపత్రిక, ‘వివిధ’).
“పొద్దుకు తొందరెక్కువ
పొయ్యి దిగక ముందే ఉరుకొస్తది
ఎండయితే పిట్టలుండవు
తువ్వాల్లో ఇష్టరుచులు మలిచి పట్టుకొని
దు:ఖం ఒలకకుండా నడువు”
అంటూ ఒక సార్వజనీన దృశ్యాన్ని కవి కళ్ళముందు పరుస్తడు.’దు:ఖం ఒలకకుండా నడువు’ అన్నప్పుడు కవిత్వభాస పరాకాష్టకు చేరింది. పిట్టకు పెట్టడానికి అన్నంతో పాటు చెంబులోనో,ముంతలోనే మంచి నీళ్ళు కూడ తీసుకెళ్తరు. ఆ నీళ్ళు ఒలకకుండా నడువాలె. ఆప్తుల పోగొట్టుకున్న బాధకు కండ్లల్ల నీళ్లు తిరుగుతయి. అది పట్టుకెళ్ళే ఇంటి యజమాని అధైర్యపడి ఏడ్వొద్దు.తద్వారా ఇంటిల్లిపాది మనోధైరాన్ని దెబ్బతీయవద్దు. ఇట్లాంటి తెలంగాణ నుడికారాన్ని ,మానవ సంబంధాల్లోని సున్నితత్వాన్ని విశదపరుస్తడు.
పిట్టముట్టడం కోసం కొడుకులు, కోడండ్లు, భార్య అందరమూ కలిసుంటమని చెప్తూ, అందర్నీ మనస్ఫూర్తిగా మొక్కమని చెపుతడు. ఎందరు ఎన్ని తీర్ల మొక్కినా, ఎన్ని బాధలువడ్డా పిట్ట రాని వైనాన్ని గుర్తిస్తడు.
“ఎందరు మొక్కినా
విస్తరి ఎటుజరిపినా
పిట్ట ముట్టది
చుట్టు చూసినా చెట్టు ఊగినా
పిట్ట రాదు”
అంటూ అసలు సమస్యను వివరిస్తడు. ఇప్పటిదాకా గంభీరంగా,సాంద్రంగా నడిచిన కవిత ‘పిట్ట ముట్టక పోవుడే సమస్య’ అనే అనవసర వాచ్యంతో తేలిపోతది. పిట్ట ముట్టకపోవడమే కవిత ఇతివృత్తం. అది బంధుగణం చేసిన బాసలు చనిపోయిన వ్యక్తి ఆత్మను తృప్తి పరచకపోవడం వల్లనా, మరే ఇతర కారణం వల్లనా అనేది అప్పటికి చెప్పడు కాని పిట్ట ముట్టక పోవడమే అసలు సమస్య అనేది కవిత పొడుగూతా తెలుస్తనే వుంటది. అట్లాంటి పరిస్థితిలో ‘పిట్ట ముట్టకపోవుడే సమస్య’ అనే పూర్తి వాచ్యాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు.
‘ఆత్మ తొక్కులాడుతంది. ఆయన తృప్తిపడలేదు’ అందుకే పిట్ట ముడుతలేదు. ఎందుకు తొక్కులాడుతంది ఆత్మ? ఎందుకంటే
“ఎంత ఆరాటపడ్డా కుటుంబం కుటుంబం వలె లేదు
ఎంత సేవ చేసినా ఊరు ఊరు వలె లేదు”
బాగానేవుంది. కాని, అప్పటిదాకా చక్కటి తెలంగాణ భాషా సొగసుతో నడుస్తున్న కవిత, ప్రామాణిక భాషగా చెప్పబడుతున్న తరగతి గది భాషలోకి వెళ్ళిపోతది. నిజానికి ఇది ఈ ఒక్క కవిత సమస్యే కాదు. ఈ ఒక్క కవి సమస్యే కాదు. ఇవ్వాళ్ళ తెలంగాణలో అద్బుత కవిత్వం రాస్తున్న అనేక మంది కవుల సమస్య కూడ. మాట్లాడే దైనందిన భాషకు, తరగతి గదిలో చదువుకునే భాషకు మధ్య విపరీతమైన అంతరం వుండడం వల్ల తలెత్తుతున్న సమస్య ఇది. అయితే, ప్రయత్నపూర్వకంగా,మనల్ని మనం తిరిగి తిరిగి ఎడిట్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
‘…………..కుటుంబం కుటుంబమోలె లేదు
……………ఊరు ఊరోలె లేదు’ అంటే సరిపోయేది.
పిట్ట ముట్టకపోవడం అసలు సమస్య అయితే, దానికి కారణం పిట్టలు లేకపోవడమేనని కవిత చివరన చెపుతడు.
“సుతులు ఆందోళన పడ్డా ఒక్క పిట్టరాదు
పిట్ట ముట్టలేదు
రావడానికైనా ముట్టటానికైనా
పిట్టలంటే కదా!”
ఇక్కడ అందరికీ తెలిసిన విషయాన్నే గుప్పిట పట్టి ప్రదర్శించిన భావన కలుగుతుంది. పిట్టలు నశించిపోవడం, దానికి కారణమైన మితిమీరిన యాంత్రికీకరణ,దానికి దారితీసిన ప్రపంచీకరణ ఇక్కడ వస్తువు. చనిపోయిన వ్యక్తి ఆత్మను తృప్తి పరచడానికి పిట్టకు పెట్టడం ఇతివృత్తం. ‘పిట్టలుంటే కదా’ అన్నప్పుడు గంభీర గమనం కాలుజారి పడ్డట్టు వుంది.అట్లా కాకుండా,
‘రావటానికైనా ముట్టటానికైనా
పిట్టలుండాలె కదా’ అంటే ఆ గంభీరం కొనసాగేది అనిపిస్న్నుది.అందరికి తెలిసిన విషయాన్ని గుర్తుచేస్తున్నట్టు ఉండేది.
నిర్మాణ పరంగానే కాకుండా వస్తువు పట్ల కూడ నాకు ఒకింత అసంతృప్తి వుంది. జీవితకాలమంతా హేతువాదంతోను, మార్క్సిస్టు భావజాలంతోను బతికిన నర్ర బాలసిద్ధారెడ్డి కి(నిజంగా ఆ సందర్భంలో రాసిందే అయితే) వీడ్కోలు హిందూ మత ధర్మానికి చెందిన కర్మకాండలతో చేసినట్టు రాయొచ్చా? మార్క్సిస్టు రచయితగా, ఉద్యమకారుడిగా పేరున్న సిధారెడ్డి వస్తువు చుట్టూ హిందూ మతానికి చెందిన ఇతివృత్తాన్ని అల్లడాన్ని అంగీకరించ వచ్చా? ప్రముఖ కెనడా రచయిత గుస్తావో ఎస్తెవా అన్నట్టు ”ప్రపంచీకరణకు విరుగుడు స్థానికీకరణే”.
దాంట్లో నాకు ఏ మాత్రం సందేహం లేదు. అంతమాత్రాన స్థానికీకరణ పేరిట మూఢనమ్మకాలను, బానిస భావజాలాన్ని ఎత్తిపడుతామా?
మతఛాందసవాదాన్ని దెబ్బకొట్టకుండా ప్రజా సమూహాల్ని నూతన సమాజ నిర్మాణానికి సిద్ధం చేయగలమా? కాదని నేను నమ్ముతాను. ఎందుకంటే, ‘మతం సమాజంలో బడుగు జీవుల నిట్టూర్పు. హృదయరహిత ప్రపంచంలో హృదయం.అనాత్మ లోకంలో ఆత్మ. మతం ప్రజల పాలిట మత్తుమందు’-కారల్ మార్క్స్.
నిజానికి ఈ విషయాలు కవితో నేను చర్చించినవే. అయితే ఎప్పుడైనా కవి నిరంకుశుడే.తనఅక్షరాలకు తనే అధిపతి.ఒక సీనియర్ కవిగా తను నాతో అంగీకరించక పోవచ్చు. ఒక పాఠకుడిగా ఒక మంచి కవిత చదివిన తృప్తిని అనుభవిస్తూనే, విభేదిస్తున్న విషయాలను కవితోను,మీతోను పంచుకుంటున్నాను. అయితే, నేనిక్కడ తీర్పరిని కాదని మనవి చేస్తున్నాను.
కవిత పూర్తిగా,
పొద్దుకు తొందరెక్కువ
పోయ్యిదిగకముందే ఉరుకొస్తది
ఎండయితే పిట్టలుండవు
తువ్వాల్లో ఇష్టరుచులు మలిచిపట్టుకొని
ద:ఖం ఒలకకుండా నడువు
అయినవాళ్ళు అనుభవం పండినవాళ్ళు
ఆఖరి ఆనవాళ్లు వెంబడిస్తుంటే
తలపులు తల్లడిల్లకుండా నడువు
విస్తరి విప్పి
పదార్థాలు పరిచి
కనీళ్ళు సాకబెట్టి
కడసారి ప్రార్థించు
పిట్ట ముట్టాలె కదా
కొడుకులు మనస్ఫూర్తిగ మొక్కాలె
భార్యాబిడ్డా నిండుగ మొక్కాలె
అందరం కలిసుంటం
అమ్మను మంచిగ చూసుకుంటం
కోడండ్లూ మనుమండ్లూ అందరు మొక్కుండ్రి
ఎందరు మొక్కినా
విస్తరి ఎటుజరిపినా
పిట్ట ముట్టది
చుట్టు చూసినా చెట్టు ఊగినా
పిట్ట రాదు
పిట్ట ముట్టకపోవుడే సమస్య
అనుమానమేదో గాని
ఆత్మ తొక్కులాడుతంది
ఆయన తృప్తి పడలేదు
ఎంత ఆరాట పడ్డా కుటుంబం కుటుంబం వలె లేదు
ఎంత సేవ చేసినా ఊరు ఊరు వలె లేదు
ఎంత పోరాడినా కలగన్న సమాజం రాదు
చూసి పోదామంటే ఆఖరుకు తెలంగాణ రాలేదు
అందరసొంటి ఆత్మ కాదది
జీవితమంతా మనిషి కోసం తండ్లాడిన ఆత్మ
ఎట్ల తృప్తి పడుతది
ఎట్ల శాంతిస్తది
సూర్యుడు నెత్తిమీదికి చేరినా
చుట్టాలు చెట్టుకిందికి చేరినా
పుతులు ఆందోళన పడ్డా ఒక్క పిట్ట రాదు
పిట్ట ముట్టలేదు
రావటానికైనా ముట్టటానికైనా
పిట్టలుంటే కదా
-నందిని సిధారెడ్డి
చాలా బాగుంది మీ విశ్లేషణ .చక్కటి కవితని పరిచియంచేసారు/
లోపలి మాట మీదైన పదునుతో బయటకు వచ్చింది,.అభినందనలు లింగారెడ్డిగారు,.మంచి కవిని, కవితను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు,.
ధన్యవాదాలు రేణుక అయోల గారు,భాస్కర్ కొండ్రెడ్డి గారు
అంత గొప్ప కవితలో మతవిశ్వాసాల మనిషి కనపడడం విషాదం.తన కోసం ఇతరుల కోసం తానుగా బతికేటపుడు ఒప్పుదల కాని సంగతులు మోసే ద్వంద్వ కష్టాల నిట్టూర్పది. ఎందుకంత గొడవ
ధన్యవాదాలు హరగోపాల్ గారు .అది మీకు సాహిత్య చర్చ లాగా కాకుండా గొడవ లాగా కనిపించడమే అత్యంత విషాదం. విమర్శను విమర్శ లాగా స్వీకరించడం సాహిత్యకారుడికి ఉండాల్సిన లక్షణం అనుకుంట.
లింగారెడ్డిగారు
అర్ధవంతమయిన విశ్లేషణ ……
TQ kranthi garu
రావటానికైనా ముట్టటానికైనా
పిట్టలుంటే కదా
యెంత సున్నితంగా.. ప్రకృతి దుఖాన్ని చూపించారు.. కవితా విశ్లేషణ కూడా అంతే సున్నితంగా వుంది..
tq Jayasri garu
అర్ధవంతమయిన విశ్లేషణ ……
tq mohanram prasad garu
కవితా వస్తువే విశ్వాసం కి సంబంధించింది . మత సంస్కారం లేకపోతె కవితా వస్తువు కి బలం లేదు కదా! అలాగే ఈ కవిత మనిషి తనానికి, ఆత్మ శాంతికి సంబంధించినది మనిషి పుట్టుక నుండి చచ్చేదాకా ఉన్న సంస్కారాలలో ఒక సంస్కారాన్ని ఆచరించేటప్పుడు అయినవాళ్ళ బాధని ఎంత హృద్యంగా చెప్పారో ! పిట్ట రాకపోవడం అనేది పర్యావరణ నాశనం ని సూచిస్తూ వాస్తవికతతో కవిత ముగిసి ఆలోచింపజేసింది
చాలా మంచి కవిత్వం చాలా బావుంది చక్కని పరిచయం చేసారు . ధన్యవాదములు
tq vanaja garu
ఆత్మ అస్తిత్వాన్ని ,ఆత్మ త్రుప్తి పడడాన్ని అంగీకరించడం భావవాదం. పిట్టకు పెట్టడం హిందూ మతం లో ఒక ఆచారం .అది ఇవ్వాళ్ళ అత్యంత సాధారణ విషయంగా మారింది . అది భౌతిక వాడ దృక్పథానికి వ్యతిరేకం .వనజ గారు! నేను ఆ విషయాన్నే మాట్లాడుతున్న. .